Tag Archives: దివ్య ఆలయాలు (Divine Temples)

కుమారకొట్టం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం II కంచి


కాంచిపురంను కంచి, కాంచి అని కూడా అంటారు. హిందువులకు మోక్షప్రదానమైన ఏడు నగరాల్లో కాంచీపురం ఒకటి. మోక్షభూమి, శక్తి భూమిగా ఈ క్షేత్రం ఎంతో పవిత్రమైనదిగా హిందువుల నమ్మకం. గరుడ పురాణం ప్రకారం మోక్షన్ని ఇచ్చే నగరాలు ఏడు అవి వరసగా అయోధ్య, మధుర, హరిద్వార్, కాశీ, అవంతికా, ద్వారక, కంచి. కాంచీపురం “ద గోల్డెన్ సిటి ఆఫ్ 1000 టెంపుల్స్”. అంత ప్రాముఖ్యత కలిగిన ఈ నగరంలో అడుగడుగునా దేవాలయాలే దర్శనమిస్తాయి.

కాంచీపురంలో శ్రీ కామాక్షి దేవి కొలువుదీరి ఉంది. శ్రీ కామాక్షిదేవిని “కామాక్షి తాయి” అని , “కామాక్షి అమ్మణ్ణ్ ” అని కూడా పిలుస్తారు. కాంచీపురంలో భగవత్ శ్రీ ఆదిశంకరాచార్యులుచే స్థాపించబడిన కంచి కామకోటి పీఠం శ్రీ కామాక్షిదేవి ఆలయం ప్రక్కనే ఉంది. పంచభూత స్థలాలలో ఒకటైన, ఏకాంబరేశ్వరుడు “పృథ్వి లింగం” గా కొలువుదీరిన క్షేత్రమే కాంచీపురం. పరమశివుడు 16 పట్టల లింగంగా కొలువుదీరిన కైలాసనాథార్ ఆలయం కాంచీపురంలోనే ఉంది. 16 పట్టలు 16 కళలు అని ప్రతీతి. శ్రీవైష్ణవులకు పరమపవిత్రమైన 108 దివ్య దేశాలలొ, 14 దివ్య దేశాలు కాంచీపురంలో కొలువుదీరి ఉన్నాయి. శైవులకు, శాక్తేయులకు, వైష్ణవులకు పరమపవిత్రమైన క్షేత్రం కాంచీపురం.

ఏకాంబరేశ్వరుడు దేవాలయం ఉన్న ప్రాంతాన్ని శివకంచి అని వరదరాజ పెరుమాళ్ దేవాలయం ఉన్న ప్రాంతాన్ని విష్ణుకంచి అని పిలుస్తారు, ఈ రెండు ప్రాంతాల మధ్య కామక్షి అమ్మ వారి ఆలయం. కాంచీపురం ఎన్నో సుప్రసిద్ధ దేవాలయాలకు చిరునామా. అవేవి సాధారణమైన గుడులు కాదు, ఎంతో గొప్ప చరిత్ర, అంతే గొప్పగా మలచిన శిల్ప కళా సౌందర్యం వాటి సొంతం. అటు వైష్ణవాలయాలు, ఇటు శైవాలయాలు, అష్టాదశ పీఠాల్లో ఒకటైన కామాక్షీ ఆలయాలతో ఎంతో ప్రాశస్త్యం ఉంది ఈ నగరానికి.

పార్వతిపరమేశ్వరుల గారాలపట్టియైన సుబ్రహ్మణ్యస్వామి వారిద్దరికీ మధ్యలో ఉన్నప్పుడు ఆయనను సోమస్కంధుడు అంటారు. కుమారకొట్టం ఆలయం కూడా కామాక్షిదేవి, ఏకాంబరేశ్వరుడు దేవాలయాల మధ్యలో ఉంటుంది. సంస్కృత స్కాందపురాణాన్ని 1625లో కచిప్ప శివాచార్య ఈ ఆలయంలో కూర్చుని తమిళంలో కందపురాణం పేరుతో అనువదించారు. ఈ కందపురాణం కావ్య ఆవిష్కరణ సమయమున పండితులమధ్య సభామండపంలో శ్రీ కుమారస్వామి ప్రత్యక్షమై కందపురాణం ఆవిష్కారించడం జరిగింది. ప్రస్తుత ఆలయమును 1915 లో నిర్మించారు. కుమారకొట్టం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం కంచి కామకోటి మఠం వెనకాల కలదు. ఆలయంపై ప్రాంగణం చుట్టూరా చెక్కిన నెమలి బొమ్మలు అలరిస్తాయి. ఆలయం లోపల ముగ్ధ మనోహరంగా బాల మురుగన్ చూడచక్కని రూపం లో దర్శమిస్తాడు.

ఎక్కడ ఉన్నది?

చెన్నై నుంచి దాదాపు 72 కిలోమీటర్ల దూరంలో ఉంది కంచి. తిరుపతి మరియు తిరుమల నుంచి బస్సు సౌకర్యం ఉంది. కంచి నుంచి తిరుపతి 3 -4 గంటల ప్రయాణం. కంచి నుంచి శ్రీపురం గోల్డెన్ టెంపుల్ 2 -3 గంటల ప్రయాణం. బస్సు సౌకర్యం ఉంది.

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనము నుంచి (కుమారకొట్టం గురుంచి)…



కంచి కుమారకొట్టం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కోసం, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు:

video
play-sharp-fill


       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

      ****** స్వామి వారి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం, శ్రీ స్వామివారిని దర్శించి తరించ గోరుచున్నాము. ******





శ్రీ కుమారస్వామి ప్రత్యక్షమై కందపురాణం ఆవిష్కారించిన మండపం ఇదే

స్వామినాథస్వామి ఆలయం II స్వామిమలై

ఆది దంపతులు పరమేశ్వరుడు, పార్వతీదేవిల రెండో తనయుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. దేవసేనానిగా వ్యవహరించి రాక్షసుడు శూరపద్ముడిని సంహరించాడు. ఈ సంహారం కోసం ఆయన పలు రణశిబిరాలను ఏర్పాటుచేశాడు. ఈ శిబిరాల్లో ముఖ్యమైనవి ఆరు. వాటిని ఆరు పడై వీడు అంటారు. ఈ ఆరు క్షేత్రాలు తమిళనాడులోనే వున్నాయి. అవి స్వామిమలై, పళని, పళముదిర్చోళై, తిరుప్పరన్‌కుండ్రం, తిరుచెందూర్, తిరుత్తణి. ప్రస్తుతం మనం స్వామిమలై గురించి తెలుసుకుందాము.

స్వామిమలై అంటే ‘దేవుని పర్వతం’ అని అర్థం మరియు ఈ పవిత్రమైన దేవుని ఉనికి ఈ పట్టణం లోపల మరియు చుట్టూ ఉన్న పరిసరాలలో ప్రభావం చూపుతుంది. స్వామిమలై శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో నాలుగవది, రాష్ట్రంలో ఇక్కడ మాత్రమే కాంస్య నాణేల యొక్క కళ బోధించే పాఠశాల ఉన్నది. స్వామిమలై అపారమైన జ్ఞానం. అందరికీ స్వామి అయిన శివునికి ఇక్కడ సుబ్రహ్మణ్యస్వామి ప్రణవ మంత్రం ‘ఓం’ తత్వాన్ని వెల్లడించిన కారణంగా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారిని స్వామినాథ స్వామి అని కొలుస్తారు..

స్వామినాథ అంటే గురు స్వరూపం. అసలు స్వామి అనే మాట అమరకోశం ప్రకారం ఒక్క సుబ్రహ్మణ్యుడిదే. ఎందుచేతనంటే “దేవసేనాపతీ, శూరః, స్వామీ, గజముఖానుజః “ అని అర్ధంగా ఇవ్వబడింది. తరువాత స్వామి అనే పేరు వేరే స్వరూపాలు కూడా తీసుకున్నా, అన్నీ సుబ్రహ్మణ్య స్వరూపాలే అని అనుకోవాలి. అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని పిలిచినా, కేవలం స్వామీ అని పిలిచినా అది సుబ్రహ్మణ్యుడికే చెందుతుంది అని చెప్పింది అమరకోశం. అటువంటి మహానుభావుడు స్వామిమలైలో వెలిసి ఉన్నాడు.

ఆలయ విశేషాలు…

ఈ క్షేత్రము అరవై మెట్లు ఉన్న ఒక కొండ మీద ఉంటుంది. పైకి ఎక్కాలంటే విశాలమైన 60 రాతి మెట్లు ఎక్కాలి. ఈ అరవై మెట్లు అరవై తమిళ సంవత్సారాలకి ప్రతీకలనీ, ఆ సంవత్సరాధిదేవతలు ఈ రూపంగా స్వామిని సేవిస్తున్నారనీ అంటారు. ప్రతి మెట్టు దగ్గర గోడమీద ఆ సంవత్సరం పేరు వ్రాసి వుంటుంది తమిళంలో. ఈ మెట్ల దోవ మధ్యలో, 32 మెట్లు ఎక్కగానే కుడివైపున కుమారస్వామి తన తండ్రికి ఉపదేశం ఇస్తున్న అద్భుత శిల్పం కనబడుతుంది. స్వామిమలై ఆలయం మూడు గోపురాలను, మూడు ప్రాకారాలు కలిగి ఉన్నది. ఇక్కడి ఆలయ ప్రాకారాలు విచిత్రంగా ఉంటాయి. మొదటి ప్రాకారం గుట్ట (కొండ అని కూడా పిలుస్తారు) అడుగుభాగంలో ఉన్నది. రెండవ ప్రాకారం గుట్ట మధ్యభాగంలో ఉన్నది. మూడవ ప్రాకారం కొండపై ఆలయం చుట్టూ నెలకొని ఉన్నది. ఇక్కడి ఆలయం బావిని వజ్రతీర్థం అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని కార్తవీర్యార్జునుడు కట్టించాడు. గర్భ గుడి బయట హాల్లో ఈయన విగ్రహాన్ని చూడవచ్చు.

గుడి క్రింది భాగంలో శివుడు పార్వతుల మంటపాలు వున్నాయి. వీరి పేర్లు మీనాక్షీ సుందరేశ్వర్, మీనాక్షి. పాండ్య రాజైన వరగుణుడు ఒకసారి మధుర నుంచి పుణ్యక్షేత్రమైన తిరువిడైమరుదూర్ కు వెళ్తూ ఈ ఆలయంలో ఒక రాత్రి గడిపాడుట. ఆయన కుల దైవమైన మీనాక్షీ సుందరేశ్వరుని ఆరాధించటానికి ఈ మంటపాలనేర్పరచాడు. తర్వాత కీ.శే. అరుణాచల చెట్టియార్ ఇక్కడ రాతి కట్టడాలు కట్టించాడు.

ధ్వజ స్ధంబం దగ్గర వున్న వినాయకుడిగుడి కూడా చాలా మహిమ కలది. ఇక్కడ కుమార తరై, నేత్ర పుష్కరిణి అనే రెండు పుష్కరిణులు వున్నాయి. కొంగు ప్రాంతంనుంచి వచ్చిన పుట్టుగుడ్డి అయిన ఒక భక్తుడు ఈ రెండు పుష్కరిణులలో స్నానం చేసి స్వామి సన్నిధానానికి వస్తుంటే ఈ వినాయకుడి గుడి దగ్గరకు వచ్చేసరికి ఆయనకి కన్నులు కనిపించాయట. అందుకే ఈ వినాయకుణ్ణి నేత్ర వినాయగర్ అంటారు.

స్థల పురాణము…

పూర్వము ఒకనాడు చతుర్ముఖ బ్రహ్మ గారు కైలాసం వైపు వెడుతూ వుండగా, సదా చిద్విలాసంతో ఉండే నా తండ్రి సుబ్రహ్మణ్యుడు, బ్రహ్మ గారిని ఆపి “ బ్రహ్మమనగా ఏమి?, ప్రణవమునకు అర్ధం తెలుసా? “ అని అడిగారు. చతుర్ముఖ బ్రహ్మ గారు అన్నారు, “ బ్రహ్మము అనగా నేనే “. వెంటనే కార్తికేయుడు, మీరు నాలుగు ముఖములతో వేదములు చెప్తున్నారు కాని, బ్రహ్మము అర్ధం కాలేదు అని బ్రహ్మ గారిని చెరసాలలో బంధించారు. వెంటనే పరమశివుడు వచ్చి, “బ్రహ్మ గారికి జ్ఞానములో కించిత్ దోషం ఉండవచ్చు, అంత మాత్రాన కారాగారములో పెట్టకూడదు. ఆయనని విడిచి పెట్టేయి” అని చెప్పగా, సుబ్రహ్మణ్య స్వామి వారు వెంటనే బ్రహ్మ గారిని విడిచిపెడతారు. అంతే కాక, సుబ్రహ్మణ్యుడు శంకరుడితో అంటారు, “ నేను ఎంత మీ కుమారుడనైనా, బ్రహ్మ గారిని అలా అవమానించకూడదు” అని, దీనికి ప్రాయశ్చిత్తంగా సర్ప రూపం దాల్చి భూలోకంలో వచ్చి ఉన్నారు . అలా ఉండగా పిల్లలూ, అందరూ వచ్చి రాళ్ళతో కొడుతూ ఉంటే, పార్వతీ దేవికి ఈ విషయం తెలిసి షష్ఠీ వ్రతం చేయించింది. దానితో ఆయన పాపం తొలగి పూర్తి తెజోమయుడైన సుబ్రహ్మణ్య రూపం వచ్చిందని అంటారు పెద్దలు.

పరమశివునికీ ప్రణవ ఉపదేశం…

ఒకానొక సమయంలో సుబ్రహ్మణ్య స్వామి వారు, పరమశివునికి ప్రణవము ఉపదేశం చేశారు స్వామిగా. ఇది ఎంతో చిత్రంగా ఉంటుంది, శంకరుడు సకల జ్ఞానములకు ఆలవాలము. ఈశానః సర్వ విద్యానాం అంటారు కదా. ఇక్కడ దీని అంతరార్ధము ఏమిటంటే, ఏ తండ్రి అయినా తన కొడుకు చేతిలో ఓడిపోవడం ఇష్టపడతాడు. కొడుకు చేతిలో తండ్రి ఓడిపోతే అది తనకి గొప్ప సన్మానముగా భావిస్తాడు తండ్రి. లోకానికంతటికీ జ్ఞానమునిచ్చే తండ్రికి, తన తేజస్సుతో పుట్టిన పుత్రుడు జ్ఞాన బోధ చేయడం అనేది ఎంతో ఆనందదాయకమైన విషయము. ఇక్కడే అగస్త్య మహర్షికి ద్రవిడ వ్యాకరణం బోధించారు సుబ్రహ్మణ్యుడు. స్వామిమలైలో సుబ్రహ్మణ్య స్వామి వారి మందిరం పైన ఉంటుంది, క్రింద, మీనాక్షీ, సుందరేశ్వరుల మందిరములు ఉంటాయి.

వసతి సదుపాయము…

స్వామిమలై క్షేత్రం కుంభకోణం నుండి చాలా దగ్గరలో ఉండడం వల్ల, వసతి కుంభకోణంలో చూసుకోవడమే ఉత్తమం. స్వామిమలైలో అంత ఎక్కువగా వసతి సదుపాయాలు లేవు. కుంభకోణం కూడా ప్రఖ్యాత పుణ్య క్షేత్రము అవడం వల్ల ఇక్కడ ఎన్నో హోటళ్ళు ఉన్నాయి.

ఆలయంలో ఆర్జిత సేవలు…

స్వామిమలైలో ప్రతీ రోజూ స్వామి వారికి అభిషేకం చేస్తారు. స్వామి వారిని అలంకరణ లేకుండా చిన్న కౌపీనం మాత్రం ఉంచి వేద మంత్రాలు చదువుతూ, పంచామృతాలతో అద్భుతంగా చేస్తారు ఈ అభిషేకం. అభిషేకంలో మన పురుషార్ధంతో ద్రవ్యాలు ఏమైనా ఇచ్చినా వాటితో కూడా చేస్తారు. ఈ అభిషేకం దర్శనం కోసం పదిహేను వందల రూపాయలు టికెట్. ఇక్కడ స్వామినాథ స్వామి చిన్న కౌపీనంతో తన చేతిలో శక్తిఆయుధం పట్టుకుని చిన్న పిల్లవాడిలా ముద్దుగా కనబడతారు. సమయము, అవకాశము ఉన్న వారు తప్పకుండా చూడవలసినది స్వామి వారి అభిషేకం.

ఎక్కడ ఉన్నది?

ఈ క్షేత్రం తమిళనాడు లోని తంజావూర్ జిల్లాలో కుంభకోణం సమీపంలో ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్ ద్వారా: తిరుచిరాపల్లి నుండి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుచిరాపల్లి, మధురై, చెన్నై, బెంగళూరు నగరాల నుండి అనేక బస్సులు ఉన్నాయి. రైలు ద్వారా: కుంభకోణంలో రైల్వే స్టేషను ఉంది. ఇక్కడ నుండి చెన్నైకి ప్రతీ రోజూ అనేక రైళ్ళు నడుస్తాయి.విమానము ద్వారా: దగ్గరలో విమానాశ్రయములు తిరుచిరాపల్లి ( 90 కి.మీ. ), మధురై ( 234 కి.మీ. ), చెన్నై ( 285 కి.మీ. ), బెంగళూరు ( 438 కి.మీ. ) దూరంలో ఉన్నాయి.

మరిన్ని వివరాలకై ఆలయం వెబ్ సైట్ ఇచ్చట చూడండి: స్వామినాథస్వామి ఆలయం – స్వామిమలై

మరిన్ని వివరాలకై ఇచ్చట చూడండి: అరుళ్మిగు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం – స్వామిమలై:

      ****** స్వామి వారి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం, శ్రీ స్వామివారిని దర్శించి తరించ గోరుచున్నాము. ******

అరుళ్మిగు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రము తిరుచెందూర్

ఆది దంపతులు పరమేశ్వరుడు, పార్వతీదేవిల రెండో తనయుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. దేవసేనానిగా వ్యవహరించి రాక్షసుడు శూరపద్ముడిని సంహరించాడు. ఈ సంహారం కోసం ఆయన పలు రణశిబిరాలను ఏర్పాటుచేశాడు. ఈ శిబిరాల్లో ముఖ్యమైనవి ఆరు. వాటిని ఆరు పడై వీడు అంటారు. ఈ ఆరు క్షేత్రాలు తమిళనాడులోనే వున్నాయి. అవి స్వామిమలై, పళని, పళముదిర్చోళై, తిరుప్పరన్‌ కుండ్రం, తిరుచెందూర్, తిరుత్తణి. ప్రస్తుతం మనం తిరుచెందూర్ గురించి తెలుసుకుందాము.

తిరుచెందూర్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో మొదటిది. ఈ క్షేత్రములో స్వామి తారకాసురుడు, శూరపద్ముడు అనే రాక్షసుల సంహారం చేయబోయే ముందు ఇక్కడ విడిది చేసి, పరమశివుని పూజించిన పవిత్రమైన క్షేత్రం. ఈ క్షేత్రం తమిళనాడు లో తిరునెల్వేలి నుండి అరవై కిలోమీటర్ల దూరములో సముద్ర తీరములో ఉన్న అద్భుతమైన ఆలయం. సముద్ర కెరటాలు తిన్నగా వచ్చి గుడిని తాకుతుంటాయి. సాధారణంగా సుబ్రహ్మణ్య ఆలయాలు అన్నీ కొండ శిఖరములపై ఉంటాయి. కాని ఈ తిరుచెందూర్లో ఒక్కచోటే స్వామి సముద్ర తీరము నందు కొండ మీద కొలువై ఉన్నాడు.

