Tag Archives: వ్యాసములు (Articles)

నిత్యపూజగా శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధన ఎలా చెయ్యాలి?

శంకరభగవత్పాదాచార్యులకు షణ్మతస్థాపనాచార్య అని పేరు. మోక్షం ఇవ్వగలిగిన రూపాలు ఏవి అన్నవాటిని ఆరింటిని ఆయన నిర్ధారణ చేశారు. మోక్షం ఇవ్వగలిగితే ఇక క్రింద వాటిని వేటిని ఇవ్వడంలోనూ వాళ్ళకి శక్తి లేనివారు అని చెప్పడానికి ఉండదు. అన్నింటికన్నా పతాకస్థాయి మోక్షం. అదే ఇవ్వగలరు అంటే ఇంక ఏదైనా ఇవ్వగలరు అని గుర్తు. అలా ఇవ్వగలిగిన వారిని ఆరుగురిని నిర్ధారించారు ఆయన – 1. పరమశివుడు 2. అంబిక(అమ్మవారు) 3. సూర్యుడు 4. విష్ణువు 5. సుబ్రహ్మణ్యుడు 6. విఘ్నేశ్వరుడు.

ఈ ఆరుగురి పేర్లమీదే శైవము, శాక్తేయము, సౌరము, వైష్ణవము, కౌమారం, గాణాపత్యము అని ఆరు సిద్ధాంతాలు. ఈ ఆరుగురూ మోక్షప్రదాతలే. ఇందులో అయిదుగురికి పూజలో స్థానం ఇచ్చారు. పంచాయతనం అంటే అయిదు. పరమశివుడు, అమ్మవారు, శ్రీమహావిష్ణువు, సూర్యుడు, విఘ్నేశ్వరుడు పంచాయతనంలో ఉంటారు. మోక్షం ఇవ్వగలిగిన వాళ్ళలో సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు. పూజలో మాత్రం సుబ్రహ్మణ్యుడు లేడు. మరి ఎలా పూజ చేయడం? సుబ్రహ్మణ్యుడు ఎక్కడ ఉన్నా సరే జ్యోతిస్స్వరూపుడు. ఆయన పేరు పావకి. అగ్నిహోత్రుడి రూపంగా వచ్చాడు.

ఆయన ఎక్కడ ఉంటే అజ్ఞాన దగ్ధం. అజ్ఞానాన్ని తీసేస్తాడు. అందుకే గోచీ పెట్టుకుని ఒక సన్యాసి ఎలా ఉంటారో అలా స్వామిమలై అన్న కొండమీద దండం చేత్తో పట్టుకొని జ్ఞానమూర్తిగా నిలబడి ఉంటారు. ఆ పేరుతోనే పుట్టారు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు, స్వామినాథన్. అందుకే ఇప్పటికీ ఆయన పుట్టినరోజునాడు ఆ క్షేత్రంలో ప్రత్యేకపూజ జరుగుతుంది. సుబ్రహ్మణ్యుడు అంటే ఎప్పుడూ జ్ఞానమూర్తి. వెలిగిపోతూంటాడు జ్యోతిస్వరూపంగా. పూజ మొట్టమొదటగా దీపం వెలిగించి మొదలుపెట్టాలి. ఆ దీపశిఖలో వెలుగుతున్నటువంటి జ్యోతి సుబ్రహ్మణ్యుడే. పూజ పూర్తి మంగళ నీరాజనంతో. నీరాజనంలో ఉన్న జ్యోతి సుబ్రహ్మణ్యుడే. జ్యోతిని చూస్తూ మీరు ఏ మూర్తి దగ్గర వేసినా సుబ్రహ్మణ్యుడికి అందుతుంది.

కాదు కళ్ళతో చూస్తూ చేయాలని ఉంది అంటే సుబ్రహ్మణ్యుడి మూర్తి పెట్టుకొని ఆయన వంక చూస్తూ మంటపంలో వేయండి. ఆయన పాదాల దగ్గరే పడుతుంది ఆ పువ్వు. మనస్సు చేత వెళ్తుంది. కాబట్టి ఎక్కడెక్కడ జ్యోతిస్స్వరూపం ఉంటుందో అక్కడక్కడ సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు అని గుర్తు. కాబట్టి జ్యోతికీ చేయవచ్చు. దీపం దగ్గర ఒక పళ్ళెం పెట్టి జ్యోతిస్స్వరూపంగా సుబ్రహ్మణ్యుడు వెలిగిపోతున్నాడు అని భావన చేసి పళ్ళెంలో పువ్వులు వేస్తూ ఉంటే ఆ పువ్వులు వెళ్ళి ఆయన పాదాలమీద పడతాయి. లేదు అంతలా మనస్సు నిలబెట్టలేను అంటే మూర్తిని ఎదురుగా పెట్టుకుని ఆయన వంక చూస్తూ శివుడికి వేస్తే ’ఆత్మావై పుత్ర నామాసి’. విష్ణువు స్థితికారుడు – ఎప్పుడూ లోకాలను రక్షిస్తాడు.

సుబ్రహ్మణ్యుడు రక్షణశక్తి. పైగా సుబ్రహ్మణ్యుడు శివకేశవులు ఇద్దరికీ ప్రతీక. అందుకే తమిళదేశంలో ఇప్పటికీ మురుగన్, మరుమగల్ అంటారు. అంటే మురుగన్ అంటే మేనల్లుడు, ఎందుచేత అంటే పార్వతీదేవి కొడుకు, పార్వతీదేవి శ్రీమన్నారాయణుడికి చెల్లెలు నారాయణి. కనుక పార్వతీదేవి కొడుకు విష్ణువుకు మేనల్లుడు అవుతాడు. మేనల్లుడు అల్లుడు ఎందుకంటే విష్ణువు యొక్క కూతురు వల్లి. మేనల్లుడే అల్లుడైనాడు. శైవము, వైష్ణవము వియ్యం అందాయి సుబ్రహ్మణ్యుడి వల్ల. స్థితికారశక్తిగా విష్ణుస్వరూపంగా ఉంటాడు. అందుకే సుబ్రహ్మణ్యుడు కొండలమీద ఉంటాడు తప్ప సాధారణంగా నేలమీద ఉండడు. సుబ్రహ్మణ్య క్షేత్రాలన్నీ కొండలమీదే ఉంటాయి. ఆయన మేనమామ గారికీ అదే లక్షణం. కాబట్టి విష్ణువు పాదం దగ్గర వేసినా, చేతిలో ఉండేది వేలాయుధం – శక్తిని చేతిలో పట్టుకుంటాడు.

అమ్మ ఎలా ఉంటుందో అలాగే ఉంటాడు. అమ్మ శక్తియే ఆయన చేతిలో శూలం. అమ్మ దగ్గర వేస్తే సుబ్రహ్మణ్యుడికి అందుతుంది. తేజోమూర్తి సూర్యనారాయణమూర్తి దగ్గర వేసినా ఆయనకు అందుతుంది. గణపతి పెద్దకొడుకు పరమేశ్వరుడికి. ఆయనకి ఒక పేరు ఉంది. స్కందపూర్వజాయ నమః’ అని సుబ్రహ్మణ్య సంబంధంగా. ఆయన దగ్గర వేసినా సుబ్రహ్మణ్యుడికి అందుతుంది. అందుకని ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యుడికి పూజలో మూర్తిని శంకరాచార్యుల వారు ఇవ్వలేదు. జ్యోతిస్స్వరూపుడు దీపంగా ఉన్నాడు కాబట్టి అక్కడ చేసినవన్నీ సుబ్రహ్మణ్యుడికే అందుతాయి. ఇలా సుబ్రహ్మణ్య పూజను పూర్ణం చేసుకోవచ్చు.

రామాయణా౦తర్గత స్కందోత్పత్తి

పరమేశ్వరుడు తపస్సు చేయుచుండగా పూర్వము దేవతలు ఋషులతో గూడి, సేనాపతిని కోరుకొనుచు బ్రహ్మదేవుని కడకు వెళ్ళిరి. ఇంద్రాది దేవతలు అగ్నిని ముందుంచుకొని, బ్రహ్మదేవునకు ప్రణమిల్లి, ఆయనతో ఇట్లు విన్నవించుకొనిరి. “ఓదేవా! పూర్వము మీరు పరమేశ్వరుని మాకు సేనాపతిగా నియమించియుంటిరి. ఆ శంకరుడు ఇప్పుడు పార్వతీదేవితో గూడి హిమవత్పర్వతమున తపమొనరించుచున్నాడు. కర్తవ్య విధానము నెరిగిన ఓ బ్రహ్మదేవా! ఈ (సెనాపతి) విషయమున లోకహితమును గోరి అనంతర కార్యమును గూర్చి ఆలోచిమ్పుడు. ఇప్పుడు మాకు మీరే దిక్కు”.

దేవతల ప్రార్థనను ఆలకించి, సరలోక సృష్టికర్తయైన బ్రహ్మదేవుడు మృదుమధుర వచనములతో వారిని ఓదార్చుచు ఇట్లు పలికెను. “పార్వతీదేవి శాప కారణముగా మీకు మీ పత్నులయందు సంతానము కలుగు అవకాశము లేదు. ఆమె వచనము తిరుగులేనిది. ఇది ముమ్మాటికిని సత్యము. ఇందు సందేహము లేదు. ఆకాశమున ప్రవహించు ఈ గంగాదేవి యందు అగ్నిదేవుడు ఒక పుత్రుని పొందగలడు. అతడు దేవసేనాపతియై, శత్రు సంహారకుడు కాగలడు. హిమవంతుని పెద్ద కూతురైన గంగ ఆ అగ్నిసుతుని (శివ తేజః ప్రభావమున అగ్నివలన తనయందు జనించిన సుతుని) ఆదరింప గలదు. అతడు పార్వతీదేవికి మిక్కిలి ప్రీతిపాత్రుడగును. ఇందు సంశయము లేదు”.

ఓ రఘునందనా! బ్రహ్మదేవుడు పలికిన ఆ మాటలకు దేవతలందరును సంతసించి, తాము కృతార్థులైనట్లు భావించిరి. అనంతరము వారు బ్రహ్మదేవునకు ప్రణమిల్లి, పూజించిరి. అంతట ఆ దేవతలందరునూ గైరికాదిధాతువులతో విలసిల్లుచున్న కైలాసపర్వతమునకు చేరి, పుత్రోత్పత్తికై అగ్నిదేవుని నియమించిరి. శివతేజమును భరించిన ఓ అగ్నిదేవా! ఈ దేవకార్యమును నెరవేర్పుము. శైలపుత్రికయైన గంగయందు ఆ శివ తేజస్సును ఉంచుము’ అని దేవతలు పలికిరి. అగ్నిదేవుడు దేవతలతో ‘అట్లే’అని పలికి, గంగాదేవి కడకు వెళ్ళి “ఓ దేవీ! గర్భమును ధరింపుము. ఇది దేవతలకు హితమొనర్చు కార్యము” అని నుడివెను. అప్పుడు గంగ ఆయన మాటలను విని దివ్యమైన స్త్రీ రూపమును ధరించెను. అగ్ని ఆమె సౌందర్యాతిశయమును జూచి, శివతేజమును ఆమెయందంతటను వ్యాపింపజేసెను.

ఓ రఘునందనా! అగ్ని ఆమెపై వ్యాపింపజేసిన శివతేజముతో గంగా ప్రవాహములన్నియును నిండిపోయెను. ఆ అగ్ని తేజస్సుయొక్క తాపమునకు తట్టుకొనలేక గంగాదేవి సర్వ దేవతలకును పురోహితుడైన అగ్నిదేవునితో “క్షణక్షణమునాకును బలీయమగుచున్న నీ తేజస్సును ధరింపలేకయున్నాను” అని పలికెను. సర్వదేవతల కొరకై సమర్పించెడి ఆహుతులను స్వీకరించునట్టి అగ్నిదేవుడు గంగతో “ఓ దేవీ! ఈ శ్వేత పర్వతప్రదేశమున నీ గర్భమును ఉంచుము’ అని యనెను. మహా తేజస్వివైన ఓ పుణ్యపురుషా! రామా! గంగాదేవి అగ్నిదేవుని మాటలను పాటించి, మిక్కిలి తేజోరాశియైన ఆ గర్భమును తన ప్రవాహములనుండి అచట వదలెను.

గంగానది గర్భమునుండి వెడలిన తేజస్సు మేలిమి బంగారము వలె కాంతిమంతమై యుండెను. కనుక ఆ తేజస్సు ఉంచబడిన భూమియు, అచటి వస్తువులన్నియును సువర్ణమయములాయెను. ఆ పరిసరములన్నియును రజిత మయములై నిరుపమానమైన కాంతితో వెలుగొందెను. ఆ తేజస్సు యొక్క తీక్ష్ణత్వము వలన రాగి ఇనుము పుట్టెను. ఆ రేతస్సు యొక్క మలము తగరము, సీసము ఆయెను. ఈవిధంగా ఆ తేజస్సు భూమిని జేరి, వివిధ ధాతువులుగా రూపొందెను.

ఆ గర్భము భూమిపై ఉంచబడగానే దాని తేజః ప్రభావముచే ఆశ్వేతపర్వతమూ, అందలి శరవణమూ(రెల్లుగడ్డి) సువర్ణమయములై తేజరిల్లసాగెను. పురుష శ్రేష్ఠుడైన ఓ రాఘవా! అగ్నితో సమానమైన కాంతి గల ఆ బంగారము అప్పటినుండియు ‘జాతరూపము’ అను పేరుతో ప్రసిద్ధికెక్కెను. అచటి తృణములు, వృక్షములు, లతలు, పొదలు మొదలగునవి అన్నియును స్వర్ణమయములాయెను. తదనంతరము అచట జన్మించిన కుమారునకు పాలిచ్చి పోషించుటకై, ఇంద్రుడు, మరుద్గణములు మొదలగు దేవతలు ఆరుమంది కృత్తికలను నియోగించిరి. “ఈబాలుడు మా అందరి యొక్క పుత్రుడగును” అని ఆ కృత్తికలు దేవతలతో ఒప్పందము చేసుకొనిరి.

పిమ్మట ఆ నిశ్చయముతో అప్పుడే పుట్టిన ఆ శిశువునకు పాలియ్యసాగిరి. అంత దేవతలందరును “ఈ బాలకుడు కార్తికేయుడు అను పేరుతో ముల్లోకముల యందును ఖ్యాతికెక్కును. ఇందు సంశయము లేదు” అని పలికిరి. గంగాద్వారా అచటికి చేరిన శివతేజస్సు యొక్క ప్రభావమున పుట్టిన ఆ బాలుడు అగ్నివలె వెలుగొందుచుండెను. దేవతలా మాటలను విని, వారి ఆదేశమును అనుసరించి, కృత్తికలు ఆ బాలకునకు స్నానము చేయించిరి. ఓ కాకుత్స్థా! గంగాదేవి గర్భమునుండి స్ఖలితుడైనందున దేవతలు అగ్నితుల్యుడై, కారణజన్ముడైన ఆ మహానుభావుని ‘స్కందుడు’ అని పిలువసాగిరి.

కృత్తికల పోషణ వలన అతనికి ‘కార్తికేయుడు’ అనియు పేరు ఏర్పడెను. అప్పుడు ఆ ఆరుగురు కృత్తికల స్తనములలో సమృద్ధిగా పాలు ఏర్పడెను. ఆరు ముఖములు గలవాడై ఆ బాలుడు ఆ ఆరుగురి నుండి స్తన్యములను గ్రోలెను. సుకుమార శరీరుడైనను ఆ కుమారస్వామి ఒక దినము మాత్రమే వారినుండి పాలుద్రాగి, మహిమాన్వితుడై అతడు తన పరాక్రమము చేత రాక్షస సైన్యములను జయించెను. దేవతలు అగ్నిదేవుని నాయకత్వమున సాటిలేని తేజస్వియైన ఆ బాలుని కడకు చేరి, అతనిని ‘దేవసేనాపతి’గా అభిషేకించిరి.

