శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని శౌర్యానికి ప్రతీకే “శూర సంహారం”
“ఖాండ షష్ఠి” పర్వదినంలో భాగమైన “శూర సంహారం” అనే వేడుకను చూడడం కోసం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
శూరసంహారమనే వేడుక వెనుక ఒక ఆసక్తికరమైన కథనం ఉంది. పూర్వకాలంలో విక్రమమహేంద్రపురి అనే నగరాన్ని శూరపద్ముడనే రాక్షసుడు పరిపాలించేవాడట. సజ్జనులను, బ్రాహ్మణులను అనేక కష్టాలకు గురిచేసే ఆ అసురరాజును సంహరించేందుకు సాక్షాత్తూ ఆ కార్తికేయుడే సిద్ధమయ్యాడు. తన వేలాయుధంతో భీకర పోరుకి సన్నద్ధమయ్యాడు. ఆ పోరాటంలో ఆఖరికి శివపుత్రుడినే విజయం వరించింది.
ఇక ప్రాణాలు పోతాయన్న ఆ సందర్భంలో శూరపద్ముడు సుబ్రహ్మణ్యుడి పాదాల చెంత వాలిపోతూ, తన జన్మ చరితార్థమయ్యేలా చూడమని కోరాడట. అప్పుడు నెమలిగా మారి తన వాహనంగా ఎల్లకాలం సేవలందించమని చెబుతాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఆ విధంగా ఓ రాక్షసరాజు సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్యేశ్వరునికి వాహనంగా మారిన రోజునే శూర సంహారంగా ఇప్పటికీ జరుపుకుంటున్నారు ప్రజలు.
దేవసేనానిగా వ్యవహరించి రాక్షసుడు శూరపద్ముడిని సంహరించాడు. ఈ సంహారం కోసం ఆయన పలు రణశిబిరాలను ఏర్పాటుచేశాడు. ఈ శిబిరాల్లో ముఖ్యమైనవి ఆరు. వాటిని ఆరు పడై వీడు అంటారు. ఈ ఆరు క్షేత్రాలు తమిళనాడులోనే వున్నాయి. అవి స్వామిమలై, పళని, పళముదిర్చోళై, తిరుప్పరన్ కుండ్రం, తిరుచెందూరు, తిరుత్తణి.
“ఖాండ షష్టి” పండగలో భాగమైన ఈ వేడుకను మధురైతో పాటు పళని, తిరుప్పరన్ కుండ్రం, తిరుచెందూరు ప్రాంతాల్లోని సుబ్రహ్మణ్య దేవాలయాల్లో చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. తిరుప్పరన్‌కుండ్రంలో బంగారు నెమలి మీద ఆసీనుడైన సుబ్రహ్మణ్యస్వామిను వూరేగిస్తూ చేసే శూర సంహార వేడుక కన్నులపండువగా సాగుతుంది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, దీపారాధనలు చేస్తారు. ఆరు రోజుల పాటు జరిగే ఈ పర్వదిన ముగింపు వేడుకలు తిరుచెందూరులో చాలా ఘనంగా జరుగుతాయి.
తిరుచెందూర్ – శూరసంహారం (29.10.2014) వివరాలకై, ► గుర్తు ఉన్న బొమ్మ మీద క్లిక్ చేయగలరు:
****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
Leave a Reply