శంకర రచనలను ఎన్ని రకాలుగా విభజించవచ్చు?

ఆదిశంకరుల రచనలను మూడు రకాలుగా విభజించవచ్చును. 1. భాష్యములు, 2. ప్రకరణ గ్రంథాలు, 3. స్తోత్రాలు.

మొదటిది వేదాంత, పురాణం ఇతిహాసాలను వివరించే గ్రంథాలు. ఇవి ఆధ్యాత్మికంగా బాగా ముందడుగు వేసిన వారికి, బ్రహ్మ విద్యను అభ్యసించాలనే కాంక్ష కలవారికి, సంస్కృత భాష చక్కగా అర్థమయ్యే వారికి అపరిమిత ఆనందాన్ని కలిగించే – ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, శ్రీ విష్ణు సహస్ర నామముల మీద రాసిన భాష్యాలు.

రెండవది వీటి సారాన్ని ప్రకరణలుగా రాసినవి. వివేక చూడామణి, ఉపదేశ సాహస్రి, అపరోక్షానుభూతి, ఏక శ్లోకీ, పంచ శ్లోకీ, దశ శ్లోకీ, శత శ్లోకీ, మనీషా పంచకం, యతి పంచకం, సాధన పంచకం, ఆత్మ బోధ, నిర్వాణ శతకం, వాక్య సుధ, వాక్య వృత్తి, తత్త్వబోధ, సిధ్ధాంత తత్త్వబిందు మొదలైనవి. సౌందర్యలహరి, శివానందలహరులను ప్రకరణ గ్రంథాలుగాను చెప్తారు, అద్భుతమైన స్తోత్రాలుగాను చెప్తారు. సాక్షాత్తుగా శివపార్వతులను దర్శించిన తన్మయత్వంతో జగద్గురువుల చేత మనకు అనుగ్రహించబడిన అద్భుత గ్రంథాలివి.

మూడవది దేవతా స్తోత్రాలు. కనకధారా స్తోత్రం, శివ పంచాక్షరీ స్తోత్రం, భజగోవిందము, గోవిందాష్టకము, గణేశ పంచ రత్న స్తోత్రం, పాండురంగాష్టకము, శివ సువర్ణమాలా స్తోత్రము, అర్థనారీశ్వర స్తోత్రము, కాలభైరవాష్టకము, దక్షిణామూర్తి స్తోత్రము, నిర్వాణ షట్కము, అన్నపూర్ణాష్టకము, అచ్యుతాష్టకము, మహిషాసుర మర్దిని స్తోత్రము, శ్రీ త్రిపురసుందరీ స్తోత్రము, మీనాక్షీ పంచరత్న స్తోత్రం, శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం, భవాన్యష్టకము, దేవీనవరత్నమాలికా, విశ్వనాథాష్టకము, ఉమామహేశ్వర స్తోత్రము, గంగాష్టకం, ఇలా ఎన్నో సామాన్య జనులకు జీవన దిశానిర్దేశము చేసే స్తుతులను రచించారు.

శ్రీ శంకరుల కవిత్వంలో భక్తి రసం పొంగుతుంది. వీరు జ్ఞాన,మోక్షాలను భక్తి తో మేళవించి బోధించారు.

       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

About the Author

Ravikanth Bandi ()

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *