Tag Archives: దివ్య ఆలయాలు (Divine Temples)

అరుళ్మిగు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం – తిరుప్పరన్‌ కుండ్రం

ఆది దంపతులు పరమేశ్వరుడు, పార్వతీదేవిల రెండో తనయుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. దేవసేనానిగా వ్యవహరించి రాక్షసుడు శూరపద్ముడిని సంహరించాడు. ఈ సంహారం కోసం ఆయన పలు రణశిబిరాలను ఏర్పాటుచేశాడు. ఈ శిబిరాల్లో ముఖ్యమైనవి ఆరు. వాటిని ఆరు పడై వీడు అంటారు. ఈ ఆరు క్షేత్రాలు తమిళనాడులోనే వున్నాయి. అవి స్వామిమలై, పళని, పళముదిర్చోళై, తిరుప్పరన్‌ కుండ్రం, తిరుచెందూరు, తిరుత్తణి. ప్రస్తుతం మనం తిరుప్పరన్‌ కుండ్రం గురించి తెలుసుకుందాము.

ఆలయ నిర్మాణం…

కొండదిగువన శిలలను తొలిచి నిర్మించిన తిరుప్పరన్‌కుండ్రం ఆలయం అద్భుత శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. పాండ్యుల కాలంలో ఆలయాన్ని నిర్మించినట్టు శాసనాలు తెలుపుతున్నాయి. అయితే అంతకు పూర్వమే ఆలయం వున్నట్టు ఆధారాలున్నాయి. నాయక రాజుల కాలంలో నిలువెత్తు విగ్రహాలను చెక్కారు. కొండను తొలచి ఆలయాన్ని నిర్మించడంతో పాటు పలు దేవతల విగ్రహాలను అద్భుతంగా చెక్కడం ద్రవిడ శిల్పకళకు అద్దం పడుతుంది. ఇంకో విశేషము ఏమిటంటే ఈ ఆలయం మొత్తం ఒకే కొండ రాతిని చెక్కి మలచినది.

ఆరుపడైవీడులో మొదటిది…

ఆరుపడైవీడులో ఈ ఆలయం మొదటిది కావడం విశేషం. అన్ని ఆలయాల్లో మురుగన్‌ నిలుచుకొని అభయమిస్తుండగా ఈ ఆలయంలో ఆసీనుడై భక్తులను ఆశీర్వదిస్తుండటం విశేషం. దేవలోక అధిపతి ఇంద్రుడు తన కుమార్తె దేవయానిని కార్తికేయుడికి ఇచ్చి వివాహనం జరిపిన ప్రదేశంగా తిరుప్పరన్‌ కుండ్రం ఖ్యాతిచెందింది. దేవయాని సమేతుడైనస్వామి చుట్టూ త్రిలోక సంచారి నారద మునీంద్రుడు, ఇంద్రుడు, బ్రహ్మ, సరస్వతి మాత, సూర్యచంద్రులు, గంధర్వులు వున్న చిత్రం కనిపిస్తుంది. ఈ క్షేత్రం తమిళనాడులో ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అయిన మధురై కి కేవలం తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది.

అభిషేకం వేలాయుధానికే…

సాధారణంగా ఆలయాల్లో అభిషేకం మూలవిరాట్టుకు చేస్తారు. అయితే ఇందుకు భిన్నంగా స్వామి వారి ఆయుధమైన వేలాయుధానికి ఇక్కడ అభిషేకం చేయడం గమనార్హం. ప్రతీ రోజూ స్వామి వారి శక్తి ఆయుధానికి అభిషేకం జరుగుతుంది. శూరపద్ముడిని సంహరించిన అనంతరం స్వామి తన వేలాయుధంతో ఇక్కడకి వచ్చినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. తమిళమాసమైన పెరటాసి నెలలో వేలాయుధాన్ని పక్కన కొండపై వున్న కాశీవిశ్వనాధుని ఆలయానికి తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ప్రధాన మందిరం…

ప్రధాన మందిరంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భక్తులకు దర్శనమిస్తుంటారు. సమీపంలోనే ఆది దంపతులైన పార్వతి, పరమేశ్వరుల మందిరం, కర్పగ వినాయక మందిరం, విష్ణుమూర్తి ఆలయాలున్నాయి. ప్రాంగణంలోనే కంబతడి మండపం, అర్ధమండప, మహామండపాలను చూడవచ్చు. వీటిపైవున్న శిల్పకళ చూపరులను విశేషంగా ఆకర్షిస్తుంది.

నక్కిరార్‌ ఆలయం…

ప్రముఖ తమిళ కవి నక్కిరార్‌కు ఒక ఆలయముంది. ఆలయ సమీపంలో తపస్సు చేసుకుంటున్న నక్కీరార్‌కు ఒక రోజు ఆలయ పుష్కరిణలో సగం చేప, సగం పక్షి రూపంలో వున్న ఒక జీవం కనిపించింది. దీన్ని ఆయన తదేకంగా చూడటంతో తపస్సు భంగమైంది. ఆ విచిత్ర రూపం రాక్షస రూపం దాల్చి అతన్ని బందీగా పట్టుకుంది. దీంతో ఆయన తనను రక్షించమంటూ మురుగన్‌ను తిరుమురుగట్టురుపడైని గానం చేశాడు. దీంతో స్వామి ప్రత్యక్షమై నక్కిరార్‌ను అతనితో పాటు వున్న అనేకమందిని రక్షించాడు. స్వామి తన వేలాయధంతో ఒక రాతిపై కొట్టడంతో గంగ జలం బయటకు వచ్చింది. ఈ జలంలో మునిగితే పాపాలు పోతాయి. ఎంత వేసవిలోనూ ఈ తీర్థం ఎండిపోకపోవడం విశేషం.

వసతి సదుపాయము…

ఈ క్షేత్రము మదురైకి దగ్గరగా ఉండడం వల్ల, వసతి ఏర్పాటు మధురైలోనే చూసుకోవచ్చు. మధురైలో ఎన్నో హోటళ్ళు ఉన్నాయి.

ఎక్కడ ఉన్నది?

రోడ్ మరియు రైలు ద్వారా:

1. తమిళనాడులోని చెన్నై నుంచి మధురైకి ఎన్నో రైళ్ళు నడుస్తాయి. మధురై చేరుకొని అక్కడ నుంచి తిరుప్పరన్‌కుండ్రానికి చేరుకోవచ్చు.
2. మధురై నుంచి తిరుప్పరన్‌కుండ్రం 9 కి.మీ. దూరంలో వుంది.
3. మధురైకు దేశంలోని పలుప్రాంతాల నుంచి విమాన, రైలు, బస్సు సౌకర్యాలున్నాయి.
4. చెన్నై – 450 కి.మీ. , బెంగళూరు – 470 కి.మీ. దూరంలో వుంది.


విమాన మార్గము:

1. దగ్గరలో అంతర్జాతీయ విమానాశ్రయము చెన్నై. అది కాక జాతీయ విమానాశ్రయము మధురై మీనాక్షీ అమ్మ వారి ఆలయం నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

       ****** శ్రీ స్వామివారిని దర్శించి తరించ గోరుచున్నాము. ******

మరిన్ని వివరాలకై ఇచ్చట చూడండి: తిరుప్పరన్‌ కుండ్రం – శ్రీ సుబ్రహ్మణ్య దేవాలయం


మరిన్ని వివరాలకై ఇచ్చట చూడండి: ఈటీవి తీర్ధయాత్ర – శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం – తిరుప్పరన్‌ కుండ్రం:

       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం – అత్తిలి

పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండల కేంద్రంలో వెలసిన శ్రీ వల్లీదేవసేనాసమేత సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయం ఆంధ్ర రాష్ట్రంలో విరసిల్లతున్న సుప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఒకటి.

స్వామి వారి ఆలయం ప్రక్కనే జలాశయం ఉంటుంది. ఈ జలాశయంలోనే స్వామి వారి విగ్రహం లబించింది అని చెబుతారు. ఆలయ ఆవరణలో స్వామి వారితో పాటు రామ సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి, గణపతి విగ్రహాలు మనకు దర్శనం ఇస్తాయి. స్వామి వారికి రోజు చేసే పూజా కార్యక్రమాలతో పాటు షష్టి రోజు చేసే వివిధ రకాల సేవలు ఎంతోగాను ఆకట్టుకుంటాయి.

1910 సంవత్సలంలో అత్తిలి సమీప గ్రామంలో ఒక మట్టి పుట్ట ఉండేదని చెబుతారు. ఆ మట్టి పుట్టలో ఒక దేవతా సర్పం నివసించేది అని, కాలక్రమంలో ఆ సర్పం అంతర్థానం అయింది అని చెబుతారు. కొనేళ్ల తరువాత అదే చెరువులో పూడికలు తీస్తూ ఉండగా ఏకశిలపై శ్రీ వల్లీదేవసేనాసమేత సుబ్రహ్మణ్య స్వామి వారి సుందర మనోహర విగ్రహం బయట పడింది అని చెబుతారు. ఈ విగ్రహం సుమారు రెండు అడుగుల ఎత్తుతో స్పష్ట ఆకృతితో తేజరిల్లుతుంటాడు .

పౌరాణికంగా అత్తిలి గ్రామం అత్రి మహర్షి తపోభూమి అని ప్రసిద్ధి పొందింది. అత్రి మహర్షి పేరు మీదుగానే అత్తిలి పేరు ఏర్పడింది అని ప్రసిద్ధి. మొదట్లో అత్రి అన్న పదమే తరవాత కాలంలో అత్తిలిగా రూపాంతరం చెందింది. అత్రి మహర్షి ఆరాధించిన శివలింగమే ఉమా సిద్దేశ్వరస్వామి వారి ఆలయంలోని మూలావిరాట్టు అని ఐతిహ్యం. స్వామివారిపై చేసిన అభిషేక జలాలు తన శరీరంపై నుంచే వెళ్ళాలనే కోర్కెను వ్యక్తపరచినట్టు ఆ వరం అనుగ్రహించినట్టు చెప్తారు.

అత్తిలి వాసులకు శ్రీ వల్లీదేవసేనాసమేత సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆరాధ్య దైవం. షష్ఠి సందర్భంగా ఈ భక్తి ప్రస్ఫుటమవుతుంది. సాధారణంగా అత్తిలి లో పెద్ద పండగ ఏది అని అడిగితే అందరు చెప్పే ఏకైక సమాధానం సుబ్రహ్మణ్య స్వామి షష్టి. 75 సంవత్సరాలుగా ఇక్కడ షష్ఠి తిరునాళ్ళను చేస్తున్నారు. స్వామివారి కల్యాణం సహా 15 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు పెద్దఎత్తున సాగుతుంటాయి.

ఈటీవి తీర్ధయాత్ర – అత్తిలి – శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం… , ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు:

video
play-sharp-fill


అత్తిలి – శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం…. , ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు:

video
play-sharp-fill

       ****** శ్రీ స్వామి వారిని దర్శించి తరించ గోరుచున్నాము. ******

       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

పంచారామాలు – శ్రీ చాళుక్య కుమారారామ భీమేశ్వరస్వామి దేవస్థానము

పంచారామాలలో ఒకటయిన ఈ కుమారభీమారామము క్షేత్రం ప్రశాంతంగా చుట్టూ పచ్చని పంటచేలతో సామర్లకోటకు కిలోమీటరు దూరంలో ఉంటుంది. ఇక్కడ లింగం కూడా 14 అడుగుల ఎత్తున రెండస్తుల మండపంగా ఉంటుంది. పై అంతస్తులోకి వెళ్ళి పూజలు జరపాలి. మహాశివరాత్రి ఉత్సవం ఇక్కడ ముఖ్యమైన పర్వదినం.

చరిత్ర…

సామర్లకోటలోని భీమేశ్వరాలయాన్ని చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించబడింది. ఈయనే ద్రాక్షరామ దేవాలయాన్నీ నిర్మించింది. అందుకె ఈ రెండు ఒకే రీతిగా వుండటమేగాక, రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకటే రకంగా మరియు నిర్మాణ శైలి కూడా ఒకే విధంగా వుంటుంది. ఈ మందిరం నిర్మాణం క్రీ.శ 892 లో ప్రారంభమై సుమారు క్రీ.శ. 922 వరకు సాగింది. ఆలయం నిర్మాణం చాలా చక్కని శిల్ప కళ కలిగి ఇప్పటికీ పగుళ్ళు లేకుండా ఉంది. ఇక్కడి శివలింగం తెల్లని రంగులో ఉంది. 1340-1466 మధ్యకాలంలో రాజ్యం చేసిన కాకతీయులు ఈ మందిరాన్ని కొంత పునర్మిర్మించారు. ఇక్కడ కాకతీయుల నాటి శిల్ప కళను, అంతకు పూర్వపు తూర్పు చాళుక్యులనాటి శిల్ప కళను తేలికగా గుర్తించవచ్చును. ఇక్కడి అమ్మవారు బాలాత్రిపురసుందరి. శివుడు కాలభైరవుని రూపంలో కూడా ఉన్నాడు. 1147 – 1494 మధ్యకాలంలో ఆలయానికి సమర్పించిన విరాళాల గురించిన శాసనాలున్నాయి.

స్థల పురాణం…

పూర్వము తారకాసురుడు అను రాక్షసుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేయగా, శివుడు సాక్షాత్కరించెను. ఆ రాక్షసుడు శివుని యొక్క ఆత్మలింగాన్ని వరంగా కోరగా శివుడు ఆత్మలింగాన్ని ప్రసాదించెను. క్రూర స్వభావం కలిగిన ఆ తారకాసురుడు ఆ లింగ శక్తి వలన దేవతలను, ఋషులను, సత్పురుషులను నానా ఇబ్బందులు పెట్టుచుండగా ఆ బాధలు భరించలేక వీరంతా విష్ణుమూర్తిని ప్రార్థించగా, అపుడు విష్ణువు ఆ లింగం తొలగితేగాని ఆ రాక్షసుని శక్తి నశించదనీ, ఈశ్వరుడి అంశతో జన్మించిన వానితో తప్ప మరెవ్వరి వలన తనకు మరణం లేకుండ వరం పొంది ఉన్నాడని చెప్పగా, మన్మధ ప్రేరేపణ చేత పార్వతీ కళ్యాణం, అనంతరం ‘కుమార సంభవం’ జరుగగా ఆ కుమారస్వామి రుద్ర గణములకు నాయకత్వం వహించి తారకాసురుడితో యుద్ధం చేయగా, కుమార స్వామి విసిరిన బాణం ఆ ఆత్మలింగానికి తగిలి అయిదు ముక్కలై భూమిమీద అయిదు చోట్ల పడెను.

అవే పంచారామ క్షేత్రాలుగా అవతరించెను. అవి వరుసగా అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట. ఇలా భూమి మీద పడిన ఆత్మలింగాలు కైలాసాన్ని చేరుకోవాలని ఎదగడం ప్రారంభించెను. అలా ఎదిగి పోతూ ఉంటే కలియుగం వచ్చేసరికి మానవులకు అభిషేకాలకు గాని, దర్శనానికి గాని అందకుండా పోతాయని ఒక్కోచోట పడిన ఆత్మలింగానికి ఒక్కొక్క దేవుడు అవి ఎదిగిపోకుండా ప్రతిష్ట చేసి అభిషేకార్చనలు చేసారు. ఆత్మలింగాన్ని చేధించిన దోషం తనకు రాకూడదని కుమారస్వామే స్వయంగా ఇక్కడ లింగాన్ని ప్రతిష్టించెను కాబట్టి ‘కుమారారామ భీమేశ్వరస్వామి ‘గా వెలిసెను.

ఆలయ వాస్తు నిర్మాణం…

ఇక్కడ ఆలయంలోని ఈశ్వరుడు కుమార భీమేశ్వరుడుగా ప్రసిద్ధిచెందగా, అమ్మవారు బాలాత్రిపురసుందరిగా పూజలు అందుకుంటోంది. విశాలమైన ప్రాకారాలతో, నాలుగు ద్వారాలతో, కోనేటి జలాలతో, చాళుక్యుల శిల్పకళా నైపుణ్యంతో అలరారుతోన్న ఈ క్షేత్రాన్ని దర్శించగానే మనసుకి ఎంతో ఆహ్లాదం, ఆనందం కలుగుతాయి. దేవాలయం లోపలి ప్రాకారంలో వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, కాల భైరవుడు, వీరభద్రుడు, మహాకాళి, శనేశ్వరుడు, నవగ్రహాలు కొలువుదీరి కనిపిస్తాయి. ప్రధాన ద్వారానికి ఎడమవైపున బాలాత్రిపురసుందరి అమ్మవారు కుడి వైపున ఊయల మంటపం కనిపిస్తాయి. గర్భగుడిలో రెండో అంతస్తు వరకూ పెరిగిన 14 అడుగుల భీమేశ్వరుడి శివలింగం నయనానందాన్ని కలిగిస్తుంటుంది. నిర్మాణ సమయంలోనే ఈ శివలింగం అంతకంతకు పెరిగిపోతుండటం గమనించి శిల్పులు శివలింగం పైభాగాన చీల కొట్టారనే కథ స్థానికంగా వినిపిస్తూ వుంటుంది.

స్వామివారికి ఎదురుగా ఆరు అడుగుల ఎత్తులో నందీశ్వరుడు కూర్చుని ఉంటాడు. గుడిలో స్వామి వారికి ఎదురుగా మండపంలో వున్న నంది విగ్రహం ఏకశిలచే చెక్కబడివున్నది. ఆలయంలోని మండపం నూరు రాతి స్తంభాలు కలిగి ఉంది. రెండో అంతస్తు వరకు దాదాపు 14 అడుగులున్న శివ లింగం, సున్నపు రాయి చే నిర్మితం. శివలింగ ఆధారం క్రింది గదిలో వుండగా, లింగ అగ్రభాగం పై కప్పును చీల్చుకొని మొదటి అంతస్తు వరకుండును. భక్తులు పూజలు, అర్చనలు ఇక్కడే చేయుదురు. మొదటి అంతస్తులో వున్న లింగ దర్శనం తరువాత క్రిందవున్న లింగ పాద భాగాన్ని దర్శించుకొనెదరు. మొదటి అంతస్తుకు చేరుటకు ఇరువైపులనుండి మెట్లు వున్నవి

ఉత్సవాలు పూజలు…

చైత్ర, వైశాఖ మాసాల్లో సూర్య కిరణాలు ఉదయం వేళలో స్వామి వారి పాదాలను, సాయంత్రం సమయంలో అమ్మవారి పాదాలను తాకడం ఇక్కడి విశేషంగా చెప్పుకుంటారు. శివరాత్రికి ముందు వచ్చే ఏకాదశి రోజున భీమేశ్వరస్వామికి, బాలాత్రిపురసుందరికి వైభవంగా వివాహ మహోత్సవం జరిపిస్తారు. అయిదు రోజులపాటు జరిగే ఈ వేడుకల్లో స్వామివారిని నందివాహనంపై అమ్మవారిని సింహ వాహనంపై ఊరేగిస్తారు. ఈ కల్యాణాన్ని తిలకించడానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలంతా వస్తుంటారు. ఇక కార్తీక మాసంలో కూడా ఇక్కడ పూజలు . అభిషేకాలు, ఉత్సవాలు విరివిగా జరుగుతూ వుంటాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ భక్తులు పునీతులవుతుంటారు.


ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు…

శివరాత్రికి ఐదు రోజులు పూజలు, కార్తీకమాసంలో నెలరోజులు కార్తీక పూజలు, ఉపన్యాసాలు నిర్వహిస్తారు. దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులూ పూజలు, సుబ్రహ్మణ్య షష్టి, నాగుల చవితికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఎక్కడ ఉన్నది?

రోడ్ మరియు రైల్వే ద్వారా:

కాకినాడకు ఉత్తరంగా 12 కి.మీ. దూరంలోనూ, రాజమండ్రికి 52 కి.మీ. దూరంలోనూ ఉన్న ఈ దేవాలయం సామర్లకోట రైల్వే స్టేషనుకు అర కిలోమీటరు దూరంలో ఉంది.

       ****** శ్రీ స్వామి వారిని దర్శించి తరించ గోరుచున్నాము. ******

       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

పళని సుబ్రహ్మణ్యుని దర్శనం సర్వపాప హరణం!

ఆది దంపతులు పరమేశ్వరుడు, పార్వతీ దేవిల రెండో తనయుడు శ్రీ సుబ్రహ్మణ్యస్వామి. దేవసేనానిగా వ్యవహరించి రాక్షసుడు శూరపద్ముడిని సంహరించాడు. ఈ సంహారం కోసం ఆయన పలు రణశిబిరాలను ఏర్పాటుచేశాడు. ఈ శిబిరాల్లో ముఖ్యమైనవి ఆరు. వాటిని ఆరు పడై వీడు అంటారు. ఈ ఆరు క్షేత్రాలు తమిళనాడులోనే వున్నాయి. అవి స్వామిమలై, పళని, పళముదిర్చోళై, తిరుప్పురకుండ్రం, తిరుచెందూరు, తిరుత్తణి. ప్రస్తుతం మనం పళని గురించి తెలుసుకుందాము.

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో నాలుగవది పళని. ఈ క్షేత్రం తమిళనాడు లోని దిండిగల్ జిల్లాలో, మధురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రాలలో చాలా ప్రఖ్యాతి గాంచిన మహా మహిమాన్వితమైన దివ్య క్షేత్రం పళని. ఇప్పుడు ఉన్న మందిరం ప్రస్తుతానికి పూర్వం ఏడవ శతాబ్దంలో కేరళ రాజు అయిన చీమన్ పెరుమాళ్ నిర్మించారు. ఆ తరువాత పాండ్యుల కాలంలో ఈ మందిరం ఇంకా అభివృద్ధి చేయబడింది.

కౌపీన ధారిగా దండాయుధపాణి…

ఈ క్షేత్రంలో వెలసియున్న స్వామి వారిని దండాయుధపాణి అనే నామంతో కొలుస్తారు. తమిళులు ఈయనను “పళని మురుగా” అని కీర్తిస్తారు. ఈ క్షేత్రం చాలా పురాతనమైనది. స్వామి చేతిలో ఒక దండం పట్టుకుని, కౌపీన ధారియై, వ్యుప్త కేశుడై నిలబడి, చిరునవ్వులొలికిస్తూ ఉంటాడు. అదే స్వరూపం భగవాన్ శ్రీ రమణ మహర్షిది. భగవాన్ రమణులు సుబ్రహ్మణ్య అవతారము అని పెద్దలు చెప్తారు . ఇక్కడ స్వామి వారు కేవలం కౌపీనంతో కనబడడంలో అంతరార్ధం “నన్ను చేరుకోవాలంటే అన్నీ వదిలేసి నన్ను చేరుకో” అని మనకి సందేశము ఇస్తున్నారు అని అర్థం. అంటే ఈ పళని క్షేత్రము జ్ఞానము ఇచ్చే క్షేత్రము. అంతే కాదు ప్రఖ్యాత కావిడి ఉత్సవము మొదలయిన క్షేత్రము పళని.

సర్వరోగ నివారణమూర్తి కుమార స్వామి…

ఇక్కడ పళని మందిరంలోని గర్భగుడిలోని స్వామి వారి మూర్తి నవపాషాణములతో చేయబడినది. ఇటువంటి స్వరూపం ప్రపంచములో మరెక్కడా లేదు. ఈ మూర్తిని సిద్ధ భోగార్ అనే మహర్షి చేశాడు. తొమ్మిది రకాల విషపూరిత పదార్ధాలతో (వీటిని నవపాషాణములు అంటారు) చేశారు. పూర్వ కాలంలో ఇక్కడ పళని స్వామి వారి మూర్తిలో ఊరు (తొడ) భాగము వెనుక నుండి స్వామి వారి శరీరం నుండి విభూతి తీసి కుష్ఠు రోగం ఉన్నవారికి ప్రసాదంగా ఇస్తే, వారికి వెంటనే ఆ రోగం పోయేదని పెద్దలు చెప్తారు. అలా ఇవ్వగా ఇవ్వగా, స్వామి వారి తొడ భాగం బాగా అరిగి పోవడంతో అలా ఇవ్వడం మానేశారు.

ఆలయ పై భాగంలో స్వామి…

ఇక్కడ స్వామి వారిని ఈ క్రింది నామాలతో స్తుతి చేస్తూ ఉంటారు: కులందైవళం, బాలసుబ్రమణ్యన్, షణ్ముగన్, దేవసేనాపతి, స్వామినాథన్, వల్లి మనలన్, దేవయానై మనలన్, పళని ఆండవార్, కురింజి ఆండవార్, ఆరుముగన్, జ్ఞాన పండిత, శరవణన్, సేవర్ కోడియోన్, వెట్రి వేల్ మురుగా ………
మొదలైన నామాలు ఎన్నో ఉన్నాయి స్వామికి ఇక్కడ.

కొండ ఎక్కడానికి వించి మార్గము…

ఇంకొక విషయం ఏమిటంటే, పళనిలో కొండ పైకి ఎక్కడానికి రెండు మార్గాలు ఉంటాయి. ఓపిక ఉన్న వారు మెట్ల మార్గంలో వెళ్లడం ఉత్తమం. మెట్లు కాకుండా, రోప్ వే లాంటి చిన్న రైలు సౌకర్యం కూడా ఉంది. దీనికి టికెట్ యాభై రూపాయలు.

పళని క్షేత్ర స్థల పురాణము…

పూర్వము విఘ్నాలకు అధిపతిని ఎవరిని చెయ్యాలి అని, పార్వతీ పరమేశ్వరులు ఒకనాడు మన బొజ్జ వినాయకుడిని, చిన్ని సుబ్రహ్మణ్యుడిని పిలిచి ఈ భూలోకం చుట్టి (అన్ని పుణ్య నదులలో స్నానం ఆచరించి ఆ క్షేత్రములను దర్శించి రావడం) ముందుగా వచ్చిన వారిని విఘ్నములకు అధిపతిని చేస్తాను అని శంకరుడు చెప్తే, అప్పుడు పెద్దవాడు, వినాయకుడు యుక్తితో ఆది దంపతులు, తన తల్లి తండ్రులు అయిన ఉమా మహేశ్వరుల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తాడు. మన బుజ్జి షణ్ముఖుడు ఆయన యొక్క నెమలి వాహనముపై భూలోకం చుట్టి రావడానికి బయలుదేరతాడు. కాని, వినాయకుడు “తల్లి తండ్రుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యం వస్తుంది” అనే సత్యము తెలుసుకుని, కైలాసంలోనే ప్రదక్షిణలు చేస్తూ ఉండడం వల్ల, సుబ్రహ్మణ్యుడు ఏ క్షేత్రమునకు వెళ్ళినా, అప్పటికే అక్కడ లంబోదరుడు వెనుతిరిగి వస్తూ కనపడతాడు.

ఈ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అయ్యాడు. కార్తికేయుడు శివపార్వతులకు చిన్న వాడు కావున,దానితో కాస్త చిన్న మొహం చేసుకుని కైలాసం వదిలి, భూలోకంలోకి వచ్చి ఒక కొండ శిఖరం మీద నివాసం ఉంటాడు అలకతో. ఏ తల్లి తండ్రులకైనా పిల్లవాడు అలిగితే బెంగ ఉంటుంది కదండీ, అందులోనూ చిన్న వాడు, శివ పార్వతుల ఇద్దరి అనురాగముల కలపోత, గారాల బిడ్డ కార్తికేయుడు అలా వెళ్ళిపోతే చూస్తూ ఉండలేరు కదా, శివ పార్వతులు ఇద్దరూ షణ్ముఖుని బుజ్జగించడం కోసం భూలోకంలో సుబ్రహ్మణ్యుడు ఉన్న కొండ శిఖరం వద్దకు వస్తారు.

శంకరుడు సుబ్రహ్మణ్యుని బుజ్జగిస్తూ…

ఆ కొండ శిఖరం ఉన్న ప్రదేశమును తిరు ఆవినంకుడి అని పిలుస్తారు. పరమశివుడు ప్రేమతో సుబ్రహ్మణ్యుడిని ఎత్తుకుని, “ నువ్వే సకల జ్ఞాన ఫలానివి రా నాన్నా” అని ఊరడిస్తాడు. సకల జ్ఞాన ఫలం (తమిళంలో పలం), నీవు (తమిళంలో నీ) ఈ రెండూ కలిపి పళని అయ్యింది. అంతటితో ప్రసన్నుడు అయిన సుబ్రహ్మణ్యుడు ఎప్పటికీ శాశ్వతముగా ఆ కొండ మీదే కొలువు ఉంటానని అభయం ఇస్తాడు. సుబ్రహ్మణ్య క్షేత్రాలలో జరిగే “కావడి ఉత్సవం” మొట్ట మొదట ఈ పళని లోనే ప్రారంభం అయ్యింది. మరియు శివకేశవుల పుత్రుడు అయ్యప్ప శబరిమలై స్వామి వారికి భక్తులు పంచామృతం ఇక్కడే తీసుకుంటారు.

కావడి ఉత్సవము – ఇడుంబన్ వృత్తాంతం…

సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క గొప్ప శిష్యులలో అగస్త్య మహా ముని ఒకరు. అగస్త్య మహా ముని స్వామి దగ్గర నుండి సకల జ్ఞానము పొందాడు. అగస్త్య మహర్షికి ద్రవిడ వ్యాకరణము సుబ్రహ్మణ్య స్వామి వారే నేర్పారు. పూర్వము దేవ దానవ యుద్ధములో చాలా మంది దానవులు నిహతులై పోయారు. కాని అందులో ఇడుంబన్ అనే ఒక రాక్షసుడు మాత్రం అగస్త్య మహర్షి పాదములు పట్టుకున్నాడు. అగస్త్యుడు సంతోషించి, వీడిలో మిగిలిపోయిన కొద్ది రాక్షస భావాలు తొలగించాలి అనుకున్నాడు. సాధారణంగా ఎవరైనా పెద్దలు తన వల్ల కాని పని ఉంటే, తన గురువుకి అప్పచెప్తారు. వీడు రాక్షసుడు కదా అని సంహరించడం కాదు, వీడిలో ఉన్న అసుర గుణములను తీసివేయాలి అని తలచి, లోకంలో ఆదిగురువు దక్షిణా మూర్తి, శంకరుడు ఉండేది కైలాసంలో కదా, అందుకని ముందు అక్కడికి పంపిద్దాము అనుకుని ఇడుంబుడిని పిలిచి, “ఒరేయ్ నేను కైలాసం నుండి రెండు కొండలు తెద్దామని చాలా కాలం నుండి అనుకుంటున్నాను, వాటిని శివగిరి, శక్తిగిరి అంటారు. నువ్వు వెళ్లి ఆ రెండు కొండలను, ఒక కావిడి లో పెట్టుకుని నేను ఉన్న చోటికి తీసుకురా” అని ఆజ్ఞాపించాడు.

ఇడుంబుడు కైలాసం వెళ్లి ఆ రెండు కొండలను తన కావిడిలో పెట్టుకుని బయలుదేరతాడు. శంకరుడు అనుకుంటాడు, ఈ రాక్షసుడి ఆసురీత్వం పోగొట్టడం, జ్ఞాన రాశి అయినటువంటి మా సుబ్రహ్మణ్యుడు చేస్తాడులే అనుకుని ఇడుంబుడిని వెళ్ళనిస్తారు. ఇక్కడ స్వామి పళని కొండ మీద చిన్న పిల్లవాడిగా ఉన్నాడు, ఇడుంబుడు దారిలో వస్తూ ఉండగా సరిగ్గా పళని దగ్గరకి వచ్చే సరికి ఆ కొండలు మోయలేక ఆయాసం వచ్చి, కాసేపు క్రింద పెట్టి సేద తీరాడు. మళ్ళీ కావిడి ఎత్తుకుందామని క్రిందకి వంగి కావిడి బద్ద భుజం మీద పెట్టుకుని లేచి నిలబడి, రెండు వైపులా బరువు సమానంగా ఉండేలా సర్దుదామని చూస్తే ఒక వైపు ఎక్కువ బరువు, ఇంకో వైపు తేలిక అవుతోంది కాని, సమానంగా ఎంతసేపటికీ కుదరట్లేదు. ఇంక విసుగొచ్చి, ఏమిటిరా ఈ కావిడి అనుకుని, అలా పైకి చూస్తాడు ఇడుంబుడు. పైకి చూడగానే అక్కడ సుబ్రహ్మణ్యుడు చిన్న పిల్లవాడి రూపంలో పకపక నవ్వుతున్నాడు. ఇది చూసి వీడికి కోపం వచ్చింది.

ఇదే రాక్షస ప్రవృత్తి అంటే, ఏదో చిన్న పిల్లవాడు నవ్వుతున్నాడులే అనుకోవచ్చు కదా. స్వామికేసి తిరిగి “ఏమిటా నవ్వు, నేనేమైనా ఈ కావిడి ఎత్తలేనని అనుకుంటున్నావా? కైలాసం నుంచి తీసుకొచ్చాను. ఏమిటా వెర్రి నవ్వు, నిన్ను చంపేస్తాను ఇవ్వాళ అని ఆ కొండ మీదకి పరిగెత్తాడు. తెలిసి పరిగెత్తాడో, తెలియక పరిగెత్తాడో పళని కొండ మీదకి పాదచారియై వెళ్లాడు. పైకి వెళ్ళాక, స్వామి రెండు గుద్దులు గుద్దాడు, ఇంక ప్రాణం వదిలేస్తున్నాను అన్నప్పుడు, వాడికి తెలిసింది, ఈ పిల్లవాడు సామాన్యుడు కాదురా, మా గురువు గారికి (అగస్త్యుడు) గురువు, సాక్షాత్తు ఈశ్వర పుత్రుడు. అప్పుడు వేడుకుంటాడు “ఈశ్వరా తెలుసుకోలేక పోయాను, మీ చేతి గుద్దులు తిన్నాను, నాకు వరం ఇవ్వండి” అన్నాడు. ఏమిటో అడుగు అన్నాడు స్వామి.

ఇడుంబుడు అన్నాడు, “స్వామీ, నేను ఈ పళనిలోనే కదా, కావిడి ఎత్తలేకపోయాను, ఈ కావిడి వల్లనే కదా, మిమ్మల్ని చేరడానికి మార్గం అయ్యింది, అందుచేత లోకంలో ఎవరైనా సుబ్రహ్మణ్యుడిని ఏ ఆరాధనా చెయ్యకపోయినా, ఒక్క సారి కావిడి పాలతో కాని, విభూతితో కాని, పూలతో కాని, తేనెతో కాని, నేతితో కాని భుజం మీద పెట్టుకుని, మేము సుబ్రహ్మణ్యుడి దగ్గరకి వెళ్ళిపోతున్నాం అని పాదచారులై నీ గుడికి వస్తే, అటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్యారాధన, శాస్త్రంలో ఎన్ని విధాలుగా చెయ్యాలని ఉందో, అంత ఆరాధనా చేసిన ఫలితం వాళ్లకి ఇచ్చేసెయ్యాలి” అన్నాడు ఇడుంబుడు. స్వామి అనుగ్రహించి సరేనని ఆ కోరికని కటాక్షించి, ఇక పైన నా దగ్గరకు వచ్చే భక్తులు ఎవరైనా ముందు నీ దర్శనం చేసి నా వద్దకు రావాలని వరం ఇచ్చాడు. అందుకే అప్పటి నుంచి అన్ని సుబ్రహ్మణ్య క్షేత్రాలలో (ప్రత్యేకంగా తమిళనాడులో) స్వామి వారిని చేరే మార్గంలో ఇడుంబుడి మూర్తి ఉంటుంది, అక్కడ ఆయనకు నమస్కరించిన తరువాతే, సుబ్రహ్మణ్యుని దర్శనము చేసుకుంటారు.

సుబ్రహ్మణ్య కావడిలు…

అప్పటి నుంచి, తమిళ దేశం వాళ్ళు సుబ్రహ్మణ్య కావిళ్ళు ఎత్తి, సుబ్రహ్మణ్యుడిని తమ దైవం చేసేసుకున్నారు. అంతే కాక, ప్రతీ ఏటా స్కంద షష్ఠి ఉత్సవాలలో ఏ దంపతులైతే, భక్తితో, పూనికతో స్వామికి నమస్కరించి ఈ కావడి ఉత్సవంలో పాల్గొంటారో వాళ్లకి తప్పక సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. వారి వంశంలో సంతానము కలగక పోవడం అనే దోషం రాబోయే తరాలలో ఉన్నా కూడా ఆ దోష పరిహారం చేసి స్వామి అనుగ్రహిస్తాడు అని పెద్దలు చెప్తారు. దీనినే కావిళ్ళ పండగ అని అంటారు. అంతటి శక్తివంతమైన క్షేత్రం, తప్పకుండా అందరూ చూడవలసిన క్షేత్రము పళని.

ఎక్కడ ఉన్నది?

రోడ్ ద్వారా:

పళని తమిళనాడు లోని మదురైకి 120 కిలోమీటర్ల దూరంలో కొండ మీద ఉంది. రోడ్డు ద్వారా: మధురై, కోయంబత్తూరు, తిరుచిరాపల్లి, చెన్నై, బెంగళూరు నగరాల నుండి అనేక బస్సులు ఉన్నాయి.

రైలు ద్వారా:

పళనిలో రైల్వే స్టేషను ఉంది. ఇక్కడ నుండి మదురైకి, కోయంబత్తూరుకి రైళ్ళు ఉన్నాయి. దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్లు కొడైకెనాల్ ( 46 కి.మీ ), దిండిగల్ ( 48 కి.మీ. ) దూరంలో ఉన్నాయి.

విమానము ద్వారా:

దగ్గరలో విమానాశ్రయములు కోయంబత్తూరు (116 కి.మీ.), మదురై (129 కి.మీ.), తిరుచిరాపల్లి ( 158 కి.మీ.), బెంగళూరు (306 కి.మీ.), చెన్నై ( 471 కి.మీ.) దూరంలో ఉన్నాయి.

       ****** శ్రీ పళని దండాయుధ పాణి స్వామి వారిని దర్శించి తరించ గోరుచున్నాము. ******

       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

మరిన్ని వివరాలకై ఇచ్చట చూడండి: పళని క్షేత్రము యొక్క వెబ్ సైట్:
మరిన్ని వివరాలకై ఇచ్చట చూడండి: ఈటీవి తీర్ధయాత్ర – పళని – దండాయుధ పాణి క్షేత్రం:

అయ్యప్ప స్వాముల భక్తి పాట: – చిన్ని చిన్ని కావడి:


పళని సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం…., ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు:

video
play-sharp-fill

నాగలమడక సుబ్రహ్మణ్య స్వామి

కర్నాటక రాష్ట్రము నందు, మూడు ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాలు కలవు. అవి ఆది సుబ్రహ్మణ్య (కుక్కే సుబ్రహ్మణ్య) , మధ్య సుబ్రహ్మణ్య (ఘాటి సుబ్రహ్మణ్య) మరియు అంత్య సుబ్రహ్మణ్య (నాగలమడక (పావగడ నగలమడికే సుబ్రహ్మణ్య)) అనే మూడు అద్భుతమైన క్షేత్రాలు. ఈ మూడూ కలిపితే ఒక సర్పాకారం ఏర్పడుతుంది. ఈ మూడు క్షేత్రాలను ఎవరు దర్శించి స్వామిని ఆరాధిస్తారో, వారికి ఉన్న సకల కుజ, రాహు, కేతు దోషములు, సకల నవగ్రహ దోషములు పరిహరింపబడి, స్వామి అనుగ్రహమును పొంది, సకల అభీష్టములు పొందుతారు.

ఈ ప్రదేశం ఆనాడు విజయనగర రాజుల ఆస్థానానికి చెందినదని అంటారు. శ్రీరామచంద్రుడు వనవాస కాలంలో నాగలమడకలో నివాసం ఉన్నట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. రాముని మాటను జవదాటని లక్ష్మణుడు ఈ ప్రదేశంలో రామునికి ఎదురు చెప్పినాడట. రాముడు ఈప్రదేశం వదలి కామనదుర్గ (నీళ్లమ్మనహళ్ళి) కాకాద్రి కొండకు ప్రయాణ మైనట్లు చెబుతారు. ఈ కొండనే కామిలకొండ అని పిలుస్తారు.

ఈ కొండపై రాముని గుడి వెలసింది. నాగలమడకలో అన్నంభట్టు అనే బ్రాహ్మణుడు ఉండేవాడని ఇతను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తుడిగా వుంటూ దక్షిణ కర్ణాటక ప్రాంతంలోని కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనానికి ప్రతి సంవత్సరం కాలి నడకన హాజరయ్యేవాడని అంటారు. ఒకసారి వృద్ధాప్యంలో అన్నంభట్టు కుక్కేలో రథం లాగే సమయానికి చేరుకోలేకపోయాడని అయితే భక్తులు ఎంతమంది లాగినా కూడా రథం ముందుకు కదలక అలాగే నిలిచి పోయిందని అన్నంభట్టు అక్కడకు చేరుకొని రథం పగ్గాలపై చేయి వేసిన వెంటనే రథం కదిలిందని పూర్వీకులు చెబుతారు.

నాగాభరణం…

వృద్ధాప్యంలో ఇక్కడకు రాలేవని అందువల్ల నాగలమడకలోనే ఉంటూ సేవ చేయమని చెప్పి నాగాభరణంను అన్నంభట్టుకు కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చినట్లు పెద్దలు పేర్కొంటున్నారు. ఆ నాగాభరణంను తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం వల్లనే నాగలమడక అని పేరు వచ్చిందంటారు. అది కూడా స్వామి కలలో కన్పించి పెన్నానది పరివాహకం వద్దనే ప్రతిష్ఠించమని చెప్పడంతో నాగుల కోసం వెతుకుతున్న సందర్భంలో ఒక రైతు పొలంలో నాగలితో దున్నుతుండగా ఆ సమయంలో నాగులను పోలిన రాళ్ళు లభ్యం కావడంతో ఆ రాళ్ళనే ప్రతిష్ఠించినట్లు చెబుతారు. తెలుగులో నాగలు అంటే నాగలమడక అని కన్నడంలో నేగిలు అని అర్థం.

ప్రారంభంలో కేవలం నాలుగు స్తంభాలు నిలబెట్టి రాతిబండపరచి మంటపాన్ని నిర్మించారని రొద్దంకు చెందిన బాలసుబ్బయ్య అనే వ్యక్తి ఈ మంటపంలో వ్యాపారంకు సంబంధించిన సరుకులు పెట్టుకుని నిద్రిస్తుండగా స్వామి కలలో కనిపించి ఆలయం నిర్మించాలని చెప్పడం తో ఆయన ఆలయ నిర్మాణానికి కృషి చేసి సఫలీకృతుడైనట్లు తెలిసింది. కావున ఆ వంశానికి చెందిన వ్యక్తులు ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథోత్సవంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నాగలమడకలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఉండే శిల్పం సుందరంగా మూడుచుట్లు చుట్టుకుని ఏడు శిరస్సు లు కల్గిన మూడు అడుగుల నాగప్పస్వామి శిల్పం చూసిన భక్తులకు తక్షణం భక్తి భావన కలుగుతుంది.

పుల్లివిస్తర్ల విశిష్టత…

ప్రతి ఏడాదికి ఒకసారి నిర్వహించే బ్రహ్మ రథోత్సవంలో లక్షలాది మంది తమ మొక్కుబడులు తీర్చడానికి ఈ ప్రాంతానికి వస్తువుంటారు. అందులో విశిష్టమైనది పుల్లివిస్తర్లు (బ్రాహ్మణులు భోజనం చేసి వదిలిన ఆకులు) తలపై పెట్టుకుని పినాకిని నదిలో స్నానం చేయడం. స్వామి రథోత్సవం తర్వాత బ్రాహ్మణులు భోజనం పిదప విడిచిన పుల్లివిస్తర్లు ఏరుకుని వాటిని తలపై పెట్టుకుని నీరున్న చోట తలంటుస్నానాలు చేస్తే చేసిన పాపాలు పోయి మంచి జరుగుతుందని భక్తులు భావించడం విశేషం. అప్పటి వరకు వున్న ఉపవాస దీక్షను విరమించడం భక్తులు అనవాయితీ.

ఈ జాతరలో రైతులకు ఈ ఎద్దుల పరుష ప్రత్యేక ఆకర్షణ. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో అతి పెద్ద ఎద్దుల పరుష ఇక్కడ జరుగుతుంది. ఇక్కడకు తుమకూరు జిల్లా, ఆంధ్ర రాష్ట్రంలోని అనంతపురం జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ఎద్దులు చేరుకుని దాదాపు 10 రోజులపాటు ఎద్దుల అమ్మకాలు, కొనుగోలు జరుగుతాయి.

ఇటీవల నిర్వహించిన పాల పొంగుల షష్ఠి ఉత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. అయితే ఈ సారైనా విస్తర్లు మోసి మొక్కులు తీర్చుకుందామని షష్ఠికి తరలివచ్చిన వేలాది మంది భక్తుల ఆశలు అడియాసలయ్యాయి. కేవలం దేవుడిని దర్శించుకుని పూజలతో సరిపెట్టుకున్నారు. ఆలయం నుంచి స్వామి వారి ఉత్సవ విగ్రహాలు వేద మంత్రాల మధ్య భోజన మంటపంలోని తరలించి అన్నం రాశిపై ప్రతిష్ఠించి పూజలు చేశారు. అనంతరం అన్న ప్రసాదాన్ని బ్రాహ్మణులు ఆరగించారు.

పూజా కార్యక్రమాలు, ఉత్సవాలు…

కర్నాటక రాష్ట్రం పావగడకు 16 కి.మీ. దూరంలో ఉత్తర పెన్నా(పినాకిని) నదీతీరం ఒడ్డున నాగలమడక తీరంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది. అంత్య సుబ్రహ్మణ్యం పేరుతో వెలసిన ఈ స్వామి ఆలయానికి విశిష్ట ఖ్యాతి నెలకొనివుంది. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లోని భక్తుల పాలిట కొంగుబంగారమై విరాజిల్లుతోంది. అంకురార్పణ, ధ్వజారోహణ, కళ్యాణోత్సవం, శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి బ్రహ్మోత్సవం, రథోత్సవం, సుబ్రహ్మణ్య షష్టి, అభిషేకం, బ్రాహ్మణుల అన్న సంతర్పణ, రాత్రి 7 గంటలకు గజ వాహనోత్సవం, పంచామృత అభిషేకం వంటి కార్యక్రమాలు జరుగుతాయి.

ఎక్కడ ఉన్నది?

రోడ్ మరియు రైలు ద్వారా:

18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయానికి రాకపోకలకు రవాణా సౌకర్యం అనుకూలంగా ఉంది. నాగలమడక ఉత్సవానికి అనంతపురం, ధర్మవరం, తాడిపత్రి, మడకశిర, కళ్యాణదుర్గం, రాయదుర్గం, పెనుకొండ ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం కలదు. బెంగళూరు నుంచి 163 కి.మీ. దూరంలో వుంది.

       ****** శ్రీ స్వామివారిని దర్శించి తరించ గోరుచున్నాము. ******

మరిన్ని వివరాలకై ఇచ్చట చూడండి: పావగడ నగలమడికే – శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం


       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******