కుమారకొట్టం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం II కంచి
కాంచిపురంను కంచి, కాంచి అని కూడా అంటారు. హిందువులకు మోక్షప్రదానమైన ఏడు నగరాల్లో కాంచీపురం ఒకటి. మోక్షభూమి, శక్తి భూమిగా ఈ క్షేత్రం ఎంతో పవిత్రమైనదిగా హిందువుల నమ్మకం. గరుడ పురాణం ప్రకారం మోక్షన్ని ఇచ్చే నగరాలు ఏడు అవి వరసగా అయోధ్య, మధుర, హరిద్వార్, కాశీ, అవంతికా, ద్వారక, కంచి. కాంచీపురం “ద గోల్డెన్ సిటి ఆఫ్ 1000 టెంపుల్స్”. అంత ప్రాముఖ్యత కలిగిన ఈ నగరంలో అడుగడుగునా దేవాలయాలే దర్శనమిస్తాయి.
కాంచీపురంలో శ్రీ కామాక్షి దేవి కొలువుదీరి ఉంది. శ్రీ కామాక్షిదేవిని “కామాక్షి తాయి” అని , “కామాక్షి అమ్మణ్ణ్ ” అని కూడా పిలుస్తారు. కాంచీపురంలో భగవత్ శ్రీ ఆదిశంకరాచార్యులుచే స్థాపించబడిన కంచి కామకోటి పీఠం శ్రీ కామాక్షిదేవి ఆలయం ప్రక్కనే ఉంది. పంచభూత స్థలాలలో ఒకటైన, ఏకాంబరేశ్వరుడు “పృథ్వి లింగం” గా కొలువుదీరిన క్షేత్రమే కాంచీపురం. పరమశివుడు 16 పట్టల లింగంగా కొలువుదీరిన కైలాసనాథార్ ఆలయం కాంచీపురంలోనే ఉంది. 16 పట్టలు 16 కళలు అని ప్రతీతి. శ్రీవైష్ణవులకు పరమపవిత్రమైన 108 దివ్య దేశాలలొ, 14 దివ్య దేశాలు కాంచీపురంలో కొలువుదీరి ఉన్నాయి. శైవులకు, శాక్తేయులకు, వైష్ణవులకు పరమపవిత్రమైన క్షేత్రం కాంచీపురం.
ఏకాంబరేశ్వరుడు దేవాలయం ఉన్న ప్రాంతాన్ని శివకంచి అని వరదరాజ పెరుమాళ్ దేవాలయం ఉన్న ప్రాంతాన్ని విష్ణుకంచి అని పిలుస్తారు, ఈ రెండు ప్రాంతాల మధ్య కామక్షి అమ్మ వారి ఆలయం. కాంచీపురం ఎన్నో సుప్రసిద్ధ దేవాలయాలకు చిరునామా. అవేవి సాధారణమైన గుడులు కాదు, ఎంతో గొప్ప చరిత్ర, అంతే గొప్పగా మలచిన శిల్ప కళా సౌందర్యం వాటి సొంతం. అటు వైష్ణవాలయాలు, ఇటు శైవాలయాలు, అష్టాదశ పీఠాల్లో ఒకటైన కామాక్షీ ఆలయాలతో ఎంతో ప్రాశస్త్యం ఉంది ఈ నగరానికి.
పార్వతిపరమేశ్వరుల గారాలపట్టియైన సుబ్రహ్మణ్యస్వామి వారిద్దరికీ మధ్యలో ఉన్నప్పుడు ఆయనను సోమస్కంధుడు అంటారు. కుమారకొట్టం ఆలయం కూడా కామాక్షిదేవి, ఏకాంబరేశ్వరుడు దేవాలయాల మధ్యలో ఉంటుంది. సంస్కృత స్కాందపురాణాన్ని 1625లో కచిప్ప శివాచార్య ఈ ఆలయంలో కూర్చుని తమిళంలో కందపురాణం పేరుతో అనువదించారు. ఈ కందపురాణం కావ్య ఆవిష్కరణ సమయమున పండితులమధ్య సభామండపంలో శ్రీ కుమారస్వామి ప్రత్యక్షమై కందపురాణం ఆవిష్కారించడం జరిగింది. ప్రస్తుత ఆలయమును 1915 లో నిర్మించారు. కుమారకొట్టం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం కంచి కామకోటి మఠం వెనకాల కలదు. ఆలయంపై ప్రాంగణం చుట్టూరా చెక్కిన నెమలి బొమ్మలు అలరిస్తాయి. ఆలయం లోపల ముగ్ధ మనోహరంగా బాల మురుగన్ చూడచక్కని రూపం లో దర్శమిస్తాడు.
ఎక్కడ ఉన్నది?
చెన్నై నుంచి దాదాపు 72 కిలోమీటర్ల దూరంలో ఉంది కంచి. తిరుపతి మరియు తిరుమల నుంచి బస్సు సౌకర్యం ఉంది. కంచి నుంచి తిరుపతి 3 -4 గంటల ప్రయాణం. కంచి నుంచి శ్రీపురం గోల్డెన్ టెంపుల్ 2 -3 గంటల ప్రయాణం. బస్సు సౌకర్యం ఉంది.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనము నుంచి (కుమారకొట్టం గురుంచి)…
కంచి కుమారకొట్టం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కోసం, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు:
****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** స్వామి వారి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం, శ్రీ స్వామివారిని దర్శించి తరించ గోరుచున్నాము. ******
శ్రీ కుమారస్వామి ప్రత్యక్షమై కందపురాణం ఆవిష్కారించిన మండపం ఇదే
Leave a Reply