https://www.clickmagick.com/share/1485142037427

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్ధానము II పంపనూరు (అనంతపురం జిల్లా)


శివ పరివారమంతా ఒకే మూర్తిలో నెలకొన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్ధానము పంపనూరు, అనంతపురం జిల్లాలో ఉన్నది.

స్ధల పురాణం ప్రకారం ఈ ప్రదేశంలో పూర్వకాలంలో మునులు తపస్సు చేసుకుంటూవుండేవాళ్ళు. అందుకనే ఈ ప్రాంతాన్ని తపోవనం అనేవారు. 500 ఏళ్ళ క్రితం, శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన సమయంలో వ్యాసరాయలువారిచే ఈ దేవాలయం నిర్మించబడినది. తర్వాత కాలంలో సరైన ఆదరణ లేక శిధిలమయింది. పైగా దుండగులు ఆలయంలో నిధులున్నాయని తవ్వి పోశారు. క్రీ.శ. 1980 –90 మధ్య ఆ గ్రామస్తులు ఆలయంలో పూజాదికాలు నిర్వహించటానికి ఆత్మకూరు ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్న కీ.శే. వి. మధుసూదన శాస్త్రిగారిని తీసుకొచ్చారు. పూజ నిర్వహించటానికి వచ్చిన శాస్త్రిగారు మూలవిరాట్ ని చూసి ఆశ్చర్యపోయారు. అందులోని విశిష్టతని గుర్తించి అక్కడకు వచ్చినవారికి స్వామి తేజోరూపాన్ని, అలాంటి స్వామిని పూజిస్తే కలిగే ప్రభావాన్ని తెలిపారు.

ఆ రోజు రాత్రి కలలో సుబ్రహ్మణ్యస్వామి సర్పరూపంతో సాక్షాత్కరించి, పంపనూరు దేవస్ధానంలో తనకు నిత్యపూజలుచేసి, నైవేద్యాలు సమర్పించి అన్నదానము చేస్తే భక్తులను అనుగ్రహిస్తానని చెప్పారు. తెల్లవారిన తర్వాత రాత్రి వచ్చిన కల దైవసంకల్పంగా భావించి, పంపనూరు వచ్చి అక్కడివారికి ఆ కల గురించి చెప్పారు. తర్వాత అక్కడి పెద్దలను, గ్రామస్తులను కలుపుకుని విరాళాలు సేకరిస్తూ, వాటితో ప్రతి ఆదివారం (శాస్త్రిగారికి సెలవురోజు) పూజకు, అన్నదానానికి కావలసిన సరుకులు తీసుకువచ్చి, స్వామికి శ్రధ్ధగా పూజలు, అభిషేకాలు నిర్వహించి, అన్నదానం జరిపేవారు. భజనలు చేసేవారు. వారి పూజలకి సంతృప్తి చెందిన స్వామి కొలిచే భక్తులకు కొంగు బంగారమై తన మహిమలను చూపించసాగాడు.

క్రమక్రమంగా స్వామి మహత్యం నలుమూలలా తెలిసి దూర ప్రాంతాలనుంచి కూడా భక్తులు రాసాగారు. ముఖ్యగా వివాహం కానివారు, సంతానం లేనివారు, జాతకంలో సర్పదోషం వున్నవారు, గ్రహ గతి సరిగ్గాలేనివారు ఇక్కడికి వచ్చి 9 లేక 11 మంగళవారాలుకానీ, ఆదివారాలుకానీ స్వామిని పూజించి, 108 ప్రదక్షిణలు చేస్తే వారి కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. భక్తుల రాక అధికం కావటంతో దేవాలయమూ అభివృధ్ధి చెందుతూ వస్తోంది. 2004 సం. లో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారి ఆశీస్సులతో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి తల్లిదండ్రులైన శివ పార్వతులను స్వామి పక్కనే రెండు ఉపాలయాలలో ప్రతిష్టించారు. అప్పటినుంచీ, పక్క రాష్ట్రాలనుంచి కూడా భక్తుల రాక అధికమైంది. ఈ ఆలయం మరీ పెద్దదేమీకాదు. అద్భుతమైన శిల్పకళ లేదు. కానీ ఇందులో వున్న అద్భుతమంతా మూలవిరాట్ లోనే. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహంలో శివ కుటుంబం మొత్తం దర్శనమిస్తుంది.

స్వామి విగ్రహంలోని విశిష్టతని గురించి అక్కడ ప్రధాన అర్చకులు శ్రీ సీతారామమోహన్ శర్మగారు వివరించిన దాని ప్రకారము, స్వామి విగ్రహము సర్ప రూపంలో వుంటుంది. పీఠం నుండి సింహతలం వరకు స్వామి ఐదు రూపాలలో దర్శనమిస్తాడు. పీఠంలో శ్రీ చక్రము వున్నది. ఇది అమ్మవారి శక్తి స్వరూపాన్ని సూచిస్తుంది. శ్రీ చక్ర స్వరూపంలో వున్న అమ్మవారు రాహుగ్రహము యొక్క అధిష్టాన దేవత. సర్పం చివరభాగము శ్రీచక్రానికి 3 1/2 సార్లు చుట్టుకోవటం మానవ శరీరంలోని వెన్నెముక చివరిభాగం మూలాధారంలో కుండలిని శక్తి రూపంతో సర్పాకారంతో మూడున్నర చుట్లు కలిగి వుండటాన్ని సూచిస్తోంది అన్నారు. సర్ప రూపంలో క్రింద భాగము వక్రతుండ ఆకారంలో సుబ్రహ్మణ్యస్వామికి అన్నగారైన శ్రీ మహాగణపతి ఆకారంలో దర్శనమిస్తుంది. ఈ గణపతి స్వరూపం కేతుగ్రహ అధిష్టాన దేవత, మూలాధార చక్ర అధిదేవత. మూల విరాట్ లోని మధ్యభాగం శివలింగం ఆకారంతో దర్శనమిస్తుంది. ఈశ్వర స్వరూపం కాలస్వరూపుడు. కాలసర్ప అధిష్టానదేవత. ఆయన ఆయుష్యు, ఆరోగ్య ప్రదాత.

ఇంక పైన, ఏడు పడగలు విప్పిన నాగేంద్రుని రూపాన్ని దర్శించవచ్చు. విగ్రహం చివరి భాగంలో వున్న సింహధ్వజము నరసింహ స్వరూపంగా విష్ణు తత్వాన్ని సూచిస్తుంది. ఇది శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య రాజముద్రగా భావింపబడుతోంది. స్వామికి ఇరువైపుల నెమలి పింఛాలతో కూడివున్న చక్రాలు స్వామివారి వాహనం మయూరాన్ని సూచిస్తుంది. అంతేకాదు కాలగమనంలో పంచ భూతాలు, సంవత్సర, ఆయన, ఋతు, మాస, పక్ష, తిధి, వార, నక్షత్రాలను సూచిస్తాయి. ఇవ్వన్నీ చూస్తే మూల విరాట్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వరూపం పైన చెప్పిన విధంగా వివిధ శక్తి రూపాలతో వెలసి వుండటం, ఒకే విగ్రహంలో శివుడు, పార్వతి, గణపతి, నాగేంద్రుడు, ఇలా శివుని పరివారమంతా ఒకే చోట దర్శనము ఇచ్చే విధంగా వుండటంతో ఈ క్షేత్రానికి ప్రాముఖ్యత ఏర్పడింది.

ఎక్కడ ఉన్నది?

అనంతపురం జిల్లా, ఆత్మకూరు మండలంలో వున్న ఈ గ్రామానికి అనంతపురం నుంచి బస్సులు వున్నాయి. అనంతపురం నుంచి వెళ్ళి రావచ్చు.

       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

మరిన్ని వివరాలకై ఇచ్చట చూడండి: ఈటీవి తీర్ధయాత్ర – శ్రీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్ధానము, పంపనూరు:

About the Author

Ravikanth Bandi ()

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *