ముత్తుస్వామి దీక్షితార్

సంగీత త్రిమూర్తులు…

త్యాగరాజు కాలం (1767 – 1847) లోనే సంగీతంలో అనేకమంది ప్రజ్ఞావంతులు ప్రపంచం నలుమూలలా జన్మించారు. తంజావూరు రాజ్యంలో 1700 – 1850 కాలంలోనూ, దక్షిణాదిన కొన్ని రాజ్యాల్లోనూ కర్ణాటక సంగీతం వెల్లి విరిసింది. కర్ణాటక సంగీతానికొక రూపూ, పద్ధతీ వచ్చిందీ ఆ కాలంలోనే. త్యాగరాజు జన్మించిన కాలంలోనే తిరువారూర్లో మరో ఇద్దరు సంగీత దిగ్గజాలు పుట్టారు. ఒకరు శ్యామ శాస్త్రి, రెండో వారు ముత్తుస్వామి దీక్షితార్. త్యాగరాజుతో కలిపి ఈ ముగ్గుర్నీ ‘సంగీత త్రిమూర్తులు’ (మ్యూజికల్ ట్రినిటీ) అని అంటారు. శ్యామశాస్త్రి 1762 లో పుడితే, 1776 లో ముత్తుస్వామి దీక్షితార్ పుట్టారు. ఇందులో చిత్రం ఏమిటంటే ఈ ముగ్గురు వాగ్గేయకారులూ తిరువారూర్లోనే పుట్టారు. దాదాపు ఒకే సమయంలోనే జీవించారు.

ముత్తుస్వామి దీక్షితార్…

కర్ణాటక సంగీతంలో దీక్షితార్ కుటుంబానికొక ప్రత్యేక స్థానం వుంది. సంగీత త్రిమూర్తుల్లో ఒకరుగా చెప్పుకుంటున్న ముత్తుస్వామి దీక్షితార్ తండ్రి రామస్వామి దీక్షితార్ ప్రముఖ సంగీత విద్వాంసుడు. ఈయన ‘అష్టోత్తర శత రాగ రత్నమాలిక’ అనే అతి పెద్ద కృతిని స్వరకల్పన చేసారు. ఇది రాగయుక్తంగా ఆలాపనలతో పాడడానికి ఓ రోజు పైగా పడుతుందని అంటారు. అటువంటి సంగీత విద్వాంసుడింట 1776 లో జన్మించారు ముత్తుస్వామి దీక్షితార్. హైదరాలీ అకృత్యాలతో తంజావూరు చుట్టుపక్కల వూళ్ళన్నీ ధ్వంసమయిపోతే, రామస్వామి దీక్షితార్ స్వస్థలమైన విరించిపురం వదిలి తిరువదమర్దూరు మకాం మార్చారు. అక్కడ నుండి తిరువారూర్ వచ్చి స్థిరపడ్డారు.

ఓసారి మనాలి ముత్తుకృష్ణ ముదలియార్ అనే ఒక యతీంద్రుడు వచ్చినపుడు ఆయన కోరికపై ముత్తుస్వామి దీక్షితార్ని పదిహేడేళ్ళ వయసులో మిగతా కొడుకులిద్దరితోనూ తండ్రి కాశీ పంపించాడు. సుమారు పదేళ్ళు దీక్షితార్ అక్కడే గడిపారు. అప్పటికే ముత్తుస్వామి దీక్షితార్ పెళ్ళయ్యింది. అన్నలిద్దరూ, చిన్న స్వామి దీక్షితార్, బాలస్వామి దీక్షితార్ ఏడాదిలో తిరువారూరు వెనక్కి తిరిగొచ్చేసినా ముత్తుస్వామి దీక్షితార్ మాత్రం కాశీ లోనే ఉండిపోయాడు. కేవలం గాయకుడు మాత్రమే కాదు, ముత్తుస్వామి దీక్షితార్ మంచి వైణికుడు కూడా.

సుమారు 1801 ప్రాంతంలో తిరిగి తిరువారూరొచ్చారు. అప్పటికే బాలుస్వామి, చిన్నస్వామిలిద్దరూ జంట విద్వాంసులుగా ప్రసిద్ధి చెందారు. వీరికి మదురై ఆస్థానం నుండి పిలుపు రావడంతో అక్కడకి వెళిపోయారు. అక్కడుండగానే చిన్నస్వామి దీక్షితార్ చనిపోయాడు. అన్నగారి మరణంతో కలత చెందిన బాలుస్వామి కొంతకాలం తీర్థయాత్రలు చేసి ఎత్తియపురం రాజాస్థానంలో చేరాడు. అప్పటివరకూ అవివాహితుడుగానున్న బాలస్వామికి ఎత్తియపురం రాజుగారు దగ్గరుండి పెళ్ళి జేసారు. ఈ వార్త ముత్తుస్వామి దీక్షితార్ చెవినపడి అన్నగార్ని చూడ్డానికని వెళ్ళాడు. అన్నగార్ని కలిసాక ఎత్తియపురం ఆస్థానంలో సంగీత కచేరీ చేసే అవకాశం ముత్తుస్వామి దీక్షితారుకొచ్చింది.

ముత్తుస్వామి దీక్షితార్ తమిళ, సంస్కృత భాషల్లో ప్రవీణుడు. ఈయన స్వరపరిచిన కృతులన్నీ సంస్కృతంలోనే ఉంటాయి. ఒక్క రచనా తెలుగులో లేదు. ముత్తుస్వామి దీక్షితార్ సముదాయ కృతులెక్కువగా రచించాడు. సముదాయ కృతులంటే ఒక స్థలాన్ని కానీ, ఒక ప్రదేశాన్ని కానీ, ఒక దైవాన్ని కానీ వుద్దేశించి రచించినవి. ఇవి గుంపుగా 5 లేదా 6 కృతులు కలిపుంటాయి. నవగ్రహ కీర్తనలు, నవరత్న కీర్తనలూ, పంచలింగ స్థల కృతులూ వీటిలో కొన్ని చెప్పుకోదగ్గవి.

ముత్తుస్వామి దీక్షితార్ కృతి ముద్ర – ‘గురు గుహ’. సాధారణంగా కృతుల ఆఖరి చరణంలో వాగ్గేయకారుల ముద్ర కనిపిస్తుంది. కానీ ముత్తుస్వామి దీక్షితార్ కృతుల్లో మాత్రం ఈ ముద్ర పల్లవిలో కానీ, అనుపల్లవిలో కానీ, చరణంలో కానీ వుంటుంది. ముత్తుస్వామి దీక్షితార్ కొన్ని కృతుల్లో ‘త్యాగరాజ’ అన్నది కనిపిస్తుంది. ఇది చూసి వాగ్గేయకారుడు త్యాగరాజు పై గౌరవంతో రాసిందిగా కొందరు అపోహపడే అవకాశముంది. ఇక్కడ త్యాగరాజు అంటే తిరువారూర్ గ్రామ దైవం ‘త్యాగరాజ స్వామి’ నుద్దేశించని అనుకోవాలి.

ముత్తుస్వామి దీక్షితార్ పై పశ్చిమదేశ సంగీత ప్రభావం కూడా వుంది. దీక్షితార్ అన్నయ్య బాలుస్వామి కచేరీల్లో పక్క వాయిద్యంగా వయులిన్ వాడకాన్ని ప్రవేశపెట్టాడు.తిరుక్కడైయూర్ భారతి, తేవూర్ సుబ్రహ్మణ్యయ్యర్, శుద్ధ మద్దాళం తంబియప్ప, వీణ వెంకట్రామయ్యర్, కోర్నాడ్ రామస్వామి, తిరువారూర్ అయ్యస్వామి, తంజావూరు చతుష్టయం పొన్నయ్య, చిన్నయ్య, శివనందం, వడివేలు, తిరువారూర్ కమలం, వళ్ళలార్ కోయిల్ అమ్మణి ఈయనకున్న శిష్యగణం. 1935 లో యత్తియపురం రాజ బంధువుల వివాహానికెళ్ళి అక్కడే దీక్షితార్ చనిపోయారు. ఎ.ఎం.చిన్నస్వామి ముదిలియార్ ‘ఓరియంటల్ మ్యూజిక్’ అనే పుస్తకంలో ఇలా రాస్తారు. “త్యాగరాజ కృతులు చెవిన పడగానే ఎంతో ఆహ్లాదంగా వుంటుంది. ముత్తుస్వామి దీక్షితార్ కృతులలాకాదు. ఒకటికి పదిమార్లు విని, శోధిస్తే కానీ ఆ కృతుల్లో గొప్పదనం తెలీదు”.

సర్వదేవతలనూ కీర్తించి సర్వక్షేత్రములలోనున్న దేవతలను తన సంగీతంతో పరవశింపజేసి అనుగ్రహాన్ని పొందిన మహానుభావులు దీక్షితుల వారు. సంగీత మూర్తిత్రయంలో ఒకరు ఆయన. మహోపాసకులు. పైగా దక్షణామూర్తి విద్యయైనటువంటి శ్రీవిద్యలో ఉద్దండుడు. పరదేవతయైనటువంటి ఆ తల్లి ఆయనకు వీణను ప్రదానం చేసింది. వీణ అంటే దక్షిణామూర్తి స్వరూపమే. అంతేకాక వారిద్దరి బిడ్డ, బ్రహ్మవిద్యా స్వరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారినోట్లో కలకండ పెట్టాడు. వెంటనే “స్వామినాథ పరిపాలయా సుమాం శ్రీ గురుగుహతారయాసుమాం” అంటూ గురుగుహ ముద్రతో ఎన్నో కీర్తనలు అందించాడు మహానుభావుడు.

ఆయన నుతించని దేవత లేదు. ప్రతి కీర్తన మనం పలికేటప్పుడు, వినేటప్పుడు అందులోని దేవత కనిపిస్తాడు. అంత దివ్యంగా అందించిన ఆయన దక్షణామూర్తిమీద చాలా కీర్తనలు రచించారు. ఆయనా పెద్ద ఉపాసకుడు, తత్త్వవేత్త. పైగా శంకరాచార్యులపై కూడా ఒక సంకీర్తన రచించారు ఆయన. అంటే శంకరాద్వైత సిద్ధాంతాన్ని తన హృదయంలో నింపుకున్న వాడాయన.

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనము నుంచి…

ముత్తుస్వామి దీక్షితార్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి మీద ఎన్నో కీర్తనలు రాసారు. అందులో కొన్ని ఇక్కడ అందజేస్తున్నాము.

1 . స్వామినాథ పరిపాలయ:

2 . పురహర నందన:

3 . వల్లీ దేవసేనాపతే:

4. ముత్తుస్వామి దీక్షితార్ మరో కీర్తన:

మరిన్ని వివరాలకై ఇచ్చట చుడండి: ముత్తుస్వామి దీక్షితార్ కీర్తనలు ۞♫

మరిన్ని వివరాలకై ఇచ్చట చుడండి: ముత్తుస్వామి దీక్షితార్ వికీపీడియా

****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

ముత్తుస్వామి దీక్షితార్ గారి చిత్రం…

ముత్తుస్వామి తపాలా బిళ్ళ…

About the Author

Ravikanth Bandi ()

One Reply to “ముత్తుస్వామి దీక్షితార్”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *