బిక్కవోలు సుబ్రహ్మణ్య దేవాలయం
1100 సంవత్సలముల చరిత్ర కలిగిన బిక్కవోలు అతి ప్రాచీన శైవ క్షేత్రములలో ఒకటి, గోదావరి తీర మండలం, రాజమహేంద్రవరము, కాకినాడ కెనాల్ రోడ్డు ప్రక్కన ఉన్న బిక్కవోలు గొప్ప ఆధ్యాత్మిక చారిత్రాత్మక విశేషాలతో తూర్పు చాళుక్యల శిల్పకళా వైభవంతో నిర్మించబడిన అనేక పురాతన ఆలయాలకు ప్రసిద్ధి చెందినది.
ఈ ఆలయాన్ని చాళుక్య రాజులలో ఒకరైన విజయాదిత్య III 849 – 892 సెంచరీ AD లో నిర్మించారు. ఈ క్షేత్రం మొదట చాళుక్య విక్షముని పేరిట విక్షమపురంగాను, కాలగమనంలో బిక్కవోలుగా నామాంతరం చెందినది.
ఈ పవిత్ర దేవాలయము శ్రీ గోలింగేశ్వర స్వామి వారి ఆలయములో ఉన్నది. శ్రీ కుమార సుబ్రాహ్మణ్యస్వామి వారు దక్షిణముగా కొలువుదీరి ఉన్నారు. అలాగే, ఇక్కడ పార్వతి, విజయ గణపతి, భద్రకాళి మరియు వీరభద్ర స్వామి ఆలయాలు గమనించవచ్చు. ఆలయలములో నెమలి వాహనం స్వామి విగ్రహం ముందు ఉంటుంది.
శ్రీ కుమార సుబ్రాహ్మణ్యస్వామి వారు బ్రహ్మచారిగా కొలవబడుచున్నారు. ఈ స్వామి అత్యoత తేజస్సు కలిగి చతుర్భుజుడై అభయ ముద్రలో దర్శనం ఇవ్వడం విశేషం. పై రెండు చేతులలో దండం, పాశం ఉంటాయి. ఇక క్రింద కుడి చేతిలో అభయమిస్తున్న స్వామి ఎడమ చేతిని తన నెమలి వాహనం పై ఉంచడం జరిగినది. స్వామి వారికి కుడి వైపున సహజ సిద్ధమైన పుట్టఉన్నది. ప్రతిరోజు రాత్రి పళ్లెంలో పాలు పోసి ఈ పుట్టవద్ద ఉంచడం ఈ ఆలయ సంప్రదాయం.
శ్రీ కుమార స్వామి పళనిలోవలే దక్షిణ ముఖంగా, బ్రహ్మచారిగా కొలువై ఉన్నందున ఈ స్వామిని దర్శించి అభిషేకములు జరిపించినంతనే విశ్వాధిపతి అయిన స్వామి అనుగ్రహం వలన సకల గ్రహశాంతి కలిగి, కోరిన కోర్కెలు నెరవేరడం ఇక్కడ విశేషం. ప్రత్యేకించి రాహు, కేతు, కుజగ్రహశాంతిని కోరి జరిపించే దోష నివారణ పూజలు వలన అనేక మందికి వివాహ సిద్ధి, సంతానం, నష్టాలు మరియు శారీరక ఈతి బాధల నుండి పరిహారం లభిస్తుంది అని ప్రజల నమ్మకం.
ఈ ఆలయాన్ని దర్శించడం వలన అన్నిoటా విజయం లభిస్తుంది అని భక్తుల ప్రధాన విశ్వాసం. ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠి రోజున శ్రీ కుమార స్వామి వారి షష్ఠి మహోత్సవములు అత్యంత వైభవముగా జరుపబడతాయి. ఆ రోజున సంతానం లేని మహిళలు పుట్టపై ఉంచిన నాగుల చీర ధరించి స్వామి వారి వైపు శిరస్సు ఉంచి నిద్రించడం వలన సంతానవంతులు అవుతారు అని ప్రగాఢ నమ్మకం.
ఎలా చేరుకోవాలి?
రోడ్డు మార్గము:
1. సామర్లకోట, కాకినాడ, పిఠాపురం, రాజమండ్రి నుండి బస్సులు అందుబాటులో కలవు.
రైలు మార్గము:
1. సామర్లకోట రైల్వే స్టేషన్ నుండి 17 కిలో మీటర్ల దూరంలో ఉంది.
2. కాకినాడ రైల్వే స్టేషన్ నుండి 31 కిలో మీటర్ల దూరంలో ఉంది.
3. పిఠాపురం రైల్వే స్టేషన్ నుండి 31 కిలో మీటర్ల దూరంలో ఉంది.
4. రాజమండ్రి రైల్వే స్టేషన్ నుండి 34 కిలో మీటర్ల దూరంలో ఉంది.
విమాన మార్గము:
1. దగ్గరి దేశీయ విమానాశ్రయం రాజమండ్రి. ఇది 40 కిలో మీటర్ల దూరంలో ఉంది.
2. దగ్గరి అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖపట్నం. ఇది 173 కిలో మీటర్ల దూరంలో ఉంది.
****** శ్రీ స్వామివారిని దర్శించి తరించ గోరుచున్నాము. ******
బిక్కవోలు సుబ్రమణ్య స్వామి – నిజరూప దర్శనం
Leave a Reply