Tag Archives:

షణ్ముఖ మంగళ ద్వావింశతి: (Shanmukha Mangala Dvavinsati)

తిరుత్తణి నివాసాయ దివ్యాయ పరమాత్మనే!
దేవసేనా సమేతాయ వల్లీశాయాస్తు మంగళమ్!!
Tiruttaṇi nivāsāya divyāya paramātmanē!
Dēvasēnā samētāya vallīśāyāstu maṅgaḷam!!

కార్తికేయాయ మహతే శరకాననశాయినే!
తారకాసుర నాశాయ షణ్ముఖాయాస్తు మంగళమ్!!

Kārtikēyāya mahatē śarakānanaśāyinē!
Tārakāsura nāśāya ṣaṇmukhāyāstu maṅgaḷam!!

పూర్ణచంద్ర నిభాస్యాయ పూర్ణశక్తి స్వరూపిణే!
పూర్ణాయ పూర్ణరూపాయ సుబ్రహ్మణ్యాయ మంగళమ్!!

Pūrṇachandra nibhāsyāya pūrṇaśakti svarūpiṇē!
Pūrṇāya pūrṇarūpāya subrahmaṇyāya maṅgaḷam!!

పరస్మై పరరూపాయ పరమేశ సుతాయ తే!
పరాత్పరాయ పారాయ సుబ్రహ్మణ్యాయ మంగళమ్!!

Parasmai pararūpāya paramēśa sutāya tē!
Parātparāya pārāya subrahmaṇyāya maṅgaḷam!!

ఉమా సుతాయ సర్వార్థఫలదాయ స్వయంభువే!
భక్తాధీనాయ విభవే సుబ్రహ్మణ్యాయ మంగళమ్!!

Umā sutāya sarvārthaphaladāya svayambhuvē!
Bhaktādhīnāya vibhavē subrahmaṇyāya maṅgaḷam!!

సుబ్రహ్మణ్యాయ శూరాయ సుందరాయ సురోచిషే!
సుస్థిరాయ సురేశాయ షణ్ముఖాయాస్తు మంగళమ్!!

Subrahmaṇyāya śūrāya sundarāya surōchiṣē!
Susthirāya surēśāya ṣaṇmukhāyāstu maṅgaḷam!!

శరదుత్ఫుల్ల పద్మాభ నేత్రాయ శివదాయినే!
గాంగేయాయ సుశీలాయ వల్లీశాయాస్తు మంగళమ్!!

Śaradutphulla padmābha nētrāya śivadāyinē!
Gāṅgēyāya suśīlāya vallīśāyāstu maṅgaḷam!!

గుహాయ గుహ్యరూపాయ గణనాథాయ జాయతే!
గీతజ్ఞాయ గుణాడ్యాయ సుబ్రహ్మణ్యాయ మంగళమ్!!

Guhāya guhyarūpāya gaṇanāthāya jāyatē!
Gītajñāya guṇāḍyāya subrahmaṇyāya maṅgaḷam!!

నిర్వికారాయ శూరాయ నిర్జితాఖిల శత్రవే!
నిర్మోహాయ సురూపాయ షణ్ముఖాయాస్తు మంగళమ్!!

Nirvikārāya śūrāya nirjitākhila śatravē!
Nirmōhāya surūpāya ṣaṇmukhāyāstu maṅgaḷam!!

సంసార దుస్తరాంభోధి పోతాయ భవసూనవే!
రామమూర్తి సుపాలాయ సుబ్రహ్మణ్యాయ మంగళమ్!!

Sansāra dustarāmbhōdhi pōtāya bhavasūnavē!
Rāmamūrti supālāya subrahmaṇyāya maṅgaḷam!!

అచింత్యశక్త యే మత్త దుష్టతారకహారిణే!
మహతే మహనీయాయ సుబ్రహ్మణ్యాయ మంగళమ్!!

Achintyaśakta yē matta duṣṭatārakahāriṇē!
Mahatē mahanīyāya subrahmaṇyāya maṅgaḷam!!

అశేషభాగ్య సంధాత్రే ఆడ్యాయ గుణశాలినే!
గుణాతీతాయ గురవే షణ్ముఖాయాస్తు మంగళమ్!!

Aśēṣabhāgya sandhātrē āḍyāya guṇaśālinē!
Guṇātītāya guravē ṣaṇmukhāyāstu maṅgaḷam!!

ఆర్తిహరాయ ఆనంద ఫలదాయ మహాత్మనే!
ఆపన్న జనరక్షాయ వల్లీశాయాస్తు మంగళమ్!!

Ārtiharāya ānanda phaladāya mahātmanē!
Āpanna janarakṣāya vallīśāyāstu maṅgaḷam!!

కూతస్థాయ కుభ్రుద్భేదకారిణే శుభరూపిణే!
మోహాంధకార రవయే సుబ్రహ్మణ్యాయ మంగళమ్!!

Kūtasthāya kubhrudbhēdakāriṇē śubharūpiṇē!
Mōhāndhakāra ravayē subrahmaṇyāya maṅgaḷam!!

సద్భక్త పారిజాతాయ సత్యమార్గరతాయతే!
సజ్జనావన దీక్షాయ వల్లీశాయాస్తు మంగళమ్!!

Sadbhakta pārijātāya satyamārgaratāyatē!
Sajjanāvana dīkṣāya vallīśāyāstu maṅgaḷam!!

సుందరయ సుశీలాయ సుస్థిరాయ శుభాత్మనే!
శోకమోహ వినాశాయ సుబ్రహ్మణ్యాయ మంగళమ్!!

Sundaraya suśīlāya susthirāya śubhātmanē!
Śōkamōha vināśāya subrahmaṇyāya maṅgaḷam!!

నిత్యాయ నిరవద్యాయ నిరీహాయ గుహాయతే!
నిరాకారాయ భద్రాయ షణ్ముఖాయాస్తు మంగళమ్!!

Nityāya niravadyāya nirīhāya guhāyatē!
Nirākārāya bhadrāya ṣaṇmukhāyāstu maṅgaḷam!!

పురాణాయ పరబ్రహ్మ స్వరూపాయ పరాత్మనే!
పరస్మై పుణ్యరూపాయ సుబ్రహ్మణ్యాయ మంగళమ్!!

Purāṇāya parabrahma svarūpāya parātmanē!
Parasmai puṇyarūpāya subrahmaṇyāya maṅgaḷam!!

స్వర్వాసిజన పూజ్యాయ సర్వసంకట హారిణే!
పరమానందరూపాయ సుబ్రహ్మణ్యాయ మంగళమ్!!

Svarvāsijana pūjyāya sarvasaṅkaṭa hāriṇē!
Paramānandarūpāya subrahmaṇyāya maṅgaḷam!!

సకలాగమ సందోహ సూక్తిగమ్య స్వరూపిణే!
విశ్వరూపాయ విశ్వస్మై షణ్ముఖాయాస్తు మంగళమ్!!

Sakalāgama sandōha sūktigamya svarūpiṇē!
Viśvarūpāya viśvasmai ṣaṇmukhāyāstu maṅgaḷam!!

ధన్యాయ ధర్మరూపాయ ధర్మాధ్యక్షాయ వేధసే!
పాపఘ్నాయ పరేశాయ సుబ్రహ్మణ్యాయ మంగళమ్!!

Dhan’yāya dharmarūpāya dharmādhyakṣāya vēdhasē!
Pāpaghnāya parēśāya subrahmaṇyāya maṅgaḷam!!

సురాసుర కిరీటస్థ మణిఘ్రుష్ట పదాంబుజః!
శివస్య మంత్రదాత్రే తే షణ్ముఖాయాస్తు మంగళమ్!!

Surāsura kirīṭastha maṇighruṣṭa padāmbujaḥ!
Śivasya mantradātrē tē ṣaṇmukhāyāstu maṅgaḷam!!

        ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
        ****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

శివశయన క్షేత్రం సురుటుపల్లి

పరమశివుడి శయన మందిరంగా సురుటుపల్లి క్షేత్రం విరాజిల్లుతోంది. సకల శైవ క్షేత్రాలలో లింగాకారంలో దర్శనమిచ్చే పరమశివుడు ఇక్కడ భారీ విగ్రహ రూపంలో పార్వతీదేవి ఒడిలో శయనించి పళ్ళికొండేశ్వర స్వామిగా భక్తులకు దర్శనమిస్తారు. గర్భాలయంలో శివశక్తులతో పాటు సకల దేవతా గణాలు, సప్తరుషులు, గజపతి, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ఉన్నాయి. తిరుపతి – చెన్నై జాతీయ రహదారిలోని నాగలాపురం మండలం అరుణానది ఒడ్డున సురుటుపల్లి ఉంది. రాష్ట్రంతో పాటు తమిళనాడు నుంచి భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది.

స్థల పురాణం…

అమృతాన్ని పొందడానికి దేవతలు, రాక్షసులు పాలసముద్రాన్ని మధనం చేస్తుండగా హాలాహలం వెలువడింది. దీంతో భీతిల్లిన దేవతలు, రాక్షసులు త్రినేత్రుని శరణు కోరగా శివుడు హాలాన్ని నేరుడు పండు రూపంలో తీసుకొని మింగేందుకు ఉపక్రమిస్తుండగా హాలాహలం వల్ల అపాయం కలుగుతుందని భావించిన పార్వతీదేవి కంఠాన్ని గట్టిగా నొక్కిపట్టడంతో హాలాహలం కంఠం వద్దనే నిలిచిపోయింది. దీంతో కంఠం నీలంగా మారుతుంది. అందువల్లే శివునికి నీలకంఠుడని పేరు వచ్చింది. అనంతరం పార్వతీ పరమేశ్వరులు కైలాసానికి వెళ్తుండగా మార్గమధ్యంలో ప్రకృతి సౌందర్యాలతో అలరాలే ప్రదేశంలో కొద్దిసేపు సేద తీరుతారు. హాలాహలం తాగిన మైకం కారణంగా ఈశ్వరుడు పార్వతీదేవి ఒడిలో విశ్రమిస్తాడు. అలా సేదతీరిన ప్రదేశమే సురుటుపల్లి.

నారదుడి ద్వారా విషయం తెలుసుకున్న సకల సురగణం ఈశ్వర దర్శనానికి ఇక్కడికి రావడంతో సురులపల్లి అనే పేరున్న ఈ ప్రాంతానికి కాలక్రమేణ సురుటుపల్లి అని పేరు వచ్చింది. భూలోకంలో నీకు విగ్రహారాధనే ఉండదన్న భృగుమహర్షి శాప విముక్తి అనంతరం త్రినేత్రుడు పార్వతీదేవి ఒడిలో శయనిస్తున్నట్లు విగ్రహరూరంలో భక్తులకు దర్శనమిస్తున్నట్లు ప్రతీతి. రావణ సంహార అనంతరం బ్రహ్మ హత్యాపాతక నివారణకు శ్రీరాముడు ఈ క్షేత్రంలో లింగ ప్రతిష్ట చేశాడు. శ్రీరాముడితోపాటు వచ్చిన లవకుశల పాదముద్రలు ఈ ఆలయంలో కనబడతాయి.

వాల్మికీ తపస్సుకు మెచ్చి అనుగ్రహించిన స్వయంబువు శివలింగం, శ్రీవాల్మీకేశ్వరుడి విగ్రహం కూడా ఇక్కడ ఉంది. పార్వతీదేవి నందీశ్వరునిపై గల దక్షిణామూర్తిని ఎడమవైపు నుంచి ఆలింగనం చేసుకుంటున్న రోజును కృష్ణపక్ష త్రయోదశి శనివారం రోజున మహా ప్రదోషంగా శివాలయాల్లో పూజలు నిర్వహిస్తుంటారు. మహా ప్రదోషకాల పూజా సమయంలో ముక్కోటి దేవలు పళ్ళికొండేశ్వర స్వామి ఆలయానికి వస్తారని స్థలపురాణం పేర్కొంటున్నది.

నాగలాపురం మండలం సమీపంలో గల సురుటుపల్లి గ్రామంలో వెలసియున్న శ్రీ పల్లికొండేశ్వరస్వామి ఆలయంలో నెలకు రెండు సార్లు ప్రదోష పూజలు వస్తుంటాయి. అయితే సంవత్సరంలో 1,2 సార్లు శనివారం వచ్చే శని త్రయోదశి ప్రదోష పూజలు ఆలయంలో విశేషంగా నిర్వహిస్తారు. ప్రతి గురువారం దాంపత్య దక్షిణామూర్తికి అభిషేకం నిర్వహించిన భక్తులకు సకల దోషా లు తొలగి అష్టైశ్వర్యాలు చేకూరును. ప్రదోష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులకు సంతానం లేని వారికి సంతానం కలుగునని, వివాహం కాని వారికి వివాహం జరుగునని, భార్యభర్తల మద్య కలహాల తొలగిపోవునని, భక్తులు కోరుకున్న కోర్కేలు తీరుతాయని భక్తులకు ప్రగాఢ నమ్మకం.

సురుటపల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులు…

1. భక్తుల విరాళాలలో సుమారు 40 లక్షల వ్యయంతో స్వామి, అమ్మవార్లకు వెండితొడుగులు ఏర్పాటైయాయి.
2. ఆలయంలో 20 లక్షలతో ప్రదోష మండపాన్ని నిర్మించారు.
3. ప్రభుత్వం అందించిన టూరిజం కారిడార్‌ నిధుల్లో రూ.80 లక్షలతో భక్తుల వసతి గృహం ఏర్పాటు.
4. ఆలయంలో తాగునీటి ట్యాంక్‌, ఆలయ ప్రహరీ నిర్మాణం.
5. భక్తులకు ఆహ్లాదకర వాతావరణ నిమిత్తం ఆలయ ఆవరణలో పార్కు నిర్మాణం.
6. భక్తుల విరాళాలలో సుమారు రూ.60 లక్షలతో ఆలయ పుష్కరిణి పనులు ముమ్మరంగా చేపడుతున్నారు.

శ్రీ స్వామి వారికి జరుగు విశేష కార్యక్రములు…

1. మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా పది రోజలు పాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామి వారిని 12 వాహనాల్లో ఊరేగింపు, అన్నదాన కార్యక్రమాలు.
2. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహాస్తి ఆలయంలో నిర్వహించే మాదిరి సర్ఫదోష, శనిదోష పూజలు.
3. ఆలయంలో కళ్యాణోత్సవం, నవగ్రహహోమం, గణపతిహోమం, రుద్రాభిషేకం, రుద్రహోమం తదితర పూజా కార్యక్రమాలు జరుగును.

ఎక్కడ ఉన్నది?

చిత్తూరు జిల్లాలోని తిరుపతి-చెన్నై జాతీయ రహదారిలోని ఈ సురుటుపల్లి ఆలయానికి విచ్చేయాలంటే బస్సు రూటు ఉంది. తిరుపతి నుంచి పుత్తూరు మీదుగా వస్తూ నారాయణవనం వైపుగా వెళుతున్న చెన్నై జాతీయ రహదారిలో వెళితే సుమారు 80 కిలో మీటర్ల దూరంలో నాగలాపురం (మండలం) సమీపంలో గల సురుటుపల్లి గ్రామంలో ఈ ఆలయం ఉంది. తిరుపతి నుంచి సత్యవేడు డిపో బస్సులు, తిరుమల డిపో చెన్నై బస్సులు ఈ మార్గంలో ప్రయాణిస్తుంటాయి.

       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

మరిన్ని వివరాలకై ఇచ్చట చూడండి: ఈటీవి తీర్ధయాత్ర – శ్రీ పళ్ళికొండేశ్వర స్వామి ఆలయం సురుటపల్లి, చిత్తూరు:

తిరుమలలోని కుమారధార తీర్ధం II ముక్తిపథ జలధార


తిరుమల పరమ పవిత్రమైన పుణ్యధామం. ఇక్కడ ముక్కోటి తీర్ధాలు, సకల దేవతలు నిత్యనివాసం ఉంటారని ప్రతీతి. ఇక ఈ శేషాచల కోండల్లో కుమారస్వామికి చెందిన ఓ దివ్య తీర్ధం దాగి ఉంది. ఏటా మార్చి నెలలో వచ్చే పౌర్ణమి రోజున ఈ దివ్య తీర్ధానికి వెళ్తుంటారు భక్తులు. శ్రీవారి ఆలయానికి వాయువ్యం వైపున 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కుమారధార తీర్థం గురించి తెలుసుకుందాం.

తిరుమల శేషాచలం కొండల్లో వెలసిన అద్భుతమైన తీర్థాల్లో కుమార ధార తీర్థం ఒకటి. వైష్ణవ వైభవానికి చిహ్నంగా ఉన్న తిరుమలలో పశుపతి తనయుడైన కుమారస్వామి పేరిట తీర్థం ఉండటం, శివకేశవ అభేదాన్ని చాటుతోంది. దైవం ద్వంద్వాతీతుడన్న సత్యానికి ఇది నిదర్శనంగా కనిపిస్తుంది.

