Tag Archives: దివ్య ఆలయాలు (Divine Temples)

ఘాటి సుబ్రహ్మణ్య స్వామి

కర్నాటక రాష్ట్రము నందు, మూడు ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాలు కలవు. అవి ఆది సుబ్రహ్మణ్య (కుక్కే సుబ్రహ్మణ్య) , మధ్య సుబ్రహ్మణ్య (ఘాటి సుబ్రహ్మణ్య) మరియు అంత్య సుబ్రహ్మణ్య (నాగలమడక (పావగడ నగలమడికే సుబ్రహ్మణ్య)) అనే మూడు అద్భుతమైన క్షేత్రాలు. ఈ మూడూ కలిపితే ఒక సర్పాకారం ఏర్పడుతుంది. ఈ మూడు క్షేత్రాలను ఎవరు దర్శించి స్వామిని ఆరాధిస్తారో, వారికి ఉన్న సకల కుజ, రాహు, కేతు దోషములు, సకల నవగ్రహ దోషములు పరిహరింపబడి, స్వామి అనుగ్రహమును పొంది, సకల అభీష్టములు పొందుతారు.

‘ఘాటి సుబ్రహ్మణ్య స్వామి’ క్షేత్ర నేపథ్యం విషయానికి వస్తే, ఈ ప్రదేశంలో ‘ఘటికాచలుడు’ అనే అసురుడిని సంహరించిన స్వామి, దేవతల కోరికపై ఇక్కడ ఆవిర్భవించాడు. ఆ తరువాత కాలంలో ఒక భక్తుడికి తన ఉనికిని తెలియజేసిన స్వామి వెలుగులోకి రావడం జరిగింది. కర్ణాటక ప్రాంతానికి చెందిన విశిష్టమైన సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రాల్లో ఇది ఒకటిగా విలసిల్లుతోంది.

ఘటికాచలుడు అనే అసురుడిని స్వామి వారు ఈ ప్రదేశంలో సంహరించిన కారణంగానే ఈ క్షేత్రంలోని స్వామివారిని ఘాటి సుబ్రహ్మణ్యస్వామిగా కొలుస్తుంటారు. ఒక్కో క్షేత్రంలో స్వామి వెలుగు చూసినతీరు ఆ స్వామి మహాత్మ్యానికి అద్దం పడుతుంటాయి. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఈ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి.

ఇక్కడ గుడి విశిష్టత ఏమిటంటే ఒకే చోట తూర్పు వైపుగా సుబ్రహ్మణ్య స్వామి , పడమర వైపుగా నరసింహ స్వామి వెలిసారు . సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకునేటప్పుడు నరసింహ స్వామి ని అద్దం లో చూడవచ్చు , అలా ఇద్దరు దేవుళ్ళని దర్శనం చేసుకోవచ్చు.

స్వామివారు ఎక్కడ ఆవిర్భవించినా ఆ స్వామి అనుగ్రహంతో సర్పదోషాలు, గ్రహ సంబంధమైన దోషాలు, అనారోగ్యాలు తొలగిపోతాయనీ, సంతాన సౌభాగ్యాలు నిలుస్తాయని భక్తులు విశ్వసిస్తుంటారు. స్వామివారిపట్ల విశ్వాసంతో మొక్కుకునేవారు, కృతజ్ఞతలతో మొక్కుబడులు చెల్లించుకునేవారు ఈ క్షేత్రాల్లో కనిపిస్తుంటారు.

ఒక్కో క్షేత్రంలో భక్తులు స్వామివారికి మొక్కుబడులు చెల్లించే పద్ధతి ఒక్కోలా ఉంటుంది. మోపిదేవి క్షేత్రంలో ‘ఉయ్యాల ఊపు’ మొక్కు ప్రధానమైనదిగా కనిపిస్తుంది.
ఇతర సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో స్వామివారికి ‘వెండి కళ్లు’, ‘వెండి పడగలు’ మొక్కుబడిగా చెల్లిస్తుండటం ఎక్కువగా ఉంటుంది.


ఇక ఘాటి సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రంలో ‘తులాభారం’ ద్వారా మొక్కుబడులు చెల్లించుకోవడం ప్రధానంగా కనిపిస్తుంది. స్వామివారికి బెల్లం, అరటిపండ్లు ఇష్టమైన నైవేద్యాలుగా చెబుతుంటారు. అందువలన తులాభారం తూగి తమ బరువుకి తగిన బెల్లం, అరటి పండ్లను మొక్కుబడిగా స్వామివారికి చెల్లిస్తుంటారు. ఆయన చల్లని చూపు సదా తమపై ఉండాలని కోరుకుంటూ ఉంటారు.

ఎక్కడ ఉన్నది?

రోడ్ మరియు రైలు ద్వారా:

బెంగళూరు -యలహంక -దొడ్డబల్లాపూర్ రోడ్డు మార్గంలో ఉంది. యలహంక నుంచి 38 కి.మీ. దూరంలో వుంది. దొడ్డబల్లాపూర్ నుంచి ఆటో సదుపాయం కలదు.

       ****** శ్రీ స్వామివారిని దర్శించి తరించ గోరుచున్నాము. ******

మరిన్ని వివరాలకై ఇచ్చట చూడండి: ఈటీవి తీర్ధయాత్ర – శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం – ఘాటి:


ఘాటి సుబ్రహ్మణ్య స్వామి – నిజరూప దర్శనం

కుక్కే సుబ్రహ్మణ్య

జగన్మాత పార్వతీదేవి, లయ కారకుడు పరమేశ్వరుల రెండో పుత్రరత్నం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. నెమలిని వాహనంగా వేలాయుధాన్ని చేతబూని యావత్‌ దేవతాసైన్యానికి ఆయన సేనానిగా వ్యవహరిస్తారు. తన కంటే పెద్దవాడయిన విఘ్నేశ్వరునితో కలిసి శిష్టరక్షణ కోసం అనేక యుద్ధాలు చేశారు. షణ్ముఖుడికి దక్షిణ భారతంలో ఆలయాలు ఎక్కువగా వున్నాయి. వీటిలో మరో మహిమాన్వితమైనది కర్ణాటకలోని కుక్కేలో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం.

కర్నాటక రాష్ట్రము నందు, మూడు ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాలు కలవు. అవి ఆది సుబ్రహ్మణ్య (కుక్కే సుబ్రహ్మణ్య) , మధ్య సుబ్రహ్మణ్య (ఘాటి సుబ్రహ్మణ్య) మరియు అంత్య సుబ్రహ్మణ్య (నాగలమడక (పావగడ నగలమడికే సుబ్రహ్మణ్య)) అనే మూడు అద్భుతమైన క్షేత్రాలు. ఈ మూడూ కలిపితే ఒక సర్పాకారం ఏర్పడుతుంది. ఈ మూడు క్షేత్రాలను ఎవరు దర్శించి స్వామిని ఆరాధిస్తారో, వారికి ఉన్న సకల కుజ, రాహు, కేతు దోషములు, సకల నవగ్రహ దోషములు పరిహరింపబడి, స్వామి అనుగ్రహమును పొంది, సకల అభీష్టములు పొందుతారు.

ప్రకృతి ఒడిలో…

పశ్చిమ కనుమల్లోని సుందర దక్షిణ కన్నడ జిల్లాలోని సులియా తాలుకాలోని కుక్కే గ్రామంలో స్వామివారు నాగులకు రక్షణగా వెలిసి నిత్యపూజలందుకుంటున్నారు. చుట్టూ కుమార పర్వతశ్రేణుల మధ్య ప్రకృతి ఒడిలో నెలకొన్న స్వామివారు నాగులకు అభయమివ్వడంతో పాటు అశేష భక్తజనులకు అభయమిస్తున్నారు.

పురాణచరిత్ర…

సుబ్రహ్మణ్య స్వామి, వినాయకునితో కలిసి తారకాసురునిపై యుద్ధం చేస్తారు. ఈ యుద్ధంలో అసుర సంహారం జరుగుతుంది. అనంతరం ఇక్కడ విశ్రమించిన స్వామి వేలాయుధాన్ని ధార నదిలో పరిశుభ్రం చేస్తారు. దీంతో ఈ నదిని కుమారధార అని పిలుస్తారు. రాక్షస సంహారం చేసిన కుమారస్వామికి దేవేంద్రుడు తన కుమార్తె దేవసేనతో మార్గశిర శుద్ధ దశమి నాడు వివాహం జరిపిస్తారు. సాక్షాత్తూ స్వామివారి వివాహవేదిక కావడంతో ఈ క్షేత్రం మరింత ప్రాశస్త్యం చెందింది. పశ్చిమ కనుమల్లోని ఏడు పరశురామ ప్రతిష్టాపిత క్షేత్రాల్లో కుక్కే సుబ్రహ్మణ్య ఒకటి కావడం విశేషం.

నాగులకు రక్షకుడు…

నాగులలో శ్రేష్టుడు వాసుకి. ఆయన క్షీరసాగర మథనంలో కవ్వానికి తాడులాగా వ్యవహరించాడు. గరుత్మంతుడి బారినుంచి రక్షించాలని కోరుతూ ఇక్కడ కొండల్లో కఠోరమైన తపస్సు చేశాడు. తపస్సుకు అనుగ్రహించిన మహేశ్వరుడు అతనికి వరమివ్వాలని సుబ్రహ్మణ్య స్వామిని ఆదేశిస్తారు. దీంతో స్కందుడు వాసుకికి ప్రత్యక్షమై కుక్కే క్షేత్రంలో నాగులకు రక్షణ వుంటుందని వరమిస్తాడు. దీంతో నాగులకు ఇది రక్షణ క్షేత్రమైంది. ఇప్పటికీ ఈ క్షేత్రంలో అనేక వందల సర్పాలను మనం చూడవచ్చు. ఆది సుబ్రహ్మణ్య మందిరంలో అనేక పుట్టలు వుంటాయి.

ఆదిశేషు, వాసుకిలపై స్వామివారు…

ప్రధాన మందిరంలోని స్వామి ఆదిశేషు, వాసుకిలపైన వుండి పూజలను అందుకుంటారు. సర్పదోష నివారణ పూజలకు ఈ క్షేత్రం ప్రసిద్ధి. సర్పసంస్కార, నాగ ప్రతిష్ట, ఆశ్లేషబలి తదితర పూజలను నిర్వహిస్తారు.

కుమారధారలో పవిత్ర స్నానం…

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, దేవసేనల వివాహం సందర్భంగా పలు పవిత్ర నదీజలాలను దేవతలు కుమారధారలో కలిపారు. స్వామివారి ఆయుధం వేలాయుధం ప్రత్యక్షంగా మునిగిన ప్రాంతం కావడంతో కుమారధారలో పలువురు భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ నీటితో పలు రకాల జబ్బులు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢవిశ్వాసం.

ఎక్కడ ఉన్నది?

రోడ్ మరియు రైలు ద్వారా:

బెంగుళూరు నుంచి 278 కి.మీ. దూరంలో వుంది. మంగళూరు నుంచి 100 కి.మీ. దూరంలో వుంది. మంగళూరు విమానాశ్రయం నుంచి వాహనాల ద్వారా చేరుకోవచ్చు. బెంగుళూరు, మంగళూరు నుంచి బస్సు సౌకర్యముంది. బెంగళూరు నుంచి మంగళూరు వెళ్లే రైళ్లు “సుబ్రహ్మణ్య రోడ్ (స్టేషన్ కోడ్ – SBHR)” మీదుగా వెళుతాయి.

       ****** శ్రీ స్వామివారిని దర్శించి తరించ గోరుచున్నాము. ******

మరిన్ని వివరాలకై ఇచ్చట చుడండి: ఈటీవి తీర్ధయాత్ర – శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం – కుక్కే:

తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి


ఆది దంపతులు పరమేశ్వరుడు, పార్వతీ దేవిల రెండో తనయుడు శ్రీ సుబ్రహ్మణ్యస్వామి. దేవసేనానిగా వ్యవహరించి రాక్షసుడు శూరపద్ముడిని సంహరించాడు. ఈ సంహారం కోసం ఆయన పలు రణశిబిరాలను ఏర్పాటుచేశాడు. ఈ శిబిరాల్లో ముఖ్యమైనవి ఆరు. వాటిని ఆరు పడై వీడు అంటారు. ఈ ఆరు క్షేత్రాలు తమిళనాడులోనే వున్నాయి. అవి స్వామిమలై, పళని, పళముదిర్చోళై, తిరుప్పురకుండ్రం, తిరుచెందూరు, తిరుత్తణి. సుబ్రహ్మణ్యస్వామికి మురుగన్‌, కార్తికేయుడు, శరవణుడు, శరవణవభుడు, షణ్ముగం, ఆర్ముగం, స్కందుడు అనే పేర్లుకూడా వున్నాయి. ప్రస్తుతం మనం తిరుత్తణి గురించి తెలుసుకుందాము.

క్షేత్ర పురాణం…

సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవతలను, మునులను బాధపెడుతున్న శూరపద్ముడనే రాక్షసుని సంహారం చేశాడు. తర్వాత ఇక్కడకొచ్చి పూర్తి ప్రశాంతత పొంది ఇక్కడ కొలువైనారని క్షేత్ర పురాణం వల్ల తెలుస్తోంది. స్వామి శాంతించి ఇక్కడ కొలువయ్యాడుగనుక ఈ క్షేత్రానికి తణిగై అనే పేరొచ్చింది. తణిగ అంటే మన్నించుట, ఓదార్చుట. స్వామి, భక్తుల పాపాలను క్షమించి కటాక్షిస్తాడు కనుక ఈ క్షేత్రానికి తనికాచలం, తిరుత్తణి అంటారు. ఇక్కడ స్వామిని తనికేశన్ అని పిలుస్తారు.

ఇక్కడ నిశ్చల మనస్కులై, అత్యంత భక్తి శ్రధ్ధలతో స్వామిని ప్రార్ధిస్తే, వారి కోరికలు క్షణాల్లో తీరుతాయని భక్తుల నమ్మకం. అందుకే ఈ కొండని క్షణికాచలం అంటారు. తమిళంలో తనికాచలం అంటారు. స్వామిని ఈ క్షేత్రములో వీరమూర్తి, జ్ఞాన మూర్తి, ఆచార్య మూర్తిగా కొలుస్తారు. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని ఆరాధిస్తే మనశ్శాంతి, సుఖం కలుగుతాయని ప్రసిధ్ధి. స్వామి చాలా శక్తి కలవాడని, ఒకసారి స్వామిని దర్శించిన భక్తులకు ఇంక ఎలాంటి కష్టాలు వుండవని భక్తుల నమ్మకం.

శ్రీ వల్లీతో వివాహం…

స్వామివారు శ్రీవల్లీని ఇక్కడే వివాహం చేసుకున్నారు. శూరపద్ముడిని తిరుచెందూరులో సంహారం చేసిన అనంతరం ఇక్కడకు చేరుకున్న షణ్ముఖుడు విశ్రాంతి తీసుకుంటారు. అందుకునే అన్ని సుబ్రహ్మణ్య ఆలయాల్లో జరిపే స్కంద షష్టిని ఇక్కడ నిర్వహించరు. దీనికి బదులుగా యుద్ధఉత్సవం జరుగుతుంది. ఆ రోజున వేయి కిలోగ్రాముల పుష్పాలతో అభిషేకం కన్నులపండువగా నిర్వహిస్తారు. స్వామివారి వాహనం మయూరం ఇక్కడ కనిపించదు. దీని స్థానంలో ఏనుగు వుంటుంది. దీనికి సంబంధించి ఒక పురాణగాథ ప్రచారంలో వుంది.

స్వర్గలోకాధిపతి దేవేంద్రుడు తన కూతురు దేవసేనను సుబ్రహ్మణ్యస్వామికిచ్చి వివాహం చేసినప్పుడు అల్లుడికి కానుకగా ఐరావతాన్ని కూడా ఇచ్చాడు. ఐరావతం ఇంద్రలోకం నుంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచీ, ఇంద్రుని సంపదలు తరిగిపోసాగాయి. అది గమనించిన కుమారస్వామి ఇంద్రునికి ఐరావతాన్ని తిరిగి ఇచ్చెయ్యబోతాడు. కానీ ఇంద్రుడు అల్లుడుకిచ్చిన కానుకను తిరిగి తీసుకోవటానికి అంగీకరించక ఐరావతాన్ని ఇంద్రలోకం వైపు తిరిగి వుండేటట్లు వుంచమని మాత్రం కోరతాడు. దానితో ఇంద్రలోకం తిరిగి కళకళలాడుతుంది. దీనికి ప్రతీకగా ఇక్కడవున్న ఏనుగు తూర్పు దిక్కుకి తిరిగి వుంటుంది.

చందన విశిష్టత …

ఈ ఆలయంలో స్వామికి ఉపయోగించే చందనం ఎంతో విశిష్టమైనది. ఇంద్రుడు తన కూతురు వివాహ సమయంలో ఒక గంధం తీసే రాయినికూడా ఇస్తాడు. దీనిమీద తీసిన గంధాన్ని స్వామికి పూస్తారు. ఈ గంధం చాలా ఔషధ గుణాలు కలిగివుంటుందంటారు. ఈ గంధాన్ని నుదుటిపై ధరించకుండా నీటిలో వేసి సేవిస్తే అన్ని జబ్బులు నయమవుతాయని భక్తుల విశ్వాసం. అయితే పర్వదినాల్లో మాత్రమే ఈ చందనాన్ని పంపిణీ చేస్తారు.

ఆపత్ సహాయ వినాయగర్ …

ఇక్కడికి దగ్గరలోనే వల్లిమలై వున్నది. వల్లీదేవితో స్వామి వివాహం జరగటంలో సుబ్రహ్మణ్యస్వామి అగ్రజుడైన వినాయకుడు సహాయపడ్డాడుట. అందుకే ఇక్కడి వినాయకుణ్ణి ఆపత్ సహాయ వినాయగర్ అంటారు.

కుమార తీర్ధము …

కుమారస్వామి ఇక్కడ తన తండ్రిని పూజించాలని, తన స్ధానానికి ఈశాన్య భాగాన శివ లింగం ప్రతిష్టించి సేవించాడు. తనయుడి పితృ భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు కుమారస్వామికి జ్ఞాన శక్తి అనే ఈటెను అనుగ్రహించాడు. ఆ కారణంగా స్వామికి జ్ఞానశక్తి ధరుడు అనే పేరొచ్చింది. కుమారస్వామి స్ధాపించిన లింగానికి కుమారేశ్వరుడనే పేరొచ్చింది. కుమారస్వామి శివుణ్ణి అర్చించటానికి సృష్టించిన తీర్ధానికి కుమార తీర్ధమని, శరవణ తటాకమని పేరు పొందింది. ఇది కొండ కింద వున్నది.

365 మెట్లు …

ఆలయాన్ని చేరుకోవాలంటే భక్తులు 365 మెట్ల మార్గం కూడా ఉంది. సంవత్సరంలో 365 రోజులకు గుర్తుగా ఈ వీటిని ఏర్పాటుచేయడం విశేషం. నూతన సంవత్సరాదికి మెట్లోత్సవం నిర్వహిస్తారు. దీనినే పడిపూజ అంటారు.

భైరవస్వామి …

ఆలయంలో భైరవుడు నాలుగు శునకాలతో కలిసివుంటాడు. నాలుగు శునకాలు నాలుగు వేదాల పరిరక్షణకు అని తెలుస్తోంది. భైరవుడి ముందు పీఠం ముందు మూడు శునకాలు దర్శనమిస్తాయి. పీఠం వెనుక భాగంలో మరో శునకం వుంటుంది. చదువులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలనుకునేవారు ఇక్కడ ప్రార్థన చేస్తే మంచి ఫలితాలు వుంటాయి.

వల్లీ, మురుగన్‌ల సందేశం …

సుబ్రహ్మణ్వేశ్వరస్వామి, వల్లీల వివాహం మానవాళికి ఒక సందేశానిచ్చింది. వల్లీదేవిని స్వామివారు వేటగాడి రూపంలో పెళ్లిచేసుకుంటారు. జననం, మరణం అనే వలయంనుంచి తప్పించుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆ పరంధాముడిని ఆర్తితో ప్రార్థించాలి. ఈ ప్రపంచం ఒక బాడుగ ఇల్లు లాంటిదని ఎవరూ తెలుసుకోలేరు. అంతా తమదే, శాశ్వతమనే భావనతో స్వార్థంగా ప్రవరిస్తుంటారు. అయితే ఇవన్నీ అశాశ్వతమని తెలుసుకొని ఆ భగవంతుని కృపకు పాత్రులు కావాలని సుబ్రహ్మణ్వేశ్వర, వల్లీదేవిలు మానవాళికి సందేశమిచ్చారు.

పురాణ కథలు …

త్రేతా యుగంలో శ్రీ రామచంద్రుడు రావణ సంహారానంతరం రామేశ్వరంలో ఈశ్వరుడిని ఆరాధించాడు. ఈశ్వరుని సూచన ప్రకారం ఇక్కడికి వచ్చి, ఈ స్వామిని సేవించి మనశ్శాంతిని పొందాడు.

ద్వాపర యుగంలో అర్జనుడు దక్షిణ దేశ యాత్ర చేస్తూ, ఈ స్వామిని సేవించాడు.

తారకాసురుడితో యుధ్ధం సమయంలో తారకాసురుడు సుదర్శన చక్రాన్ని సుబ్రహ్మణ్యస్వామి మీదకి విసురుతాడు. ఆ చక్రం స్వామి ఛాతీ భాగానికి తగిలి కొద్దిగా నొక్కుకు పోయినట్లు అవుతుంది. ఇక్కడ స్వామి విగ్రహంలో ఛాతీ దగ్గర కొంచెం అణిగినట్లు కనబడుతుంది. తర్వాత తారకాసురుడి దగ్గరనుంచి గెలుచుకున్న శంఖ చక్రాలను శ్రీ మహావిష్ణువుకి ఇస్తాడు స్కందుడు.

బ్రహ్మ గారు ప్రణవార్ధం వివరించలేక ఆయన చేతిలో బందీ అయి, సృష్టి చేసే సామర్ధ్యం కోల్పోతాడు. ఇక్కడ బ్రహ్మ తీర్ధంలో ఈ స్వామిని సేవించి బంధ విముక్తుడవుతాడు.

దేవేంద్రుడు ఇక్కడ ఇంద్ర తీర్ధములో కరున్ కువలై అనే అరుదైన పూలమొక్కను నాటాడు. ప్రతి రోజూ ఆ మొక్క ఇచ్చే మూడు పూవులతో ఈ స్వామిని పూజించి తారకాసురుడు మొదలైన రాక్షసులవల్ల పోగొట్టుకున్న ఇంద్రలోక ఐశ్వర్యాలను తిరిగి పొందగలిగాడు.

నాగరాజు వాసుకి సముద్ర మధనంలో తనకైన గాయాలనుంచీ ఈ స్వామిని సేవించటంవల్ల ఉపశమనం పొంది ఆరోగ్యవంతుడయ్యాడు. అగస్త్యుడు ఈ స్వామిని ప్రార్ధించి తమిళ భాషా పాండిత్యం వరంగా పొందాడు.

స్వామి మహిమలు …

అరుణగిరినాథర్‌ అనే మహాభక్తుడు ఇక్కడే స్వామివారిని కొలుస్తూ పరమపదించాడు. కర్ణాటక సంగీతత్రయంలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితులు ఒకసారి ఇక్కడకు వచ్చారు. మెట్లు ఎక్కుతుండగా ఒక వృద్ధుడు వచ్చి స్వామివారి ప్రసాదాన్ని దీక్షతులకు ఇచ్చారు. ఆ ప్రసాదాన్ని నోటిలో వేసుకొనగానే ముత్తుస్వామి నోరు పవిత్రమైంది. ఆశుధారగా గానం చేశారు. అమృతప్రాయమైన ఆ ప్రసాదాన్ని సాక్షాత్తు కార్తికేయుడే వృద్ధుని రూపంలో వచ్చి ముత్తుస్వామికి ఇవ్వడం భగవద్‌ లీలావినోదం.

ఆలయ విశేషాలు …

ఈ ఆలయం 1600 సంవత్సరాలకన్నా పురాతనమైనదంటారు. క్రీ.శ. 875-893లో అపరాజిత వర్మ అనే రాజు శాసనంలోను, క్రీ.శ. 907-953లో మొదటి పరాంతక చోళుడి శాసనంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావించబడింది.

ఇక్కడ వున్న ఉత్సవ విగ్రహాలపైన వుండే విమానము (స్వామి గర్భగుడి పక్కనే పెద్ద పూజా మందిరంలా వుంటుంది) రుద్రాక్షలతో చేసింది. స్వామి ధరించిన ఆకుపచ్చరంగు షట్కోణ పతకం దేదీప్యమాన కాంతులలో స్వామి మెరిసిపోతుంటాడు. ఇక్కడ స్వామిని బంగారు బిల్వ పత్రాలమాలతో అలంకరిస్తారు.

పండుగలు …

ప్రతి నెలా కృత్తికా నక్షత్రం రోజున జరిగే ఉత్సవాలేకాక, తమిళ మాసం ఆడిలో (జులై – ఆగస్టు) 3 రోజులు బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంలో దాదాపు 2 లక్షలమంది పూలతో అలంకరించిన కావిళ్ళు తీసుకొచ్చి స్వామికి సమర్పిస్తారు. ఈ దృశ్యం చూడటానికి చాలా మనోహరంగా వుంటుంది.

ప్రతి ఏడాదీ డిసెంబరు 31వ తారీకు అర్ధరాత్రి 12 గం. లకు లక్షలాది భక్తులు నూతన సంవత్సరంలో స్వామిని సేవించి, స్వామి ఆశీస్సులు పొందటానికి వస్తారు. బ్రిటిష్ పరిపాలన సమయంలో వల్లిమలై స్వామివారి చేత ఈ ఆచారం ప్రారంభించబడింది. నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా అధికారులకు శుభాకాంక్షలు చెప్పే ముందు మనకి సర్వం ప్రసాదించే తనికేశుణ్ణి ప్రార్ధించి, సేవించి తర్వాత అధికారులను కలిసే పధ్ధతి అప్పుడు ప్రారంభమయి, ఇప్పటికీ సాగుతోంది. ఈనాటికీ లక్షలమంది భక్తులు నూతన సంవత్సరం సందర్భంగా స్వామిని సేవించి పాటలు పాడతారు. స్వామి ఆలయానికి చేరే ప్రతి మెట్టుమీదా కర్పూరం వెలిగిస్తారు.

ఎక్కడ ఉన్నది?

రోడ్ మరియు రైలు ద్వారా:
* చెన్నై-తిరుపతి మార్గంలో ఈ క్షేత్రం వుంది.
* తిరుపతి నుంచి 66 కి.మీ.దూరంలో వుంది.
* తిరుపతి నుంచి రైలు, బస్సు లేదా ఇతర వాహనాల ద్వారా తిరుత్తణి చేరుకోవచ్చు
* మెట్ల మార్గం ద్వారా లేదా రోడ్డు మార్గం ద్వారా స్వామి సన్నిధిని చేరి స్వామిని దర్శించుకోవచ్చు.

       ****** శ్రీ స్వామివారిని దర్శించి తరించ గోరుచున్నాము. ******

మరిన్ని వివరాలకై ఇచ్చట చూడండి: తిరుత్తణి – శ్రీ సుబ్రహ్మణ్య దేవాలయం


మరిన్ని వివరాలకై ఇచ్చట చూడండి: ఈటీవి తీర్ధయాత్ర – శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం – తిరుత్తణి:

అన్నామలైశ్వరుడు – అరుణాచలము

వినాయకునికి వందనములు. కుమారస్వామికి వందనములు.

జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన దివ్యక్షేత్రం. అరుణాచలం

        అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలా I
        అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలా I I

తిరువణ్ణామలై (అరుణాచలం) స్మరణ మాత్రం చేత ముక్తినిచ్చే క్షేత్రం. తిరు అనగా “శ్రీ”, అణ్ణామలై అనగా “పెద్దకొండ”. దీనినే “అరుణాచలము” అంటారు. అరుణాచలము అనగా అరుణ – ఎర్రని, అచలము – కొండ. ఎర్రని కొండ అని తాత్పర్యము. అ-రుణ = పాపములను పరిహరించునది అని అర్ధము.

ఇది భూమండలములో అన్నిప్రదేశాల కంటే పురాతనమైనదనీ, ఇది సమస్త భూమండలానికి మధ్యన ఉండి, దాని హృదయం వంటిదనీ చెప్పుకొంటారు.

భూరంభాంస్యనలో నిలోమ్బర మహార్నాథో హిమాంశుః పుమాన్‌ �ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్‌ �నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభోః �తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే’’

జగద్గురు ఆదిశంకరాచార్య చెప్పిన దక్షిణామూర్తి స్తోత్రంలో ఒక పాదం ఇది. దీని అర్థమేమంటే.. అంతటా నిండి నిబిడీకృతమైన శివ చైతన్యం కంటికి కనపడే విధంగా అష్టమూర్తి తత్వంగా ప్రకాశిస్తుంది అని. ఈ ప్రపంచంలో మనం శివుడిని ఎనిమిది రూపాల్లో చూడగలమట. ఆయన తత్వమంతా ఎనిమిది అంకెమీదే నడుస్తుంది. పృథ్వి, అగ్ని, జలం, వాయు, ఆకాశములు పంచ భూతాలు.. ఈ ఐదుతో పాటు సూర్యచంద్రులు, జీవుడు. ఈ ఎనిమిది శివస్వరూపాలు. వీటిని శివ స్వరూపాలుగా నిర్థారణ చేయడం కోసమే ఈ ఎనిమిది లింగాలు మనకు దర్శనమిస్తున్నాయి.

అవి కంచిలో పృథ్వి లింగం, జంబుకేశ్వరంలో జల లింగం, అరుణాచలంలో అగ్ని లింగం, చిదంబరంలో ఆకాశ లింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్క్‌లో సూర్య లింగం, సీతాకుండంలో చంద్ర లింగం, కాఠ్‌మాండులో యజమానలింగం.

ఈ తిరువణ్ణామలై క్షేత్రం తమిళనాడులో ఉన్నది. అరుణాచలంలో పరమేశ్వరుడు అగ్నిలింగంగా కొలువై ఉన్నాడు. అగ్ని అంటే జ్వాల. మిగిలిన పంచభూత లింగాల మాదిరిగా ఇక్కడి శివుడు అగ్నిరూపంలో దర్శనమివ్వడు. కేవలం రాతి లింగంగానే ఉంటాడు. అరుణాచలం పరిసర ప్రాంతాలతో పోలిస్తే ఆలయంలో విపరీతమైన వేడి ఉంటుంది. అది జ్ఞానాగ్ని వల్ల వచ్చే వేడి అంటారు. జ్ఞానాగ్ని ఎవరికి కలుగుతుందో వారి కర్మలు దగ్ధమవుతాయి. దాని వలన మళ్లీ జన్మించాల్సిన అవసరం లేకుండా పాపాలన్నీ పోతాయి. అందుకే అరుణాచలాన్ని జ్ఞానస్వరూపమైన అగ్నిలింగం అంటారు.

పురాణగాథ…

పూర్వం బ్రహ్మ, మహా విష్ణువుల్లో ఎవరు గొప్ప అనే దానిపై ఇరువురు కలహించుకొన్నారట. సృష్టికర్త అయిన బ్రహ్మ, స్థితికారుడైన విష్ణువు శివమాయకు వశం కావడం ఈ కలహానికి కారణమైంది. శివ మాయా మోహితులైన వీరిని మాయా మేఘం కమ్మేసింది. దీంతో ఇరువురి మధ్య అహంకారం ప్రజ్వరిల్లి కలహానికి దారితీసిందట. ‘నేను సృష్టికర్తను. నేను సృష్టించకుండా ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది’ అని బ్రహ్మ.. ‘నేను స్థితికారుడను. అన్నీ సవ్యంగా సాగడానికి కారణం నేనే కనుక నేనే గొప్ప’ అని విష్ణువు అనడం ఇద్దరి మధ్య ఎడతెగని చర్చకు, వాదోపవాదానికి దారితీసిందట. ఏ మాయవల్ల వారు కలహానికి దిగారో అది తెలియాలని ఇరువురి మధ్య పరమశివుడు ఒక పెద్ద జ్యోతి స్తంభంగా వెలిశాడట. అనంతరం బ్రహ్మ, విష్ణువులిద్దరినీ ఈ జ్యోతిస్తంభం ఆది, అంతములు తెలుసుకొని రమ్మన్నాడట.

వరాహమూర్తియై శ్రీమహావిష్ణువు జ్యోతిర్లింగం ఆదిని తెలుసుకోవడానికి భూమిని తవ్వుకొంటూ పాతాళలోకం దాటి వెళ్లిపోగా, పైన ఉన్న కొనభాగాన్ని తెలుసుకోవడానికి హంసనెక్కి చతుర్ముఖ బ్రహ్మ.. వూర్థ్వముఖానికి వెళ్లారట. అలా కొన్ని వేల దివ్య సంవత్సరములు వారు ప్రయాణం చేశారట. బ్రహ్మకు అలసట రావడంతో ఓ చోట ఆగిపోయారట. ఆ సమయంలో పైనుంచి పడుతున్న ఒక మొగలిపువ్వును పట్టుకుని అడిగారట.. ‘నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు?’ అని. అప్పుడు మొగలిపువ్వు ‘నేను శివుడి తలపై నుంచి కింద పడుతున్నా’ అని సమాధానమిచ్చిందట. ఈ శివలింగం పైభాగం ఇంకెంత దూరం ఉందని ఆ కేతకీపుష్పాన్ని బ్రహ్మ అడగగా, అందుకు అది సమాధానమిస్తూ ‘నేను ఇలా పడటం మొదలుపెట్టి కొన్ని వేల దివ్య సంవత్సరములు అయింది’ అని చెప్పిందట.

ఆద్యంత రహితమైన శివలింగాన్ని కనుక్కోలేక మొగలిపువ్వుతో బ్రహ్మ ఈ విధంగా అన్నాడట. శివలింగం పై భాగం నుంచి నేనే నిన్ను తీసుకొచ్చానని శివుడికి చెప్పాలి అనడంతో అందుకు ఆ కేతకీపుష్పం అంగీకరించిందట. అప్పుడే అక్కడకు వచ్చిన కామధేనువును కూడా సాక్ష్యం చెప్పాల్సిందిగా బ్రహ్మ కోరాడట. దీంతో ఆ రెండింటినీ తీసుకుని పరమశివుడి వద్దకు చేరాడట బ్రహ్మ. అప్పటికే మాయమేఘం వీడిపోయిన శ్రీమహావిష్ణువు తాను ఈ లింగం ఆదిని కనుక్కోలేకపోయానని నిజం ఒప్పుకొన్నాడట. అయితే అగ్నిలింగం ఆరంభాన్ని తాను చూశానని అందుకు మొగలిపువ్వు, కామధేనువులే సాక్షి అని చెప్పాడట బ్రహ్మ. మొగలిపువ్వు అవును అని సమాధానమివ్వగా, కామధేనువు తలతో ఔనని, తోకతో కాదు అని సమాధానమిచ్చిందట.

అందుకు ఆగ్రహించిన శివుడు ‘నువ్వు భూలోకంలో పూజాదికాలు లేకుండా ఉండుగాక’ అని బ్రహ్మను శపించాడట. అసత్యాన్ని పలికిన మొగలిపువ్వును పూజకు పనికి రావనీ, సగం నిజం, సగం అబద్ధం చెప్పిన ఆవు ముఖానికి పూజలేకుండా కేవలం పృష్టానికి మాత్రమే పూజలందుకుంటావనీ శపించాడట. ఆనాడు అలా వెలసిన అగ్నిస్తంభాన్ని బ్రహ్మ ప్రార్థన చేశాడట. ‘మా అహంకారం పోయింది. అసలు పరబ్రహ్మ స్వరూపమేదో, ఆద్యంతములు లేనిదేదో తెలిసింది. ఇక్కడ ఇదే స్వరూపంతో వెలిసిన మీరు భూలోకంలో అజ్ఞానాన్ని పోగొట్టేందుకు అరుణాచలంలో అగ్నిలింగమన్న పేరుతో భక్తులను అనుగ్రహించాలి’ అని ప్రార్థన చేశారు. ఆ కారణంతోనే పరమశివుడు అరుణాచలంలో అగ్నిలింగంగా వెలశాడన్నది పురాణగాథ.

అరుణాచలం ఎందరో సిద్ధ పురుషులకు ఆలవాలం. దేవతలు కూడా ఎప్పుడూ ప్రదక్షిణ చేస్తుంటారు. పర్వతం మొత్తం శివ స్వరూపం. అరుణాచలంలో ఒక మినహాయింపు ఉంది. ఆ పర్వతం చుట్టుపక్కల 24మైళ్ల దూరం దాని తేజస్సు పడుతుందట. అక్కడ ఏ దీక్షా అవసరం లేదట. ఇందుకు రమణ మహర్షి జీవితంలో జరిగిన ఓ ఘటనను ఉదాహరణగా చెబుతారు. భగవాన్‌ రమణ మహర్షి (శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అవతారం) అరుణాచలం పర్వతంపై గల విరూపాక్ష గుహలో తెల్లటి కౌపీనం ధరించి ఉన్నారట. ఆ సమయంలో శృంగగిరి పీఠం నుంచి ఓ పండితుడు వచ్చి.. ‘అయ్యా! మీరు అన్నీ విడిచిపెట్టేశారు. ఏ బంధనాలు లేవు. ఇలా తెల్లటి గోచి పెట్టుకుని ఉండటం కన్నా సన్యాసం స్వీకరించి, కాషాయ వస్త్రాలు ధరిస్తే బాగుంటుంది. సన్యాసం కాదంటే ఓ కాషాయ కౌపీనం ధరిస్తే బాగుంటుంది’ అని సలహా ఇచ్చారట.

అందుకు రమణ మహర్షి ఏ సమాధానం ఇవ్వలేదట. తాను మళ్లీ వస్తానని మనసు మార్చుకుంటే చెప్పండి అని ఆ పండితుడు వెళ్లిపోయారట. కొద్దిసేపటికి ఓ వృద్ధుడు పుస్తకాల సంచీతో అక్కడి వచ్చి ‘నేను స్నానం చేయలేదు. ఈ మూట చూస్తూ ఉండు’ అంటూ రమణ మహర్షికి చెప్పి వెళ్లిపోయాడట. పుస్తకాల మూటను విప్పి చూసిన రమణులు అందులో పైనున్న పుస్తకాన్ని తెరచి చూశారు. అది సంస్కృతంలో ఉన్న ‘అరుణాచల మహత్యం’ అనే పుస్తకం. గిరి పర్వతం చుట్టుపక్కల 24 మైళ్ల వరకూ ఏ దీక్షా నియమాలు ఉండవని అందులో రాసి ఉందట. పరమ శివుడే వృద్ధుడి రూపంలో వచ్చి రమణ మహర్షికి పుస్తకాలను అందజేశారని చెబుతారు. ఆ పుస్తకాన్ని చూపితే పండితుడు మారు మాట్లాడకుండా వెళ్లిపోయాడట.

పర్వత గుహలో దక్షిణామూర్తి

అరుణాచలం పర్వతం లోపల మధ్యలో ఓ పెద్ద గుహ ఉందట. అక్కడ ఓ పెద్ద మర్రిచెట్టు ఉంటుందని దాని కింద దక్షిణామూర్తి స్వరూపుడై సిద్ధయోగిగా పరమశివుడు ఇప్పటికీ కూర్చుని ఉంటాడని నమ్మకం. అయితే అక్కడకు వెళ్లాలని ప్రయత్నించిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని చివరకు వెనుతిరిగి వచ్చేశారట. అలా దక్షిణామూర్తిని దర్శించాలని బయలుదేరి వెనుదిరిగిన వారిలో రమణ మహర్షి కూడా ఉన్నారట. అరుణాచలం పరమ సత్యమైన క్షేత్రం. శివుడు లింగరూపంలో ఆవిర్భవించిన తర్వాత అక్కడ నిర్వహించవలసిన పూజాది కార్యక్రమాలు ఎలా చేయాలనే విషయాన్ని నిర్ణయించమని, గౌతమ మహర్షిని ఆదేశించారట.

అరుణాచలంలో ఏయే సేవలు ఉండాలి.. ఏ ఆలయాలు ఉండాలి.. ఏ పూజలు చేయాలి.. అని నిర్ణయం చేసిన వారు గౌతమ మహర్షి. ఈ క్షేత్రానికి కాల భైరవుడు క్షేత్రపాలకుడు. స్థల వృక్షం ఇప్ప చెట్టు. అబిత కుచాంబ అనే పేరుతో అమ్మవారు ఇక్కడ ఉంటారు. విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యస్వామి, పాతాళ లింగ కూడా ఉంటాయి.

ముఖ్య ఉత్సవాలు…

అరుణాచలంలో ముఖ్యంగా మూడు ఉత్సవాలు జరుగుతాయి. ఆలయంలో వలయాకారపు మండపం ఉంటుంది. అక్కడ అమ్మవారికి గాజుల్ని సమర్పించుకుంటారు.

కార్తీక మాసంలో జరిగే మరో గొప్ప ఉత్సవం… దీపోత్సవం. దీనిని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

ఇక కనుల పండువగా జరిగే ఉత్సవం పార్వతీ పరమేశ్వరుల మధ్య వచ్చే ప్రణయ కలహోత్సవం. ఎందుకు వారి మధ్య ప్రణయ కలహం వచ్చిందటే.. ఇందుకు ఓ పురాణగాథను చెబుతారు. ప్రమధ గణాల్లో భృంగి ఒకడు. ఆయన శివుడికి మాత్రమే భక్తుడు. కేవలం ఆయనకు మాత్రమే ప్రదక్షిణ చేసేవాడు. ఇలా రోజూ చేస్తుండటంతో ఓ రోజు అమ్మవారికి ఆగ్రహం వచ్చిందట. ఏం చేస్తాడో చూద్దామని భృంగి వస్తుంటే అమ్మవారు పరమశివుడి వామార్ధం (ఎడమభాగం)లోకి వెళ్లిపోయి అర్ధనారీశ్వర రూపాన్ని ధరించారట. అదే సమయానికి అక్కడకు వచ్చిన భృంగి తేనెటీగలా మారిపోయి పరమ శివుడికి, అమ్మవారికీ మధ్య రంధ్రం చేసి ప్రదక్షిణ చేశాడట.

దీంతో ఆయన భక్తికి మెచ్చిన శివుడు మోక్షం ఇస్తాననీ, ఇవ్వకూడదని అమ్మవారూ… ఇరువురూ కలహించుకొన్నారని గాథ. ఆదిదంపతుల గాథను స్ఫూర్తిగా తీసుకొని అర్చకులు అరుణాచలంలో అత్యంత వైభవంగా ప్రణయ కలహోత్సవం చేస్తారట. ఈ సందర్భంగా పరమశివుడు భృంగికి మోక్షం ఇవ్వడం, దీంతో పార్వతీ దేవికి కోపం వచ్చి అబిత కుచాంబ ఆలయంలోకి వెళ్లి తలుపేసుకుంటుంది. పరమశివుడు ఒక్కడే గిరి ప్రదక్షిణకు వెళ్తే దొంగలు దోచుకుంటారు. ఇప్పటికీ ఈ దొంగలతోపును ఆనవాయితీగా చేస్తున్నారు.

గోపురాల విశిష్టత

అరుణాచల దివ్య క్షేత్రానికి ఎంత గొప్ప పేరుందో అక్కడి గోపురాలకు అంతే విశిష్టత ఉంది. అందుకు సంబంధించి కొన్ని కథలూ ప్రచారంలో ఉన్నాయి. తూర్పు వైపు గోపురం శ్రీకృష్ణదేవరాయలు కట్టించారు. అదో అద్భుత కట్టడం. ఇక ఉత్తర దిక్కున ఉన్న గోపురాన్ని ఓ మహిళ కట్టించారట. ఆమె పేరు అమ్మణి అమ్మన్‌. పరమశివుడి అనుగ్రహం వల్ల యోగశక్తిలో సిద్ధహస్తురాలయ్యారు. ఆమె ప్రతీ ఇంటికి వెళ్లి ‘గోపురం కడుతున్నాం దానం చేయండి’ అని అర్థించేవారట. డబ్బులు లేవు అని చెబుతారేమోనని వారి ఇళ్లలోని ఇనుప పెట్టెలు ఎక్కడ ఉన్నవి.. అందులో ఎంత సొమ్ము ఉన్నదీ చెప్పేసేవారట. దీంతో భయపడి విరాళం ఇచ్చేవారని వాటితోనే ఆమె ఉత్తర గోపురాన్ని కట్టారని చెబుతుంటారు.

        ****** ఓం సర్వం శ్రీ రమణార్పణమస్తు ******








అరుణచలేశ్వరుల దేవాలయము – ముఖ్యస్థానములు

ArunachalamuDevalyaMukhyasthanamulu

కోటంక సుబ్రహ్మణ్యస్వామి ఆలయం

భక్తుల కోరికలను నెరవేర్చడం కోసం సుబ్రహ్మణ్యస్వామి వివిధ ప్రదేశాల్లో అవతరించాడు. అలాంటి విశిష్టమైన క్షేత్రాల్లో ఒకటి అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ‘కోటంక’ గ్రామంలో ఉంది.. గుంటికింద సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం. ఇక్కడ సమీపంలోని పాటకోట కొండ మీద స్వామి స్వయంభువుగా వెలిశాడు. తూర్పు దిక్కుకు అభిముఖంగా నాగేంద్రుడి ఆకారంలో కనిపించే పెద్ద శిలను భక్తులు షణ్ముఖుడి ప్రతి రూపంగా కొలుస్తారు. దీ౦తో గుండు సుబ్బరాయుడు కాస్తా వాడుకలో గుంటికింద దేవుడిగా వాసికెక్కాడు. స్థల మహత్యం తెలిసిన మహర్షులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ తపస్సు చేసేవారని ప్రతీతి. పూర్వం స్వామి, ఏడూ శిరస్సుల సర్పరూపంలో మహర్షులకు దర్శనమిస్తూ వుండేవాడని చెబుతుంటారు.

ఇక్కడ స్వామివారి మూలవిరాట్టు పాదాలకింద పాతాళగంగ వుంది. ఇందులో నీరు చాల తియ్యగా ఉంటుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకూ ఇందులోని నీటి ధార తగ్గకపోవడం విశేషంగా చెప్పుకుంటూ వుంటారు. ఇది స్వామివారి మహిమగా విశ్వసిస్తూ వుంటారు. ఈ నీటిని స్వామివారి అభిషేకానికి ఉపయోగిస్తారు. పాతాళ గంగలోని నీటిని తీర్థంగా స్వీకరించడానికి భక్తులు మరింత ఆసక్తిని చూపుతారు. ఈ నీటిని తీర్థంగా స్వీకరించడం వలన, దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుముఖం పడతాయని అనుభవపూర్వకంగా చెబుతుంటారు.

వివాహం విషయంలోను, సంతాన భాగ్యం విషయంలోను ఆలస్యమవుతున్నప్పుడు, ఈ స్వామిని దర్శించుకుని మనసులో మాట చెప్పుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని అంటారు. ఈ క్షేత్రంలో అడుగుపెట్టడం వలన సమస్త దోషాలు తొలగిపోతాయనీ, పుణ్యఫలాలు చేకూరతాయని చెబుతారు. విశేషమైన పర్వదినాల్లో స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది. ఆహ్లాదకరమైన ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది.

పురాణగాథ…

పార్వతీపరమేశ్వరుల ముద్దుల తనయుడు కుమారస్వామిని సర్పరూపంలో కొలవడం వెనుక ఓ పురాణ గాథ ఉంది. ఒకానొక సమయములో, ఈశ్వరుడిని దర్శించుకోవడానికి బ్రహ్మ కైలాసానానికి వచ్చారు. ఆయన గొప్పతనాన్ని గుర్తించకుండా బ్రహ్మను అవమానించాడు కార్తికేయుడు. అది తెలిసి పరమశివుడు కొడుకుని మందలించాడు. తానెంత అపరాధానికి పాల్పడ్డాడో సుబ్రహ్మణ్యుడికి అప్పుడు కానీ అర్థం కాలేదు. చాలా పశ్చాత్తాపపడ్డాడు. సృష్టికర్తను అగౌరవ పరిచిన దోషాన్ని తొలగించుకోవడానికి తనకు తాను ఓ శిక్ష విధించుకున్నాడు. భూలోకానికొచ్చి, నాగుపాము రూపంలో రహదారికి అడ్డంగా పడుకున్నాడు. కాటేయడానికి విషసర్పమేమో అనుకుని జనం రాళ్లతో కొట్టసాగారు. దీ౦తో నిలువెల్లా గాయాలు అయ్యాయి. ఆ విషయం పార్వతీ దేవికి తెలిసి, తన బిడ్డను రక్షించమని ముక్కోటి దేవతలను ప్రార్థి౦చింది. మహర్షుల సూచన ప్రకారం, తనయుడితో షష్ఠి వ్రతం చేయించింది. అలా పాప పరిహారం అయిపోయిందని సుబ్రహ్మణ్యుడు సర్పరూపాన్ని విడిచి పెట్టాడని అంటారు. ఆకారణంగానే, స్వామి సర్పరూపంలో భక్తులకు దర్శనం ఇస్తు౦టాడని చెబుతారు.

విశేష పూజలు…

ఇక్కడ మాఘమాసంలోని నాలుగు ఆదివారాలూ విశేషంగా పూజలు జరుగుతాయి. మూడో ఆదివారం సుబ్రహ్మణ్యేశ్వరుడికి పంచామృతాభిషేకాలు, ఏకాదశవార రుద్రాభిషేకాలు, రథోత్సవం, తిరునాళ్లు జరుగుతాయి. శ్రావణమాసంలో భక్తులు ఉపవాసదీక్షతో పుట్ట వద్ద దీపాలు వెలిగిస్తారు. ఉసిరి, రావి, వేప, కానుగ చెట్లు ఇక్కడి మరింత ఆహ్లాదభరితం చేస్తున్నాయి. దీంతో కార్తీక వనభోజనాలకు భక్తులు తరలి వస్తుంటారు. ఆదివారాలూ, పర్వదినాల్లో అన్నదానం జరుగుతుంది.

ఎక్కడ ఉన్నది?

రోడ్ ద్వారా:
అనంతపురం – బెంగళూరు జాతీయ రహదారిలో గార్లదిన్నె మండలం కేంద్రం నుంచి 10 కి.మీ.ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఇది రాయలసీమ ప్రాంతంలోనిది. కోటంక గ్రామం అనంతపురంకి 15 కి.మీ.ల దూరంలో ఉంది. ఆత్మకూరు, అనంతపురం నుండి బస్సులు అందుబాటులో కలవు.

రైలు ద్వారా:
అతి సమీపంలోని రైల్వేష్టేషన్‌ అనంతపురం.