శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి

ఆది దంపతులు శివ,పార్వతుల రెండో కుమారుడు సుబ్రహ్మణ్యస్వామి. దేవతల సైన్యానికి ఆయన సేనాధిపతి. ముల్లోకాలకు కంటకంగా మారిన తారకాసురుని సంహరించాడు. ఆరుముఖాలతో వుంటాడు కనుక షణ్ముఖ అని, కృతికలు పెంచడంతో కార్తికేయుడని, రెల్లుపొదల్లో జన్మించడంతో శరవణభవుడు అనే పేర్లతో పూజిస్తాం. మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా ఆచరిస్తారు. ‘సుబ్రహ్మన్యోగ్o ‘ అని వేదం కార్తికేయుని స్తుతించింది. బ్రహ్మవిద్యకు, సంతాన భాగ్యానికి అధిపతి సుబ్రహ్మణ్యుడు. ‘నీవంటి దైవమును షడానన, నేనెందు కాననురా’ అని త్యాగారాజాదులు ఈ స్వామిని కీర్తించారు.

తారకాసురుని సంహారం అనంతరం సుబ్రహ్మణ్యస్వామి సృష్టికర్త బ్రహ్మపట్ల అహంభావాన్ని ప్రదర్శిస్తాడు. దీంతో తండ్రి పరమేశ్వరుడు హితవు పలకడంతో తప్పు తెలుసుకున్న సుబ్రహ్మణ్యుడు కఠోరమైన యోగ సాధనకు ఉపక్రమించాడు. శరీరంలోని నిద్రాణంగా వున్న కుండలినీ శక్తి యోగసాధనతో మేల్కోంది. అందరి శరీరాల్లో కుండలినీ శక్తి నిద్రాణంగా వుంటుంది. ఈ సాధనతో ద్వేషం, ఈర్ష, అసూయ తదితర దుర్గుణాలను సాధకుడు జయిస్తాడు. సాధనాస్థాయిని బట్టి కుండలినీ శక్తి మధ్యలో వున్న చక్రాలను దాటి సహస్రాకారాన్ని చేరుకుంటుంది.

సహస్రాకారం అంటే వేయిరేకుల తామరపూవు అని అర్థం. అంటే ఆ స్థాయికి బుద్ది వికసిస్తుంది. సు అంటే మంచి బ్రహ్మణ్యం అంటే వికాసం అందుకనే షణ్ముగస్వామిని సుబ్రహ్మణ్యం అని పిలుస్తారు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మురుగన్‌ ఆలయాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. కర్ణాటకలోని కుక్కె సుబ్రహ్మణ్య, తమిళనాడులోని పళని, తిరుచెందూర్‌, తిరుత్తణి, తిరుప్పరకుండ్రం, స్వామిమలై, పళముదిర్‌చొలై ఆలయాల్లో వైభవంగా పూజలు జరుగుతాయి. తారకాసుర సంహారం సమయంలో స్వామి బ్రహ్మచారిగా వుండేవారు. అనంతరం శ్రీమహావిష్ణువు కోరికమేరకు వల్లీ, దేవసేనలను వివాహం చేసుకుంటాడు. షష్ఠినాడు నాగప్రతిమలను పూజించడం, సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలను సందర్శించడం సంప్రదాయం.

పరమేశ్వరుడి తనయుడైన కుమారస్వామినే స్కందుడని, కార్తికేయుడని, సుబ్రహ్మణ్యేశ్వరుడని, తెలుగునాట సుబ్బరాయుడని వ్యవహరిస్తారు. మార్గశిర శుక్ల షష్ఠినాడు కుమారస్వామి తారకాసురుని సంహరించి తారకాధిపతిలా ప్రకాశించాడని, ఈ తిథి అతడికి ప్రియమైనదని భవిష్యోత్తరం చెబుతోంది. కుమారస్వామి జన్మించిన షష్ఠి గనుక దీన్ని సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారని వ్రత చూడామణి పేర్కొంటోంది. కార్తికేయుడు దేవసేనాధిపత్యం పొందిన తిథిగానూ కొన్ని పురాణాలు చెబుతున్నాయి. సులభప్రసన్నుడైన కుమారస్వామిని ఆరోజున అర్చించి అభీష్టసిద్ధిని పొందుతారు. సర్పరూపంగా భావించి పుట్టలో పాలు పోయడం కూడా ఆరోజున కొన్నిచోట్ల ఆచారం. ‘షష్ఠి’ కుమారుని జన్మదినం. స్వామికి ప్రీతిపాత్రమైన తిథి. కొందరు ఉపవాసాది నియమాలతో కూడా స్వామివారిని అర్చిస్తారు. ఏ విధంగానైన ఆరోజు షణ్ముఖుని పూజించడం సర్వోత్తమం. సర్వారిష్ట పరిహారకం.

కుమారస్వామి జననం గురించి పురాణాలు భిన్న గాథలు పేర్కొంటున్నాయి. శివపార్వతులు మన్మథ క్రీడలో ఉండగా తనను మించిన ప్రభావవంతుడు ఉదయిస్తాడని ఇంద్రుడు భయపడి వారికి అంతరాయం కలిగించడానికి అగ్నిని నియమిస్తాడు. అగ్నిని చూసిన శివుడు పార్వతికి దూరం కాగా భూమిపై పడనున్న శివతేజాన్ని అగ్ని గ్రహించి దాన్ని భరించలేక గంగలో వదిలాడు. గంగ దాన్ని తన తీరంలోని రెల్లుపొదల్లో జారవిడిచింది. ఆ శరవణంలో జన్మించడం వల్ల శరవణుడయ్యాడు. కృత్తికలుగా పిలిచే ఆరుగురు ముని కన్యలు ఆ శిశువును తీసుకొనిపోయి బదరికావనం చేర్చారు. కృత్తికలు పెంచినవాడు కనుక కార్తికేయుడయ్యాడు.

బ్రహ్మ మానస పుత్రుల్లో సనత్కుమారుడు ఒకడు. ఆయన సంపూర్ణ వైరాగ్యమూర్తి. తన తపస్సు తప్ప ప్రపంచం, సుఖదుఃఖాలను గురించిన చింత లేనివాడు. అటువంటివాడికి ఒకనాడు ఒక కల వచ్చింది. కలలో తాను దేవసేనాధిపత్యం వహించి రాక్షసులతో యుద్ధం చేస్తున్న దృశ్యం కనిపించింది. వెంటనే బ్రహ్మ వద్దకు వెళ్ళి ఇహలోకమే వద్దనుకునే నాకు ఈ కల ఏమిటని అడిగాడు. బ్రహ్మ దివ్యదృష్టితో పరిశీలించి ‘అది అలా జరగబోతోంది కాబట్టి కలగా వచ్చింది. కానీ, ఇది రాబోయే జన్మలోనిది’ అని చెప్పాడు. ఇది శివ పార్వతులకు తెలిసింది. సనత్కుమారుడంతటివాడికి మరో జన్మ ఉంటే అతడు తమకే సంతానమైతే బాగుంటుందని వారికి అభిప్రాయం కలిగింది.

సనత్కుమారుడు తపస్సు చేసుకుంటున్న ప్రదేశానికి శివుడు వెళ్లాడు. తపోనిమగ్నుడైన సనత్కుమారుడు శివుణ్ని పట్టించుకోలేదు. కోపించిన శివుడు ‘లయకర్తనైన నేనే స్వయంగా వచ్చినా పలకరించవా’ అని గద్దించాడు. ‘శపించగలను జాగ్రత్త’ అని హెచ్చరించాడు. కళ్లు తెరచిన సనత్కుమారుడు ‘శాప ఫలితం నా దేహానికే గాని ఆత్మకు కాదు గదా’ అన్నాడు. శపిస్తానన్నా భయపడని వైరాగ్యమూర్తిని చూసి ఆశ్చర్యపోయిన శివుడు సనత్కుమారుడితో ఆదరంగా ‘నీకు వరం ఇస్తాను… కోరుకో’ అన్నాడు. దానికి అతడు ‘ప్రపంచం మీద ఏ ఆశా లేని నాకు వరం దేనికి? కావలిస్తే నీకే వరమిస్తాను కోరుకో’ అన్నాడు.

వచ్చిన అవకాశం జారవిడువరాదని భావించిన శివుడు ‘స్వామీ! నీవంటి వైరాగ్య సంపన్నుడు నాకు పుత్రుడిగా జన్మించా’లని కోరుకొన్నాడు. ఆయన అంగీకరించాడు. ఇది విన్న పార్వతి ‘నీకు పుత్రుడిగా’ అన్నావు కదా. పురుషుడికి గర్భధారణ ఎలా? ‘మాకు పుత్రుడు’గా రావాలని అడిగింది. అయితే గర్భధారణ ఇష్టం లేక అమ్మవారి స్వరూపమైన శరవణ తటాకం నుండి స్వామి ఒక కుమారుడి రూపం ధరించగా కృత్తికా స్త్రీలు ఆరుగురు తమ స్తన్యంతో పోషించారు. అందుకే ‘షణ్ముఖు’డయ్యాడు. ఇది మరొక గాథ.

సుబ్రహ్మణ్యస్వామి వాహనం నెమలి. ఇంద్రుడి కుమార్తె దేవసేన, శివ ముని పుత్రిక వల్లీదేవి ఇతడి పత్నులుగా పురాణాలు చెబుతున్నాయి. తమిళుల దైవారాధనలో స్కంద పూజకు విశేష ప్రాచుర్యం ఉంది. అక్కడ ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలున్నాయి. తెలుగునాట కొన్ని ప్రాంతాల్లో ఈ దినం పుట్టలో పాలుపోసే సంప్రదాయమూ ఉంది. పంచారామాల్లో ఒకటి సామర్లకోటలోని స్కందారామం. ఇక్కడి శివలింగాన్ని కుమారస్వామి ప్రతిష్ఠించినట్లు చెబుతారు.

About the Author

Ravikanth Bandi ()

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *