Tag Archives: ధర్మసందేహాలు (Dharma Sandehalu)

కుమారస్వామి, సుబ్రమణ్యస్వామి ఒకరేనా?

కృత్తికలు ఆరుగురూ ఏకకాలమునందు పాలివ్వడానికి సిద్ధపడ్డారు. మా అమ్మే పాలివ్వడానికి సిద్ధపడిందని ఆరు ముఖములతో ఆ పిల్లవాడు ఏక కాలమునందు పాలు తాగేశాడు. కాబట్టి “షణ్ముఖుడు” అయ్యాడు.

పిల్లవాడు కృత్తికల పాలు త్రాగాడు కాబట్టి ఈ పిల్లవాడిని “కార్తికేయుడు” అని పిలుస్తారు అన్నారు.

మహానుభావుడు సనత్కుమారు ఇలా జన్మించాడు కాబట్టి, గర్భము జారి పడిపోతే పూర్ణంగా గర్భం పన్నెండు నెలలు లేకుండానే బయటకు వచ్చాడు కాబట్టి ఆయనను “స్కందుడు” అని పిలుస్తారు.

ఆరుగురు కృత్తికల స్తనములను ఏకకాలమునందు పానము చేసినవాడు కనుక ఆయనకు “షడాననుడు”, “షణ్ముఖుడు” అని పేరు వచ్చింది.

పరమశివుని తేజస్సులోంచి శంకరుడికే ఒక కొడుకు పుడితే ఒక కుటుంబం కాదు, ఒక లోకం కాదు సమస్త ప్రపంచం ఆనంద సాగరంలో మునిగిపోయింది. కనుక ఆ పిల్లవాడిని “కుమారా” అని పిలిచారు. అందుకని కుమారా శబ్దము ఈశ్వర పుత్ర సంబందమై శివుని కుమారుడిని ఉద్దేశించిందిగా ఉంటుంది.

అగ్ని దేవుడు పరమశివుని తేజస్సుని తనయందు ఉంచుకొని గంగయందు ప్రవేశపెట్టిన కారణము చేత ఆ పిల్లవానిని “పావకి” అని పిలిచారు.

ఒకేసారి తల్లుల పాలు త్రాగి తొందరగా భక్తులను రక్షించడానికి ఒకే రోజులో యూవనంలో ఉన్న “కుమారస్వామిగా” మారిపోయారు.

ఉత్తరక్షణం ఈయనకు అభిషేకం చేసేద్దామని పుట్టినరోజు నాడే దేవతలందరూ అయనను దేవసేనాధిపతిగా అభిషేకం చేసేశారు. కాబట్టి “సేనాని” అని పేరు పొందాడు.

ఈయనకే “గుహ” అని పేరు ఉంది.

       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

సుబ్రహ్మణ్యస్వామిని నాగదేవత స్వరూపంగా ఎందుకు పూజిస్తారు?

సుబ్రహమణ్యేశ్వరుడు మన శరీరంలోని కుండలిని శక్తికి సంపూర్ణమైన సంకేతం. మనలో కుండలిని రూపంలోన ఒదిగిన సుబ్రహ్మణ్యుడే పుట్టలో ఒదిగి ఆరాధనలు అందుకుంటున్న మహా సర్పరూపం. మనము మార్గ శీర్ష శుద్ధ షష్ఠి నాడు పుట్టలో పాలని పోస్తాము. పుట్ట ఎవరో కాదు మానవ శరీరమే.

మనము కూర్చొనప్పుడు వెనుక నుండి చుస్తే మన విశాలమైన క్రింద భాగం పుట్ట అడుగు భాగం. పోను పోను తల దగ్గరికి సన్నగా వెళ్లే విధానంలోనే పుట్ట ఆకారం ఉంటుంది. ఆ పుట్ట పై ఉండే చిల్లు అది శిరస్సు మధ్యలో ఉండే బ్రహ్మ రంద్రానికి సంకేతం. పాలు ఙ్ఞానమునకు సంకేతం. అందుకే పుట్టలో పాలు పోయడం అంటే శరీరం నిండుగా ఙ్ఞానమును నింపడం అని అర్థం. అంటే ఏది చెయ్యకూడదో, చేయవచ్చునో దాన్ని నింపడం.

కుండలం అంటే పాము చుట్ట అని అర్థం. పాము చుట్టవేసుకొని కూర్చు౦టుంది, సాగదీసిన వెన్నెముక్క నిలబడ్డ పాము యొక్క శరీరం. పాము పడగ విప్పే విధానం మానవ తల వెనుక భాగం నుండి వ్యాపించే విధానం. పాము చుట్టలు చుట్టుకునేది మూల ఆధార చక్రానికి సంకేతం. మనిషి సుబ్రహ్మణ్యుడు కావాలి అంటే కుండలిని శక్తిని జాగృతం చేసుకుని బ్రహ్మ రంద్రం నుండి అమృత బిందువులు శరీరమ౦తా చిలికించుకున్న సందర్భంలో మాత్రమే కాగలడు అని మన ప్రాచీనులు చెప్పారు.

శరీరంలో అసుర సంపద లేకుండా దేవతల వైపు సేనాపతిగా ఉండి అన్ని దైవ లక్షణాలు కలిగి ఉండటమే సుబ్రహ్మణ్య విధానం. సంపూర్ణమైన దైవ భావనలు కలిగి ఉండటం సుబ్రహ్మణ్య విధానానికి వెళ్లే మార్గ లక్షణం. శరవణభవ అనే ఆరు అక్షరాల మహా మంత్రమే జీవుని తరింపజేసే, కుండలిని జాగృత పరిచే దివ్య శక్తి మయమైన శబ్ద బ్రహ్మ స్వరూపం.

పూజ్య గురువులు Dr. శ్రీ మైలవరపు శ్రీనివాస రావు గారి సమాధానం వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు:

video
play-sharp-fill

       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******