పాపనాశనం డ్యామ్‌ నుంచి వాయవ్య దిశలో ఉంటుంది కుమారధార తీర్థం. కాలినడకన నాలుగైదు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. దట్టమైన అరణ్యంలో, భారీ కొండల నడుమ, మార్మికమైన బిలంలా కనిపించే ఈ కందకం.. ప్రాకృతిక సౌందర్యానికి మచ్చుతునక. చుట్టూ పోతపోసినట్టు ఉన్న రాతికుడ్యాల మధ్య తళుక్కున మెరుస్తూ జలజల జారే సున్నితమైన జలపాతాన్ని చూడటంతోనే మనసు పులకితమవుతుంది. ఈ పుణ్యజలాల కింద స్నానమాచరించడానికి తపోధనులు, దేవతలు కూడా వస్తుంటారని చెబుతుంటారు.

కుమారధార మహత్యం…

తిరుమల మహాత్మ్యంలో పేర్కొన్న 26 ముఖ్య తీర్థాల్లో కుమారధార ఒకటి. వేంకటాచలంలో ముక్తిపథ తీర్థాలుగా పేరెన్నికగన్న తొమ్మిదింటిలో దీనికీ స్థానం ఉంది. కుమారధార వైభవం గురించి వరాహ, వామన, పద్మ పురాణాల్లో ప్రస్తావించారు. పూర్వం ఒకానొక ముసలి బ్రాహ్మణుడు.. తప్పిపోయిన తన కుమారుడైన కౌండిన్యుడి కోసం వెతుకుతూ, వెతుకుతూ ఏడు కొండలు చేరుకున్నాడట. అప్పుడు వేంకటేశ్వరస్వామి మానవ రూపం ధరించి ఆ పెద్దాయనకు ఎదురుపడ్డాడు. ‘తాతా! నీకు ఇంకా బతకాలనే ఆకాంక్ష ఉన్నట్టుందే! కొడుకు కోసం ఏమిటీ ఆరాటం’ అని ప్రశ్నించాడు.

అప్పుడా బ్రాహ్మణుడు.. ‘నాయనా! నాకు నిజంగానే బతకాలని ఉంది. ఈ జీవితంపై వ్యామోహంతో ఈ మాట చెప్పడం లేదు. దేవతలు, ఋషులు ఎలాగైతే పరమాత్ముని ఎల్లకాలం సేవిస్తుంటారో నాకూ అలాంటి భాగ్యం కావాలని ఉంది. అందుకు దేహం అవసరం. పితృకార్యాలు, దైవకార్యాలు నిర్వర్తించడానికి నాకు కొడుకు అవసరం’ అని బదులిచ్చాడట. ఆ జవాబుకు ప్రసన్నుడైన బాలాజీ.. ఆ బ్రాహ్మణుడిని అక్కడికి సమీపంలో ఉన్న ఒక తీర్థానికి తీసుకెళ్లి స్నానం చేయమన్నాడట. అందులో మునక వేయగానే ముదుసలి బ్రాహ్మణుడు యౌవనవంతుడయ్యాడట. అతడి కుమారుడిని చూపించి.. ఆధ్యాత్మిక మార్గంలో సాగమని ఆశీర్వదించాడట. ముసలివానికి యౌవనాన్ని ప్రసాదించిన కారణంగా.. దీనికి కుమార తీర్థం అని పేరువచ్చిందని వరాహ పురాణం పేర్కొంది.

కుమారస్వామి తపస్సు…

ఈ తీర్థానికి సమీపంలోని గుహలో కుమారస్వామి విగ్రహం ఉంది. తీర్థంలో స్నానమాచరించిన భక్తులు కుమారస్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతారు. తారకాసరుణ్ణి సంహరించడంతో కుమారస్వామికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. దోష నివారణార్థం వేంకటాచలం వెళ్లి శ్రీహరికై తపస్సు చేయమన్నాడట శివుడు. తండ్రి మాట మేరకు కుమారస్వామి ఈ తీర్థం సమీపంలో కఠోర తపస్సు ఆచరించాడట. కొన్నాళ్లకు విష్ణుమూర్తి ప్రత్యక్షమై కుమారస్వామిని అనుగ్రహించాడట. కుమారస్వామి తపమాచరించిన తీర్థం కావడంతో దీనికి ‘కుమారధార’ అని పేరు వచ్చిందని మరో కథ ప్రచారంలో ఉంది.

మాఘ మాసంలో ముక్కోటి ఉత్సవం…

పురాణ ప్రాశస్త్యం ప్రకారం తిరుమలలోని శేషగిరులలో ముక్కోటి పుణ్యతీర్ధాలు ఉన్నవని ప్రతీతి. ఈ పుణ్య తీర్ధాలలో ధర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్య, ముక్తి ప్రదములు కలిగించేవి ప్రధానమైనవి ఏడు తీర్ధములు. అవి స్వామివారి పుష్కరిణి, కుమారధార, తుంబురు, రామకృష్ణ, ఆకాశగంగ, పాపవినాశనం మరియు పాండవ తీర్ధములు. ఈ తీర్ధాలలో ఆయా పుణ్య ఘడియల్లో స్నానమాచరించిన ఎడల సర్వ పాపాలు తొలగి ముక్తి సమకూరుతుందన్నది వైశిష్ట్యం.

కుమారధార ప్రయాణం సంక్లిష్టంగా ఉంటుంది. అయినా భక్తులు ఏ మాత్రం వెరవకుండా ఇక్కడికి చేరుకుంటారు. మూడు నాలుగు మార్గాల ద్వారా ఈ తీర్థానికి చేరుకోవచ్చు. జాపాలి తీర్థం నుంచి ఇక్కడికి దారి ఉంది. తలకోన నుంచి అరణ్య మార్గంలో రావచ్చు. అన్నదమ్ముల బండ, గొల్లోళ్ల రచ్చ మీదుగా కుమారధార తీర్థానికి చేరుకోవచ్చు. అయితే సాహసాలకు సిద్ధపడిన యాత్రికులు ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. పాప నాశనం డ్యామ్‌ మీదుగా రావడానికి ఆసక్తి కనబరుస్తారు.

ఏటా మాఘ మాసంలో మఖా నక్షత్రంతో కూడుకున్న పౌర్ణమి రోజున కుమారధార తీర్థానికి ముక్కోటి ఉత్సవం నిర్వహిస్తారు. ఈ పర్వదినాన స్నానమాచరించి, దానధర్మాలు చేసి, స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు. ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే కుమారధార తీర్ధ ముక్కోటిని దర్శించి, స్నానమాచరించడం భక్తులు ఒక ప్రత్యేక అనుభూతిగా భావిస్తారు.

కుమారధారకు సమీపంలో పసుపుధార తీర్థం ఉంటుంది. వర్షరుతువులో ఈ తీర్థాల గుండా భారీగా నీళ్లు ప్రవహిస్తుంటాయి. అందుకే ఈ తీర్థాలకు సమీపంలో కుమారధార డ్యామ్‌ నిర్మించారు. ఏడాది పొడుగునా జలకళతో అలరారే కుమారధార డ్యామ్‌ తిరుమలకు వచ్చే భక్తుల తాగునీటి అవసరాలను తీరుస్తోంది.

       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

మరిన్ని వివరాలకై ఇచ్చట చూడండి: తిరుమలలోని కుమారధార తీర్ధం:

శ్రీ త్యాగరాజ స్వామి పంచరత్నకృతులు

పంచరత్న కృతులు శ్రీత్యాగరాజస్వామి కర్ణాటక సంగీతానికి అందించిన ఐదు రత్నాల వంటి కీర్తనలు. శ్రీత్యాగరాజస్వామి స్వరపరచిన ఈ ఐదు పంచరత్న కృతులను “త్యాగరాజ పంచ రత్నాలు” అనడం కూడా కద్దు. 19 వ శతాబ్దంలో శాస్త్రీయ సంగీతానికి ప్రాణం పోసిన త్రిమూర్తి వాగ్గేయకారులలో ఒకడైన త్యాగయ్య గారు అందించిన వేలాది కీర్తనలలో రత్నాల వంటివి. ఈ వేలాది కీర్తనలలో ప్రస్తుతం 750 వరకు కీర్తనలు లభించుచున్నాయి. త్యాగరాజు కీర్తనలు తేలికైన తేట తెలుగున పండిత పామురులకు అర్థం అయ్యే రీతిన కూర్చిన శ్రీరామ కీర్తనలు.

పంచరత్న కీర్తనలు…

ఐదు పంచ రత్న కీర్తనలు ఆది తళానికి కూర్చబడ్డాయి. పంచరత్న కీర్తనలు పాడే రాగం వాటి సాహిత్యం మరియు భావాన్ని అనుసరించి ఉంటాయి. ఈ ఐదు కీర్తనలు సంగీత కచేరి లొని రాగం, తానం, పల్లవి పాడేందుకు వీలుగా సంగీత ఉద్ధండులు కల్పనా స్వరాలు పాడేందుకు వీలుగా ఊంటాయి.

త్యాగయ్య వారి పంచ రత్న కీర్తనలు వరుసలో

1. జగదానందకారక – నట రాగం
2. దుడుకుగల నన్నే – గౌళ రాగం
3. సాధించనే ఓ మనసా – అరభి రాగం
4. కనకనరుచిరా – వరాళి రాగం
5. ఎందరోమహానుభావులు – శ్రీ రాగం

పంచరత్న కృతులు పాడే నట గౌళ అరభి వరాళి శ్రీ రాగాలను గాన పంచక రాగాలు అని పిలుస్తారు. వీటికి సంబంధించిన తానం వీణ పై వాయించడానికి చాలా అనువుగా ఉంటాయి. నట వరాళి రాగాలకు 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నది.

పంచరత్న కృతుల ప్రత్యేకతలు…

జగదానంద కారక: పంచరత్నాలలో మొదటిది- నాట రాగకృతి. ఇది 36వమేళకర్త రాగమైన చలనాట జన్యం. శారంగదేవుని సంగీత రత్నాకరం పేర్కొన్న గొప్పరాగాలలో ఇది ఒకటి. ఈ రాగంలో షడ్జ, పంచమాలతో పాటు షట్ శృతి దైవతం, కాకలి నిషాదం ఉన్నాయి. ఈ కృతికి ఎన్నుకున్న భాష -సంస్కృతం. భావం:జగదానంద కారకుడైన శ్రీరాముని వర్ణనం. ధీరోదాత్త గుణశోభితుడైన శ్రీరాముని సంబోధనాత్మక కృతి ఇది. నాట రాగ అనువుగా-ఎంతో హృద్యంగా అమరింది.

దుడుకుగల నన్నే: పంచరత్నాలలో రెండవది- గౌళ రాగంలోని కృతి. ఇది 15వ మేళకర్త మాయామాళవగౌళ జన్యం. షడ్జ, పంచమాలతో పాటు శుద్ధ రిషభం ,అంతర గాంధారం ,శుద్ధ మధ్యమం ,శుద్ధ దైవతం ,కాకలి నిషాదం గల రాగం. దీనిలో రిషభం రాగచ్ఛాయగల ఏకశృతిరిషభం. పాడేటప్పుడు దీన్ని ప్రత్యేకంగా పలుకుతారు. కనుక దీనిని గౌళ రిషభం అని అంటారు. సాహిత్యం చూస్తే, దుడుకు చేష్టలున్న అనే పద ప్రయోగం; ఆ వెంటనే ఏ దొర కొడుకు బ్రోచు? అనే పదప్రయోగం నవ్వు పుట్టిస్తాయి. కాని, ఇదొక ఆత్మ విమర్శా ‍‍జ్ఞానం. దీనిలో చరణాలు కూడా అదే ధోరణిలో సాగుతాయి.

సాధించనే ఓ మనసా: ఇందులో అయిన భగవంతుని యొక్క గొప్పతనన్ని చాలా అందంగా,చక్కగా వర్ణించారు. మొదటి ఐదు చరణాలు శ్రీ కృష్ణుని గొప్పతనాన్ని ,ఆరవ చరణం రాముడి ఘనతను మిగిలిన చరణాలు వేంకటేశ్వర స్వామిని పొగడుతు వ్రాశారు.

కనకన రుచిరా : ఈ కీర్తనను చాల తక్కువగా ఆలాపించటం జరుగుతుంది .దీన్ని గురువు దగ్గర అభ్యసిస్తే గురు శిష్యుల మధ్య భేదభవాలు కలుగుతాయి అని ఒక నానుడి.అందుకనే ఈ కీర్తనను నేర్పించడం చాలా అరుదు.ఇందులో ధ్రువుని కధకి రామయణానికి ఉన్న పొలికలను వర్ణించడం జరిగింది.

ఎందరో మహనుభావులు : ఈ కీర్తనలో త్యాగరాజుల వారు, ప్రపంచములో ఉన్న గొప్పవారందరికి తన వందనాలు తెలిపారు.ఈ కీర్తన చాలా పేరుపొందినది.

       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

త్యాగరాజ స్వామి వారి పంచరత్న కృతులు | గురుకులం స్టూడెంట్స్:

video
play-sharp-fill


మనకు తెలియని మన త్యాగరాజ స్వామి

త్యాగరాజు గారు (మే 4, 1767 – జనవరి 6, 1847) కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరు. త్యాగయ్య, త్యాగబ్రహ్మ అనే పేర్లతో కూడా ప్రసిద్ధుడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. ఆయన కీర్తనలు శ్రీరామునిపై ఆయనకుగల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై ఆయనకున్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి. ఉపనయనం తరువాత తండ్రిగారి బోధలు, 18వ ఏట రామకృష్ణానంద పరబ్రహ్మం ఉపదేశం చేసిన రామ షడక్షరీ మంత్ర ప్రభావం, తల్లి అలవర్చిన భక్తి సంగీతాలు బాల్యంలోనే బీజాంకురాలై త్యాగరాజస్వామి వారిలో మూర్తీభవించాయి.

“నీవంటి దైవము షడానన! నేనెందుకు కాననురా! మారకోటులందు గల శృంగారము, ఇందుముఖా! నీ కొనగోటను బోలునే!” అని సుబ్రహ్మణ్యుని కీర్తించారు నాదబ్రహ్మ త్యాగరాజ స్వామి.

బాల్యం, విద్యాభ్యాసం…

త్యాగరాజు గారు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కంభం మండలంలో కాకర్ల అను గ్రామంలో తెలుగు వైదిక బ్రాహ్మణ కుటుంబంలో 1767లో జన్మించారు. త్యాగరాజు కాకర్ల రామబ్రహ్మం, కాకర్ల సీతమ్మ దంపతుల మూడవ సంతానం. ఇతని జన్మనామం కాకర్ల త్యాగ బ్రహ్మం. వీరు మురిగినాడు తెలుగు బ్రాహ్మణులు. త్రిలింగ వైదీకులు. ఇతడి పూర్వీకులు ప్రస్తుత ప్రకాశం జిల్లా కంభం మండలంలో కాకర్ల అను గ్రామం నుండి తమిళ దేశానికి వలస వెళ్లారు. తండ్రి రామబ్రహ్మం తంజావూరు ప్రభువు శరభోజీ ఆధ్వర్యంలో ఉండేవారు. త్యాగరాజు గారి తాతగారు గిరిరాజ కవిగారు. వీరి గురించి త్యాగయ్య తన బంగాళరాగ కృతిలో “గిరిరాజసుతా తనయ” అని తన తాతగార్ని స్తుతించియున్నారు. త్యాగయ్య గారి విద్య కొరకు రామబ్రహ్మము తిరువారూర్ నుంచి తిరువయ్యూర్ కు వెళ్లారు. త్యాగయ్య గారు అచట సంస్కృతమును, వేదవేదాంగములను అమూలాగ్రము పఠించెను. సంగీతాభ్యాసము కొరకు త్యాగయ్య గారు శొంఠి వేంకటరమణయ్య గారి దగ్గర విడువబడెను. వేంకటరమణయ్య గారు త్యాగయ్య గారి చాకచక్యమును, సంగీతమునందుగల ప్రావీణ్యతను గమనించి వారియందు అతి శ్రద్ధతో సంగీతోపదేశము చేయసాగిరి.

జీవిత విశేషాలు…

త్యాగయ్య గారి తండ్రి గారు పిన్న వయస్సులోనే గతించిరి. కనుక అన్నదమ్ముల మధ్య అయిన భాగపరిష్కారములలో త్యాగయ్య గారి భాగములో కులప్రతిమలైన శ్రీరామ లక్ష్మణులు విగ్రహములు వచ్చెను. ఆ ప్రతిమను అతి భక్తితో పూజించుచుండిరి. త్యాగయ్య గారు ఉంఛవృత్తి నవలంబించి సర్వసామాన్యముగా జీవనం చేయుచుండిరి. తక్కిన సమయమంతయు తన యిష్టదైవమైన “శ్రీరాములు” పై కృతులు రచించుటలో పాల్గొనుచుండిరి. త్యాగయ్య గారు 96 కోట్ల శ్రీరామ నామములు జపించి వారి దర్శనము పొంది వారి ఆశీర్వాదము పొందిరి. త్యాగయ్య గారు మంచి శారీరము కలిగియుండిరి. త్యాగయ్య గారు వైణికులు కూడా. 18 సంవత్సరాల వయసులో త్యాగరాజుకు పార్వతి అనే యువతితో వివాహమైంది. కానీ ఆయన 23 వయస్సులో ఉండగా ఆమె మరణించడం జరిగింది. తరువాత ఆయన పార్వతి సోదరియైన కమలాంబను వివాహమాడాడు. వీరికి సీతామహాలక్ష్మి అనే కూతురు కలిగింది. ఈమె ద్వారా త్యాగరాజుకు ఒక మనుమడు కలిగాడు కానీ యవ్వనంలోకి అడుగుపెట్టక మునుపే మరణించాడు. కాబట్టి త్యాగరాజుకు కచ్చితమైన వారసులెవరూ లేరు కానీ ఆయన ఏర్పరచిన సాంప్రదాయం మాత్రం ఈనాటికీ కొనసాగుతూనే ఉంది.

సంగీత ప్రతిభ…

త్యాగరాజు గారు తన సంగీత శిక్షణను శొంఠి వెంకటరమణయ్య గారి దగ్గర, చాలా చిన్న వయసులోనే ప్రారంభించారు. పదమూడేండ్ల చిరు ప్రాయమునాడే త్యాగరాజు గారు నమో నమో రాఘవా అనే కీర్తనను దేశికతోడి రాగంలో స్వరపరచారు. గురువు శొంఠి వేంకటరమణయ్య ఇంటిలో చేసిన కచేరీలో ఎందరో మహానుభావులు అనే కీర్తనను స్వరపరచి పాడారు. ఇది పంచరత్న కృతులలో ఐదవది. ఈ పాటకు వెంకటరమణయ్య గారు చాలా సంతోషించి, త్యాగరాజులోని బాలమేధావి గురించి తంజావూరు రాజుగారికి చెప్పగా, రాజు సంతోషించి అనేక ధన కనక వస్తు వాహనాది రాజలాంఛనాలతో త్యాగరాజు గారిని సభకు ఆహ్వానించారు. కానీ త్యాగరాజు గారు తనకు నిధి కన్నా రామ సన్నిధి మాత్రమే సుఖమని ఆ కానుకలను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఈ సందర్భంగా స్వరపరచి పాడినదే నిధి చాల సుఖమా అనే కీర్తన. సంగీతాన్ని భగవంతుని ప్రేమను పొందే మార్గముగా త్యాగరాజు గారు భావించారు. సంగీతంలోని రాగ, తాళములను వాటిపై తన ప్రావీణ్యాన్ని చూపించుకోవడానికి కాక, భగవంతుని నామాలను చెప్పడానికి, భగవంతుని లీలలను పొగడటానికి ఓ సాధనముగా మాత్రమే చూసారు.

తంజావూరు రాజు పంపిన కానుకలను తిరస్కరించినపుడు ఆగ్రహించిన అతని అన్నయ్య జపేశుడు, త్యాగరాజు గారు నిత్యం పూజించుకునే శ్రీరామ పట్టాభిషేక విగ్రహాలను కావేరీ నదిలో విసిరివేసాడు. శ్రీరామ వియోగ బాధను తట్టుకోలేక, రాముడు లేని ఊరిలో ఉండలేక దక్షిణ భారతదేశ యాత్రలకు వెళ్ళి అనేకానేక దేవాలయములను, తీర్థములను దర్శించి, ఎన్నో అద్భుత కీర్తనలను త్యాగయ్య రచించారు. చివరగా శ్రీరాముని అనుగ్రహంతో విగ్రహాలను పొందాడు. వైకుంఠ ఏకాదశి నాడు త్యాగరాజు గారు శ్రీరామ సన్నిధిని చేరుకున్నారు.

త్యాగరాజు గారి జీవితంలో జరిగినట్లుగా కొన్ని విశేషాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. దేవముని అయిన నారదుడే స్వయంగా ఇతనికి సంగీతంలోని రహస్యాలను చెప్పి, “స్వరార్నవ”మనే ఓ అద్భుతమైన పుస్తకం ఇచ్చాడనీ, ఆ సంధర్భంలో త్యాగరాజు గారు చెప్పిన కృతిగా పంచరత్న కృతులలో మూడవదైన “సాధించెనే” అనీ చెపుతారు. ఈ పుస్తకము వల్ల త్యాగయ్యగారు సంగీతములో అత్యుత్కృష్టమైన విషయములను తెలిసికొనినట్లు తెలియుచున్నది. శంకరాభరణము లోని “స్వరరాగ సుధారసము” అను కృతిలో ఈ గ్రంథము గురించి త్యాగయ్య గారు పేర్కొనియున్నారు. త్యాగయ్యవారు 24000 రచనల వరకు రచించిరి. “దివ్యనామ సంకీర్తనలు”, “ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు” అను బృంద కీర్తనలు కూడా రచించెను. “ప్రహ్లాద భక్తి విజయము”, నౌకా చరిత్రము అను సంగీత నాటకములు కూడా రచించిరి.

త్యాగరాజు గారి జీవితంలో కొన్ని సంఘటనలు…

1. త్యాగరాజు గారు తన రామచంద్రుని పూజా విగ్రహాలు పోగొట్టుకున్నప్పుడు పాడిన పాట: ఎందు దాగినావో.
2. త్యాగరాజు గారు తిరుపతి వేంకటేశ్వరుని దర్శనం కోసం వెళ్ళినప్పుడు అక్కడ తెరవేసి ఉంటే, తెరతీయగరాదా అనే పాట పాడితే తెరలు వేంకటేశ్వరుని దయచేత అవే తొలగిపోయినాయి. ఆ తరువాత ఆయన వేంకటేశ నిను సేవింప అనే పాట పాడినారు.
3. త్యాగయ్య గారు పరమపదము చేరటానికి ముందు పాడిన పాటలు: గిరిపై, పరితాపము.

త్యాగరాజ ఆరాధనోత్సవాలు…

అసంఖ్యాకమైన కీర్తనలు రచించి, కర్ణాటక సంగీతంలోని అన్ని నియమాలను సోదాహరణంగా నిరూపించి శాశ్వతమైన కీర్తి సంపాదించిన త్యాగరాజు గారిని కర్ణాటసంగీతానికి మూలస్తంభంగా చెపుతారు.ఈయన జన్మదినం రోజుని భారతీయ సంగీత దినోత్సవంగా జరుపుతాము. ఈ సంగీత నిధికి నివాళిగా ప్రతి సంవత్సరం పుష్య బహుళ పంచమి నాడు (జనవరి, ఫిబ్రవరి నెలలలో) తిరువారూర్లో ఆయన సమాధి చెందిన త్యాగరాజ మహోత్సవ సభనందు త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు.

ఆయన భక్తులు మరియు సంగీత కళాకారులు మొదట ఉంచవృతి భజన, తరువాత ఆయన నివాస స్థలమైన తిరుమంజనవీధి నుంచి బయలుదేరి ఆయన సమాధి వరకూ కీర్తనలు గానం చేస్తూ ఊరేగింపుగా వస్తారు. వందలకొద్దీ కర్ణాటక సంగీత కళాకారులు ఆయన రచించిన పంచరత్న కృతులను కావేరీ నది ఒడ్డున గల ఆయన సమాధి వద్ద బృందగానం చేస్తారు. సంగీతాభిమానులకు ఈ గానం శ్రవణానందాన్ని కలిగించడమే కాకుండా భక్తిభావాన్ని కూడా రేకెత్తిస్తుంది. ఈ ఉత్సవాన్ని ప్రపంచంలో చాలాచోట్ల నిర్వహిస్తారు కానీ తిరువారూలో నిర్వహించే ఆరాధన చాలా ప్రసిద్ధి గాంచింది. ప్రతీ సంవత్సరం పెరుగుతూ వస్తున్న కళాకారుల మరియు సందర్శకుల కోసం ఇక్కడ ఒక పెద్ద భవనం కూడా నిర్మాణదశలో ఉంది.

సమాధి

త్యాగరాజ స్వామివారి మహాభక్తురాలు బెంగుళూరు నాగరత్నమ్మ కావేరీ నది ఒడ్డున శిథిలావస్థలోనున్న స్వామి వారి సమాధి చూసింది. ఆ స్థలాన్ని, దాని చుట్టు ఉన్న ప్రదేశాన్ని తంజావూరు రాజుల ద్వారా, రెవిన్యూ అధికారుల ద్వారా తన వశము చేసికొని పరిశుభ్రము చేయించి, గుడి, గోడలు కట్టించింది. మద్రాస్ లోని తన ఇంటిని అమ్మి రాత్రనక పగలనక వ్యయప్రయాసల కోర్చి దేవాలయ నిర్మాణాన్ని ముగించింది. 1921 అక్టోబరు 27లో పునాదిరాయిని నాటగా, 1925 జనవరి 7న గుడి కుంభాభిషేకము జరిగింది. స్థలాభావము వలన ఇంకా నేల కొని ఒక మంటపము, పాకశాల 1938లో నిర్మించింది. ఈ నిర్మాణములతో ఆమె సంపద, ఆభరణాలు హరించుకుపోయాయి. 1946లో త్యాగయ్య చిత్ర నిర్మాణసందర్భములో చిత్తూరు నాగయ్య గారు నాగరత్నమ్మను కలిశారు. ఆమె సలహాపై నాగయ్య గారు త్యాగరాజనిలయం అనే సత్రాన్ని కట్టించారు.

రచనలు…

‘రామేతి మధురం వాచం’ అన్నట్లు 96 కోట్ల సార్లు రామనామాన్ని జపించి, స్వీయానుభవ భావనలే కృతి రూపంలో మలచి గాంధర్వగాన మధురానుభూతిగా లోకానికి అందించారు. భూలోక నారదుడైన త్యాగరాజ స్వామి నారద మంత్రోపదేశం పొంది, అనుగ్రహం ప్రాభవంతో ‘స్వరార్ణ వం’ ‘నారదీయం’ అనే రెండు సంగీత రహస్యార్ధ ‘శాస్త్ర గ్రంథాలు రచించారు. పంచరత్న కృతి సందేశం : శ్రీత్యాగరాజస్వామి రచించిన కృతులను ప్రాపంచికం, తాత్వికం, కీర్తనం, నిత్యానుష్ఠానాలని వర్గీకరించవచ్చు. త్యాగరాజస్వామి కీర్తనలలో ఘనరాగ పంచరత్న కీర్తనలు ముఖ్యమైనవి. శ్రీత్యాగరాజస్వామి. రామభక్తా మృతాన్ని సేవించి, కర్ణాటక సంగీత సంప్రదాయంలో అనేక కృతులను మధుర కీర్తనలుగా మలచి సంగీత, సాహిత్య రసజ్ఞుల హృదయాల్లో చిరంజీవిగా నిలిచారు. త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో విశేషంగా పంచరత్న కీర్తనలు ఆలపించడం సంప్రదాయం.

కీర్తనలు…

శ్రీత్యాగరాజస్వామి దాదాపు 800 కీర్తనలను రచించారు. వీటిలో చాలావరకు ఆయన మాతృభాష ఐనటువంటి తెలుగులో రచించినవే. కొన్ని సంస్కృతంలో రచించబడినవి. కానీ ఈ కీర్తనలు మాత్రం ఆంధ్రదేశంలోకన్న కర్ణాటక సంగీతం బాగా ప్రాచుర్యంలో ఉన్న తమిళనాట బాగా ప్రాచుర్యం పొందాయి. సంస్కృతంలో రచించబడిన జగదానందకారక అనే కీర్తన శ్రీరామునికున్న 108 పేర్లను ప్రస్తావిస్తుంది. ‘ప్రహ్లాద భక్తి విజయం’, ‘నౌకా చరితం’ అనే నాట్యరూపకాలను కూడా రచించారు.

మరిన్ని వివరాలకై ఇచ్చట చుడండి: శ్రీ త్యాగరాజ స్వామి కీర్తనలు ۞♫

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

శ్రీ త్యాగరాజ స్వామి చిత్రం…