శ్రీ శివ ప్రదక్షిణ విధానము?

మీరు శివాలయంకి వెళ్ళినపుడు అన్ని ఆలయాలకి చేసిన విధంగానే ప్రదక్షిణ చేస్తున్నారా? ఇకపై అలా చేయకండి…

శివుడికి ప్రదక్షిణ చేయటం అంటే ప్రణవం చేయటం లాంటిది. అత్యంత విశిష్టమయినది. శివ మహా పురాణంలో శివుడికి అభిషేకం చేసి, మహా నివేదన చేసి , హారతి ఇచ్చిన తరువాత అపరాదాన్ని క్షమించమని ప్రదక్షిణ చేయాలి. 108 సార్లు ప్రదక్షిణ చేస్తే శివుడు సంతుష్టుడు అవుతాడు. సకల పాపాల్ని తుడిచేయగల ఫలితం ప్రదక్షిణ ఇస్తుంది. ప్రణవం చేయటం వలన , ఓంకారం చేయటం వలన ఎలాంటి పుణ్యం వస్తుందో అలాంటి పుణ్యం కేవలం శివుడికి ప్రదక్షిణ వలన వస్తుంది. శివుడికి ప్రదక్షిణ చేయటం వలన షోడసోపచార పూజ చేసిన పుణ్యం వస్తుంది. సకల పూజ చేయలేని వారు శివుడికి ప్రదక్షిణ చేయడం వలన అనంతమయిన పుణ్యం వస్తుంది.

అలాగే చాలా మంది ఏ దేవాలయంలో అయిన తెలియక చేసే పొరపాటు గర్భగుడి వెనుక భాగాన్ని తాకి నమస్కారం చేస్తారు. అలా చేయకూడదు. గర్భగుడి వెనుక భాగంలో రాక్షసులు ఉంటారు వారిని నిద్ర లేపినట్లు అవుతుంది తాకితే. మరో విషయం ఏమిటంటే, విగ్రహనికి ఎదురుగా నిలబడి ఏ దేవుడు లేదా దేవత దర్శనం చేసుకోకూడదు. ఎందుకంటే విగ్రహం నుండి వెలువడే శక్తి తరంగాలు నేరుగా మన మీద పడతాయి. వాటి శక్తి మనం భరించలేం కనుక ప్రక్కన నిలబడి దర్శనం చేసుకోవాలని పెద్దలు చెప్తారు.

ప్రాణ కళారూప ధరుడు పశుపతి. ఆయన “నీలలోహితుడు” అని తాంత్రికం చెబుతోంది. అంటే, ప్రాణరూపమైన పాశంతో జీవుల్ని కట్టివేస్తున్నవాడు. పశుపతి పంచ ముఖుడు. నాలుగు ముఖాలు నాలుగు దిక్కుల్లో ఉంటాయి. అయిదోది ఆ నాలుగింటి పైనా ఉంటుంది. తూర్పు ముఖం తత్పురుషం. పశ్చిమ ముఖం సద్యోజాతం. ఉత్తర ముఖం వామదేవం. దక్షిణంలో ఉండేది అఘోరం. పైన కనిపించేది ఈశానం. శ్రీదక్షిణామూర్తి విజ్ఞానమయ రూపుడు. కళారూపమైన వాక్కుకు ఆ భూతేశుడే ఆధారప్రాయుడు.

శివాలయంలో గృహస్తు ప్రదక్షిణ ఏవిదంగా చేయాలి?…



1. శివాలయంలో ధ్వజస్థంభం వద్ద ప్రదక్షిణ ప్రారంభించి, ధ్వజస్థంభం నుండి చండీశ్వరుని వరకూ ప్రదక్షిణ చేసి చండీశ్వరుని వద్దకు వెళ్ళి నమస్కరించవలెను.
2. అక్కడ నుండి మళ్లీ వెనక్కి తిరిగి ధ్వజస్థంభం దగ్గరకు వచ్చి ఒక్క క్షణం ఆగి మరలా ప్రదక్షిణ మొదలు పెట్టి సోమసూత్రం (అభిషేక జలం బయటకు పోవు దారి) వరకు వరకు వెళ్ళవలెను.
3. తిరిగి ధ్వజస్థంభం దగ్గరకు వద్దకు వచ్చి నమస్కరించుకొని (అలా వస్తే ఒక్క ప్రదక్షిణ పూర్తి అవుతుంది) చండీశ్వరుని చేరవలెను.
4. మరల ధ్వజస్తంభము మీదుగా (మధ్యలో ఆగకుండా) సోమసూత్రమును చేరవలెను.
5. అదే విధంగా, ధ్వజస్తంభము మీదుగా (మధ్యలో ఆగకుండా) చండీశ్వరుని చేరి నమస్కరించవలెను.
6. మరల, ధ్వజస్తంభము వద్దకు వచ్చి నమస్కరించుకోనిన ప్రదక్షిణ పూర్తి యగును.
ధ్వజస్తంభము లేని యడల, నందీశ్వరుని నుండి ఈ ప్రదక్షిణ చేయవచ్చును. ఈవిదంగా చేసే ప్రదక్షిణకే చండీ ప్రదక్షిణం లేదా సోమసూత్ర ప్రదక్షిణ అని పేరు.

శివ ప్రదక్షిణలో సోమసూత్రం దాటరాదు ఎందుకంటే ఆయనకు అభిషేకం చేసిన జలం సోమసూత్రం నుండి పోతుంది. అంతేకాక అక్కడ ప్రమధగణాలు కొలువై ఉంటారు. అందుకే వారిని దాటితే శివుని కోపానికి గురి అవుతారు. ఈ విధంగా చేసే ప్రదక్షిణం సాధారణంగా చేసే పది వేల ప్రదక్షిణాలతో సమానమని లింగ పురాణంలో పేర్కొనబడింది. ఇలా మూడు ప్రదక్షిణలు చేయాలి. అయితే నందికి శివునికి మధ్యలో నడవకూడదు ఎందుకంటే సదా ఆయన చూపులు శివుని మీదే ఉంటాయి. ఏ పూజలు చేయలేనివారు ఎన్ని ప్రదక్షిణలు చేస్తే అంత పాపాలని పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. ఈ జన్మలో పూర్వజన్మలో చేసిన పాపాలని కూడా మనం ప్రదక్షిణలు చేయడం ద్వారా పరిహరించుకోవచ్చు. ప్రదక్షిణ చేసేటప్పుడు మన అడుగుల చప్పుడు వినపడకూడదు, అంత నెమ్మదిగా చెయ్యాలి.

శివాలయంలో బ్రహ్మచారి ప్రదక్షిణ ఏవిదంగా చేయాలి?…

బ్రహ్మచారి సోమసూత్రం దాటవచ్చును కాబట్టి ఎడమ ప్రక్కన నుంచి మొదలు పెట్టి గుండ్రంగా ప్రదక్షిణ చేసి శివునికి ఎదురుగా రావాలి.

శివాలయంలో సన్యాసి ప్రదక్షిణ ఏవిదంగా చేయాలి?…

సన్యాసి కుడి ప్రక్కనుంచి మొదలు పెట్టి పూర్ణ ప్రదిక్షణ చెయ్యాలి.

పురాణగాథ…

పుష్పదంతుడు అనబడే ఒక గంధర్వుడు ఉండేవాడు. ఆయనకు ఒక అలవాటు ఉండేది. రోజూ ఈశ్వరుడిని అనేక రకాల పువ్వులతో పూజించేవాడు. ఆయన వేరువేరు తోటల నుంచి పువ్వులును దొంగతనంగా సేకరించేవాడు. అలా రోజూ ఒక రాజుగారి తోటలోని పూలను దొంగతనంగా కోసుకుని వెళ్ళేవాడు. ఆ రాజు ఎలా అయినా దొంగని పట్టుకోవాలి అనుకున్నాడు. తోటకి కాపలాగా భటులను పెట్టాడు. రాత్రిపూట వాళ్ళు చూస్తుండగానే పువ్వులు మాయమయ్యేవి. ఆ విషయం భటులు రాజుగారికి చెప్పారు, అదివిన్న రాజు ఇది ఖచ్చితంగా మానవుల పనికాదని ఎవరో “మాయావి” కావాలని చేస్తున్న పని అని అర్ధమైనది. “శివనిర్మాల్యం తొక్కితే ఎంతటి దివ్యశక్తి అయినా నశించిపోతుంది” అని తెలిసిన ఆ రాజు శివునికి పూజ చేసిన పువ్వులను తెప్పించి, ఆ తోట మొత్తం చల్లించాడు.

అది తెలియక పుష్పదంతుడు యధావిధిగా పువ్వుల కోసం తోటలోకి వెళ్ళాడు. అక్కడ చల్లిన శివ- నిర్మాల్యాన్ని తెలియక తొక్కాడు. అప్పుడు ఆయనకు ఉన్న దివ్యత్వం పోయి సాధారణ మానవునిగా భటుల కళ్ళకు కనిపించాడు. పుష్పదంతుడిని బంధించి రాజుగారి దగ్గరకు తీసుకుని వెళ్ళారు. అప్పుడు పుష్పదంతుడు ఎంతో గొప్పది, శక్తివంతమైన “శివమహిమ్న స్తోత్రము” చేశాడు. విశేష ప్రాచుర్యం పొందిన శివస్త్రోత్రాల్లో శివ మహిమ్నస్తోత్రమ్ ఒకటి. అప్పుడు పుష్పదంతుడి దివ్యత్వం తిరిగివచ్చి గంధర్వుడిగా మారి రాజుని క్షమాపణ కోరి తనలోకానికి తిరిగి వెళ్ళిపోయాడు. శివమహిమ్న స్తోత్రమ్ 31 శ్లోకాల చిన్న స్తోత్రమే కానీ, చాలా ప్రసిద్ధి పొందింది. ‘మహిమ్నః’ అనే శ్లోకంలో మొదలవుతుంది కనుక, దీన్ని శివమహిమ్న స్తోత్రం అని అంటారు.

       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనము నుంచి…

video
play-sharp-fill

About the Author

Ravikanth Bandi ()

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *