వినాయకుడూ సుబ్రహ్మణ్యుడూ బ్రహ్మచారులా?

గణపతి ఉపాసన, కుమారస్వామి ఉపాసన విడివిడిగా చేసేటప్పుడు సిద్ధిబుద్ధి గణపతికి, వల్లీదేవసేనా కుమారస్వామికి ఉన్నట్లుగాను భావన చేస్తున్నాం. అమ్మవారి తనయులుగా వారిని భావించినప్పుడు శిశురూపంలోనే సాక్షాత్కరిస్తున్నారు.


గణపతి – సిద్ధిబుద్ధి, కుమారస్వామి – వల్లీదేవసేనలను భార్యాభర్తలుగా అన్వయించడానికి వీలులేదు. శక్తులకు సంకేతం. అందుకే దీనిని భ్రాంతిమాత్రదాంపత్యం అంటారు. దాంపత్యం వంటిదే తప్ప దాంపత్యం కాదు. ఇది ఉపాసనాపరమైన మర్మం.


గణపతికి సిద్ధిబుద్ధి భార్యలు, పుత్రులు క్షేముడు, లాభుడు. ఇవి సంకేతములు మాత్రమే. దేవతా విషయంలో స్త్రీలు అని చెప్పినప్పుడు శక్తులు అని అర్థం. గణపతి కార్యసిద్ధిని కలిగించే దేవత. అందుకే సిద్ధివినాయకుడు అంటాం. ఏ కార్యమైనా మనకి పరిపూర్ణఫలం ఇవ్వాలంటే రెండు లక్షణాలు ఉండాలి – కార్యానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి, చిట్టచివరికి ఆ కార్యం మనకి సిద్ధింపబడాలి. అందుకే కార్యానికి కావలసిన జ్ఞానము బుద్ధి, కార్యము యొక్క ఫలము సిద్ధి. ఈ రెండింటినీ శక్తులుగా కలిగినటువంటి కార్యసాధక శక్తి ఏదైతే ఉన్నదో ఆయన గణపతి. కార్యానికి అవసరమైన సాధన బుద్ధి, కార్యం యొక్క ఫలం సిద్ధి. ఈ రెండింటినీ ఇచ్చేవాడు విఘ్నసంహారకుడైన గణపతి. ఇవి లభిస్తే మనకు లభించేది క్షేమము, లాభము. క్షేమం పరమార్థానికి సంబంధించినది, లాభం భౌతికమైన ఇహజీవితానికి సంబంధించినది. ఈ రెండూ గణపతి వల్ల మనకు లభిస్తున్నాయి కాబట్టి పుత్రస్థానాలుగా చెప్పారు. అంతేకానీ భార్యలని, పుత్రులని భౌతికంగా, లౌకికంగా, దేవతారూపంగా కూడా భావించడం తగని విషయం. అయితే ఉపాసనాపరంగా వాటి బీజములు వాటికి ఉన్నాయి గనుక మంత్రబీజం అంటూ ఉంటే దేవతాకృతి అంటూ ఉంటుంది గనుక సిద్ధీబుద్ధీయుత గణపతిని ఉపాసించడం అనే మంత్రశాస్త్రవిషయం వేరు. అది పౌరాణిక కథలకు అన్వయించడానికి లేదు.


యోగపరంగా చెప్పుకుంటే యోగియైన సాధకుడికి ఋతంభరా అయినటువంటి ప్రజ్ఞ లభిస్తుంది. సృష్టికి ఆధారమైనటువంటి సత్యాలకి కూడా ఏవి ఆధారమైనవో ఆ సత్యాలను ఋతములు అంటారు. ఆ ఋతములు తెలుసుకోగలిగే ప్రజ్ఞ ఏదైతే ఉన్నదో దానిని ఋతంభరా ప్రజ్ఞ అంటారు. యోగియైన సాధకుడికి ఋతంభరా ప్రజ్ఞ సమృద్ధిగా ఉంటుంది. ఆ ఋతంభరా ప్రజ్ఞాస్వరూపుడే గణపతి. అయితే ఈ ప్రజ్ఞాలాభం కలిగినప్పుడు బుద్ధి, సిద్ధి మనకి వశ్యం అవుతాయి. ఆ ప్రజ్ఞ కలుగకుండా అడ్డుకునేవి బుద్ధి, సిద్ధి. మన బుద్ధి రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. బుద్ధి రకరకాలుగా ఆలోచనలు చేసి మేధాపరమైన భావనలు తెచ్చేటప్పటికీ బుద్ధికి కూడా అతీతమైనటువంటి ఋతంభరా ప్రజ్ఞను చేరుకోవడానికి బుద్ధియే ఆవరోధం అవుతోంది.


యోగంలో అణిమ, మహిమ మొదలైన రకరకాల సిద్ధులు వస్తూ ఉంటాయి. ఆ సిద్ధులు వచ్చినప్పుడు లోభపడిపోయి పడిపోతాం. ఋతంభరా ప్రజ్ఞకు వెళ్ళడానికి బుద్ధి, సిద్ధి కూడా అవరోధాలు అవుతూ ఉంటాయి. ఋతంభరా ప్రజ్ఞా స్వరూపుడైన గణపతిని ఆరాధన చేసినప్పుడు ఆయన బుద్ధి సిద్ధులను తన కంట్రోల్ లోకి తెచ్చుకుంటాడు. బుద్ధి సిద్ధులు వశమై ఉంటాయి ఋతంభరా ప్రజ్ఞ కలిగిన వారికి. అందుకు బుద్ధిసిద్ధులు పత్నులుగా చెప్పబడుతున్నారు. వాటిని వశం చేసుకున్నవాడే సర్వ విఘ్నములనూ తొలగించుకున్నావాడై పరమార్థాన్ని పొందగలడు. అందుకే విఘ్నసంహారకుడు అని పేరు.


కుమారస్వామి, వల్లీ దేవసేన అని చెప్పినప్పుడు వల్లి అనగా లత అని అర్థం. కుండలినీ శక్తియే ఈ లత(వల్లి) అని చెప్పబడుతున్నది. విశ్వంలో ఉన్న ప్రకృతి శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ దేవసేనలు. దివ్యశక్తులన్నింటినీ సమీకరించి నడిపించే ఈశ్వర చైతన్యమే దేవసేనాపతియైన సుబ్రహ్మణ్యుడు.


గణపతిని, కుమారస్వామిని నైష్టిక బ్రహ్మచారులు అంటారు. అందుకే గణపతి ఆరాధనలోను, సుబ్రహ్మణ్య ఆరాధనలోను బ్రహ్మచారి (వటువు) పూజ ప్రత్యేకించి చెప్పారు. ఈ వటుపూజయే తెలియజేస్తుంటుంది వాళ్ళు నిత్యబ్రహ్మచారులు అని.


       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

About the Author

Ravikanth Bandi ()

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *