అమరసింహుడు నాల్గవ శతాబ్దమునాటి జైనమతస్తుడు. సంస్కృత, భాషాభ్యాసమునకు మహోపకారియగు ఒక నిఘంటువును రచించారు.
దానిపేరు నామలింగాను శాసనము. వాడుకలో అమరసింహుని పేరు మీదనే ఈ నిఘంటువు అమరకోశం అని ప్రాచుర్యం పొందింది. తెలుగు వారికోసం దాని వ్యాఖ్యానమును లింగాభట్టు రచించారు. ‘అమరం చదవని వానికి నేను అమరను’ అని సరస్వతి దేవి వచనంగా ప్రచారంలో ఉన్న ‘నామా లింగాను శాసనం’ అనే నిఘంటువు సుమారు రెండు వేల సంవత్సరాలకు పైగా భారత భూమిలో ప్రచారంలో ఉన్నది. బ్రిటీషువారు భారతదేశానికి రాకముందు మన ప్రాచీన గురుకుల పాఠశాలల వ్యవస్థలో పై తరగతుల పిల్లలకి అమరకోశంతో పాటు రఘువంశం, కుమారసంభవం, మేఘసందేశం, కిరాతార్జునీయం, శిశుపాలవధ అనే ఈ అయిదు పుస్తకాలూ తప్పనిసరి వాచకాలుగా నిర్దేశించబడ్డాయి.
సంస్కృతం నేర్చుకునే ప్రతి విద్యార్థి అమరం వల్లెవేయడం ప్రాథమికమని భావించబడిన మహా గ్రంథం ఇది. ఆయుర్వేద మహా శాస్త్రవేత్త ధన్వంతరి కూడా ఈ నిఘంటువు మీద ఆధారపడి తన ధన్వంతరి కోశమనే ఆయుర్వేద నిఘంటువును రచించారు. ఇతడు జైనమతస్తుడయినను, భారతీయ సాంప్రదాయములకు, ఆచారవ్యవహారములకు విరుద్ధుడు కాడు. భాషాసేవయే ముఖ్యమని భావించి స్వాభిప్రాయముల జొప్పించక సంస్కృతమునకు మేలు చేకూర్చాడు. పదిహేను వందల సంవత్సరాల కిందటే చైనా భాషలోకి కూడా అనువాదం పొందిన నిఘంటువు ఇది. ఈ అమరకోశం తనకు పూర్వం రచించబడిన నిఘంటువుల నడుమ మహోజ్వలమై నాటికీ నేటికి ప్రకాశించే కోశరత్నం. ఈనాటికి ప్రతి సంస్కృత విద్యార్థి ‘యస్య జ్ఞాన దయా సింధీ’ అనే ప్రార్థన శ్లోకంతో మొదలు పెట్టి సంస్కృత అధ్యయనాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ విధంగా అమరకోశం సంస్కృత వాజ్మయంలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న విషయం యదార్థం.
అమరసింహుడు అమరకోశముతో పాటు అనేక గ్రంధములను రచించారు. కానీ శంకర భగవత్పాదులతో వాదమునకు దిగినప్పుడు శంకరుల చేతిలో ఓడిపోయారు. అప్పుడు ఆయనకు బాధ కలిగింది. ‘నేను శంకరాచార్యుల వారి చేతిలో ఓడిపోయాను – కాబట్టి నేను రచించిన గ్రంథములన్నీ పనికిమాలినవి అయిపోయాయి’ అని ఆయన తన గ్రంథములనన్నిటిని తగులబెట్టేశారు. ఈ విషయం శంకరులకు తెలిసింది. ఆయన బహు కారుణ్య మూర్తి. ఆయన వచ్చి ‘ఎంత పని చేశావయ్యా! గ్రంథములను ఎందుకు తగులబెట్టావు?’ అని అడిగారు. అప్పటికి ఇంకా ఒకే ఒక గ్రంథము మిగిలిపోయి ఉన్నది. అది అమరకోశము.
అమరకోశము చాలా గొప్ప గ్రంథము. అది మన సనాతన ధర్మమునకు సంబంధించిన నామముల విషయంలో ఏ పక్షపాతం లేకుండా చక్కగా శృతి ఎలా ప్రతిపాదించిందో, స్మృతులు, పురాణములు ఎలా ప్రతిపాదించాయో తాత్త్వికమయిన విషయములను, నామములకు, అనేకమయిన విషయములకు ఉండే అర్థములను అలా ప్రతిపాదన చేసింది. ఏదయినా ఒక విషయమును ప్రతిపాదన చేసేముందు సాధారణంగా ఒకసారి అమరకోశమును చూస్తూ ఉంటారు. అమరకోశంలో కాండ విభాగం బట్టి కానీ వర్గ విభాగం నుంచి చేసిన పధ్ధతి చాలా శాస్త్రీయమైనది. అందువలననే అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ గ్రంధం విస్తృతంగా వ్యాప్తి చెందింది. సంస్కృత భాషను నేర్చుకునే ప్రాధమిక విద్యార్ధికి దీనిని మించిన ఉపయుక్తమైన గ్రంధం లేదు. అమరం అనంతరం అనేక నిఘంటువులు వచ్చినా అవి నిలదొక్కుకోలేక పోయినాయి. కేవలం దీనిలో లేని పదాలను ఉటంకిస్తూ మాత్రమే అవి అస్తిత్వాన్ని నిలుపుకోవలసి వచ్చినాయి. అమరకోశానికి దాదాపు 60 వరకూ వ్యాఖ్యాన గ్రంధాలు ఉన్నాయంటే ఆ సంఖ్యే అమరకోశంగ్రంధం యొక్క ప్రాశస్త్యానికి, ప్రచారానికి అద్దం పడుతుంది.
‘శివ’ అనే శబ్దము చాలా గొప్పది. శివమహాపురాణము శివ శబ్దముతోటే ప్రారంభమయింది. శివ శబ్దమును అమరకోశం వ్యాఖ్యానం చేసింది. ‘శివ’ ‘శివా’ అనే రెండు శబ్దములు మనకి లోకములో వాడుకలో ఉన్నాయి.
‘శివ’ అంటే శంకరుడు. ‘శివా’ అంటే పార్వతీదేవి. ఆయన యొక్క శక్తి స్వరూపము.
అసలు స్వామి అనే మాట అమరకోశం ప్రకారం ఒక్క సుబ్రహ్మణ్యుడిదే. ఎందుచేతనంటే “దేవసేనాపతీ, శూరః, స్వామీ, గజముఖానుజః “ అని అర్ధంగా ఇవ్వబడింది. తరువాత స్వామి అనే పేరు వేరే స్వరూపాలు కూడా తీసుకున్నా, అన్నీ సుబ్రహ్మణ్య స్వరూపాలే అని అనుకోవాలి. అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని పిలిచినా, కేవలం స్వామీ అని పిలిచినా అది సుబ్రహ్మణ్యుడికే చెందుతుంది అని చెప్పింది అమరకోశం.
అమరంలో అసలేముంది?
ఇందులో మూడు కాండలున్నాయి.
1.
ప్రథమకాండ – మంగళాచరణము, పరిభాష, స్వర్గవర్గం, వ్యోమవర్గం, దిగ్వర్గం, కాలవర్గం, ధీవర్గం, వాగ్వర్గం, శబ్దాదివర్గం, నాట్యవర్గం, పాతాళవర్గం, భోగివర్గం, నరకవర్గం, వారివర్గం అనే విభాగాలున్నాయి. మొత్తం శ్లోకాల సంఖ్య రమారమి 330.
2.
ద్వితీయకాండ – భూవర్గం, పురవర్గం, శైలవర్గం, వనౌషధివర్గం, సింహాదివర్గం, మనుష్యవర్గం, బ్రహ్మవర్గం, వైశ్యవర్గం, శూద్రవర్గం. మొత్తం శ్లోకాల సంఖ్య రమారమి 750.
3.
తృతీయకాండ – విశేష్యనిఘ్నవర్గం, సంకీర్ణవర్గం, నానార్థవర్గం, అవ్యయవర్గం, లింగాదిసంగ్రహవర్గం, పున్నపుంసకలింగశేషం, త్రిలింగశేషం. మొత్తం శ్లోకాల సంఖ్య రమారమి 483.
అమరంలో కుమారస్వామి పేర్లు…
కార్తికేయో మహాసేన శ్శరజన్మా షడాననః
పార్వతీ నందన స్కన్ద స్సేనానీ రగ్ని భూర్గుహః
బాహులేయక స్తారకజి ద్విశ్శాఖ శ్శిఖి వాహనః
షాణ్మాతురః శ్శక్తిధరః కుమారః క్రౌంచ ధారణః
కార్తికేయః = ఆరు కృత్తికా నక్షత్రములచే పోషింపబడిన వాడు.
మహాసేనః = గొప్ప సేన గలవాడు.
శరజన్మాః = శరవణతటాకము (రెల్లు పొదల) నుండి జన్మించినవాడు.
షడాననః = షట్కృత్తికల స్తన్య పానము చేయుటకై ఆరు మొగములు ధరించినవాడు.
పార్వతీ నందనః = పార్వతీదేవి కుమారుడు.
స్కంధః = శతృవులను శోషింపజేయువాడు, శివుని రేతస్సుచే జనించినవాడు.
సేనానీః – దేవసేనలకు అధిపతి, దేవసేనాధ్యుక్షుడు.
అగ్నిభూః = అగ్ని వలన జనించినవాడు.
గుహః = సకలజీవుల హృదయ గుహలో కొలువై ఉన్నవాడు.
బాహులేయః = కృత్తికల కొడుకు.
తారకజిత్ = తారకాసురుని జయించినవాడు.
విశాఖః = విశాఖా నక్షత్రమున జన్మించినవాడు, పక్షియైన నెమలిపై తిరుగువాడు.
శిఖివాహనః = నెమలి వాహనముగాగలవాడు.
షణ్మాతురః = ఆరుగురు తల్లులు గలవాడు.
శక్తిధరః = శక్తి యను ఆయుధము గలవాడు.
కుమారః = ఎల్లపుడు బాలుడుగా కనబడువాడు, కుత్సితులను సంహరించువాడు, భువియండు మన్మధునివలె అందమైన వాడు, ఎల్లపుడును బ్రహ్మచారి.
క్రౌంచ ధారణః = క్రౌంచ పర్వతమును ఉక్కళించినవాడు.
ఇవి పదిహేడున్నూ కుమార స్వామి పేర్లు