సుబ్రహ్మణ్యారాదన ఫలితం

సుబ్రహ్మణ్యుని చేతిలో ఉన్నటువంటి ఆయుధము శక్త్యాయుధము అని చెప్పబడుతున్నది. అందుకే “ప్రథమో జ్ఞాన శక్త్యాత్మా” – పైగా దానికి జ్ఞాన శక్త్యాయుధమని పేరు. అంటే ఆ ఆయుధంలో రెండు విశేషములున్నాయి. జ్ఞానము, శక్తి రెండు చెప్పబడుతున్నాయి. అసలు జ్ఞానానికే పెద్ద శక్తి ఉంది. ఎంతటి శక్తి ఉంది అంటే ఎవరూ ఛేదించలేని అజ్ఞానాన్ని ఛేదించడమే జ్ఞానముయొక్క శక్తి.


అలా జ్ఞానశక్తి ఆయనయొక్క ఆయుధం. ఇది భావన చేసినప్పుడు ఆయన గురుస్వరూపంగా కనిపిస్తాడు. అసుర సంహారం చేసినటువంటి మహా ప్రతాపమూర్తి. “సేనానీనాం అహం స్కందః” అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటి మాట. సేనానులలో స్కందుడు. స్కందుడు అని సుబ్రహ్మణ్యునికి మరొక పేరు.
చెల్లాచెదురైనటువంటి దేవసేనలన్నింటినీ సమీకరించి వారందరికీ తాను బలమై, బలాన్ని ఇచ్చి నడిపించి అసుర శక్తులను సంహరించాడు.


అందుకే ఎప్పుడైనా సరే కాలంలోనూ, దేశంలోనూ ప్రపంచాన్ని బాధించే అసుర శక్తులు ఉన్నవేళ సుబ్రహ్మణ్య ఆరాధన గానీ చేసినట్లయితే వెంటనే అసుర శక్తులు తొలగి దేశానికీ, కాలానికీ, వ్యక్తికీ కూడా క్షేమం లభిస్తుంది. అలాంటి క్షేమం కావలసినటువంటి వారు సుబ్రహ్మణ్యారాదన విశేషంగా చేయాలి. దీనివల్ల బాధించె శక్తులు తొలగుతాయి. అందుకు ప్రత్యేకించి దేవతలందరూ కూడా దేవసేనాపతి ఆవిర్భావానికి తపన పడ్డారు. శివశాక్త్యాత్మకంగా ఆవిర్భవించాడు సుబ్రహ్మణ్యుడు.


ఆయన ఆవిర్భావంతో దేవతలందరికీ బలం వచ్చింది.అసలు బలమే ఆయనయొక్క స్వరూపం. అందుకే సేనాని అయ్యాడు. అందుకు లోక క్షేమంకరమైన ఉత్తమ శక్తులు చెల్లాచెదురై బలం తగ్గినప్పుడు వాటన్నింటికీ బలాన్నిచ్చి నడిపించేటటువంటి నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి. అందుకు గొప్ప నాయకుడు కూడా ఈయన. అలాంటి సేనానిగా ఎవరైతే నమస్కరిస్తారో వారికి మొత్తం దేవతా సమూహం అంతా కూడా రక్షణ చేస్తుంది.

సుబ్రహ్మణ్యస్వామి కొన్ని క్షేత్రాలలో ప్రధాన దైవంగాను, మరికొన్ని క్షేత్రాలలో ఉపాలయాలలోను దర్శనమిస్తూ ఉంటాడు. ఆ స్వామి ఎక్కడ ఎలా కొలువైనా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తూ వుంటారు. కొన్ని క్షేత్రాలలో సర్ప రూపంలోనూ, మరి కొన్ని క్షేత్రాలలో బల్లెం ధరించిన బాలుడి రూపంలో సుబ్రహ్మణ్య స్వామి పూజలు అందుకుంటూ వుంటాడు.

మంగళవారం సుబ్రహ్మణ్యస్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు కనుక, ఆ రోజున స్వామిని దర్శించుకునేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆ రోజున స్వామికి అరటిపండ్లు, పటిక బెల్లం నైవేద్యంగా సమర్పించడం వలన ఆయన ప్రీతి చెందుతాడు. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం వలన, అంకితభావంతో అర్చించడం వలన సర్పసంబంధమైన దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. సంతానం లేనివారు స్వామిని నియమ నిష్ఠలతో పూజించడం వలన, సంతాన భాగ్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు.

About the Author

Ravikanth Bandi ()

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *