కోటంక సుబ్రహ్మణ్యస్వామి ఆలయం
భక్తుల కోరికలను నెరవేర్చడం కోసం సుబ్రహ్మణ్యస్వామి వివిధ ప్రదేశాల్లో అవతరించాడు. అలాంటి విశిష్టమైన క్షేత్రాల్లో ఒకటి అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ‘కోటంక’ గ్రామంలో ఉంది.. గుంటికింద సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం. ఇక్కడ సమీపంలోని పాటకోట కొండ మీద స్వామి స్వయంభువుగా వెలిశాడు. తూర్పు దిక్కుకు అభిముఖంగా నాగేంద్రుడి ఆకారంలో కనిపించే పెద్ద శిలను భక్తులు షణ్ముఖుడి ప్రతి రూపంగా కొలుస్తారు. దీ౦తో గుండు సుబ్బరాయుడు కాస్తా వాడుకలో గుంటికింద దేవుడిగా వాసికెక్కాడు. స్థల మహత్యం తెలిసిన మహర్షులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ తపస్సు చేసేవారని ప్రతీతి. పూర్వం స్వామి, ఏడూ శిరస్సుల సర్పరూపంలో మహర్షులకు దర్శనమిస్తూ వుండేవాడని చెబుతుంటారు.
ఇక్కడ స్వామివారి మూలవిరాట్టు పాదాలకింద పాతాళగంగ వుంది. ఇందులో నీరు చాల తియ్యగా ఉంటుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకూ ఇందులోని నీటి ధార తగ్గకపోవడం విశేషంగా చెప్పుకుంటూ వుంటారు. ఇది స్వామివారి మహిమగా విశ్వసిస్తూ వుంటారు. ఈ నీటిని స్వామివారి అభిషేకానికి ఉపయోగిస్తారు. పాతాళ గంగలోని నీటిని తీర్థంగా స్వీకరించడానికి భక్తులు మరింత ఆసక్తిని చూపుతారు. ఈ నీటిని తీర్థంగా స్వీకరించడం వలన, దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుముఖం పడతాయని అనుభవపూర్వకంగా చెబుతుంటారు.
వివాహం విషయంలోను, సంతాన భాగ్యం విషయంలోను ఆలస్యమవుతున్నప్పుడు, ఈ స్వామిని దర్శించుకుని మనసులో మాట చెప్పుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని అంటారు. ఈ క్షేత్రంలో అడుగుపెట్టడం వలన సమస్త దోషాలు తొలగిపోతాయనీ, పుణ్యఫలాలు చేకూరతాయని చెబుతారు. విశేషమైన పర్వదినాల్లో స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది. ఆహ్లాదకరమైన ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది.
పురాణగాథ…
పార్వతీపరమేశ్వరుల ముద్దుల తనయుడు కుమారస్వామిని సర్పరూపంలో కొలవడం వెనుక ఓ పురాణ గాథ ఉంది. ఒకానొక సమయములో, ఈశ్వరుడిని దర్శించుకోవడానికి బ్రహ్మ కైలాసానానికి వచ్చారు. ఆయన గొప్పతనాన్ని గుర్తించకుండా బ్రహ్మను అవమానించాడు కార్తికేయుడు. అది తెలిసి పరమశివుడు కొడుకుని మందలించాడు. తానెంత అపరాధానికి పాల్పడ్డాడో సుబ్రహ్మణ్యుడికి అప్పుడు కానీ అర్థం కాలేదు. చాలా పశ్చాత్తాపపడ్డాడు. సృష్టికర్తను అగౌరవ పరిచిన దోషాన్ని తొలగించుకోవడానికి తనకు తాను ఓ శిక్ష విధించుకున్నాడు. భూలోకానికొచ్చి, నాగుపాము రూపంలో రహదారికి అడ్డంగా పడుకున్నాడు. కాటేయడానికి విషసర్పమేమో అనుకుని జనం రాళ్లతో కొట్టసాగారు. దీ౦తో నిలువెల్లా గాయాలు అయ్యాయి. ఆ విషయం పార్వతీ దేవికి తెలిసి, తన బిడ్డను రక్షించమని ముక్కోటి దేవతలను ప్రార్థి౦చింది. మహర్షుల సూచన ప్రకారం, తనయుడితో షష్ఠి వ్రతం చేయించింది. అలా పాప పరిహారం అయిపోయిందని సుబ్రహ్మణ్యుడు సర్పరూపాన్ని విడిచి పెట్టాడని అంటారు. ఆకారణంగానే, స్వామి సర్పరూపంలో భక్తులకు దర్శనం ఇస్తు౦టాడని చెబుతారు.
విశేష పూజలు…
ఇక్కడ మాఘమాసంలోని నాలుగు ఆదివారాలూ విశేషంగా పూజలు జరుగుతాయి. మూడో ఆదివారం సుబ్రహ్మణ్యేశ్వరుడికి పంచామృతాభిషేకాలు, ఏకాదశవార రుద్రాభిషేకాలు, రథోత్సవం, తిరునాళ్లు జరుగుతాయి. శ్రావణమాసంలో భక్తులు ఉపవాసదీక్షతో పుట్ట వద్ద దీపాలు వెలిగిస్తారు. ఉసిరి, రావి, వేప, కానుగ చెట్లు ఇక్కడి మరింత ఆహ్లాదభరితం చేస్తున్నాయి. దీంతో కార్తీక వనభోజనాలకు భక్తులు తరలి వస్తుంటారు. ఆదివారాలూ, పర్వదినాల్లో అన్నదానం జరుగుతుంది.
ఎక్కడ ఉన్నది?
రోడ్ ద్వారా:
అనంతపురం – బెంగళూరు జాతీయ రహదారిలో గార్లదిన్నె మండలం కేంద్రం నుంచి 10 కి.మీ.ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఇది రాయలసీమ ప్రాంతంలోనిది. కోటంక గ్రామం అనంతపురంకి 15 కి.మీ.ల దూరంలో ఉంది. ఆత్మకూరు, అనంతపురం నుండి బస్సులు అందుబాటులో కలవు.
రైలు ద్వారా:
అతి సమీపంలోని రైల్వేష్టేషన్ అనంతపురం.
Leave a Reply