కుమారస్వామి, సుబ్రమణ్యస్వామి ఒకరేనా?
కృత్తికలు ఆరుగురూ ఏకకాలమునందు పాలివ్వడానికి సిద్ధపడ్డారు. మా అమ్మే పాలివ్వడానికి సిద్ధపడిందని ఆరు ముఖములతో ఆ పిల్లవాడు ఏక కాలమునందు పాలు తాగేశాడు. కాబట్టి “షణ్ముఖుడు” అయ్యాడు.
పిల్లవాడు కృత్తికల పాలు త్రాగాడు కాబట్టి ఈ పిల్లవాడిని “కార్తికేయుడు” అని పిలుస్తారు అన్నారు.
మహానుభావుడు సనత్కుమారు ఇలా జన్మించాడు కాబట్టి, గర్భము జారి పడిపోతే పూర్ణంగా గర్భం పన్నెండు నెలలు లేకుండానే బయటకు వచ్చాడు కాబట్టి ఆయనను “స్కందుడు” అని పిలుస్తారు.
ఆరుగురు కృత్తికల స్తనములను ఏకకాలమునందు పానము చేసినవాడు కనుక ఆయనకు “షడాననుడు”, “షణ్ముఖుడు” అని పేరు వచ్చింది.
పరమశివుని తేజస్సులోంచి శంకరుడికే ఒక కొడుకు పుడితే ఒక కుటుంబం కాదు, ఒక లోకం కాదు సమస్త ప్రపంచం ఆనంద సాగరంలో మునిగిపోయింది. కనుక ఆ పిల్లవాడిని “కుమారా” అని పిలిచారు. అందుకని కుమారా శబ్దము ఈశ్వర పుత్ర సంబందమై శివుని కుమారుడిని ఉద్దేశించిందిగా ఉంటుంది.
అగ్ని దేవుడు పరమశివుని తేజస్సుని తనయందు ఉంచుకొని గంగయందు ప్రవేశపెట్టిన కారణము చేత ఆ పిల్లవానిని “పావకి” అని పిలిచారు.
ఒకేసారి తల్లుల పాలు త్రాగి తొందరగా భక్తులను రక్షించడానికి ఒకే రోజులో యూవనంలో ఉన్న “కుమారస్వామిగా” మారిపోయారు.
ఉత్తరక్షణం ఈయనకు అభిషేకం చేసేద్దామని పుట్టినరోజు నాడే దేవతలందరూ అయనను దేవసేనాధిపతిగా అభిషేకం చేసేశారు. కాబట్టి “సేనాని” అని పేరు పొందాడు.
ఈయనకే “గుహ” అని పేరు ఉంది.
****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******