పవిత్రమైన ఈ గాథను విన్నవారు ధన్యులగుదురు. కుమారస్వామి పై భక్తిగల మానవుడు ఈ లోకమున దీర్ఘాయుష్మంతుడై పుత్రపౌత్రులతో వర్ధిల్లును. తుదకు స్కంద సాలోక్య ఫలమును గూడ పొందును.

       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

సుబ్రహ్మణ్యారాదన ఫలితం

సుబ్రహ్మణ్యుని చేతిలో ఉన్నటువంటి ఆయుధము శక్త్యాయుధము అని చెప్పబడుతున్నది. అందుకే “ప్రథమో జ్ఞాన శక్త్యాత్మా” – పైగా దానికి జ్ఞాన శక్త్యాయుధమని పేరు. అంటే ఆ ఆయుధంలో రెండు విశేషములున్నాయి. జ్ఞానము, శక్తి రెండు చెప్పబడుతున్నాయి. అసలు జ్ఞానానికే పెద్ద శక్తి ఉంది. ఎంతటి శక్తి ఉంది అంటే ఎవరూ ఛేదించలేని అజ్ఞానాన్ని ఛేదించడమే జ్ఞానముయొక్క శక్తి.


అలా జ్ఞానశక్తి ఆయనయొక్క ఆయుధం. ఇది భావన చేసినప్పుడు ఆయన గురుస్వరూపంగా కనిపిస్తాడు. అసుర సంహారం చేసినటువంటి మహా ప్రతాపమూర్తి. “సేనానీనాం అహం స్కందః” అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటి మాట. సేనానులలో స్కందుడు. స్కందుడు అని సుబ్రహ్మణ్యునికి మరొక పేరు.
చెల్లాచెదురైనటువంటి దేవసేనలన్నింటినీ సమీకరించి వారందరికీ తాను బలమై, బలాన్ని ఇచ్చి నడిపించి అసుర శక్తులను సంహరించాడు.


అందుకే ఎప్పుడైనా సరే కాలంలోనూ, దేశంలోనూ ప్రపంచాన్ని బాధించే అసుర శక్తులు ఉన్నవేళ సుబ్రహ్మణ్య ఆరాధన గానీ చేసినట్లయితే వెంటనే అసుర శక్తులు తొలగి దేశానికీ, కాలానికీ, వ్యక్తికీ కూడా క్షేమం లభిస్తుంది. అలాంటి క్షేమం కావలసినటువంటి వారు సుబ్రహ్మణ్యారాదన విశేషంగా చేయాలి. దీనివల్ల బాధించె శక్తులు తొలగుతాయి. అందుకు ప్రత్యేకించి దేవతలందరూ కూడా దేవసేనాపతి ఆవిర్భావానికి తపన పడ్డారు. శివశాక్త్యాత్మకంగా ఆవిర్భవించాడు సుబ్రహ్మణ్యుడు.


ఆయన ఆవిర్భావంతో దేవతలందరికీ బలం వచ్చింది.అసలు బలమే ఆయనయొక్క స్వరూపం. అందుకే సేనాని అయ్యాడు. అందుకు లోక క్షేమంకరమైన ఉత్తమ శక్తులు చెల్లాచెదురై బలం తగ్గినప్పుడు వాటన్నింటికీ బలాన్నిచ్చి నడిపించేటటువంటి నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి. అందుకు గొప్ప నాయకుడు కూడా ఈయన. అలాంటి సేనానిగా ఎవరైతే నమస్కరిస్తారో వారికి మొత్తం దేవతా సమూహం అంతా కూడా రక్షణ చేస్తుంది.

సుబ్రహ్మణ్యస్వామి కొన్ని క్షేత్రాలలో ప్రధాన దైవంగాను, మరికొన్ని క్షేత్రాలలో ఉపాలయాలలోను దర్శనమిస్తూ ఉంటాడు. ఆ స్వామి ఎక్కడ ఎలా కొలువైనా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తూ వుంటారు. కొన్ని క్షేత్రాలలో సర్ప రూపంలోనూ, మరి కొన్ని క్షేత్రాలలో బల్లెం ధరించిన బాలుడి రూపంలో సుబ్రహ్మణ్య స్వామి పూజలు అందుకుంటూ వుంటాడు.

మంగళవారం సుబ్రహ్మణ్యస్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు కనుక, ఆ రోజున స్వామిని దర్శించుకునేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆ రోజున స్వామికి అరటిపండ్లు, పటిక బెల్లం నైవేద్యంగా సమర్పించడం వలన ఆయన ప్రీతి చెందుతాడు. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం వలన, అంకితభావంతో అర్చించడం వలన సర్పసంబంధమైన దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. సంతానం లేనివారు స్వామిని నియమ నిష్ఠలతో పూజించడం వలన, సంతాన భాగ్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు.

దేవసేనా సుబ్రమణ్యుల కళ్యాణం

అరిష్టనేమి అనబడే ఒక ప్రజాపతి కుమార్తె దేవసేన. ఈమెకు దైత్యసేన అనే ఒక చెల్లెలు ఉంది. ఒకరోజున దేవసేన తన చెల్లెలయిన దైత్యసేనతో కలిసి ఆడుకుంటోంది. ఆ సమయంలో అక్కడికి ఒక రాక్షసుడు వచ్చి దేవసేనను భయపెట్టి ఎత్తుకుపోయే ప్రయత్నం చేశాడు. ఆవిడ బిగ్గరగా కేకలు పెట్టింది.

ఆ సమయంలో ఇంద్రుడు ఐరావతం మీద వెడుతున్నాడు. ఆయన వెంటనే తన వజ్రాయుధంతో ఆ రాక్షసుని సంహరించి అరిష్టనేమి కుమార్తె అయిన ‘ఈ దేవసేనని నా కుమార్తెగా ఇవ్వాల్టి నుంచి పెంచుకుంటాను. దైత్యసేనని నీ దగ్గర ఉంచుకో. దేవసేన నా దగ్గర పెరుగుతుంది. అని అరిష్టనేమికి చెప్పి ఆమెను తీసుకు వెళ్ళి పెంచాడు. ఈ పిల్ల పెరిగి పెద్దదవుతుంటే ఇంద్రునికొక ఆలోచన కలిగింది.

ఈ దేవసేనను దక్కించుకోగలిగిన వాడు పరాక్రమముతో పాటు కారుణ్యము అపారముగా కలిగిన వాడి ఉండాలి. అటువంటి వాడికి ఇచ్చి వివాహం చేస్తాను అనుకున్నాడు. ఆ సమయంలో ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. తారకాసురుడి తమ్ముడు శూరపద్ముడు. ఆ శూరపద్ముని సంహారం కూడా కుమారస్వామి చేశారు. తన కుమార్తెకు అలాంటి వాడిని ఇచ్చి వివాహం చేయాలి అనుకున్నాడు. వెళ్లి కుమారస్వామిని వేడుకుని దేవసేననిచ్చి వివాహం చేసాడు. వివాహంచేసిన స్థలాన్ని తిరుప్పరంకుండ్రం అని పిలుస్తారు.

మంచి గుణములు కలగాలంటే కుమారస్వామి ఆరాధనము చేసి తీరవలెనని శాస్త్రం చెప్తోంది. సుబ్రహ్మణ్యానుగ్రహమును పొందాలి.

వల్లీ సుబ్రమణ్యుల కళ్యాణం

ఒకానొక సమయంలో నారదమహర్షి కైలాసపర్వతం మీద స్నేహితులతో కలిసి ముచ్చటించుకున్నటువంటి సుబ్రహ్మణ్యుని సన్నిధానమునకు వెళ్ళారు. లోకములలో తాను చూసిన విశేషములను చెప్పడం మొదలు పెట్టాడు. ఇప్పుడు నారదుడు వల్లీ కళ్యాణం చేయించడానికి వచ్చాడు. ఒక మహర్షి తేజస్సు వలన అయోనిజయై ఒకపిల్ల ఒకతె అరణ్యమునందు పుట్టి ఉండగా ఒక భిల్లు నాయకునికి దొరికింది ఆ పిల్లను తీసుకు వచ్చి ఆయన పెంచుకుంటున్నాడు. ఆ పిల్ల పేరు వల్లి. ఆమె రాశీభూతమయిన సౌందర్యము. అటువంటి వల్లి నీ భార్య కావాలి అది నా కోరిక. ఆ పిల్ల చుట్టూ పాములు ఉంటాయి ఎప్పుడూ. నువ్వు చూసి భయపడకూడదు సుమా! ఎవరు ఆ పిల్ల వొంటిని పట్టిన పాములను చూస్తారో వాళ్ళు ఆ పిల్ల సౌందర్యమును చూసి ఉండలేక పొంగిపోతారు అన్నాడు నారదుడు.


ఆ మాటలను విని సుబ్రహ్మణ్యుడు భిల్లపురానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళడానికి ముందే నారదుడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. నారదుడికి భిల్లరాజు ఎదురువచ్చాడు. మంచి మంచి పువ్వులు, తేనే, పళ్ళు తీసుకువచ్చి నారదుడికి పెట్టాడు. నారదుడు భిల్లరాజుతో “నీకొక శుభవార్త చెప్తాను. మిమ్మల్ని ఉద్ధరించడానికి పరమేశ్వరుడు ఈ పిల్లను నీకు కూతురుగా పంపాడు. ఈ వల్లీదేవిని పెళ్ళి చేసుకో బోయేవాడు లోకంలో యౌవనంలో ఉన్న ప్రతి స్త్రీ ఎవరిని భర్తగా పొందాలని అనుకుంటుందో, ఎవరు జగదా౦బ అందాలు పోసుకున్నవాడో, ఎవరు పరమ సౌందర్యరాశియైన శంకరుని తేజమును పొందిన వాడో, ఎవడు గొప్ప వీరుడో, ఎవడు మహాజ్ఞానియో ఎవడు దేవసేనాధిపతియో అటువంటి వాడు నీకు అల్లుడు కాబోతున్నాడు నీ అదృష్టమే అదృష్టం అన్నాడు. భిల్లురాజు నారదుని మాటలు విని చాలా పొంగిపోయాడు.

కుమారస్వామి వనంలోకి ప్రవేశించి వల్లీ దేవి వంక చూసి బహుశః బ్రహ్మ తన సృష్టి శక్తిలోని సౌందర్యమునంతటిని ఒకచోట రాశీభూతం చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తే ఆమె ఈ వల్లి అయి ఉంటుంది ఈ పిల్లతో ఒకసారి మాట్లాడాలి అని అనుకున్నాడు. ‘లతాంగీ నన్ను చేపట్టవా?” అని అడిగాడు. ఆవిడ ఈయన వంక చూసి ‘అబ్బో ఈతడు ఎంత అందగాడో’ అనుకుని నారదుడు మా ఇంటికి వచ్చినప్పుడు నాకు సుబ్రహ్మణ్యుడితో వివాహం అవుతుందని చెప్పాడు. ఈ పిల్లవాడు అందగాడు కావచ్చు కానీ నా మనస్సు నందు పాపపంకిలమయిన భావం కలుగరాదు. నేను సుబ్రహ్మణ్యుడికి చెందినదానను. పార్వతీ పరమేశ్వరుల కుమారుడు అయి ఉంటె నా రొట్టె విరిగి నేతిలో పడినట్లే కదా అనుకుని ‘ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు. ఏదయినా అడగవలసి వస్తే మా తల్లిదండ్రులను అడగాలి. అయినా కుమారస్వామి నాకు భర్త అవుతాడని నారదుడు చెప్పాడు. అందువల్ల నా మనస్సు ఆయనకు అర్పించబడింది అని చెప్పింది.


ఆమె అలా చెప్పగానే మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు ఒక్కసారి తన నిజరూపమును చూపించాడు. ఆ తల్లి పొంగిపోయింది. ఇంతలో తండ్రి వచ్చి ఇంటికి తీసుకు వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పిల్ల మనస్సులో కుంది ఏడుస్తోంది. అయ్యో ఎక్కడి మహానుభావుడు. నేను ఒక్కమాట నోరు తెరిచి చెప్పలేదు. అని. చెలికత్తె ఎందుకమ్మా బెంగ పెట్టుకుంటావు. ఒక ఆకుమీద ఉత్తరం రాసి ఇవ్వు. నేను పట్టుకుని వెళ్లి ఆయనకు ఇస్తాను అంది. అక్కడ సుబ్రహ్మణ్యుడు పుష్పవాటిక యందు ఒక సరోవరం ఒడ్డున కూర్చుని ఉన్నాడు. చెలికత్తె వెళ్లి పత్రం చూపించింది. ఆయన చదివి వల్లీదేవి దగ్గరకు వెళదాం అన్నాడు. అపుడు చెలికత్తె అలా వద్దు నేను పిల్లను తీసుకువస్తాను అని చెప్పి వెళ్లి వల్లీదేవిని తీసుకువచ్చింది. వారిద్దరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఈలోగా తెల్లారిపోయింది.


పిల్ల కనపడలేదని అందరూ వెతుకుతూ సరోవరం ఒడ్డు దగ్గరకు రాగా ఇద్దరూ కనపడ్డారు. భిల్ల నాయకుడికి ఆ యువకుడు సుబ్రహ్మణ్యుడు అని తెలియదు. సుబ్రహ్మణ్యుడు కూడా వేటగాని వేషంలో ఉన్నాడు. వెంటనే ఆగ్రహంతో తన పరివారంతో ఆయన మీద బాణములు ప్రయోగించాడు. సుబ్రహ్మణ్యుడు పేలగా నవ్వుతూ వాటినన్నింటినీ స్వీకరించి వల్లీదేవి వంక చూసి వారి మీద సమ్మోహనాస్త్రమును ప్రయోగించాడు. అందరూ క్రిందపడి స్పృహతప్పిపోయారు. అప్పుడు వల్లీ దేవి తన వాళ్ళందరూ పడిపోయారని ఏడ్చింది. అపుడు స్వామివారు అనుగ్రహించేసరికి మరల వారందరికీ స్పృహ వచ్చి లేచారు. వారు లేచి చూసేసరికి శూలం పట్టుకుని నెమలివాహనం మీద వల్లీదేవితో కలిసి కూర్చున్న సుబ్రహ్మణ్యుడు సాక్షాత్కరించాడు. ఆ భిల్లులందరూ నేలమీద పది సుబ్రహ్మణ్యుడికి సాష్టాంగ నమస్కారం చేసి పొంగిపోయారు.


నారదుడు దేవసేనతో పార్వతీ పరమేశ్వరులతో అక్కడకు వచ్చాడు. నేనెంత భాగ్యవంతురాలినో కదా అనుకుని వల్లీదేవి పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించింది. అపుడు సంతోషంగా పార్వతీ పరమేశ్వరులతో దేవసేనతో కలిసి ఏ అరమరికలూ లేకుండా ఆనాటి నుండి ఈనాటి వరకు భక్తుల కోర్కెలు అనుగ్రహించడానికి సుబ్రహ్మణ్య స్వామి వారు తిరుత్తణియందు వెలసి ఉన్నారు.

సుబ్రహ్మణ్యుడిని పూజిస్తే మన పాపములన్నీ దగ్ధమయిపోతాయి. వంశాభివృద్ధి జరుగుతుంది.