Tag Archives:

కుక్కే సుబ్రహ్మణ్య

జగన్మాత పార్వతీదేవి, లయ కారకుడు పరమేశ్వరుల రెండో పుత్రరత్నం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. నెమలిని వాహనంగా వేలాయుధాన్ని చేతబూని యావత్‌ దేవతాసైన్యానికి ఆయన సేనానిగా వ్యవహరిస్తారు. తన కంటే పెద్దవాడయిన విఘ్నేశ్వరునితో కలిసి శిష్టరక్షణ కోసం అనేక యుద్ధాలు చేశారు. షణ్ముఖుడికి దక్షిణ భారతంలో ఆలయాలు ఎక్కువగా వున్నాయి. వీటిలో మరో మహిమాన్వితమైనది కర్ణాటకలోని కుక్కేలో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం.

కర్నాటక రాష్ట్రము నందు, మూడు ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాలు కలవు. అవి ఆది సుబ్రహ్మణ్య (కుక్కే సుబ్రహ్మణ్య) , మధ్య సుబ్రహ్మణ్య (ఘాటి సుబ్రహ్మణ్య) మరియు అంత్య సుబ్రహ్మణ్య (నాగలమడక (పావగడ నగలమడికే సుబ్రహ్మణ్య)) అనే మూడు అద్భుతమైన క్షేత్రాలు. ఈ మూడూ కలిపితే ఒక సర్పాకారం ఏర్పడుతుంది. ఈ మూడు క్షేత్రాలను ఎవరు దర్శించి స్వామిని ఆరాధిస్తారో, వారికి ఉన్న సకల కుజ, రాహు, కేతు దోషములు, సకల నవగ్రహ దోషములు పరిహరింపబడి, స్వామి అనుగ్రహమును పొంది, సకల అభీష్టములు పొందుతారు.

ప్రకృతి ఒడిలో…

పశ్చిమ కనుమల్లోని సుందర దక్షిణ కన్నడ జిల్లాలోని సులియా తాలుకాలోని కుక్కే గ్రామంలో స్వామివారు నాగులకు రక్షణగా వెలిసి నిత్యపూజలందుకుంటున్నారు. చుట్టూ కుమార పర్వతశ్రేణుల మధ్య ప్రకృతి ఒడిలో నెలకొన్న స్వామివారు నాగులకు అభయమివ్వడంతో పాటు అశేష భక్తజనులకు అభయమిస్తున్నారు.

పురాణచరిత్ర…

సుబ్రహ్మణ్య స్వామి, వినాయకునితో కలిసి తారకాసురునిపై యుద్ధం చేస్తారు. ఈ యుద్ధంలో అసుర సంహారం జరుగుతుంది. అనంతరం ఇక్కడ విశ్రమించిన స్వామి వేలాయుధాన్ని ధార నదిలో పరిశుభ్రం చేస్తారు. దీంతో ఈ నదిని కుమారధార అని పిలుస్తారు. రాక్షస సంహారం చేసిన కుమారస్వామికి దేవేంద్రుడు తన కుమార్తె దేవసేనతో మార్గశిర శుద్ధ దశమి నాడు వివాహం జరిపిస్తారు. సాక్షాత్తూ స్వామివారి వివాహవేదిక కావడంతో ఈ క్షేత్రం మరింత ప్రాశస్త్యం చెందింది. పశ్చిమ కనుమల్లోని ఏడు పరశురామ ప్రతిష్టాపిత క్షేత్రాల్లో కుక్కే సుబ్రహ్మణ్య ఒకటి కావడం విశేషం.

నాగులకు రక్షకుడు…

నాగులలో శ్రేష్టుడు వాసుకి. ఆయన క్షీరసాగర మథనంలో కవ్వానికి తాడులాగా వ్యవహరించాడు. గరుత్మంతుడి బారినుంచి రక్షించాలని కోరుతూ ఇక్కడ కొండల్లో కఠోరమైన తపస్సు చేశాడు. తపస్సుకు అనుగ్రహించిన మహేశ్వరుడు అతనికి వరమివ్వాలని సుబ్రహ్మణ్య స్వామిని ఆదేశిస్తారు. దీంతో స్కందుడు వాసుకికి ప్రత్యక్షమై కుక్కే క్షేత్రంలో నాగులకు రక్షణ వుంటుందని వరమిస్తాడు. దీంతో నాగులకు ఇది రక్షణ క్షేత్రమైంది. ఇప్పటికీ ఈ క్షేత్రంలో అనేక వందల సర్పాలను మనం చూడవచ్చు. ఆది సుబ్రహ్మణ్య మందిరంలో అనేక పుట్టలు వుంటాయి.

ఆదిశేషు, వాసుకిలపై స్వామివారు…

ప్రధాన మందిరంలోని స్వామి ఆదిశేషు, వాసుకిలపైన వుండి పూజలను అందుకుంటారు. సర్పదోష నివారణ పూజలకు ఈ క్షేత్రం ప్రసిద్ధి. సర్పసంస్కార, నాగ ప్రతిష్ట, ఆశ్లేషబలి తదితర పూజలను నిర్వహిస్తారు.

కుమారధారలో పవిత్ర స్నానం…

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, దేవసేనల వివాహం సందర్భంగా పలు పవిత్ర నదీజలాలను దేవతలు కుమారధారలో కలిపారు. స్వామివారి ఆయుధం వేలాయుధం ప్రత్యక్షంగా మునిగిన ప్రాంతం కావడంతో కుమారధారలో పలువురు భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ నీటితో పలు రకాల జబ్బులు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢవిశ్వాసం.

ఎక్కడ ఉన్నది?

రోడ్ మరియు రైలు ద్వారా:

బెంగుళూరు నుంచి 278 కి.మీ. దూరంలో వుంది. మంగళూరు నుంచి 100 కి.మీ. దూరంలో వుంది. మంగళూరు విమానాశ్రయం నుంచి వాహనాల ద్వారా చేరుకోవచ్చు. బెంగుళూరు, మంగళూరు నుంచి బస్సు సౌకర్యముంది. బెంగళూరు నుంచి మంగళూరు వెళ్లే రైళ్లు “సుబ్రహ్మణ్య రోడ్ (స్టేషన్ కోడ్ – SBHR)” మీదుగా వెళుతాయి.

       ****** శ్రీ స్వామివారిని దర్శించి తరించ గోరుచున్నాము. ******

మరిన్ని వివరాలకై ఇచ్చట చుడండి: ఈటీవి తీర్ధయాత్ర – శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం – కుక్కే:

శరవణభవుడు

“శరవణభవ”… ఓం శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః.

షణ్మతాలలో కుమారోపాసన ఒకటి. కంఠంలో రత్నాలంకారాలు, మేనిలో చక్కదనం, చేతిలో జ్ఞానశక్తి ఆయుధం, ముఖాన చిరునవ్వు, కటియందుహస్తాన్ని దాల్చి నెమలిపై ప్రకాశిస్తుండే స్వామి జ్ఞానస్వరూపుడు. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా అనే మూడు శక్తులమయమైన శక్తిని ధరించిన కుమారస్వామి, శరణు అన్న వాడిని కాపాడే దేవుడు. అమోఘమైన శివతేజాన్ని, పృథ్వి, అగ్ని, జలం, ఆరు కృత్తికల శక్తిని (నక్షత్ర శక్తి) ధరించి, శరవణంలోనించి (పార్వతిదేవి) స్వామి జన్మించాడు. అందుకే స్వామి శరవణభవుడు.

శరవణభవ అనే మంత్రాన్ని పఠిస్తే చాలు సమస్త సన్మంగళాలు నిర్విఘ్న౦గా జరుగుతాయి. శరవణభవ మంత్రంలో –

శ – లక్ష్మీబీజము అధిదేవత శంకరుడు
ర – అగ్నిబీజము అధిదేవత అగ్ని
వ – అమృతబీజము అధిదేవత బలభద్రుడు
ణ – యక్షబీజము అధిదేవత బలభ్రద్రుడు
భ – అరుణ బీజము అధిదేవత భద్రకాళీదేవి
వ – అమృతబీజము అధిదేవత చంద్రుడు

శ – శమింపజేయువాడు
ర – రతిపుష్టిని ఇచ్చువాడు
వ – వంధ్యత్వం రూపుమాపువాడు
ణ – రణమున జయాన్నిచ్చేవాడు
భ – భవసాగరాన్ని దాటించేవాడు
వ – వందనీయుడు

అని ‘శరవణభవ’కు గూఢార్థం.

శరవణభవ మంత్రం కోసం ఇచ్చట చూడండి: శరవణభవ మంత్రం

శ్రీ సుబ్రహ్మణ్య తత్త్వం II ప్రవచనము

ప్రవచనము పేరు:  శ్రీ సుబ్రహ్మణ్య తత్త్వం

 

ప్రవచన కర్త:    ‘సమన్వయ సరస్వతి’ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ

భాగము 1 of 5 ప్రవచనమును వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please Click on the ► icon to Listen Part 1 of 5)::

 

video
play-sharp-fill

భాగము 2 of 5 ప్రవచనమును వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please Click on the ► icon to Listen Part 2 of 5):

video
play-sharp-fill

భాగము 3 of 5 ప్రవచనమును వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు (Please Click on the ► icon to Listen Part 3 of 5):

video
play-sharp-fill

భాగము 4 of 5 ప్రవచనమును వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు(Please Click on the ► icon to Listen Part 4 of 5):

video
play-sharp-fill

భాగము 5 of 5 ప్రవచనమును వినుటకు, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు(Please Click on the ► icon to Listen Part 5 of 5):

video
play-sharp-fill

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******

తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి


ఆది దంపతులు పరమేశ్వరుడు, పార్వతీ దేవిల రెండో తనయుడు శ్రీ సుబ్రహ్మణ్యస్వామి. దేవసేనానిగా వ్యవహరించి రాక్షసుడు శూరపద్ముడిని సంహరించాడు. ఈ సంహారం కోసం ఆయన పలు రణశిబిరాలను ఏర్పాటుచేశాడు. ఈ శిబిరాల్లో ముఖ్యమైనవి ఆరు. వాటిని ఆరు పడై వీడు అంటారు. ఈ ఆరు క్షేత్రాలు తమిళనాడులోనే వున్నాయి. అవి స్వామిమలై, పళని, పళముదిర్చోళై, తిరుప్పురకుండ్రం, తిరుచెందూరు, తిరుత్తణి. సుబ్రహ్మణ్యస్వామికి మురుగన్‌, కార్తికేయుడు, శరవణుడు, శరవణవభుడు, షణ్ముగం, ఆర్ముగం, స్కందుడు అనే పేర్లుకూడా వున్నాయి. ప్రస్తుతం మనం తిరుత్తణి గురించి తెలుసుకుందాము.

క్షేత్ర పురాణం…

సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవతలను, మునులను బాధపెడుతున్న శూరపద్ముడనే రాక్షసుని సంహారం చేశాడు. తర్వాత ఇక్కడకొచ్చి పూర్తి ప్రశాంతత పొంది ఇక్కడ కొలువైనారని క్షేత్ర పురాణం వల్ల తెలుస్తోంది. స్వామి శాంతించి ఇక్కడ కొలువయ్యాడుగనుక ఈ క్షేత్రానికి తణిగై అనే పేరొచ్చింది. తణిగ అంటే మన్నించుట, ఓదార్చుట. స్వామి, భక్తుల పాపాలను క్షమించి కటాక్షిస్తాడు కనుక ఈ క్షేత్రానికి తనికాచలం, తిరుత్తణి అంటారు. ఇక్కడ స్వామిని తనికేశన్ అని పిలుస్తారు.

ఇక్కడ నిశ్చల మనస్కులై, అత్యంత భక్తి శ్రధ్ధలతో స్వామిని ప్రార్ధిస్తే, వారి కోరికలు క్షణాల్లో తీరుతాయని భక్తుల నమ్మకం. అందుకే ఈ కొండని క్షణికాచలం అంటారు. తమిళంలో తనికాచలం అంటారు. స్వామిని ఈ క్షేత్రములో వీరమూర్తి, జ్ఞాన మూర్తి, ఆచార్య మూర్తిగా కొలుస్తారు. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని ఆరాధిస్తే మనశ్శాంతి, సుఖం కలుగుతాయని ప్రసిధ్ధి. స్వామి చాలా శక్తి కలవాడని, ఒకసారి స్వామిని దర్శించిన భక్తులకు ఇంక ఎలాంటి కష్టాలు వుండవని భక్తుల నమ్మకం.

శ్రీ వల్లీతో వివాహం…

స్వామివారు శ్రీవల్లీని ఇక్కడే వివాహం చేసుకున్నారు. శూరపద్ముడిని తిరుచెందూరులో సంహారం చేసిన అనంతరం ఇక్కడకు చేరుకున్న షణ్ముఖుడు విశ్రాంతి తీసుకుంటారు. అందుకునే అన్ని సుబ్రహ్మణ్య ఆలయాల్లో జరిపే స్కంద షష్టిని ఇక్కడ నిర్వహించరు. దీనికి బదులుగా యుద్ధఉత్సవం జరుగుతుంది. ఆ రోజున వేయి కిలోగ్రాముల పుష్పాలతో అభిషేకం కన్నులపండువగా నిర్వహిస్తారు. స్వామివారి వాహనం మయూరం ఇక్కడ కనిపించదు. దీని స్థానంలో ఏనుగు వుంటుంది. దీనికి సంబంధించి ఒక పురాణగాథ ప్రచారంలో వుంది.

స్వర్గలోకాధిపతి దేవేంద్రుడు తన కూతురు దేవసేనను సుబ్రహ్మణ్యస్వామికిచ్చి వివాహం చేసినప్పుడు అల్లుడికి కానుకగా ఐరావతాన్ని కూడా ఇచ్చాడు. ఐరావతం ఇంద్రలోకం నుంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచీ, ఇంద్రుని సంపదలు తరిగిపోసాగాయి. అది గమనించిన కుమారస్వామి ఇంద్రునికి ఐరావతాన్ని తిరిగి ఇచ్చెయ్యబోతాడు. కానీ ఇంద్రుడు అల్లుడుకిచ్చిన కానుకను తిరిగి తీసుకోవటానికి అంగీకరించక ఐరావతాన్ని ఇంద్రలోకం వైపు తిరిగి వుండేటట్లు వుంచమని మాత్రం కోరతాడు. దానితో ఇంద్రలోకం తిరిగి కళకళలాడుతుంది. దీనికి ప్రతీకగా ఇక్కడవున్న ఏనుగు తూర్పు దిక్కుకి తిరిగి వుంటుంది.

చందన విశిష్టత …

ఈ ఆలయంలో స్వామికి ఉపయోగించే చందనం ఎంతో విశిష్టమైనది. ఇంద్రుడు తన కూతురు వివాహ సమయంలో ఒక గంధం తీసే రాయినికూడా ఇస్తాడు. దీనిమీద తీసిన గంధాన్ని స్వామికి పూస్తారు. ఈ గంధం చాలా ఔషధ గుణాలు కలిగివుంటుందంటారు. ఈ గంధాన్ని నుదుటిపై ధరించకుండా నీటిలో వేసి సేవిస్తే అన్ని జబ్బులు నయమవుతాయని భక్తుల విశ్వాసం. అయితే పర్వదినాల్లో మాత్రమే ఈ చందనాన్ని పంపిణీ చేస్తారు.

ఆపత్ సహాయ వినాయగర్ …

ఇక్కడికి దగ్గరలోనే వల్లిమలై వున్నది. వల్లీదేవితో స్వామి వివాహం జరగటంలో సుబ్రహ్మణ్యస్వామి అగ్రజుడైన వినాయకుడు సహాయపడ్డాడుట. అందుకే ఇక్కడి వినాయకుణ్ణి ఆపత్ సహాయ వినాయగర్ అంటారు.

కుమార తీర్ధము …

కుమారస్వామి ఇక్కడ తన తండ్రిని పూజించాలని, తన స్ధానానికి ఈశాన్య భాగాన శివ లింగం ప్రతిష్టించి సేవించాడు. తనయుడి పితృ భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు కుమారస్వామికి జ్ఞాన శక్తి అనే ఈటెను అనుగ్రహించాడు. ఆ కారణంగా స్వామికి జ్ఞానశక్తి ధరుడు అనే పేరొచ్చింది. కుమారస్వామి స్ధాపించిన లింగానికి కుమారేశ్వరుడనే పేరొచ్చింది. కుమారస్వామి శివుణ్ణి అర్చించటానికి సృష్టించిన తీర్ధానికి కుమార తీర్ధమని, శరవణ తటాకమని పేరు పొందింది. ఇది కొండ కింద వున్నది.

365 మెట్లు …

ఆలయాన్ని చేరుకోవాలంటే భక్తులు 365 మెట్ల మార్గం కూడా ఉంది. సంవత్సరంలో 365 రోజులకు గుర్తుగా ఈ వీటిని ఏర్పాటుచేయడం విశేషం. నూతన సంవత్సరాదికి మెట్లోత్సవం నిర్వహిస్తారు. దీనినే పడిపూజ అంటారు.

భైరవస్వామి …

ఆలయంలో భైరవుడు నాలుగు శునకాలతో కలిసివుంటాడు. నాలుగు శునకాలు నాలుగు వేదాల పరిరక్షణకు అని తెలుస్తోంది. భైరవుడి ముందు పీఠం ముందు మూడు శునకాలు దర్శనమిస్తాయి. పీఠం వెనుక భాగంలో మరో శునకం వుంటుంది. చదువులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలనుకునేవారు ఇక్కడ ప్రార్థన చేస్తే మంచి ఫలితాలు వుంటాయి.

వల్లీ, మురుగన్‌ల సందేశం …

సుబ్రహ్మణ్వేశ్వరస్వామి, వల్లీల వివాహం మానవాళికి ఒక సందేశానిచ్చింది. వల్లీదేవిని స్వామివారు వేటగాడి రూపంలో పెళ్లిచేసుకుంటారు. జననం, మరణం అనే వలయంనుంచి తప్పించుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆ పరంధాముడిని ఆర్తితో ప్రార్థించాలి. ఈ ప్రపంచం ఒక బాడుగ ఇల్లు లాంటిదని ఎవరూ తెలుసుకోలేరు. అంతా తమదే, శాశ్వతమనే భావనతో స్వార్థంగా ప్రవరిస్తుంటారు. అయితే ఇవన్నీ అశాశ్వతమని తెలుసుకొని ఆ భగవంతుని కృపకు పాత్రులు కావాలని సుబ్రహ్మణ్వేశ్వర, వల్లీదేవిలు మానవాళికి సందేశమిచ్చారు.

పురాణ కథలు …

త్రేతా యుగంలో శ్రీ రామచంద్రుడు రావణ సంహారానంతరం రామేశ్వరంలో ఈశ్వరుడిని ఆరాధించాడు. ఈశ్వరుని సూచన ప్రకారం ఇక్కడికి వచ్చి, ఈ స్వామిని సేవించి మనశ్శాంతిని పొందాడు.

ద్వాపర యుగంలో అర్జనుడు దక్షిణ దేశ యాత్ర చేస్తూ, ఈ స్వామిని సేవించాడు.

తారకాసురుడితో యుధ్ధం సమయంలో తారకాసురుడు సుదర్శన చక్రాన్ని సుబ్రహ్మణ్యస్వామి మీదకి విసురుతాడు. ఆ చక్రం స్వామి ఛాతీ భాగానికి తగిలి కొద్దిగా నొక్కుకు పోయినట్లు అవుతుంది. ఇక్కడ స్వామి విగ్రహంలో ఛాతీ దగ్గర కొంచెం అణిగినట్లు కనబడుతుంది. తర్వాత తారకాసురుడి దగ్గరనుంచి గెలుచుకున్న శంఖ చక్రాలను శ్రీ మహావిష్ణువుకి ఇస్తాడు స్కందుడు.

బ్రహ్మ గారు ప్రణవార్ధం వివరించలేక ఆయన చేతిలో బందీ అయి, సృష్టి చేసే సామర్ధ్యం కోల్పోతాడు. ఇక్కడ బ్రహ్మ తీర్ధంలో ఈ స్వామిని సేవించి బంధ విముక్తుడవుతాడు.

దేవేంద్రుడు ఇక్కడ ఇంద్ర తీర్ధములో కరున్ కువలై అనే అరుదైన పూలమొక్కను నాటాడు. ప్రతి రోజూ ఆ మొక్క ఇచ్చే మూడు పూవులతో ఈ స్వామిని పూజించి తారకాసురుడు మొదలైన రాక్షసులవల్ల పోగొట్టుకున్న ఇంద్రలోక ఐశ్వర్యాలను తిరిగి పొందగలిగాడు.

నాగరాజు వాసుకి సముద్ర మధనంలో తనకైన గాయాలనుంచీ ఈ స్వామిని సేవించటంవల్ల ఉపశమనం పొంది ఆరోగ్యవంతుడయ్యాడు. అగస్త్యుడు ఈ స్వామిని ప్రార్ధించి తమిళ భాషా పాండిత్యం వరంగా పొందాడు.

స్వామి మహిమలు …

అరుణగిరినాథర్‌ అనే మహాభక్తుడు ఇక్కడే స్వామివారిని కొలుస్తూ పరమపదించాడు. కర్ణాటక సంగీతత్రయంలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితులు ఒకసారి ఇక్కడకు వచ్చారు. మెట్లు ఎక్కుతుండగా ఒక వృద్ధుడు వచ్చి స్వామివారి ప్రసాదాన్ని దీక్షతులకు ఇచ్చారు. ఆ ప్రసాదాన్ని నోటిలో వేసుకొనగానే ముత్తుస్వామి నోరు పవిత్రమైంది. ఆశుధారగా గానం చేశారు. అమృతప్రాయమైన ఆ ప్రసాదాన్ని సాక్షాత్తు కార్తికేయుడే వృద్ధుని రూపంలో వచ్చి ముత్తుస్వామికి ఇవ్వడం భగవద్‌ లీలావినోదం.

ఆలయ విశేషాలు …

ఈ ఆలయం 1600 సంవత్సరాలకన్నా పురాతనమైనదంటారు. క్రీ.శ. 875-893లో అపరాజిత వర్మ అనే రాజు శాసనంలోను, క్రీ.శ. 907-953లో మొదటి పరాంతక చోళుడి శాసనంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావించబడింది.

ఇక్కడ వున్న ఉత్సవ విగ్రహాలపైన వుండే విమానము (స్వామి గర్భగుడి పక్కనే పెద్ద పూజా మందిరంలా వుంటుంది) రుద్రాక్షలతో చేసింది. స్వామి ధరించిన ఆకుపచ్చరంగు షట్కోణ పతకం దేదీప్యమాన కాంతులలో స్వామి మెరిసిపోతుంటాడు. ఇక్కడ స్వామిని బంగారు బిల్వ పత్రాలమాలతో అలంకరిస్తారు.

పండుగలు …

ప్రతి నెలా కృత్తికా నక్షత్రం రోజున జరిగే ఉత్సవాలేకాక, తమిళ మాసం ఆడిలో (జులై – ఆగస్టు) 3 రోజులు బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంలో దాదాపు 2 లక్షలమంది పూలతో అలంకరించిన కావిళ్ళు తీసుకొచ్చి స్వామికి సమర్పిస్తారు. ఈ దృశ్యం చూడటానికి చాలా మనోహరంగా వుంటుంది.

ప్రతి ఏడాదీ డిసెంబరు 31వ తారీకు అర్ధరాత్రి 12 గం. లకు లక్షలాది భక్తులు నూతన సంవత్సరంలో స్వామిని సేవించి, స్వామి ఆశీస్సులు పొందటానికి వస్తారు. బ్రిటిష్ పరిపాలన సమయంలో వల్లిమలై స్వామివారి చేత ఈ ఆచారం ప్రారంభించబడింది. నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా అధికారులకు శుభాకాంక్షలు చెప్పే ముందు మనకి సర్వం ప్రసాదించే తనికేశుణ్ణి ప్రార్ధించి, సేవించి తర్వాత అధికారులను కలిసే పధ్ధతి అప్పుడు ప్రారంభమయి, ఇప్పటికీ సాగుతోంది. ఈనాటికీ లక్షలమంది భక్తులు నూతన సంవత్సరం సందర్భంగా స్వామిని సేవించి పాటలు పాడతారు. స్వామి ఆలయానికి చేరే ప్రతి మెట్టుమీదా కర్పూరం వెలిగిస్తారు.

ఎక్కడ ఉన్నది?

రోడ్ మరియు రైలు ద్వారా:
* చెన్నై-తిరుపతి మార్గంలో ఈ క్షేత్రం వుంది.
* తిరుపతి నుంచి 66 కి.మీ.దూరంలో వుంది.
* తిరుపతి నుంచి రైలు, బస్సు లేదా ఇతర వాహనాల ద్వారా తిరుత్తణి చేరుకోవచ్చు
* మెట్ల మార్గం ద్వారా లేదా రోడ్డు మార్గం ద్వారా స్వామి సన్నిధిని చేరి స్వామిని దర్శించుకోవచ్చు.

       ****** శ్రీ స్వామివారిని దర్శించి తరించ గోరుచున్నాము. ******

మరిన్ని వివరాలకై ఇచ్చట చూడండి: తిరుత్తణి – శ్రీ సుబ్రహ్మణ్య దేవాలయం


మరిన్ని వివరాలకై ఇచ్చట చూడండి: ఈటీవి తీర్ధయాత్ర – శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం – తిరుత్తణి:

ఉమామహేశ్వర కుమార (UmaMaheswara Kumara)


ఉమామహేశ్వర కుమార పుణ్యం పాహి పాహి సుబ్రహ్మణ్య౦
భక్తజనప్రియ పంకజలోచన పాహి పాహి సుబ్రహ్మణ్య౦
పతిత పావన పార్వతినందన పాహి పాహి సుబ్రహ్మణ్య౦
సుబ్రహ్మణ్య౦ మాం పాహి స్వామినాథ మాం పాహి
శరవణభవ శుభ మాం పాహి షణ్ముఖనాథ మాం పాహి
సుబ్రహ్మణ్య౦ సుబ్రహ్మణ్య౦ సుబ్రహ్మణ్య౦ సుబ్రహ్మణ్య౦
శివశివ శివశివ సుబ్రహ్మణ్య౦ హరహర హరహర సుబ్రహ్మణ్య౦
సత్యసనాతన సుందరశ్యామా నిత్యానందా ఘనేశ్వర శ్యామా
లక్ష్మీసేవిత పదయుగ శ్యామా సురమునివరగణ అర్చిత శ్యామా

umāmahēśvara kumāra puṇyaṁ pāhi pāhi subrahmaṇyam
bhaktajanapriya paṅkajalōchana pāhi pāhi subrahmaṇyam
patita pāvana pārvatinandana pāhi pāhi subrahmaṇyam
subrahmaṇyam māṁ pāhi svāminātha māṁ pāhi
śaravaṇabhava śubha māṁ pāhi ṣaṇmukhanātha māṁ pāhi
subrahmaṇyam subrahmaṇyam subrahmaṇyam subrahmaṇyam
śivaśiva śivaśiva subrahmaṇyam harahara harahara subrahmaṇyam
satyasanātana sundaraśyāmā nityānandā ghanēśvara śyāmā
lakṣmīsēvita padayuga śyāmā suramunivaragaṇa archita śyāmā

        ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
        ****** Sarvaṁ śrīvallīdēvasēnāsamēta śrīsubrahmaṇyēśvarārpaṇamastu ******