అరుళ్మిగు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం – తిరుప్పరన్‌ కుండ్రం

ఆది దంపతులు పరమేశ్వరుడు, పార్వతీదేవిల రెండో తనయుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. దేవసేనానిగా వ్యవహరించి రాక్షసుడు శూరపద్ముడిని సంహరించాడు. ఈ సంహారం కోసం ఆయన పలు రణశిబిరాలను ఏర్పాటుచేశాడు. ఈ శిబిరాల్లో ముఖ్యమైనవి ఆరు. వాటిని ఆరు పడై వీడు అంటారు. ఈ ఆరు క్షేత్రాలు తమిళనాడులోనే వున్నాయి. అవి స్వామిమలై, పళని, పళముదిర్చోళై, తిరుప్పరన్‌ కుండ్రం, తిరుచెందూరు, తిరుత్తణి. ప్రస్తుతం మనం తిరుప్పరన్‌ కుండ్రం గురించి తెలుసుకుందాము.

ఆలయ నిర్మాణం…

కొండదిగువన శిలలను తొలిచి నిర్మించిన తిరుప్పరన్‌కుండ్రం ఆలయం అద్భుత శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. పాండ్యుల కాలంలో ఆలయాన్ని నిర్మించినట్టు శాసనాలు తెలుపుతున్నాయి. అయితే అంతకు పూర్వమే ఆలయం వున్నట్టు ఆధారాలున్నాయి. నాయక రాజుల కాలంలో నిలువెత్తు విగ్రహాలను చెక్కారు. కొండను తొలచి ఆలయాన్ని నిర్మించడంతో పాటు పలు దేవతల విగ్రహాలను అద్భుతంగా చెక్కడం ద్రవిడ శిల్పకళకు అద్దం పడుతుంది. ఇంకో విశేషము ఏమిటంటే ఈ ఆలయం మొత్తం ఒకే కొండ రాతిని చెక్కి మలచినది.

ఆరుపడైవీడులో మొదటిది…

ఆరుపడైవీడులో ఈ ఆలయం మొదటిది కావడం విశేషం. అన్ని ఆలయాల్లో మురుగన్‌ నిలుచుకొని అభయమిస్తుండగా ఈ ఆలయంలో ఆసీనుడై భక్తులను ఆశీర్వదిస్తుండటం విశేషం. దేవలోక అధిపతి ఇంద్రుడు తన కుమార్తె దేవయానిని కార్తికేయుడికి ఇచ్చి వివాహనం జరిపిన ప్రదేశంగా తిరుప్పరన్‌ కుండ్రం ఖ్యాతిచెందింది. దేవయాని సమేతుడైనస్వామి చుట్టూ త్రిలోక సంచారి నారద మునీంద్రుడు, ఇంద్రుడు, బ్రహ్మ, సరస్వతి మాత, సూర్యచంద్రులు, గంధర్వులు వున్న చిత్రం కనిపిస్తుంది. ఈ క్షేత్రం తమిళనాడులో ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అయిన మధురై కి కేవలం తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది.

అభిషేకం వేలాయుధానికే…

సాధారణంగా ఆలయాల్లో అభిషేకం మూలవిరాట్టుకు చేస్తారు. అయితే ఇందుకు భిన్నంగా స్వామి వారి ఆయుధమైన వేలాయుధానికి ఇక్కడ అభిషేకం చేయడం గమనార్హం. ప్రతీ రోజూ స్వామి వారి శక్తి ఆయుధానికి అభిషేకం జరుగుతుంది. శూరపద్ముడిని సంహరించిన అనంతరం స్వామి తన వేలాయుధంతో ఇక్కడకి వచ్చినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. తమిళమాసమైన పెరటాసి నెలలో వేలాయుధాన్ని పక్కన కొండపై వున్న కాశీవిశ్వనాధుని ఆలయానికి తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ప్రధాన మందిరం…

ప్రధాన మందిరంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భక్తులకు దర్శనమిస్తుంటారు. సమీపంలోనే ఆది దంపతులైన పార్వతి, పరమేశ్వరుల మందిరం, కర్పగ వినాయక మందిరం, విష్ణుమూర్తి ఆలయాలున్నాయి. ప్రాంగణంలోనే కంబతడి మండపం, అర్ధమండప, మహామండపాలను చూడవచ్చు. వీటిపైవున్న శిల్పకళ చూపరులను విశేషంగా ఆకర్షిస్తుంది.

నక్కిరార్‌ ఆలయం…

ప్రముఖ తమిళ కవి నక్కిరార్‌కు ఒక ఆలయముంది. ఆలయ సమీపంలో తపస్సు చేసుకుంటున్న నక్కీరార్‌కు ఒక రోజు ఆలయ పుష్కరిణలో సగం చేప, సగం పక్షి రూపంలో వున్న ఒక జీవం కనిపించింది. దీన్ని ఆయన తదేకంగా చూడటంతో తపస్సు భంగమైంది. ఆ విచిత్ర రూపం రాక్షస రూపం దాల్చి అతన్ని బందీగా పట్టుకుంది. దీంతో ఆయన తనను రక్షించమంటూ మురుగన్‌ను తిరుమురుగట్టురుపడైని గానం చేశాడు. దీంతో స్వామి ప్రత్యక్షమై నక్కిరార్‌ను అతనితో పాటు వున్న అనేకమందిని రక్షించాడు. స్వామి తన వేలాయధంతో ఒక రాతిపై కొట్టడంతో గంగ జలం బయటకు వచ్చింది. ఈ జలంలో మునిగితే పాపాలు పోతాయి. ఎంత వేసవిలోనూ ఈ తీర్థం ఎండిపోకపోవడం విశేషం.

వసతి సదుపాయము…

ఈ క్షేత్రము మదురైకి దగ్గరగా ఉండడం వల్ల, వసతి ఏర్పాటు మధురైలోనే చూసుకోవచ్చు. మధురైలో ఎన్నో హోటళ్ళు ఉన్నాయి.

ఎక్కడ ఉన్నది?

రోడ్ మరియు రైలు ద్వారా:

1. తమిళనాడులోని చెన్నై నుంచి మధురైకి ఎన్నో రైళ్ళు నడుస్తాయి. మధురై చేరుకొని అక్కడ నుంచి తిరుప్పరన్‌కుండ్రానికి చేరుకోవచ్చు.
2. మధురై నుంచి తిరుప్పరన్‌కుండ్రం 9 కి.మీ. దూరంలో వుంది.
3. మధురైకు దేశంలోని పలుప్రాంతాల నుంచి విమాన, రైలు, బస్సు సౌకర్యాలున్నాయి.
4. చెన్నై – 450 కి.మీ. , బెంగళూరు – 470 కి.మీ. దూరంలో వుంది.


విమాన మార్గము:

1. దగ్గరలో అంతర్జాతీయ విమానాశ్రయము చెన్నై. అది కాక జాతీయ విమానాశ్రయము మధురై మీనాక్షీ అమ్మ వారి ఆలయం నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

       ****** శ్రీ స్వామివారిని దర్శించి తరించ గోరుచున్నాము. ******

మరిన్ని వివరాలకై ఇచ్చట చూడండి: తిరుప్పరన్‌ కుండ్రం – శ్రీ సుబ్రహ్మణ్య దేవాలయం


మరిన్ని వివరాలకై ఇచ్చట చూడండి: ఈటీవి తీర్ధయాత్ర – శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం – తిరుప్పరన్‌ కుండ్రం:

       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

About the Author

Ravikanth Bandi ()

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *