మనకు తెలియని మన త్యాగరాజ స్వామి
“నీవంటి దైవము షడానన! నేనెందుకు కాననురా! మారకోటులందు గల శృంగారము, ఇందుముఖా! నీ కొనగోటను బోలునే!” అని సుబ్రహ్మణ్యుని కీర్తించారు నాదబ్రహ్మ త్యాగరాజ స్వామి.
బాల్యం, విద్యాభ్యాసం…
త్యాగరాజు గారు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కంభం మండలంలో కాకర్ల అను గ్రామంలో తెలుగు వైదిక బ్రాహ్మణ కుటుంబంలో 1767లో జన్మించారు. త్యాగరాజు కాకర్ల రామబ్రహ్మం, కాకర్ల సీతమ్మ దంపతుల మూడవ సంతానం. ఇతని జన్మనామం కాకర్ల త్యాగ బ్రహ్మం. వీరు మురిగినాడు తెలుగు బ్రాహ్మణులు. త్రిలింగ వైదీకులు. ఇతడి పూర్వీకులు ప్రస్తుత ప్రకాశం జిల్లా కంభం మండలంలో కాకర్ల అను గ్రామం నుండి తమిళ దేశానికి వలస వెళ్లారు. తండ్రి రామబ్రహ్మం తంజావూరు ప్రభువు శరభోజీ ఆధ్వర్యంలో ఉండేవారు. త్యాగరాజు గారి తాతగారు గిరిరాజ కవిగారు. వీరి గురించి త్యాగయ్య తన బంగాళరాగ కృతిలో “గిరిరాజసుతా తనయ” అని తన తాతగార్ని స్తుతించియున్నారు. త్యాగయ్య గారి విద్య కొరకు రామబ్రహ్మము తిరువారూర్ నుంచి తిరువయ్యూర్ కు వెళ్లారు. త్యాగయ్య గారు అచట సంస్కృతమును, వేదవేదాంగములను అమూలాగ్రము పఠించెను. సంగీతాభ్యాసము కొరకు త్యాగయ్య గారు శొంఠి వేంకటరమణయ్య గారి దగ్గర విడువబడెను. వేంకటరమణయ్య గారు త్యాగయ్య గారి చాకచక్యమును, సంగీతమునందుగల ప్రావీణ్యతను గమనించి వారియందు అతి శ్రద్ధతో సంగీతోపదేశము చేయసాగిరి.
జీవిత విశేషాలు…
త్యాగయ్య గారి తండ్రి గారు పిన్న వయస్సులోనే గతించిరి. కనుక అన్నదమ్ముల మధ్య అయిన భాగపరిష్కారములలో త్యాగయ్య గారి భాగములో కులప్రతిమలైన శ్రీరామ లక్ష్మణులు విగ్రహములు వచ్చెను. ఆ ప్రతిమను అతి భక్తితో పూజించుచుండిరి. త్యాగయ్య గారు ఉంఛవృత్తి నవలంబించి సర్వసామాన్యముగా జీవనం చేయుచుండిరి. తక్కిన సమయమంతయు తన యిష్టదైవమైన “శ్రీరాములు” పై కృతులు రచించుటలో పాల్గొనుచుండిరి. త్యాగయ్య గారు 96 కోట్ల శ్రీరామ నామములు జపించి వారి దర్శనము పొంది వారి ఆశీర్వాదము పొందిరి. త్యాగయ్య గారు మంచి శారీరము కలిగియుండిరి. త్యాగయ్య గారు వైణికులు కూడా. 18 సంవత్సరాల వయసులో త్యాగరాజుకు పార్వతి అనే యువతితో వివాహమైంది. కానీ ఆయన 23 వయస్సులో ఉండగా ఆమె మరణించడం జరిగింది. తరువాత ఆయన పార్వతి సోదరియైన కమలాంబను వివాహమాడాడు. వీరికి సీతామహాలక్ష్మి అనే కూతురు కలిగింది. ఈమె ద్వారా త్యాగరాజుకు ఒక మనుమడు కలిగాడు కానీ యవ్వనంలోకి అడుగుపెట్టక మునుపే మరణించాడు. కాబట్టి త్యాగరాజుకు కచ్చితమైన వారసులెవరూ లేరు కానీ ఆయన ఏర్పరచిన సాంప్రదాయం మాత్రం ఈనాటికీ కొనసాగుతూనే ఉంది.
సంగీత ప్రతిభ…
త్యాగరాజు గారు తన సంగీత శిక్షణను శొంఠి వెంకటరమణయ్య గారి దగ్గర, చాలా చిన్న వయసులోనే ప్రారంభించారు. పదమూడేండ్ల చిరు ప్రాయమునాడే త్యాగరాజు గారు నమో నమో రాఘవా అనే కీర్తనను దేశికతోడి రాగంలో స్వరపరచారు. గురువు శొంఠి వేంకటరమణయ్య ఇంటిలో చేసిన కచేరీలో ఎందరో మహానుభావులు అనే కీర్తనను స్వరపరచి పాడారు. ఇది పంచరత్న కృతులలో ఐదవది. ఈ పాటకు వెంకటరమణయ్య గారు చాలా సంతోషించి, త్యాగరాజులోని బాలమేధావి గురించి తంజావూరు రాజుగారికి చెప్పగా, రాజు సంతోషించి అనేక ధన కనక వస్తు వాహనాది రాజలాంఛనాలతో త్యాగరాజు గారిని సభకు ఆహ్వానించారు. కానీ త్యాగరాజు గారు తనకు నిధి కన్నా రామ సన్నిధి మాత్రమే సుఖమని ఆ కానుకలను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఈ సందర్భంగా స్వరపరచి పాడినదే నిధి చాల సుఖమా అనే కీర్తన. సంగీతాన్ని భగవంతుని ప్రేమను పొందే మార్గముగా త్యాగరాజు గారు భావించారు. సంగీతంలోని రాగ, తాళములను వాటిపై తన ప్రావీణ్యాన్ని చూపించుకోవడానికి కాక, భగవంతుని నామాలను చెప్పడానికి, భగవంతుని లీలలను పొగడటానికి ఓ సాధనముగా మాత్రమే చూసారు.
తంజావూరు రాజు పంపిన కానుకలను తిరస్కరించినపుడు ఆగ్రహించిన అతని అన్నయ్య జపేశుడు, త్యాగరాజు గారు నిత్యం పూజించుకునే శ్రీరామ పట్టాభిషేక విగ్రహాలను కావేరీ నదిలో విసిరివేసాడు. శ్రీరామ వియోగ బాధను తట్టుకోలేక, రాముడు లేని ఊరిలో ఉండలేక దక్షిణ భారతదేశ యాత్రలకు వెళ్ళి అనేకానేక దేవాలయములను, తీర్థములను దర్శించి, ఎన్నో అద్భుత కీర్తనలను త్యాగయ్య రచించారు. చివరగా శ్రీరాముని అనుగ్రహంతో విగ్రహాలను పొందాడు. వైకుంఠ ఏకాదశి నాడు త్యాగరాజు గారు శ్రీరామ సన్నిధిని చేరుకున్నారు.
త్యాగరాజు గారి జీవితంలో జరిగినట్లుగా కొన్ని విశేషాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. దేవముని అయిన నారదుడే స్వయంగా ఇతనికి సంగీతంలోని రహస్యాలను చెప్పి, “స్వరార్నవ”మనే ఓ అద్భుతమైన పుస్తకం ఇచ్చాడనీ, ఆ సంధర్భంలో త్యాగరాజు గారు చెప్పిన కృతిగా పంచరత్న కృతులలో మూడవదైన “సాధించెనే” అనీ చెపుతారు. ఈ పుస్తకము వల్ల త్యాగయ్యగారు సంగీతములో అత్యుత్కృష్టమైన విషయములను తెలిసికొనినట్లు తెలియుచున్నది. శంకరాభరణము లోని “స్వరరాగ సుధారసము” అను కృతిలో ఈ గ్రంథము గురించి త్యాగయ్య గారు పేర్కొనియున్నారు. త్యాగయ్యవారు 24000 రచనల వరకు రచించిరి. “దివ్యనామ సంకీర్తనలు”, “ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు” అను బృంద కీర్తనలు కూడా రచించెను. “ప్రహ్లాద భక్తి విజయము”, నౌకా చరిత్రము అను సంగీత నాటకములు కూడా రచించిరి.
త్యాగరాజు గారి జీవితంలో కొన్ని సంఘటనలు…
1. త్యాగరాజు గారు తన రామచంద్రుని పూజా విగ్రహాలు పోగొట్టుకున్నప్పుడు పాడిన పాట: ఎందు దాగినావో.
2. త్యాగరాజు గారు తిరుపతి వేంకటేశ్వరుని దర్శనం కోసం వెళ్ళినప్పుడు అక్కడ తెరవేసి ఉంటే, తెరతీయగరాదా అనే పాట పాడితే తెరలు వేంకటేశ్వరుని దయచేత అవే తొలగిపోయినాయి. ఆ తరువాత ఆయన వేంకటేశ నిను సేవింప అనే పాట పాడినారు.
3. త్యాగయ్య గారు పరమపదము చేరటానికి ముందు పాడిన పాటలు: గిరిపై, పరితాపము.
త్యాగరాజ ఆరాధనోత్సవాలు…
అసంఖ్యాకమైన కీర్తనలు రచించి, కర్ణాటక సంగీతంలోని అన్ని నియమాలను సోదాహరణంగా నిరూపించి శాశ్వతమైన కీర్తి సంపాదించిన త్యాగరాజు గారిని కర్ణాటసంగీతానికి మూలస్తంభంగా చెపుతారు.ఈయన జన్మదినం రోజుని భారతీయ సంగీత దినోత్సవంగా జరుపుతాము. ఈ సంగీత నిధికి నివాళిగా ప్రతి సంవత్సరం పుష్య బహుళ పంచమి నాడు (జనవరి, ఫిబ్రవరి నెలలలో) తిరువారూర్లో ఆయన సమాధి చెందిన త్యాగరాజ మహోత్సవ సభనందు త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు.
ఆయన భక్తులు మరియు సంగీత కళాకారులు మొదట ఉంచవృతి భజన, తరువాత ఆయన నివాస స్థలమైన తిరుమంజనవీధి నుంచి బయలుదేరి ఆయన సమాధి వరకూ కీర్తనలు గానం చేస్తూ ఊరేగింపుగా వస్తారు. వందలకొద్దీ కర్ణాటక సంగీత కళాకారులు ఆయన రచించిన పంచరత్న కృతులను కావేరీ నది ఒడ్డున గల ఆయన సమాధి వద్ద బృందగానం చేస్తారు. సంగీతాభిమానులకు ఈ గానం శ్రవణానందాన్ని కలిగించడమే కాకుండా భక్తిభావాన్ని కూడా రేకెత్తిస్తుంది. ఈ ఉత్సవాన్ని ప్రపంచంలో చాలాచోట్ల నిర్వహిస్తారు కానీ తిరువారూలో నిర్వహించే ఆరాధన చాలా ప్రసిద్ధి గాంచింది. ప్రతీ సంవత్సరం పెరుగుతూ వస్తున్న కళాకారుల మరియు సందర్శకుల కోసం ఇక్కడ ఒక పెద్ద భవనం కూడా నిర్మాణదశలో ఉంది.
సమాధి…
త్యాగరాజ స్వామివారి మహాభక్తురాలు బెంగుళూరు నాగరత్నమ్మ కావేరీ నది ఒడ్డున శిథిలావస్థలోనున్న స్వామి వారి సమాధి చూసింది. ఆ స్థలాన్ని, దాని చుట్టు ఉన్న ప్రదేశాన్ని తంజావూరు రాజుల ద్వారా, రెవిన్యూ అధికారుల ద్వారా తన వశము చేసికొని పరిశుభ్రము చేయించి, గుడి, గోడలు కట్టించింది. మద్రాస్ లోని తన ఇంటిని అమ్మి రాత్రనక పగలనక వ్యయప్రయాసల కోర్చి దేవాలయ నిర్మాణాన్ని ముగించింది. 1921 అక్టోబరు 27లో పునాదిరాయిని నాటగా, 1925 జనవరి 7న గుడి కుంభాభిషేకము జరిగింది. స్థలాభావము వలన ఇంకా నేల కొని ఒక మంటపము, పాకశాల 1938లో నిర్మించింది. ఈ నిర్మాణములతో ఆమె సంపద, ఆభరణాలు హరించుకుపోయాయి. 1946లో త్యాగయ్య చిత్ర నిర్మాణసందర్భములో చిత్తూరు నాగయ్య గారు నాగరత్నమ్మను కలిశారు. ఆమె సలహాపై నాగయ్య గారు త్యాగరాజనిలయం అనే సత్రాన్ని కట్టించారు.
రచనలు…
‘రామేతి మధురం వాచం’ అన్నట్లు 96 కోట్ల సార్లు రామనామాన్ని జపించి, స్వీయానుభవ భావనలే కృతి రూపంలో మలచి గాంధర్వగాన మధురానుభూతిగా లోకానికి అందించారు. భూలోక నారదుడైన త్యాగరాజ స్వామి నారద మంత్రోపదేశం పొంది, అనుగ్రహం ప్రాభవంతో ‘స్వరార్ణ వం’ ‘నారదీయం’ అనే రెండు సంగీత రహస్యార్ధ ‘శాస్త్ర గ్రంథాలు రచించారు. పంచరత్న కృతి సందేశం : శ్రీత్యాగరాజస్వామి రచించిన కృతులను ప్రాపంచికం, తాత్వికం, కీర్తనం, నిత్యానుష్ఠానాలని వర్గీకరించవచ్చు. త్యాగరాజస్వామి కీర్తనలలో ఘనరాగ పంచరత్న కీర్తనలు ముఖ్యమైనవి. శ్రీత్యాగరాజస్వామి. రామభక్తా మృతాన్ని సేవించి, కర్ణాటక సంగీత సంప్రదాయంలో అనేక కృతులను మధుర కీర్తనలుగా మలచి సంగీత, సాహిత్య రసజ్ఞుల హృదయాల్లో చిరంజీవిగా నిలిచారు. త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో విశేషంగా పంచరత్న కీర్తనలు ఆలపించడం సంప్రదాయం.
కీర్తనలు…
శ్రీత్యాగరాజస్వామి దాదాపు 800 కీర్తనలను రచించారు. వీటిలో చాలావరకు ఆయన మాతృభాష ఐనటువంటి తెలుగులో రచించినవే. కొన్ని సంస్కృతంలో రచించబడినవి. కానీ ఈ కీర్తనలు మాత్రం ఆంధ్రదేశంలోకన్న కర్ణాటక సంగీతం బాగా ప్రాచుర్యంలో ఉన్న తమిళనాట బాగా ప్రాచుర్యం పొందాయి. సంస్కృతంలో రచించబడిన జగదానందకారక అనే కీర్తన శ్రీరామునికున్న 108 పేర్లను ప్రస్తావిస్తుంది. ‘ప్రహ్లాద భక్తి విజయం’, ‘నౌకా చరితం’ అనే నాట్యరూపకాలను కూడా రచించారు.
మరిన్ని వివరాలకై ఇచ్చట చుడండి: శ్రీ త్యాగరాజ స్వామి కీర్తనలు ۞♫
****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
శ్రీ త్యాగరాజ స్వామి చిత్రం…
Leave a Reply