Tag Archives: వ్యాసములు (Articles)

శరవణభవుడు

“శరవణభవ”… ఓం శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః.

షణ్మతాలలో కుమారోపాసన ఒకటి. కంఠంలో రత్నాలంకారాలు, మేనిలో చక్కదనం, చేతిలో జ్ఞానశక్తి ఆయుధం, ముఖాన చిరునవ్వు, కటియందుహస్తాన్ని దాల్చి నెమలిపై ప్రకాశిస్తుండే స్వామి జ్ఞానస్వరూపుడు. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా అనే మూడు శక్తులమయమైన శక్తిని ధరించిన కుమారస్వామి, శరణు అన్న వాడిని కాపాడే దేవుడు. అమోఘమైన శివతేజాన్ని, పృథ్వి, అగ్ని, జలం, ఆరు కృత్తికల శక్తిని (నక్షత్ర శక్తి) ధరించి, శరవణంలోనించి (పార్వతిదేవి) స్వామి జన్మించాడు. అందుకే స్వామి శరవణభవుడు.

శరవణభవ అనే మంత్రాన్ని పఠిస్తే చాలు సమస్త సన్మంగళాలు నిర్విఘ్న౦గా జరుగుతాయి. శరవణభవ మంత్రంలో –

శ – లక్ష్మీబీజము అధిదేవత శంకరుడు
ర – అగ్నిబీజము అధిదేవత అగ్ని
వ – అమృతబీజము అధిదేవత బలభద్రుడు
ణ – యక్షబీజము అధిదేవత బలభ్రద్రుడు
భ – అరుణ బీజము అధిదేవత భద్రకాళీదేవి
వ – అమృతబీజము అధిదేవత చంద్రుడు

శ – శమింపజేయువాడు
ర – రతిపుష్టిని ఇచ్చువాడు
వ – వంధ్యత్వం రూపుమాపువాడు
ణ – రణమున జయాన్నిచ్చేవాడు
భ – భవసాగరాన్ని దాటించేవాడు
వ – వందనీయుడు

అని ‘శరవణభవ’కు గూఢార్థం.

శరవణభవ మంత్రం కోసం ఇచ్చట చూడండి: శరవణభవ మంత్రం

శ్రీ సుబ్రహ్మణ్యం శరణం ప్రపద్యే

ఆరు ముఖములను, పన్నెండు చేతులను కలిగి నెమలి వాహనారూఢుడై దివ్య తేజస్సుతో వెలుగొందుతూ ఉన్న శివపార్వతుల గారాల బిడ్డ, దేవసేనల ప్రభువు, కేవలం కావడి మొక్కులను సమర్పించినంతనే భక్తులకు వంశాభివృద్ధిని, బుద్ధి సమృద్ధిని ప్రసాదించే భక్తసులభుడైన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారు జన్మించిన పవిత్ర పర్వదినం ‘శ్రీ సుబ్రహ్మణ్య షష్టి’. ప్రతి సంవత్సరం మార్గశిర మాసం శుక్లపక్ష షష్టినాడు శ్రీ సుబ్రహ్మణ్య షష్టి పర్వదినాన్ని జరుపుకోవడం ఆచారం. ఈ పర్వదినానికి సుబ్బరాయషష్టి, కుమారషష్టి, స్కందషష్టి, కార్తికేయషష్టి, గుహప్రియా వ్రతం వంటి పేర్లున్నాయి.

శ్రీ సుబ్రహ్మణ్యస్వామి పుట్టుక…

శ్రీ సుబ్రహ్మణ్యస్వామి పుట్టుకకు సంబంధించిన ఆసక్తికరమైన గాథలు పురాణాల్లో కనిపిస్తాయి. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు బలగర్వితుడై సకల లోకవాసులను హింసిస్తూ ఉండడంతో దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు అందుకు ”శివుడు తపస్సు చేస్తూ ఉన్నాడు. శివుడు తపస్సు మానేసి పార్వతీదేవిని పరిణయమాడునట్టు చేస్తే వారికి జన్మించే కుమారుడు తారకాసురుడిని అంతమొందిస్తాడు” అని ఉపాయం చెప్పాడు. ఈ మాటలను విన్న దేవతలు, శివుడు తపస్సు మాని పార్వతీదేవిని వివాహం చేసుకునేలాగా చేసేందుకు మన్మథుడిని పంపగా శివుడు తన మూడవ నేత్రం తెరిచి మన్మథుడిని దహించి వేశాడు. అయితే తారకాసురుడిని అంత మొందించవలసిన అవసరాన్ని గుర్తించిన శివుడు తనకు పరిచర్యలు చేస్తూ ఉన్న పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ శృంగారంలో తేలియాడుతూ ఉన్న సమయంలో శివుడి రేతస్సు పతనమై భూమిపై పడింది. దానిని భూమి భరించలేక అగ్నిలో పడవేసింది.

అగ్నిదానిని భరించలేక గంగలో వదలగా దానిని గంగ తన తీరంలోని శరవణమునకు తోసివేసింది. అక్కడే శ్రీకుమారస్వామి జన్మించాడు. అంతేకాకుండా గంగానదిలో పడిన రేతస్సు ఆరు భాగాలుగా ఏర్పడింది. ఆ ఆరు భాగాలు అలల తాకిడికి ఏకమై ఆరు ముఖములు, పన్నెండు చేతులుతో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి జన్మించాడు. అందువల్ల ఆయనకు ‘షణ్ముఖుడు’ అనే పేరు ఏర్పడింది. ఈ విధంగా ఆవిర్భవించిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని పెంచేందుకు శ్రీమహావిష్ణువు ఆరు కృత్తికలను నియమించారు. వారు పెంచి పెద్ద చేశారు. ఆరు కృత్తికల చేత పెంచబడడం వల్ల స్వామికి ‘కార్తికేయుడు’ అనే పేరు ఏర్పడింది. ఈ విధంగా కృత్తికల చేత పెంచబడిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుడిపై దండెత్తి తారకాసురుడిని అంతమొందించి దేవతలను ప్రజలను రక్షించినట్లు కథనం.

బ్రహ్మనే బంధించిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి…

త్రిమూర్తులలో లయకారుడైన శివుడికి కుమారుడిగా జన్మించి స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు నియమించిన కృత్తికల చేత పెంచబడిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడిని బాల్యంలోని బందించినట్లు పురాణాలు చెప్తున్నాయి. సుబ్రహ్మణ్యస్వామి పసివాడుగా తల్లి పార్వతీదేవి ఒడిలో ఉన్న సమయంలో ఒకసారి శివుడు పార్వతీదేవికి ప్రణవ మంత్రార్థాన్ని వివరించారు. బాలుడుగా ఉన్న సుబ్రహ్మణ్యస్వామి దానిని విని ఆకళింపు చేసుకున్నాడు. ఒకసారి బ్రహ్మదేవుడు కైలాసానికి రాగా బాలుడుగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ప్రణవమంత్రార్థాన్ని చెప్పాల్సిందిగా అడిగాడు. బ్రహ్మ సరిగ్గా చెప్పకపోవడంతో సుబ్రహ్మణ్యస్వామి బ్రహ్మదేవుడుని బంధించాడు. శివుడు జోక్యం చేసుకుని విడిపించాడు.

నెమలి వాహనం,కోడి ధ్వజం…

తారకాసురుడి సోదరుడైన శూరపద్ముడు దేవతలను ఇబ్బందిపాలు చేస్తూ ఉండడంతో సుబ్రహ్మణ్యస్వామి శూరపద్ముడుపై దండెత్తి యుద్ధం చేశాడు. యుద్ధంలో ఆరవరోజు శూరపద్ముడు పక్షి రూపాన్ని ధరించి తలపడ్డాడు. సుబ్రహ్మణ్యస్వామి శూలాయుధం ప్రయోగించడంతో పక్షి రెండుగా ఖండింపబడింది. ఆ రెండిటిలో ఒకటి నెమలిగా, మరొకటి కోడిపుంజుగా మారి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారిని శరణు వేడుకోవడంతో….నెమలిని వాహనంగా, కోడిని ధ్వజంగా చేసుకుంటున్నట్లు పురాణ కథనం.

వల్లీ…దేవసేనలు…..

శ్రీ సుబ్రహ్మణ్యస్వామికి ఇద్దరు దేవేరులున్నారు. శ్రీవల్లీదేవి, శ్రీదేవసేనలు. వారు తారకాసురుడిని అంతమొందించిన తర్వాత దేవేంద్రుడు తన కుమార్తె దేవసేనను సుబ్రహ్మణ్యస్వామికిచ్చి వివాహం చేయగా, తిరుత్తణి ప్రాంత పాలకుడైన నందిరాజు కుమార్తె వల్లీదేవిని వేటగాడి రూపంలో వెళ్ళి వివాహం చేసుకున్నట్లు పురాణ కథనం.

కావడి మొక్కులంటే ఇష్టం…

పూర్వం అగస్త్య మహర్షి కైలాసానికి వెళ్ళి శివుడిని దర్శించి తిరిగి వెళ్ళే సమయంలో శివుడు రెండు కొండలను బహుకరించి శివశక్తి రూపంగా దక్షిణాదికి తీసుకు వెళ్ళి కొలవవలసిందిగా తెలిపారు. వాటిని స్వీకరించిన అగస్త్యుడు వాటిని ఇదంబుడు అనే శిష్యుడికిచ్చి తన వెంట వాటిని తీసుకుని రావలసిందిగా తెలిపాడు. ఇదంబుడు కావడిని కట్టుకుని రెండు పర్వతాలను అందులో ఉంచుకుని అగస్త్యుడి వెంట నడవసాగాడు. కొంత దూరం అంటే పళని వచ్చేసరికి ఆయాసం అధికమై కొంత సేపు విశ్రాంతికి ఆగాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ కావడిని ఎత్తగా ఒకవైపు పైకి లేచింది. మరోవైపు లేకపోవడంతో వెనుతిరిగి చూడగా దానిపై సుబ్రహ్మణ్యస్వామి నిలబడి ఉన్నాడు. కొండ దిగి వెళ్ళిపోమన్నాడు. పోకపోవడంలో వారిద్దరి మధ్యా యుద్ధం జరిగి చివరకు ఇదంబుడు చనిపోయాడు. ఈ విషయం తెలుసుకుని అగస్త్యుడు ప్రార్థించడంతో స్వామి తిరిగి బతికించారు. ఈ విషయం ఇదంబుడి భార్యకు తెలిసి కావడిలో పాలను తీసుకువెళ్ళి కృతజ్ఞతగా స్వామివారికి సమర్పించింది. అప్పటి నుంచి కావడి మొక్కులను సమర్పించడం ఆచారమైంది. కాగా, కావడిని ఉపయోగించే బద్ద ‘బ్రహ్మదండం’ అనీ కర్కోటక అనే అష్టనాగులకు ప్రతీకలని చెప్పబడుతూ ఉంది.

సుబ్రహ్మణ్య షష్టి నాడు శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారిని షోడశోపచారాలు అష్టోత్తరాలతో పూజించి నైవేద్యం సమర్పించాలి. ఈ దినమంతా ఉపవాస వ్రతం పాటించి మరుసటిరోజు తిరిగి పూజ చేసి భోజనం చేసి ఉపవాసంను విరమించాలి. అంతేకాకుండా శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారిని సర్పంగా కూడా ఆరాధిస్తూ ఉండడం ఆచారం. కనుక పుట్ట వద్దకు వెళ్ళి పూజ చేసి పుట్టలో పాలుపోయడం కూడా సత్ఫలితాలను ఇస్తుంది. దీనికి తోడు గ్రహదోషాలతో బాధపడేవారు ముఖ్యంగా రాహు, కేతు, సర్ప, కుజదోషములున్న వారు కఠినమైన ఉపవాసం ఉండి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల ఫలితాలుంటాయని చెప్పబడుతూ ఉంది.

బ్రహ్మచారికి పూజ…

సుబ్రహ్మణ్యషష్టినాడు బ్రాహ్మణ బ్రహ్మచారిని ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్యస్వామి రూపంగా భావించి పూజించి పులగం, క్షీరాన్నం వంటి వంటలను చేసి భోజనం పెట్టి, పంచలసాపు,దక్షిణలను తాంబూలమందు ఉంచి ఇచ్చి నమస్కరించాలి. ఈ విధంగా చేయడం వల్ల అనంతమైన పుణ్య ఫలాలు కలుగుతాయి. వీటికి తోడు ఈరోజు “శరవణభవ” అనే ఆరు అక్షరాల నామమంత్రాన్ని పఠించడం, జపించడం కూడా మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది. ఈ విధంగా సుబ్రహ్మణ్యషష్టి జరుపుకోవడం వల్ల వంశాభివృద్ధి, విజ్ఞానాభివృద్ధి, బుద్ధి సమృద్ధి కలుగుతాయి.

శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి

ఆది దంపతులు శివ,పార్వతుల రెండో కుమారుడు సుబ్రహ్మణ్యస్వామి. దేవతల సైన్యానికి ఆయన సేనాధిపతి. ముల్లోకాలకు కంటకంగా మారిన తారకాసురుని సంహరించాడు. ఆరుముఖాలతో వుంటాడు కనుక షణ్ముఖ అని, కృతికలు పెంచడంతో కార్తికేయుడని, రెల్లుపొదల్లో జన్మించడంతో శరవణభవుడు అనే పేర్లతో పూజిస్తాం. మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా ఆచరిస్తారు. ‘సుబ్రహ్మన్యోగ్o ‘ అని వేదం కార్తికేయుని స్తుతించింది. బ్రహ్మవిద్యకు, సంతాన భాగ్యానికి అధిపతి సుబ్రహ్మణ్యుడు. ‘నీవంటి దైవమును షడానన, నేనెందు కాననురా’ అని త్యాగారాజాదులు ఈ స్వామిని కీర్తించారు.

తారకాసురుని సంహారం అనంతరం సుబ్రహ్మణ్యస్వామి సృష్టికర్త బ్రహ్మపట్ల అహంభావాన్ని ప్రదర్శిస్తాడు. దీంతో తండ్రి పరమేశ్వరుడు హితవు పలకడంతో తప్పు తెలుసుకున్న సుబ్రహ్మణ్యుడు కఠోరమైన యోగ సాధనకు ఉపక్రమించాడు. శరీరంలోని నిద్రాణంగా వున్న కుండలినీ శక్తి యోగసాధనతో మేల్కోంది. అందరి శరీరాల్లో కుండలినీ శక్తి నిద్రాణంగా వుంటుంది. ఈ సాధనతో ద్వేషం, ఈర్ష, అసూయ తదితర దుర్గుణాలను సాధకుడు జయిస్తాడు. సాధనాస్థాయిని బట్టి కుండలినీ శక్తి మధ్యలో వున్న చక్రాలను దాటి సహస్రాకారాన్ని చేరుకుంటుంది.

సహస్రాకారం అంటే వేయిరేకుల తామరపూవు అని అర్థం. అంటే ఆ స్థాయికి బుద్ది వికసిస్తుంది. సు అంటే మంచి బ్రహ్మణ్యం అంటే వికాసం అందుకనే షణ్ముగస్వామిని సుబ్రహ్మణ్యం అని పిలుస్తారు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మురుగన్‌ ఆలయాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. కర్ణాటకలోని కుక్కె సుబ్రహ్మణ్య, తమిళనాడులోని పళని, తిరుచెందూర్‌, తిరుత్తణి, తిరుప్పరకుండ్రం, స్వామిమలై, పళముదిర్‌చొలై ఆలయాల్లో వైభవంగా పూజలు జరుగుతాయి. తారకాసుర సంహారం సమయంలో స్వామి బ్రహ్మచారిగా వుండేవారు. అనంతరం శ్రీమహావిష్ణువు కోరికమేరకు వల్లీ, దేవసేనలను వివాహం చేసుకుంటాడు. షష్ఠినాడు నాగప్రతిమలను పూజించడం, సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలను సందర్శించడం సంప్రదాయం.

పరమేశ్వరుడి తనయుడైన కుమారస్వామినే స్కందుడని, కార్తికేయుడని, సుబ్రహ్మణ్యేశ్వరుడని, తెలుగునాట సుబ్బరాయుడని వ్యవహరిస్తారు. మార్గశిర శుక్ల షష్ఠినాడు కుమారస్వామి తారకాసురుని సంహరించి తారకాధిపతిలా ప్రకాశించాడని, ఈ తిథి అతడికి ప్రియమైనదని భవిష్యోత్తరం చెబుతోంది. కుమారస్వామి జన్మించిన షష్ఠి గనుక దీన్ని సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారని వ్రత చూడామణి పేర్కొంటోంది. కార్తికేయుడు దేవసేనాధిపత్యం పొందిన తిథిగానూ కొన్ని పురాణాలు చెబుతున్నాయి. సులభప్రసన్నుడైన కుమారస్వామిని ఆరోజున అర్చించి అభీష్టసిద్ధిని పొందుతారు. సర్పరూపంగా భావించి పుట్టలో పాలు పోయడం కూడా ఆరోజున కొన్నిచోట్ల ఆచారం. ‘షష్ఠి’ కుమారుని జన్మదినం. స్వామికి ప్రీతిపాత్రమైన తిథి. కొందరు ఉపవాసాది నియమాలతో కూడా స్వామివారిని అర్చిస్తారు. ఏ విధంగానైన ఆరోజు షణ్ముఖుని పూజించడం సర్వోత్తమం. సర్వారిష్ట పరిహారకం.

కుమారస్వామి జననం గురించి పురాణాలు భిన్న గాథలు పేర్కొంటున్నాయి. శివపార్వతులు మన్మథ క్రీడలో ఉండగా తనను మించిన ప్రభావవంతుడు ఉదయిస్తాడని ఇంద్రుడు భయపడి వారికి అంతరాయం కలిగించడానికి అగ్నిని నియమిస్తాడు. అగ్నిని చూసిన శివుడు పార్వతికి దూరం కాగా భూమిపై పడనున్న శివతేజాన్ని అగ్ని గ్రహించి దాన్ని భరించలేక గంగలో వదిలాడు. గంగ దాన్ని తన తీరంలోని రెల్లుపొదల్లో జారవిడిచింది. ఆ శరవణంలో జన్మించడం వల్ల శరవణుడయ్యాడు. కృత్తికలుగా పిలిచే ఆరుగురు ముని కన్యలు ఆ శిశువును తీసుకొనిపోయి బదరికావనం చేర్చారు. కృత్తికలు పెంచినవాడు కనుక కార్తికేయుడయ్యాడు.

బ్రహ్మ మానస పుత్రుల్లో సనత్కుమారుడు ఒకడు. ఆయన సంపూర్ణ వైరాగ్యమూర్తి. తన తపస్సు తప్ప ప్రపంచం, సుఖదుఃఖాలను గురించిన చింత లేనివాడు. అటువంటివాడికి ఒకనాడు ఒక కల వచ్చింది. కలలో తాను దేవసేనాధిపత్యం వహించి రాక్షసులతో యుద్ధం చేస్తున్న దృశ్యం కనిపించింది. వెంటనే బ్రహ్మ వద్దకు వెళ్ళి ఇహలోకమే వద్దనుకునే నాకు ఈ కల ఏమిటని అడిగాడు. బ్రహ్మ దివ్యదృష్టితో పరిశీలించి ‘అది అలా జరగబోతోంది కాబట్టి కలగా వచ్చింది. కానీ, ఇది రాబోయే జన్మలోనిది’ అని చెప్పాడు. ఇది శివ పార్వతులకు తెలిసింది. సనత్కుమారుడంతటివాడికి మరో జన్మ ఉంటే అతడు తమకే సంతానమైతే బాగుంటుందని వారికి అభిప్రాయం కలిగింది.

సనత్కుమారుడు తపస్సు చేసుకుంటున్న ప్రదేశానికి శివుడు వెళ్లాడు. తపోనిమగ్నుడైన సనత్కుమారుడు శివుణ్ని పట్టించుకోలేదు. కోపించిన శివుడు ‘లయకర్తనైన నేనే స్వయంగా వచ్చినా పలకరించవా’ అని గద్దించాడు. ‘శపించగలను జాగ్రత్త’ అని హెచ్చరించాడు. కళ్లు తెరచిన సనత్కుమారుడు ‘శాప ఫలితం నా దేహానికే గాని ఆత్మకు కాదు గదా’ అన్నాడు. శపిస్తానన్నా భయపడని వైరాగ్యమూర్తిని చూసి ఆశ్చర్యపోయిన శివుడు సనత్కుమారుడితో ఆదరంగా ‘నీకు వరం ఇస్తాను… కోరుకో’ అన్నాడు. దానికి అతడు ‘ప్రపంచం మీద ఏ ఆశా లేని నాకు వరం దేనికి? కావలిస్తే నీకే వరమిస్తాను కోరుకో’ అన్నాడు.

