Tag Archives: వ్యాసములు (Articles)

తిరుమలలోని కుమారధార తీర్ధం II ముక్తిపథ జలధార


తిరుమల పరమ పవిత్రమైన పుణ్యధామం. ఇక్కడ ముక్కోటి తీర్ధాలు, సకల దేవతలు నిత్యనివాసం ఉంటారని ప్రతీతి. ఇక ఈ శేషాచల కోండల్లో కుమారస్వామికి చెందిన ఓ దివ్య తీర్ధం దాగి ఉంది. ఏటా మార్చి నెలలో వచ్చే పౌర్ణమి రోజున ఈ దివ్య తీర్ధానికి వెళ్తుంటారు భక్తులు. శ్రీవారి ఆలయానికి వాయువ్యం వైపున 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కుమారధార తీర్థం గురించి తెలుసుకుందాం.

తిరుమల శేషాచలం కొండల్లో వెలసిన అద్భుతమైన తీర్థాల్లో కుమార ధార తీర్థం ఒకటి. వైష్ణవ వైభవానికి చిహ్నంగా ఉన్న తిరుమలలో పశుపతి తనయుడైన కుమారస్వామి పేరిట తీర్థం ఉండటం, శివకేశవ అభేదాన్ని చాటుతోంది. దైవం ద్వంద్వాతీతుడన్న సత్యానికి ఇది నిదర్శనంగా కనిపిస్తుంది.

పాపనాశనం డ్యామ్‌ నుంచి వాయవ్య దిశలో ఉంటుంది కుమారధార తీర్థం. కాలినడకన నాలుగైదు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. దట్టమైన అరణ్యంలో, భారీ కొండల నడుమ, మార్మికమైన బిలంలా కనిపించే ఈ కందకం.. ప్రాకృతిక సౌందర్యానికి మచ్చుతునక. చుట్టూ పోతపోసినట్టు ఉన్న రాతికుడ్యాల మధ్య తళుక్కున మెరుస్తూ జలజల జారే సున్నితమైన జలపాతాన్ని చూడటంతోనే మనసు పులకితమవుతుంది. ఈ పుణ్యజలాల కింద స్నానమాచరించడానికి తపోధనులు, దేవతలు కూడా వస్తుంటారని చెబుతుంటారు.

కుమారధార మహత్యం…

తిరుమల మహాత్మ్యంలో పేర్కొన్న 26 ముఖ్య తీర్థాల్లో కుమారధార ఒకటి. వేంకటాచలంలో ముక్తిపథ తీర్థాలుగా పేరెన్నికగన్న తొమ్మిదింటిలో దీనికీ స్థానం ఉంది. కుమారధార వైభవం గురించి వరాహ, వామన, పద్మ పురాణాల్లో ప్రస్తావించారు. పూర్వం ఒకానొక ముసలి బ్రాహ్మణుడు.. తప్పిపోయిన తన కుమారుడైన కౌండిన్యుడి కోసం వెతుకుతూ, వెతుకుతూ ఏడు కొండలు చేరుకున్నాడట. అప్పుడు వేంకటేశ్వరస్వామి మానవ రూపం ధరించి ఆ పెద్దాయనకు ఎదురుపడ్డాడు. ‘తాతా! నీకు ఇంకా బతకాలనే ఆకాంక్ష ఉన్నట్టుందే! కొడుకు కోసం ఏమిటీ ఆరాటం’ అని ప్రశ్నించాడు.

అప్పుడా బ్రాహ్మణుడు.. ‘నాయనా! నాకు నిజంగానే బతకాలని ఉంది. ఈ జీవితంపై వ్యామోహంతో ఈ మాట చెప్పడం లేదు. దేవతలు, ఋషులు ఎలాగైతే పరమాత్ముని ఎల్లకాలం సేవిస్తుంటారో నాకూ అలాంటి భాగ్యం కావాలని ఉంది. అందుకు దేహం అవసరం. పితృకార్యాలు, దైవకార్యాలు నిర్వర్తించడానికి నాకు కొడుకు అవసరం’ అని బదులిచ్చాడట. ఆ జవాబుకు ప్రసన్నుడైన బాలాజీ.. ఆ బ్రాహ్మణుడిని అక్కడికి సమీపంలో ఉన్న ఒక తీర్థానికి తీసుకెళ్లి స్నానం చేయమన్నాడట. అందులో మునక వేయగానే ముదుసలి బ్రాహ్మణుడు యౌవనవంతుడయ్యాడట. అతడి కుమారుడిని చూపించి.. ఆధ్యాత్మిక మార్గంలో సాగమని ఆశీర్వదించాడట. ముసలివానికి యౌవనాన్ని ప్రసాదించిన కారణంగా.. దీనికి కుమార తీర్థం అని పేరువచ్చిందని వరాహ పురాణం పేర్కొంది.

కుమారస్వామి తపస్సు…

ఈ తీర్థానికి సమీపంలోని గుహలో కుమారస్వామి విగ్రహం ఉంది. తీర్థంలో స్నానమాచరించిన భక్తులు కుమారస్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతారు. తారకాసరుణ్ణి సంహరించడంతో కుమారస్వామికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. దోష నివారణార్థం వేంకటాచలం వెళ్లి శ్రీహరికై తపస్సు చేయమన్నాడట శివుడు. తండ్రి మాట మేరకు కుమారస్వామి ఈ తీర్థం సమీపంలో కఠోర తపస్సు ఆచరించాడట. కొన్నాళ్లకు విష్ణుమూర్తి ప్రత్యక్షమై కుమారస్వామిని అనుగ్రహించాడట. కుమారస్వామి తపమాచరించిన తీర్థం కావడంతో దీనికి ‘కుమారధార’ అని పేరు వచ్చిందని మరో కథ ప్రచారంలో ఉంది.

మాఘ మాసంలో ముక్కోటి ఉత్సవం…

పురాణ ప్రాశస్త్యం ప్రకారం తిరుమలలోని శేషగిరులలో ముక్కోటి పుణ్యతీర్ధాలు ఉన్నవని ప్రతీతి. ఈ పుణ్య తీర్ధాలలో ధర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్య, ముక్తి ప్రదములు కలిగించేవి ప్రధానమైనవి ఏడు తీర్ధములు. అవి స్వామివారి పుష్కరిణి, కుమారధార, తుంబురు, రామకృష్ణ, ఆకాశగంగ, పాపవినాశనం మరియు పాండవ తీర్ధములు. ఈ తీర్ధాలలో ఆయా పుణ్య ఘడియల్లో స్నానమాచరించిన ఎడల సర్వ పాపాలు తొలగి ముక్తి సమకూరుతుందన్నది వైశిష్ట్యం.

కుమారధార ప్రయాణం సంక్లిష్టంగా ఉంటుంది. అయినా భక్తులు ఏ మాత్రం వెరవకుండా ఇక్కడికి చేరుకుంటారు. మూడు నాలుగు మార్గాల ద్వారా ఈ తీర్థానికి చేరుకోవచ్చు. జాపాలి తీర్థం నుంచి ఇక్కడికి దారి ఉంది. తలకోన నుంచి అరణ్య మార్గంలో రావచ్చు. అన్నదమ్ముల బండ, గొల్లోళ్ల రచ్చ మీదుగా కుమారధార తీర్థానికి చేరుకోవచ్చు. అయితే సాహసాలకు సిద్ధపడిన యాత్రికులు ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. పాప నాశనం డ్యామ్‌ మీదుగా రావడానికి ఆసక్తి కనబరుస్తారు.

ఏటా మాఘ మాసంలో మఖా నక్షత్రంతో కూడుకున్న పౌర్ణమి రోజున కుమారధార తీర్థానికి ముక్కోటి ఉత్సవం నిర్వహిస్తారు. ఈ పర్వదినాన స్నానమాచరించి, దానధర్మాలు చేసి, స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు. ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే కుమారధార తీర్ధ ముక్కోటిని దర్శించి, స్నానమాచరించడం భక్తులు ఒక ప్రత్యేక అనుభూతిగా భావిస్తారు.

కుమారధారకు సమీపంలో పసుపుధార తీర్థం ఉంటుంది. వర్షరుతువులో ఈ తీర్థాల గుండా భారీగా నీళ్లు ప్రవహిస్తుంటాయి. అందుకే ఈ తీర్థాలకు సమీపంలో కుమారధార డ్యామ్‌ నిర్మించారు. ఏడాది పొడుగునా జలకళతో అలరారే కుమారధార డ్యామ్‌ తిరుమలకు వచ్చే భక్తుల తాగునీటి అవసరాలను తీరుస్తోంది.

       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

మరిన్ని వివరాలకై ఇచ్చట చూడండి: తిరుమలలోని కుమారధార తీర్ధం:

శ్రీ త్యాగరాజ స్వామి పంచరత్నకృతులు

పంచరత్న కృతులు శ్రీత్యాగరాజస్వామి కర్ణాటక సంగీతానికి అందించిన ఐదు రత్నాల వంటి కీర్తనలు. శ్రీత్యాగరాజస్వామి స్వరపరచిన ఈ ఐదు పంచరత్న కృతులను “త్యాగరాజ పంచ రత్నాలు” అనడం కూడా కద్దు. 19 వ శతాబ్దంలో శాస్త్రీయ సంగీతానికి ప్రాణం పోసిన త్రిమూర్తి వాగ్గేయకారులలో ఒకడైన త్యాగయ్య గారు అందించిన వేలాది కీర్తనలలో రత్నాల వంటివి. ఈ వేలాది కీర్తనలలో ప్రస్తుతం 750 వరకు కీర్తనలు లభించుచున్నాయి. త్యాగరాజు కీర్తనలు తేలికైన తేట తెలుగున పండిత పామురులకు అర్థం అయ్యే రీతిన కూర్చిన శ్రీరామ కీర్తనలు.

పంచరత్న కీర్తనలు…

ఐదు పంచ రత్న కీర్తనలు ఆది తళానికి కూర్చబడ్డాయి. పంచరత్న కీర్తనలు పాడే రాగం వాటి సాహిత్యం మరియు భావాన్ని అనుసరించి ఉంటాయి. ఈ ఐదు కీర్తనలు సంగీత కచేరి లొని రాగం, తానం, పల్లవి పాడేందుకు వీలుగా సంగీత ఉద్ధండులు కల్పనా స్వరాలు పాడేందుకు వీలుగా ఊంటాయి.

త్యాగయ్య వారి పంచ రత్న కీర్తనలు వరుసలో

1. జగదానందకారక – నట రాగం
2. దుడుకుగల నన్నే – గౌళ రాగం
3. సాధించనే ఓ మనసా – అరభి రాగం
4. కనకనరుచిరా – వరాళి రాగం
5. ఎందరోమహానుభావులు – శ్రీ రాగం

పంచరత్న కృతులు పాడే నట గౌళ అరభి వరాళి శ్రీ రాగాలను గాన పంచక రాగాలు అని పిలుస్తారు. వీటికి సంబంధించిన తానం వీణ పై వాయించడానికి చాలా అనువుగా ఉంటాయి. నట వరాళి రాగాలకు 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నది.

పంచరత్న కృతుల ప్రత్యేకతలు…

జగదానంద కారక: పంచరత్నాలలో మొదటిది- నాట రాగకృతి. ఇది 36వమేళకర్త రాగమైన చలనాట జన్యం. శారంగదేవుని సంగీత రత్నాకరం పేర్కొన్న గొప్పరాగాలలో ఇది ఒకటి. ఈ రాగంలో షడ్జ, పంచమాలతో పాటు షట్ శృతి దైవతం, కాకలి నిషాదం ఉన్నాయి. ఈ కృతికి ఎన్నుకున్న భాష -సంస్కృతం. భావం:జగదానంద కారకుడైన శ్రీరాముని వర్ణనం. ధీరోదాత్త గుణశోభితుడైన శ్రీరాముని సంబోధనాత్మక కృతి ఇది. నాట రాగ అనువుగా-ఎంతో హృద్యంగా అమరింది.

దుడుకుగల నన్నే: పంచరత్నాలలో రెండవది- గౌళ రాగంలోని కృతి. ఇది 15వ మేళకర్త మాయామాళవగౌళ జన్యం. షడ్జ, పంచమాలతో పాటు శుద్ధ రిషభం ,అంతర గాంధారం ,శుద్ధ మధ్యమం ,శుద్ధ దైవతం ,కాకలి నిషాదం గల రాగం. దీనిలో రిషభం రాగచ్ఛాయగల ఏకశృతిరిషభం. పాడేటప్పుడు దీన్ని ప్రత్యేకంగా పలుకుతారు. కనుక దీనిని గౌళ రిషభం అని అంటారు. సాహిత్యం చూస్తే, దుడుకు చేష్టలున్న అనే పద ప్రయోగం; ఆ వెంటనే ఏ దొర కొడుకు బ్రోచు? అనే పదప్రయోగం నవ్వు పుట్టిస్తాయి. కాని, ఇదొక ఆత్మ విమర్శా ‍‍జ్ఞానం. దీనిలో చరణాలు కూడా అదే ధోరణిలో సాగుతాయి.

సాధించనే ఓ మనసా: ఇందులో అయిన భగవంతుని యొక్క గొప్పతనన్ని చాలా అందంగా,చక్కగా వర్ణించారు. మొదటి ఐదు చరణాలు శ్రీ కృష్ణుని గొప్పతనాన్ని ,ఆరవ చరణం రాముడి ఘనతను మిగిలిన చరణాలు వేంకటేశ్వర స్వామిని పొగడుతు వ్రాశారు.

కనకన రుచిరా : ఈ కీర్తనను చాల తక్కువగా ఆలాపించటం జరుగుతుంది .దీన్ని గురువు దగ్గర అభ్యసిస్తే గురు శిష్యుల మధ్య భేదభవాలు కలుగుతాయి అని ఒక నానుడి.అందుకనే ఈ కీర్తనను నేర్పించడం చాలా అరుదు.ఇందులో ధ్రువుని కధకి రామయణానికి ఉన్న పొలికలను వర్ణించడం జరిగింది.

ఎందరో మహనుభావులు : ఈ కీర్తనలో త్యాగరాజుల వారు, ప్రపంచములో ఉన్న గొప్పవారందరికి తన వందనాలు తెలిపారు.ఈ కీర్తన చాలా పేరుపొందినది.

       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

త్యాగరాజ స్వామి వారి పంచరత్న కృతులు | గురుకులం స్టూడెంట్స్:

video
play-sharp-fill


ప్రణవం


వేదాలకు పునాది అనాది ప్రణవనాదం. లోకాలన్నీ ప్రణవం నుంచే ప్రభవించాయంటారు. పరమేశ్వరుడు ప్రణవ మంత్రాసీనుడై భాసిస్తుంటాడని, సంసార సముద్రాన్ని దాటించగల ఏకైకనాదం ప్రణవమని చెబుతారు. ‘ఓంకారం ఎప్పటికీ నశించని నాదం. ఓంకారమే ఈ సకల విశ్వం. గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ ఓంకారమే. కాల తీరాలకు ఆవల కూడా నిత్యమై ధ్వనించేది ఓంకారమే. ఈ విశ్వమంతా పరబ్రహ్మ స్వరూపమే. మనలోని పరమాత్మ ప్రణవనాదమే’ అని మాండూక్యోపనిషత్తు విస్పష్టంగా ప్రవచించింది.

ఆద్య మంత్రం ఓంకారం బ్రహ్మానికి ప్రతీక. ఓంకారంపై ధ్యానం చేస్తే అంతిమ సత్య సాక్షాత్కారం సాధ్యమవుతుందని పెద్దల మాట. ప్రణవ ధ్యానం ఒక అవిచ్ఛిన్న కాంతిధారగా పరాత్పరుడివైపు ప్రసరిస్తుంది. ఓంకారాన్ని జపించడంవల్ల మృణ్మయ శరీర భూమిక నుంచి ఆత్మ పరమోన్నత లక్ష్యంవైపు ప్రయాణిస్తుందని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు బోధించాడు.

ఒకసారి ‘ప్రణవ మంత్రానికి అర్థం నాకు తెలియదు’ అని బ్రహ్మ అన్నప్పుడు అక్కడే ఉన్న షణ్ముఖుడు ఆయన్ని కటకటాల వెనక బంధించాడు. తనకు వేదాల్లోని జ్ఞానమంతా తెలుసు, కాని ప్రణవ మంత్రానికి పరిపూర్ణ అర్థం తెలియదని బ్రహ్మ అన్నాడు సవినయంగా. మహోన్నత జ్ఞానసిద్ధిని పొందినవారు మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలుగుతారు కొంతవరకు.

బ్రహ్మను కారాగారంలో బంధించి షణ్ముఖుడు సృష్టి చేయడానికి ఉపక్రమిస్తాడు. శివుడు షణ్ముఖుణ్ని వారించి, ఎక్కువ కాలం బ్రహ్మను కారాగారంలో ఉంచరాదని, విడుదల చేయాలని నచ్చజెప్పాడు. ‘కారాగారం గోడల మధ్య ఎలాంటి భావాలు నీకు కలిగాయి’ అని శివుడు బ్రహ్మను అడుగుతాడు. కారాగారం తపస్సు చేయడానికి అనువైన చోటుగా భావించానని బ్రహ్మ సమాధానం ఇస్తాడు. శివుడు షణ్ముఖుణ్ని తన ఒడిలో కూర్చోబెట్టుకొని ‘ప్రణవమంటే అర్థం ఏమిటో నువ్వు చెప్పు’ అని అడుగుతాడు. ‘నీకు రహస్యంగా చెవిలో చెబుతాను’ అని షణ్ముఖుడు అంటాడు.

‘ప్రణవం మహిమ వర్ణనాతీతం. కర్మబంధాల నుంచి విముక్తం పొందడానికే ఆత్మలు భూమిపై జన్మలు ఎత్తుతున్నాయి. ఈ జీవన చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది. చివరికి భగవంతుణ్ని తెలుసుకుని ముక్తి పొందేవారు జీవులు. దైవం ప్రణయానంతరం సృష్టి చేయాలని సంకల్పించినప్పుడు, ఓంకారం వినిపిస్తుందంటారు. సమస్త దేవతలకు, లోకాలకు, ఆత్మలకు మూలం ప్రణవమే!’

ప్రణవనాద సుధారసమే భువనమోహనమైన రామావతారమై దిగివచ్చిందని త్యాగయ్య గానం చేశాడు. ‘నాదాల్లో ప్రణవనాదాన్ని నేను’ అని శ్రీకృష్ణుడు తెలియజెప్పాడు. గణపతి ఓంకార రూపంతో ప్రకాశిస్తాడు. ‘ప్రణవమే ధనుస్సు. ఆత్మే బాణం. బ్రహ్మమే లక్ష్యం. గురి తప్పకుండా ఆత్మ లక్ష్యాన్ని చేరాలి. బాణం లక్ష్యాన్ని ఛేదించినట్లు ఆత్మ బ్రహ్మంలో లీనం కావాలి’ అని ఒక ఉపనిషత్తు గానం చేసింది.

భూమాత గర్భంనుంచి, తల్లి గర్భం నుంచి జన్మించానని భావిస్తున్న జీవాత్మ మొదట పరమాత్మనుంచే ప్రభవించింది. ఆత్మ ఆది ప్రణవమే. అది నిత్య కాంతి ధామం. యుగాల పరిణామం అనంతరం అటువైపే ఆత్మ మహాప్రస్థానం.

సంకష్టహరుడు…

పరబ్రహ్మ సంకల్పం నుంచి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. బ్రహ్మదేవుడు సృష్టి చేసేటప్పుడు విఘ్నాలొచ్చాయి. మామూలుగా ఏ పని చేసినా విఘ్నాలు వస్తాయి. అలాంటిది సృష్టిరచన వంటి గొప్ప పనికి విఘ్నాలు రాకుండా ఉంటాయా? విఘ్నాలు వచ్చాయి. ఆ విఘ్నాలు వచ్చినపుడు ఏం చేయాలో తెలియలేదు బ్రహ్మదేవుడికి. అప్పుడాయన తనకు కూడా మూలకారణమైన పరమాత్మని ధ్యానం చేశాడు. ఆ పరమాత్మని తెలియచేసే నాదం ఓంకారం. ఆ ఓంకారాన్ని జపిస్తూ పరమాత్మని ధ్యానం చేయగా..ఆ ఓంకార వాచ్యమైన పరమాత్మ…ఓ రూపం ధరించి బ్రహ్మదేవుడికి సాక్షాత్కరించాడు. ఓంకారమే రూపం ధరించి కనపడిన రూపం ఎలా ఉన్నదీ అంటే ఏనుగు ముఖంతో ప్రకాశిస్తూ ఎర్రని కాంతులతో ఉన్నదట. ఆ రూపం బ్రహ్మదేవుడికి సాక్షాత్కరించి ఓ మంత్రం ఉపదేశించింది.ఆ మంత్రం పేరు ‘వక్రతుండ మంత్రం. ‘వక్రతుండ’ అంటే వంకర తుండం కలిగినవాడు. స్వామి రూపం అలా ఉంది కనుక స్వామి మంత్రం ‘వక్రతుండ మంత్రం’అయింది. ఈ మంత్రం జపం చేశాడు బ్రహ్మదేవుడు. అపుడు ఏం జరిగింది అంటే విఘ్నాలు అన్నీ తొలగిపోయాయి.బ్రహ్మదేవుడి సృష్టిరచన సమర్థంగా సాగింది.

       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

అరిషడ్వర్గాలను అంతం చేసే షణ్ముఖుడు

షట్ అంటే ఆరు. స్వామి ఆరు ముఖాలు కలవాడు. అందుకే షణ్ముఖుడని పేరు వచ్చినది. సుబ్రహ్మణ్య స్వామి జ్ఞాన స్వరూపము. అందుచేతనే అజ్ఞాన స్వరూపులైన రాక్షసులను హతమార్చినాడు. ఆ జ్ఞానమునకు ఆరు తలలుండును. అరిషడ్వర్గములు అనగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఆరు దుర్గణములున్న అజ్ఞాన రాక్షసిని ఆరు తలలు ఉంటే తప్ప చంపలేము. స్వామి ఆరుముఖాలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే అరిషడ్వర్గములను నాశనం చేస్తాయి. దైవ సంపదయగు ఆరు తలలు గల్గి అసుర సంపదకు సంభవించిన అరిషడ్వర్గములనెడి ఆరు తలలను త్రుంచి వేయవలెను. ఇదియే షణ్ముఖుని రూప వైశిష్ట్యము.

కుమారస్వామిని ఆరాధించటాన్ని కౌమారం అంటారు. కుమారస్వామి జననమే అపూర్వం. తారకాసుర సంహారం కోసం శివశక్తుల సంగమం అనివార్యమైంది. షణ్ముఖుడైన కుమారస్వామిని సంవత్సరాగ్ని స్వరూపంగా వేదాలు పేర్కొన్నాయి. కాలాగ్ని స్వరూపుడైన తేజమే ఈ సంవత్సరాగ్ని. ఆరు ముఖాలు ఆరు ఋతువులు, పన్నెండు చేతులు 12 మాసాలు. ఇదీ సంవత్సరాగ్ని స్వరూపం. ‘అమోఘమైన శివతేజాన్ని పృధ్వి, అగ్ని, జలం, నక్షత్ర శక్తి (షట్‌కృత్తికలు) ధరించి, చివరకు అలౌకిక మహాగ్ని శరవణం (రెల్లుతుప్ప)లో రూపుదిద్దుకుంది. శరవణ భద్రడయ్యాడు సుబ్రహ్మణ్యుడు. చిత్రాగ్ని అనే నెమలిని వాహనంగా చేసుకున్నాడు. అనేక వర్ణాలను వెదజల్లే కాంతిపుంజమే నెమలిగా చెప్పేయి.

షణ్ముఖుని ఆరుముఖములు…

తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము, ఆకాశము, భూమి.

స్వామి ఆరు ముఖాల ప్రత్యేకత…

మొదటిది వెలుగునిస్తుంది.
రెండవముఖం వరాలను ఇస్తుంది.
మూడవ ముఖం యజ్ఞాలను రక్షిస్తుంది.
నాలుగవ ముఖం వేదాల అర్థాన్ని బోధిస్తుంది.
ఐదవ ముఖం దుష్టశక్తులను నాశనం చేస్తుంది.
ఆరవముఖం ధర్మాన్ని ఆచరించాలని అందరికి ప్రబోధిస్తుంది.

ఈయన బ్రహ్మచారి అని కూడా చెబుతారు. ఒక రోజు కార్తికేయుడు ఒక పిల్లిని గిల్లితే ఆయన తల్లికి బుగ్గ మీద గాయమయ్యిందట. జగజ్జనని, “నాయనా! ఈ ప్రపంచములోని ప్రతి ప్రాణిలోనూ నేను వున్నాను, నేను కానిది వేరే లేదు, ఈ సృష్టి అంతా నేనే ! అందువల్ల నువ్వు ఎవరిని గాయపరచినా నన్ను గాయపరచినట్లే అని చెప్పింది. అది విన్న కార్తికేయుడు పెళ్ళి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాడు. అందరు స్త్రీలలోను తన తల్లి మూర్తీభవించి ఉంది కనుక తాను ఇక ఎవరినీ పెళ్ళాడలేను అనుకుని కార్తికేయుడు బ్రహ్మచారిగా వుండి పోయాడట.

       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

ప్రసాదాలు – రకాలు – మృత్తికా ప్రసాదం

ప్రపంచం అంతటా నిండి ఉన్న దైవానికి పూజ చెయ్యడం, ప్రసాదాన్ని సమర్పించడం మానసిక సంతృప్తి ఇవ్వడమే కాక అనేక కోరికలను కూడా తీర్చుతుంది. ప్రసాదం అనేక రకాలు.

1. తీర్థ ప్రసాదం – పంచామృత అభిషేక తీర్ధం, పానకం, జల తీర్ధం, కషాయ తీర్ధం.
2. పత్ర ప్రసాదం – తులసి, మరువం, దవనం, బిల్వ పత్రం, శమీ, గరిక, కుశ, పాటలీ, సింధువార పత్రం.
3. భక్ష్య ప్రసాదం – వడలు, దోశెలు, లడ్డూలు, బొబ్బట్లు, అరిసెలు, కేసరి, పాలకోవా, చెగోడీలు మొదలయినవి.
4. కుంకుమ ప్రసాదం – కుంకుమ, పసుపు, సింధూరం, గోపీ చందనం, రక్త చందనం, అంగార, అష్ట గంధం, చాదు, తిరుమణం, శివ గంధం మొదలయినవి.
5. పుష్ప ప్రసాదం – సువాసనా భరితం, పూర్తిగా వికసించిన పువ్వులు. కమలం, మొగలి, సంపెంగ, మల్లి, జాజి, కలువ, తులసి, విప్ప మొదలయిన పుష్పాలు.
6. అన్న ప్రసాదం – నేతి అన్నం, చిత్రాన్నం, పులిహోర, దద్దోజనం, పెరుగన్నం, కారపు అన్నం, పాయసాన్నం, పులగం మొదలయినవి.
7. ఫల ప్రసాదం – అరటి పండు, మామిడి, దానిమ్మ, సపోటా, నేరేడు, కమలా, ఆపిల్, ద్రాక్ష, జామ, అంజీర మొదలయినవి.
8. వస్త్ర ప్రసాదం – అమ్మవారికి చీర, స్వామికి పంచె, శాలువా సమర్పించాలి.
9. రక్షా ప్రసాదం – నవగ్రహ పీడకు రక్ష, హోమ రక్ష, దీప రక్ష.
10. గంధ ప్రసాదం – శ్రీ గంధపు చెక్క, శ్రీ గంధ తిలకం.
11. ఆభరణ ప్రసాదం – కొత్త బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు మొదట దేవుడికి సమర్పించి ధరించాలి.
12. అక్షతా ప్రసాదం – పసుపు అక్షతలు, సువర్ణ మంత్రాక్షతలు, మంత్రాక్షతలు.
13. లేపన ప్రసాదం – తైలలేపనం, నవనీత లేపనం, అన్న లేపనం, మృత్తికా లేపనం.
14. మృత్తికా ప్రసాదం – పుట్ట మన్ను, మట్టి ఉండ.
15. నేత్ర ప్రసాదం – అంటె కన్నుల ప్రసాదం. పరమేశ్వరుని భార్య అయిన ద్రాక్షాయణి తన తండ్రి చేసిన యాగంలో తనకు తన భర్తకు అయిన అవమానాన్ని తాళలేక యాగం చేస్తున్న యజ్ఞ కుండలో దూకి ఆత్మహత్య చేసుకొంటుంది. ఈ స్థలాన్ని మనం హరిద్వారలోని సతీకుండం దగ్గర చూడవచ్చు. ఈ విషయాన్ని విని పరమేశ్వరుడు తన భార్య ద్రాక్షాయణి దేవి నిర్జీవ శరీరాన్ని భుజానికి ఎత్తుకొని భూప్రదక్షణ చేస్తున్న సమయంలో విష్ణువు చూసి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని తన యోగ మాయచే 64 భాగాలుగా చేస్తాడు. కొందరు 108 అని అంటారు. దేవి ఒక్కోభాగం ఒక్కో ప్రదేశంలో పడతాయి. వాటికి శక్తిపీఠాలని ప్రతీతి. సతీదేవి నయనాలు అంటే కళ్ళు పడిన ప్రదేశమే హిమాచల ప్రదేశంలోని నయనదేవి మందిరం. ఈ నయనదేవికి పండ్లు, పూలతో పాటు కన్నులను తీసుకోని వెళ్ళితే వాటిని దేవికి తాకించి, భక్తులకు కన్నులను ప్రసాదంగా ఇస్తారు. ఈ క్షేత్రంలోని దుకాణాలలో ఇత్తడి ,వెండి ,బంగారు కన్నులను విక్రయిస్తారు.
16. మాంస ప్రసాదం – సాత్విక ,రాజస ,తామస దేవతల్లో విభాగాన్ని బట్టి మూడు రకాలుగా నైవేద్యంలు ఉంటాయి. క్రూర, రౌద్ర , క్షుద్ర దేవతలకు రాజస తామసమైన ఆహారాన్ని నైవేద్యంగా ఉంచుతారు. సాత్విక దేవతల ఆహారానికి నైవేద్యం అని పేరు. రాజస మరియు తామస దేవతల ఆహారానికి బలి అని పేరు.

మృత్తికా ప్రసాదం…

అంటే దేవాలయంల్లో ప్రసాదరూపంగా మట్టిని ఇస్తారు. దీన్ని వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అన్ని దేవాలయాల్లో ప్రసాదంగా భక్తులకు విభూది, కుంకుమ, చందనం తదితరాలను ఇస్తే నుదిటికి పెట్టుకోవచ్చు. ఒక వేళ పండ్లు లేదా తినే పదార్ద్దాన్ని ఇస్తే తినవచ్చు. అయితే ప్రసాద రూపంగా వచ్చే మన్ను ప్రసాదాన్ని తినేందుకు అవకాశం లేకుండా ఉంటుంది. అలా అని దాన్ని పడేసేందుకు మనస్సు ఒప్పుకోదు. అటువంటి సందర్భంలో ఎం చేయాలో మనస్సుకు తోచదు.

ఎక్కడ ఇస్తారు…

కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయానికి వెళ్ళితే అక్కడి ఆది సుబ్రహ్మణ్య దేవాలయంలో భక్తులకు వల్మిక మృత్తికా అంటే పుట్ట మన్ను ప్రసాదరూపంలో అందిస్తారు. ఉడిపి సమీపంలో ఉన్న నాగబనగహళ్లి అంటే శ్రీ సుబ్రహ్మణ్య దేవాలయంలో కూడా మీకు పుట్ట మన్నును ప్రసాదరూపంలో ఇస్తారు.

మృత్తికా ప్రసాదంతో మనకు ప్రయోజనాలు…

1. మృత్తికా ప్రసాదాన్ని ఎవరు ధరిస్తారో వారికీ నాగుల భయం ఉండదు. నాగ దేవతల అనుగ్రహం ఉంటుంది.

2. ఎవరైతే పాములను చూసి చాలా భయపడతారో, ఎవరికైతే కలలో పాములు ఎక్కువుగా కనబడుతుంటాయో అటువంటి వారు మృత్తికా ప్రసాదాన్ని ధరిస్తే సర్పాల భీతి తొలగిపోతుంది.

3. ఆడ పిల్లలు ఎవరైతే ఎంత మంది పెళ్లి కొడుకులు వచ్చినా వివాహానికి ఒప్పుకోరో అటువంటి ఆడ పిల్లలు లేదా అబ్బాయులు పెళ్లి చూపులకు వెళ్ళే సమయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ధ్యానించి ఒక చిటిక మృత్తికాను మరో చిటిక పసుపును స్నానం చేసే సమయంలో వేడినీరు కాచే పాత్రలో వేసి తరువాత స్నానం చేయాలి. తరువాత శుబ్రమైన వస్త్రాన్ని కట్టుకొని దేవునికి నేతి దీపాన్ని వెలిగించి ప్రార్ధన చేస్తే వివాహం త్వరగా అవుతుంది.

4. ఎవరైతే అర్ధం పర్ధం లేకుండా ఎక్కువగా మాట్లడుతుంటారో అటువంటి వారికి కొబ్బరినూనెలో ఒక చిటికె మృత్తికాను వేసి తల దువ్వుకొంటె ఎక్కువ మాట్లాడకుండా ఉంటారు. అలాగే సమాజంలో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకొంటారు.

5. ఎ పిల్లలకైతే బాలగ్రహ దోషాలు ఉంటాయో చాల ఎక్కువుగా పళ్ళను కోరుకుతుండటం, కిందపడి కొట్టుకోవడం, ఒకే వైపు తదేకంగా చూస్తూ ఉండడం, అదే పనిగా ఏడుస్తూ ఉండడం, సన్నబడుతూ ఉండడం తదితరాలు ఉంటె మృత్తికాను తీసుకొని శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ధ్యానించి పిల్లల నుదిటికి పెడితే వారు ఆరోగ్యంగా ఎదుగుతారు.

6.ఎ పిల్లలు ఆరోగ్య భాగ్యం లేకుండా పదే పదే అనారోగ్యానికి గురి అవుతుంటారో, అటువంటి పిల్లలకు స్నానం చేసే సమయంలో వేడినీరు కాచే పాత్రలో ఒక చిటికె మృత్తికాను వేసి తరువాత స్నానం చేయాలి. అనంతరం దేవునికి నేతి దీపాన్ని వెలిగించి ప్రార్ధన చేస్తే అట్టి వారికీ ఆరోగ్యం చాలా బాగుంటుంది.

7. ఎవరికైతే ఋతు సమయంలో కడుపు నొప్పి ఎక్కువుగా వస్తుంటుందో అటువంటి వారు ఋతు కాలానికి ముందు ఒక చిటిక మృత్తికాను బాగా పొడి చేసుకొని, కొబ్బరి నూనే లేదా అముదంలో వేసి పొట్టకు పూసుకుంటే ఋతుకాలంలో పొట్టనొప్పి ఉండదు.

8. ఎవరైతే పరీక్షా కాలంలో చదివిందంతా మరచిపోతుంటే అటువంటి వారు ఒక చిటిక మృత్తికాను ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రంతా నానబెట్టి ఉదయం ఆ నీటిని వడకట్టి తాగుతూ వుంటే అపుడు మంచి జ్ఞాపకశక్తి వస్తుంది.

9. వివాహం అయి సంతాన భాగ్యం లేనివారు మంగళవారం శ్రీ సుబ్రమణ్య స్వామి పూజను చేసిన తరువాత దేవునికి ప్రసాదంగా పెట్టి పాలకు ఒక చిటిక మృత్తికాను వేసి దేవునికి చూపించి ప్రార్ధన చేసుకొని త్రాగితే స్వామి అనుగ్రహంతో కచ్చితంగా సంతాన భాగ్య్యం కలుగుతుంది.

10. ఎవరింట్లో అయితే తులసి మొక్క తమలపాకు ఆకుల తీగలు ఎంత వేసిన వదలి పోతుంటాయో అటువంటి వారు బృందావనపు కుండలో ఒక చిటిక మృత్తికాను వేసి మొక్కలను పెంచేతే మొక్కలు బాగా పెరుగుతాయి.

11. ఎవరికీ చర్మం పొడి బారుతుందో, నాగఫణి రోగాన్ని అనుభవిస్తుంటారో, ఎవరైతే బాగా నీరసంతో ఇబ్బంది పడుతుంటారో అటువంటి వారు ఒక చిటిక మృత్తికాను నీటిలో వేసి సాయంకాలం స్నానం చేస్తే ఎటువంటి రోగాలు రాకుండా ఆరోగ్యవంతులుగా, భాగ్యవంతులుగా విలసిల్లుతారు.

       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******