స్థల పురాణము…

ఒకానొకప్పుడు, ఈ పవిత్ర స్థలంలో అసురుడైన శూరపద్ముడు తన సోదరులగు సింహముఖుడు మరియు తారకాసురుడితో ముల్లోకాలను ఏలుతుండేవాడు. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారు, తిరుచెందూరుకు అసుర సంహారమునకై వచ్చారు. తన శివారాధన నిమిత్తం, మయుడిని రప్పించి ఒక దేవాలయాన్ని నిర్మించమని ఆఙ్ఞాపించారు. ఆ తరువాత స్వామివారు అసురసంహారానికై పూనుకొని, వారితో ఆరు రోజులు ఎడతెఱిపి లేకుండా నేలపైన, సముద్రముపైన, ఆకాశములో యుద్ధం చేశారు. ఆ భీకర యుద్ధంలో శూరపద్ముడు మినహా అందరూ సంహరింపబడ్డారు. శూరపద్ముడు సముద్రానికి దగ్గిరలో ఒక మామిడి చెట్టు రూపంలో ఉద్భవించాడు. స్వామివారు ఇంద్రుడిని తన వాహనముగా చేసుకొని, తన శక్తి ఆయుధంతో రెండు ముక్కలుగా చీల్చి సంహరించారు. కానీ ఆ రెండు ముక్కలు కోడిపుంజు, మగ నెమలి స్వామివారిచే క్షమింపబడి, ఆయన విశ్వరూప దర్శన భాగ్యాన్ని పొందాడు. ఇంద్రుడి బదులు ఆ మగ నెమలిని తన వాహనంగా చేసుకొని, కోడిపుంజును తన పతాక చిహ్నముగా చేసుకున్నారు.

స్కాంద పురాణంలో…

ఈ ఆలయం గురించి స్కాంద పురాణములో చెప్పబడినది. ఈ క్షేత్రంలోనే ఒక గొప్ప విచిత్రం జరిగింది. ఒకసారి జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య దర్శనం కోసమై తిరుచెందూర్ వెళ్లారు. అక్కడ ఆయన ఇంకా సుబ్రహ్మణ్య దర్శనం చేయలేదు, ఆలయం వెలుపల కూర్చుని ఉన్నారు. అప్పుడు ఆయనకి ధ్యానములో సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనము అయ్యింది. వెంటనే శంకరులు సుబ్రహ్మణ్య భుజంగం చేశారు. ఈ భుజంగ స్తోత్రము ద్వారా, మనల్ని, మన వంశాలనీ పట్టి పీడించేసే కొన్ని దోషాలు ఉంటాయి, అటువంటి వాటిలో నాగ దోషం లేదా కాల సర్ప దోషం ఒకటి . దీనికి కారణం మనం తప్పుచేయకపోవచ్చు, ఎక్కడో వంశంలో తప్పు జరుగుతుంది, దాని ఫలితము అనేక విధాలుగా అనుభవిస్తూ ఉండవచ్చు. ఉదాహరణకు, సంతానము కలుగక పోవడం, కుష్టు రోగం మొదలైనవి. అటువంటి దోషములను కూడా పోగొట్టే సుబ్రహ్మణ్య శక్తి ఎంత గొప్పదో, శంకరులు ఈ సుబ్రహ్మణ్య భుజంగము ద్వారా తెలియజేశారు. ఎంతో అద్భుతమైన స్తోత్రం ఇది.

ఈ సంసారము అనే మహా సముద్రము నుండి మనలను కడతేర్చడానికి నేనున్నాను మీకు అని అభయం ఇవ్వడానికే స్వామి ఇక్కడ నివాసము ఉంటున్నారు. అందుకే శంకర భగవత్పాదులు స్వామిని “మహాంబోధితీరే మహాపాపచోరే ….. అని కీర్తించారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రములో. అంతటి శక్తి ఈ తిరుచెందూర్ క్షేత్రమునకు ఉన్నది.

స్వామివారి రూపం…

తిరుచెందూర్ క్షేత్రములో సుబ్రహ్మణ్య స్వామి వారిని వర్ణించడం సాధ్యం కాదు. అంత అందంగా ఉంటారు. ఇక్కడ, స్వామి తన ముద్దులొలికే రూపంతో పాటు పూర్తి ఆయుధాలతో కూడా దర్శనమిస్తారు. చాలా చాలా శక్తివంతమైన క్షేత్రము. ఎటువంటి వారికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, ఇక్కడ స్వామి విభూతి ప్రసాదంగా తీసుకుంటే అవి తొలగిపోతాయి. సముద్ర తీరంలో శక్తివంతమైన, సుందరమైన దివ్య క్షేత్రం యిది.ఇక్కడ స్వామి వారికి చేసే విభూతి అభిషేకం ఎంత అద్భుతంగా ఉంటుందో. అది చూసి తీరాలి. సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ప్రత్యేకంగా ఈ తిరుచెందూర్ క్షేత్రములో ప్రసాదంగా ఇవ్వబడే విభూతి ఎంతో మహిమాన్వితమైనది.

విభూది మహిమ…

ఇక్కడ స్వామి వారికి అభిషేకం చేసిన విభూతి తీసుకు వచ్చి ఇంట్లో పెట్టుకుంటే, ఎటువంటి గ్రహ, శత్రు, భూత, ప్రేత పిశాచ బాధలు ఉండవు. అంతే కాదు, ఈ విభూతిని సేవించడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక చర్మవ్యాధులు నయం అవుతాయి.

ఆలయశోభ…

సమీపిస్తున్న కొద్దీ, భవ్యమైన తొమ్మిదంతస్తుల రాజగోపురం, దాని పైని శూలం కొట్టొచ్చినట్లుగా కనబడుతాయి. దీనిని 300 ఏళ్ళ క్రితమే నిర్మించడం జరిగింది. తిరువాదుథురై మఠ మహాసన్నిధానానికి చెందిన దేశికమూర్తిస్వామివారికి కలలో ఈ నిర్మాణం చేపట్టవలసినదిగా ప్రచోదనమయ్యింది. అయితే అతడు పేదవాడు కావడంవల్ల, గోపుర నిర్మాణానికై వచ్చిన కూలీలకు కూలీ డబ్బులకు బదులుగా స్వామివారి విభూతిని ఇచ్చాడట. ఆ కూలీలు తుండుక్కై వినాయక ఆలయం వద్దనుండి వెళుతున్నపుడు, ఎవరి శ్రమకు తగినట్టుగా వారికి ఆ విభూతి బంగారంగా మారిపోయేదట. ఆరవ అంతస్థు పూర్తికాగానే, ఈ అద్భుతం ఆగిపోయిందట. మరలా సుబ్రహ్మణ్యస్వామివారు కలలో కనిపించి, కల్యాణ పట్టణానికి చెందిన సీతాపతి మరైక్కార్ అను పోషకుడి వద్దనుండి ఒక బుట్ట ఉప్పును పొందమని ఆదేశించారట. ఆ బుట్టతో తిరుచెందూర్ చేరుకోగానే, ఉప్పు కాస్తా బంగారు నాణాలుగా మారి మిగతా మూడంతస్థుల నిర్మాణం పూర్తిగావించడానికి తోడ్పడిందట. అనంతరంతర కాలంలో ఈ ఆలయం అనేక మార్పులకు, చేర్పులకూ గురవుతూ వచ్చింది. ప్రస్తుతమున్న ఈ ఆలయం వంద సంవత్సరాలకు పూర్వం నిర్మించబడినట్లు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది.

షణ్ముఖ విలాసం…

దేవాలయ ప్రధాన మంటపం 124 స్థంబాలతో శోభిస్తూ, దక్షిణాభిముఖంగా ఉంటుంది. దీనిని షణ్ముఖ విలాసం అని పిలుస్తారు. మొదటి ప్రాకారపు దక్షిణ ప్రవేశమార్గానికి పడమటివైపు దక్షిణామూర్తి (శివుడు) కనిపిస్తారు. ఇక్కడే మరో మండపం ఉంది. ఈ మండపంలో ఉత్సవ దేవతా విగ్రహాలు దర్శనమిస్తారు. ఫల్గుణీ మాసంలో ప్రతి ఏటా ఈ మంటపంలో వల్లీ అమ్మవారి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. పడమటి ద్వారానికి ఉత్తరాన శూరపద్మునితో పోరాటానికి సిద్ధంగా ఉన్న సుబ్రహ్మణ్యస్వామివారు, నెమలిపై కూర్చొన్న విగ్రహం కనిపిస్తుంది. అక్కడక్కడా శివలింగాలు కనిపిస్తాయి. ఆ తరువాత, అరుణగిరి నాథర్ ముని విగ్రహం ఉంటుంది. ఈయన స్వామివారిని స్తుతిస్తూ తిరుప్పుగయ్ అనే రచన చేశారు. దీనికి సమీపంలో గణపతిస్వామి మూర్తి ఉంది. ఈయనను ఇక్కడ ‘ముక్కురిణి పిళ్లయర్’అని పిల్వడం జరుగుతోంది. ఉత్తర ద్వారం వద్ద వేంకటేశ్వరస్వామివారి విగ్రహం కనిపిస్తుంది. ఆనుకొనున్న గుహలో గజలక్ష్మి, పరుండిన రంగనాథుడు, శ్రీదేవీ, భూదేవీ, నీలాదేవి దర్శనమిస్తారు.

ఇక్కడే రాతిలో చెక్కిన పన్నెండు ఆళ్వారుల (వైష్ణవ భక్తాగ్రేసరులు) మూర్తులు కూడా దర్శనమిస్తాయి. తూర్పువాకిలి మధ్య భాగాన, తూర్పుగోపురం హద్దుగా తామ్రంతో నిర్మితమైన ధ్వజస్తంభం ఉంది. రెండవ ప్రాకారంలో, కుమార పీటంకార, ఆయన భార్యలు, షణ్ముఖుని ఉత్సవ విగ్రహాలూ ఉంటాయి. దగ్గిరలో 63 నాయన్మార్లు (శైవ భక్తాగ్రేసరులు) వరుసగా దర్శనమిస్తారు. ఉత్తరపు వాకిలిలో, శివాలయాలలో ఉన్నట్టు చిటికెల చండీశ్వరమూర్తి కనిపిస్తారు. అలాగే, తూర్పున నటరాజస్వామి, శనీశ్వరుడు, భైరవ మూర్తులు దర్శనమిస్తాయి. తూర్పు వాకిలి మధ్య భాగంలో, బంగారు ధ్వజ స్థంభం ఉన్నది.

మూల విరాఠ్ – పవిత్ర పూజ్య పీఠం…
పూజ్య పీఠ ప్రవేశ ద్వారం వద్ద వీర బాహు, వీర మహేంద్రులనబడే ద్వార పాలకులు, స్వామివారి రక్షక భటులుగా నిలబడి కనిపిస్తారు. ఒకే ముఖముతో, చతుర్భుజుడై మూలవర్‌ (మూల విరాఠ్) బాల సుబ్రహ్మణ్య స్వామివారిగా దర్శనం ఇస్తారు. ఇది బ్రహ్మచారి స్వరూపం. ఈ క్షేత్ర ప్రాశస్త్యం, వైభవాలు ఎంతగా ప్రభావితం చేసినా, స్వామివారి దర్శనం చేసినపుడు మాత్రం ఒక వింత అనుభవం కలుగకమానదు. భయంకరమైన రక్కసులను సంహరించినా, స్వామివారి సుందర విగ్రహం, ఒక బాలకుడిలా ఎంతో ముద్దుగొలుపుతూ ఉంటుంది. రెండు చేతులు జోడించి దణ్ణం పెట్టాలనే వాంఛకన్నా, దగ్గిరకెళ్ళి బుగ్గగిల్లాలనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంటారీ స్వామివారు.

ఉత్తరపు దిక్కున ఒక మూలలోగల శివలింగమే, శూరపద్ముని సంహారం తరువాత, సుబ్రహ్మణ్య స్వామివారు పూజించినదని చెబుతారు. స్వామివారి ప్రసాదం విభూతి. ప్రధాన పీఠానికి ఎడమవైపున ఉత్తరాన ఉత్సవ విగ్రహాలైన శెంథిల్ నాయకన్‌, తన భార్యలతో కూడి దర్శనమిస్తారు. ఈ ఉత్సవ మూర్తులకు ఎడమ వైపు బొక్కసం (ఆభరణాలు భద్రపరుచు స్థలం) ఉంటుంది.

మరొక ప్రత్యేక స్థానంలో, దక్షిణాభిముఖంగా షణ్ముఖస్వామి తన భార్యలగు వల్లి, దేవసేనలతో వేంచేసి ఉన్నారు. ఈ అందమైన రాగి విగ్రహం అద్భుతమైన ఆభరణాలతో సుశోభితంగా ఉంటుంది. స్వామివారు పన్నెండు చేతులతో అనేకమైనట్టి ఆయుధాలు చేతబూని ఉంటారు.

పురాణ విగ్రహం…

షణ్ముఖ విగ్రహానికి సంభందించిన చారిత్రక గాధ ఒకటి ఉన్నది. క్రీ.శ. 1648 లో డచ్ దేశస్తులు ఆలయంపై దాడి చేసి, మూలవిరాఠ్, నటరాజ విగ్రహాలను, సంపదనూ దొంగిలించి సముద్ర మార్గంగుండా పారిపోయారు. కానీ ఒక భయంకరమైన తుఫానులో చిక్కుకొని, భయానికిలోనయి ఆ విగ్రహాలను అక్కడే సముద్రంలో జారవిడిచి తోక ముడిచారు. దొంగతనం గురించి తెలుసుకున్న వడమలయప్ప పిల్లయన్, వెంటనే పంచలోహాలతో మునుపటి విగ్రహంలాంటిదే మరొకటి తయారు చేయించారట. ఈయన నాయకన్లచే నియమింపబడిన జమిందారు. కానీ, క్రీ.శ. 1653 లో ఈ నూతన పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్టించే సమయానికి, ఒకనాడు స్వామివారు ఆయనకు కలలో దర్శనమిచ్చి, సముద్రంలో జారవిడిచిన తన నిజ విగ్రహాన్ని వెతికి తెచ్చి, తిరిగి ప్రతిష్టించమని ఆఙ్ఞాపించారు. సముద్రంలో నిమ్మపండు తేలియాడుతున్నచోట, దానిపై గరుడపక్షి వలయాకారంలో తిరుగుతూ కనిపిస్తుందని ఆనవాళ్ళు తెలిపారు. నిర్దేశం ప్రకారం వెతికి, స్వామివారి నిజమూర్తిని కనుగొని, పునః ప్రతిష్ట గావించారు. కొత్తగా చేయించిన పంచలోహ విగ్రహాన్ని, మురుగన్ కురుచిలో తిరుప్పిరంటీశ్వరాలయంలో ప్రతిష్టించారు. ఇదేదో కట్టు కథ అనుకునేరు! M.Raffel అనే ఫ్రెంచ్ దేశస్తుడు, 1785లో తను ప్రచురించిన పుస్తకంలో, డచ్ సైనికుడు ఒకడు తెలిపిన వివరాలను పొందుపరిచాడు.

నాయిక్కనర్ వింత బావి…

షణ్ముఖ విలాస్ ఎదురుగా, ఒక దారి కనబడుతుంది. ఆ దారిగుండా వెళితే, చివరన ప్రవేశ రుసుము చెల్లించి బావిలోకి దిగే మార్గంగుండా వెళితే, ఈ నాయిక్కనర్ చేరుకుంటాము. సాధారణంగా భక్తులు మొదట సముద్రంలో స్నానం చేసిన తరువాత, ఈ బావిలో స్నానమాచరించి, పొడి బట్టలు ధరించి, స్వామివారి దర్శనానికి వెళుతుంటారు. ఈ కుండాన్ని, తన వేలాయుధంతో సుబ్రహ్మణ్యస్వామివారు స్వయంగా సృష్టించారని ప్రతీతి.

సముద్రాన్ని ఆనుకొని ఉన్నా, నీరు తాగడానికి అనువుగా ఉంటుంది. అంతే కాదు, ఈ బావిలో నీరు – రెండు రకాలుగా ఉంటుంది. మొత్తంగా వ్యాపించి ఉన్న నీరు గంధకం వాసనతో, కాస్తంత ఉప్పగా మురికిగా కనిపిస్తుంది. ఒక మూలకు ఉన్న మరో చిన్ని కుండం 7 అడుగుల లోతు, ఒక అడుగు వేడల్పు కొలతలతో ఉంటుంది. దీనినుండి ఊరే జలం ఉప్పగా ఉండదు. దీనినే నాయిక్కనర్ అంటారు. సరైన నామం స్కంద పుష్కరిణి. ఇందులో స్నానం ముఖ్యంగా పిల్లల స్నానం ఎంతో ప్రసిద్ధి. ఆ చిన్న కుండం నుండి నీరు తోడి భక్తుల స్నానానికి సహాయంగా, ఒక దేవస్థాన ఉద్యోగి ఉంటాడు.
ఆలయంలో ఆర్జిత సేవలు…

స్వామి వారి అభిషేకము కోసం పదిహేను వందల రూపాయలు ఖర్చు అవుతుంది. దీనికి ముందుగా ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు. ఎవరైనా ఈ క్షేత్రము వెడితే ఈ అభిషేకం తప్పక దర్శించగలరు. అద్భుతంగా ఉంటుంది. ఇవి కాక ఇంకా అష్టోత్తర అర్చన, సహస్రనామ అర్చన మొదలైన సేవలు ఉన్నాయి.

బ్రహ్మోత్సవాలు…

ఈ ఆలయంలో ఏటా రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అందులో ఒకటి తమిళ ఆవణఇ మాసంలో (ఆగస్టు – సెప్టెంబరు), రెండోది మాసి మాసంలో (ఫిబ్రవరి- మార్చి) నిర్వహిస్తారు. అలాగే చిత్తరై మాసంలో (ఏప్రిల్-మే) వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇది పది రోజులు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. వైశాఖిలో (మే-జూన్) 12 రోజులు విశాఖ ఉత్సవాలను నిర్వహిస్తారు. శూరసంహారం ముగిసిన అనంతరం, మరుసటిరోజున తిరుకళ్యాణ మంటపంలో దేవయాని తిరుకళ్యాణాన్ని నిర్వహిస్తారు. ఇక్కడ కావడి పూజలకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. తమ కోర్కెలు తీరిన భక్తులు తమ శక్త్యానుసారం పాలకావడి, పన్నీరు కావడి, పుష్పకావడిలు సుదూర ప్రాంతాలనుంచి కాలినడకన తీసుకొచ్చి, స్వామికి సమర్పిస్తారు.

వసతి సదుపాయము…

ఈ క్షేత్రములో ఆలయ దేవస్థానపు వసతి గృహాలు అనేకము గలవు. ఇవి ముందుగా ఆలయం వారి వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇంతే కాక అనేక ప్రైవేటు హోటళ్ళు కూడా ఉన్నాయి.

ఎక్కడ ఉన్నది?

రోడ్ మరియు రైలు ద్వారా:

తిరుచెందూరు పట్టణం తిరునల్వేలి పట్టణానికి రైలు మార్గంలో సుమారు 50 కిలోమీటర్లు దూరంలో ఉంది. చెన్నై ఎగ్మోర్ స్టేషన్ నుంచి తిరునల్వేలికి చేరుకుని అక్కడి నుంచి రైలులో గాని, బస్సులో గాని ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు.

మరిన్ని వివరాలకై ఆలయం వెబ్ సైట్ ఇచ్చట చూడండి: తిరుచెందూరు – అరుళ్మిగు శ్రీ సుబ్రహ్మణ్య దేవాలయం

మరిన్ని వివరాలకై ఇచ్చట చూడండి: ఈటీవి తీర్ధయాత్ర – అరుళ్మిగు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం – తిరుచెందూరు:

****** స్వామి వారి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం, శ్రీ స్వామివారిని దర్శించి తరించ గోరుచున్నాము. ******

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనము నుంచి…

శివశయన క్షేత్రం సురుటుపల్లి

పరమశివుడి శయన మందిరంగా సురుటుపల్లి క్షేత్రం విరాజిల్లుతోంది. సకల శైవ క్షేత్రాలలో లింగాకారంలో దర్శనమిచ్చే పరమశివుడు ఇక్కడ భారీ విగ్రహ రూపంలో పార్వతీదేవి ఒడిలో శయనించి పళ్ళికొండేశ్వర స్వామిగా భక్తులకు దర్శనమిస్తారు. గర్భాలయంలో శివశక్తులతో పాటు సకల దేవతా గణాలు, సప్తరుషులు, గజపతి, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ఉన్నాయి. తిరుపతి – చెన్నై జాతీయ రహదారిలోని నాగలాపురం మండలం అరుణానది ఒడ్డున సురుటుపల్లి ఉంది. రాష్ట్రంతో పాటు తమిళనాడు నుంచి భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది.

స్థల పురాణం…

అమృతాన్ని పొందడానికి దేవతలు, రాక్షసులు పాలసముద్రాన్ని మధనం చేస్తుండగా హాలాహలం వెలువడింది. దీంతో భీతిల్లిన దేవతలు, రాక్షసులు త్రినేత్రుని శరణు కోరగా శివుడు హాలాన్ని నేరుడు పండు రూపంలో తీసుకొని మింగేందుకు ఉపక్రమిస్తుండగా హాలాహలం వల్ల అపాయం కలుగుతుందని భావించిన పార్వతీదేవి కంఠాన్ని గట్టిగా నొక్కిపట్టడంతో హాలాహలం కంఠం వద్దనే నిలిచిపోయింది. దీంతో కంఠం నీలంగా మారుతుంది. అందువల్లే శివునికి నీలకంఠుడని పేరు వచ్చింది. అనంతరం పార్వతీ పరమేశ్వరులు కైలాసానికి వెళ్తుండగా మార్గమధ్యంలో ప్రకృతి సౌందర్యాలతో అలరాలే ప్రదేశంలో కొద్దిసేపు సేద తీరుతారు. హాలాహలం తాగిన మైకం కారణంగా ఈశ్వరుడు పార్వతీదేవి ఒడిలో విశ్రమిస్తాడు. అలా సేదతీరిన ప్రదేశమే సురుటుపల్లి.

నారదుడి ద్వారా విషయం తెలుసుకున్న సకల సురగణం ఈశ్వర దర్శనానికి ఇక్కడికి రావడంతో సురులపల్లి అనే పేరున్న ఈ ప్రాంతానికి కాలక్రమేణ సురుటుపల్లి అని పేరు వచ్చింది. భూలోకంలో నీకు విగ్రహారాధనే ఉండదన్న భృగుమహర్షి శాప విముక్తి అనంతరం త్రినేత్రుడు పార్వతీదేవి ఒడిలో శయనిస్తున్నట్లు విగ్రహరూరంలో భక్తులకు దర్శనమిస్తున్నట్లు ప్రతీతి. రావణ సంహార అనంతరం బ్రహ్మ హత్యాపాతక నివారణకు శ్రీరాముడు ఈ క్షేత్రంలో లింగ ప్రతిష్ట చేశాడు. శ్రీరాముడితోపాటు వచ్చిన లవకుశల పాదముద్రలు ఈ ఆలయంలో కనబడతాయి.

వాల్మికీ తపస్సుకు మెచ్చి అనుగ్రహించిన స్వయంబువు శివలింగం, శ్రీవాల్మీకేశ్వరుడి విగ్రహం కూడా ఇక్కడ ఉంది. పార్వతీదేవి నందీశ్వరునిపై గల దక్షిణామూర్తిని ఎడమవైపు నుంచి ఆలింగనం చేసుకుంటున్న రోజును కృష్ణపక్ష త్రయోదశి శనివారం రోజున మహా ప్రదోషంగా శివాలయాల్లో పూజలు నిర్వహిస్తుంటారు. మహా ప్రదోషకాల పూజా సమయంలో ముక్కోటి దేవలు పళ్ళికొండేశ్వర స్వామి ఆలయానికి వస్తారని స్థలపురాణం పేర్కొంటున్నది.

నాగలాపురం మండలం సమీపంలో గల సురుటుపల్లి గ్రామంలో వెలసియున్న శ్రీ పల్లికొండేశ్వరస్వామి ఆలయంలో నెలకు రెండు సార్లు ప్రదోష పూజలు వస్తుంటాయి. అయితే సంవత్సరంలో 1,2 సార్లు శనివారం వచ్చే శని త్రయోదశి ప్రదోష పూజలు ఆలయంలో విశేషంగా నిర్వహిస్తారు. ప్రతి గురువారం దాంపత్య దక్షిణామూర్తికి అభిషేకం నిర్వహించిన భక్తులకు సకల దోషా లు తొలగి అష్టైశ్వర్యాలు చేకూరును. ప్రదోష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులకు సంతానం లేని వారికి సంతానం కలుగునని, వివాహం కాని వారికి వివాహం జరుగునని, భార్యభర్తల మద్య కలహాల తొలగిపోవునని, భక్తులు కోరుకున్న కోర్కేలు తీరుతాయని భక్తులకు ప్రగాఢ నమ్మకం.

సురుటపల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులు…

1. భక్తుల విరాళాలలో సుమారు 40 లక్షల వ్యయంతో స్వామి, అమ్మవార్లకు వెండితొడుగులు ఏర్పాటైయాయి.
2. ఆలయంలో 20 లక్షలతో ప్రదోష మండపాన్ని నిర్మించారు.
3. ప్రభుత్వం అందించిన టూరిజం కారిడార్‌ నిధుల్లో రూ.80 లక్షలతో భక్తుల వసతి గృహం ఏర్పాటు.
4. ఆలయంలో తాగునీటి ట్యాంక్‌, ఆలయ ప్రహరీ నిర్మాణం.
5. భక్తులకు ఆహ్లాదకర వాతావరణ నిమిత్తం ఆలయ ఆవరణలో పార్కు నిర్మాణం.
6. భక్తుల విరాళాలలో సుమారు రూ.60 లక్షలతో ఆలయ పుష్కరిణి పనులు ముమ్మరంగా చేపడుతున్నారు.

శ్రీ స్వామి వారికి జరుగు విశేష కార్యక్రములు…

1. మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా పది రోజలు పాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామి వారిని 12 వాహనాల్లో ఊరేగింపు, అన్నదాన కార్యక్రమాలు.
2. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహాస్తి ఆలయంలో నిర్వహించే మాదిరి సర్ఫదోష, శనిదోష పూజలు.
3. ఆలయంలో కళ్యాణోత్సవం, నవగ్రహహోమం, గణపతిహోమం, రుద్రాభిషేకం, రుద్రహోమం తదితర పూజా కార్యక్రమాలు జరుగును.

ఎక్కడ ఉన్నది?

చిత్తూరు జిల్లాలోని తిరుపతి-చెన్నై జాతీయ రహదారిలోని ఈ సురుటుపల్లి ఆలయానికి విచ్చేయాలంటే బస్సు రూటు ఉంది. తిరుపతి నుంచి పుత్తూరు మీదుగా వస్తూ నారాయణవనం వైపుగా వెళుతున్న చెన్నై జాతీయ రహదారిలో వెళితే సుమారు 80 కిలో మీటర్ల దూరంలో నాగలాపురం (మండలం) సమీపంలో గల సురుటుపల్లి గ్రామంలో ఈ ఆలయం ఉంది. తిరుపతి నుంచి సత్యవేడు డిపో బస్సులు, తిరుమల డిపో చెన్నై బస్సులు ఈ మార్గంలో ప్రయాణిస్తుంటాయి.

       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

మరిన్ని వివరాలకై ఇచ్చట చూడండి: ఈటీవి తీర్ధయాత్ర – శ్రీ పళ్ళికొండేశ్వర స్వామి ఆలయం సురుటపల్లి, చిత్తూరు:

స్వయంభువు సుబ్రహ్మణ్యుడి దర్శనభాగ్యం II నడిపూడి

తూర్పుగోదావరి జిల్లా అమాలాపురానికి సమీపంలోని నడిపూడిలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి స్వయంభువుగా ఆవిర్భవించిన క్షేత్రం ఉన్నది. ప్రాచీనకాలం నుంచి ఇక్కడ స్వయంభువు సుబ్రహ్మణ్య స్వామి పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. గోదావరి నదీతీరంలో గల ఈ క్షేత్రానికి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున పెద్దసంఖ్యలో భక్తులు వస్తుంటారు. స్వామివారికి పూజాభిషేకాలు జరిపించి తరిస్తుంటారు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఈ క్షేత్రంలో తప్పనిసరిగా ఒక సర్పం భక్తులకు దర్శనమిస్తుందని చెబుతుంటారు.

ఆ రోజున తెల్లవారుజామున ఆలయానికి చేరుకున్న భక్తులకు శిఖరంపై సర్పం దర్శనమిచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయని స్థానికులు చెబుతుంటారు. స్వామియే సర్పరూపంలో భక్తులకు దర్శనమిస్తున్నట్టుగా వాళ్లు విశ్వసిస్తుంటారు. ఇక్కడి స్వామిని దర్శించడం వలన సమస్త దోషాలు నశించి సకల శుభాలు కలుగుతాయని చెబుతుంటారు. ఆ రోజున ఈ క్షేత్రంలో స్వామికి మొక్కుబడులు చెల్లించేవాళ్లను చూస్తే, స్వామి ఎంతటి మహిమాన్వితుడో అర్థమైపోతుంది. ఈ క్షేత్రంలో అడుగుపెట్టినవాళ్లు స్వామి అనుగ్రహాన్ని పొందకుండా వెనుదిరగరని స్పష్టమైపోతుంది.

స్థల పురాణం…

దక్షిణాపదములో వశిష్ట గోదావరీ నదీ తీరములో శతాబ్దాల క్రితం అనగా బ్రిటీష్ ప్రభుత్వంలో కాటన్ దొర బ్యారేజి కట్టని క్రితం ఈ ప్రదేశంలో వశిష్ట గోదావరీ నది పరవళ్లు త్రొక్కుతూ ప్రవహిస్తూ ఉండేది. పురాణ ప్రసిద్ధి చెందిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు నాశికా త్రయంబకం నుండి గోదావరీ నదిలో ప్రయాణం చేస్తూ ఋషుల తపస్సులు, పండితుల వేదం ఘోషలతో నిత్యము విరాజిల్లుతున్న ఈ గోదావరీ నది ఒడ్డుకు స్వామి వారు చేరుకున్నారు. పిదప శ్రీ స్వామి వారు ఒక భక్తునికి స్వప్నములో కనిపించి తనకి గ్రామోత్సవము జరిపించి, గ్రామోత్సవము జరిపించిన ఆ పల్లకి ఎక్కడ స్థిరముగా ఆగిపోతుందో అక్కడ తనని ప్రతిష్టించమని ఆజ్ఞాపించారు. స్వామి వారి కోరిక ప్రకారం అరటి దొప్పలతో పల్లకి తయారు చేసి స్వామి వారిని గ్రామములో ఉరేగించి, పల్లకి ఆగిన చోట ఆలయలము గ్రామస్తులు నిర్మించారు. అప్పటి నుండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు స్వయంభువునిగా ఈ ఆలయం నందు కొలువై ఉన్నారు.

భక్తులు కోరినంత మాత్రమునే వారికి ఆయు ఆరోగ్యములు, సంతతి, సకల ఐశ్వర్యములు కలుగజేయును. సంతానలేమితో బాధపడుతోన్నవారికీ, చర్మసంబంధమైన వ్యాధులతో సతమతమైపోతున్నవారికీ, నాగదోషాలతోను, గ్రహ సంబంధమైన దోషాలతోను బాధలుపడుతోన్నవారికి, విద్యలో అభివృద్ధిని సాధించలేకపోతున్నవారికి కూడా శ్రీ స్వామి వారిని దర్శించి పూజించినంత మాత్రమునే వారి దోషములు అన్నియు తొలగిపోతాయి. ఇది అంతయూ స్వయంభు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్ర మహత్యం.

స్వయంభువుగా వెలసిన స్వామి క్షేత్రం లోక ప్రసిద్ధి చెందినది. స్వామి వారికి తూర్పు వైపున ద్వారబందము లోపల స్వామి పుట్ట ఉన్నది. ఇది ఎవరు నిర్మాణము చేసినది కాదు. స్వామి వారు ఈ పుట్టలో నిత్యము ఉంటారని భక్తుల నమ్మకం. ఈ పుట్టను దర్శనము చేసుకొనుటకు అద్దము ఏర్పాటు చేయబడినది. ప్రతి సంవత్సరం వచ్చే గోదావరీ నది ప్రవాహ వేగమునకు నది-పూడి ఏర్పడిన ఈ గ్రామము కాలక్రమేణా నడుపూడిగా వ్యవహారములోనికి వచ్చియున్నది. 1973 సంవత్సరంలో ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమము, శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట జరిగినది.

శ్రీ స్వామి వారికి జరుగు విశేష కార్యక్రములు…

1. నిత్యము స్వామి వారికి అభిషేకము, కళ్యాణము జరుగును.
2. మార్గశిర శుద్ధ పంచమి రోజు రాత్రి స్వామి వారి కళ్యాణం.
3. మార్గశిర శుద్ధ షష్ఠి రోజు శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి, రధోత్సవం, తిరునాళ్లు జరుగును.
4. మార్గశిర శుద్ధ సప్తమి రోజు రాత్రి స్వామి వారి కళ్యాణం.
5. మార్గశిర శుద్ధ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి రోజు స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం.
6. ఆషాడ మాస శుద్ధ షష్ఠి రోజు కుమార షష్ఠి.
7. మాఘ శుద్ధ షష్ఠి రోజు స్వామి వారికి విశేష అభిషేకములు జరుగును.
8. కార్తీక శుద్ధ చవితి, నాగుల చవితి రోజు స్వామి వారికి పాలాభిషేకములు జరుగును.
9. కార్తీక శుద్ధ షష్ఠి, స్కంద షష్ఠి రోజు స్వామి వారికి విశేష అభిషేకములు జరుగును.

ఎక్కడ ఉన్నది?

1. నడిపూడికి రావులపాలెం, పెనుగొండ, తణుకు నుంచి బస్సు మరియు ఆటో సౌకర్యం ఉంది.
2. దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్లు: తణుకు , తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు, రాజమండ్రి.
3. దగ్గరలో దేశీయ విమానాశ్రయము రాజమండ్రి.

       ****** శ్రీ స్వామి వారిని దర్శించి తరించ గోరుచున్నాము. ******

       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******