వచ్చిన అవకాశం జారవిడువరాదని భావించిన శివుడు ‘స్వామీ! నీవంటి వైరాగ్య సంపన్నుడు నాకు పుత్రుడిగా జన్మించా’లని కోరుకొన్నాడు. ఆయన అంగీకరించాడు. ఇది విన్న పార్వతి ‘నీకు పుత్రుడిగా’ అన్నావు కదా. పురుషుడికి గర్భధారణ ఎలా? ‘మాకు పుత్రుడు’గా రావాలని అడిగింది. అయితే గర్భధారణ ఇష్టం లేక అమ్మవారి స్వరూపమైన శరవణ తటాకం నుండి స్వామి ఒక కుమారుడి రూపం ధరించగా కృత్తికా స్త్రీలు ఆరుగురు తమ స్తన్యంతో పోషించారు. అందుకే ‘షణ్ముఖు’డయ్యాడు. ఇది మరొక గాథ.

సుబ్రహ్మణ్యస్వామి వాహనం నెమలి. ఇంద్రుడి కుమార్తె దేవసేన, శివ ముని పుత్రిక వల్లీదేవి ఇతడి పత్నులుగా పురాణాలు చెబుతున్నాయి. తమిళుల దైవారాధనలో స్కంద పూజకు విశేష ప్రాచుర్యం ఉంది. అక్కడ ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలున్నాయి. తెలుగునాట కొన్ని ప్రాంతాల్లో ఈ దినం పుట్టలో పాలుపోసే సంప్రదాయమూ ఉంది. పంచారామాల్లో ఒకటి సామర్లకోటలోని స్కందారామం. ఇక్కడి శివలింగాన్ని కుమారస్వామి ప్రతిష్ఠించినట్లు చెబుతారు.

సంతానం – సుబ్రహ్మణ్యేశ్వరుడు

పార్వతీ పరమేశ్వరులను దర్శించటానికి అనేక మంది తాపసులు కైలాసానికి వచ్చారట. అందులో దిగంబర ఋషులు ఉండటంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హేళనగా నవ్వాడు, దానికి పార్వతిదేవి కుమారుని మందలించి, మర్మాంగాలు సృష్టి వృద్ధికోసం సృష్టి౦చినవి, జాతికి జన్మ స్థానాలని తెలియజెప్పింది. తల్లి జ్ఞానబోధతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్ప రూపం దాల్చి పాప పరిహారం కోసం తపస్సు ప్రారంభించాడు. జీవ కణాలు పాముల్లా ఉంటాయని మనకు తెలిసిందే. ఆ తరువాత వాటికి అధిపతి అయ్యాడు. సంతానంలేని దంపతులకు సంతానం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలవటం ద్వారా కలుగుతుందనేది శాస్త్రవచనం.

పూజా మందిరంలో శివ కుటుంబ చిత్రపటం

చాలామంది ఉదయాన్నే పూజా మందిరాన్ని శుభ్రం చేసి, తమ ఇష్టదైవాన్ని పూజిస్తుంటారు. తన దైవానికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించి, తమని చల్లగా చూడమని కోరుతుంటారు. అలాంటి పూజా మందిరాలలో శివకుటుంబ చిత్రపటం ఉండటం చాలా మంచిదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

పార్వతీ పరమేశ్వరులు లోకానికే తల్లిదండ్రులు. అన్యోన్య దాంపత్యానికి ఆదర్శమూర్తులు. పరమేశ్వరుడు ఆయుష్షును ప్రసాదిస్తే, అమ్మవారు విజయాన్ని చేకూరుస్తుంది. తమ బిడ్డలను అనుగ్రహించడంలోను, ఆదరించడంలోను ఆ తల్లిదండ్రులు ఎంతమాత్రం ఆలస్యం చేయరు. ఇక వినాయకుడు తనని పార్ధించిన వారికి ఎలాంటి విఘ్నాలు ఎదురుకాకుండా చూస్తాడు, విద్యాభివృద్ధిని కలిగిస్తాడు.

కుమారస్వామి తేజస్సును, చైతన్యాన్ని కలిగిస్తాడు. జ్ఞానాన్ని పెంచడమే కాకుండా సంతానాన్ని అనుగ్రహిస్తాడు. ఇలా పార్వతీ పరమేశ్వరులు, వినాయకుడు, కుమారస్వామి, ఆయురారోగ్యాలను .. విజయాలను .. జ్ఞానాన్ని .. చైతన్యాన్ని కలిగిస్తారు. అందువలన వాళ్లంతా కలిసి వున్న శివ కుటుంబ చిత్రపటం, పూజా మందిరంలో ఉండటం చాలా మంచిదని అంటారు.