పరమపావన పుణ్యక్షేత్రం – మోపిదేవి
దక్షిణభారత దేశంలోని షణ్ముఖుని దేవాలయాల సరసన ప్రముఖ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రంగా భాసిల్లుతోంది కృష్ణాజిల్లా మోపిదేవి శ్రీవల్లిదేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి దేవస్థానం. స్కాందపురాణంలోని సహ్యాద్రిఖండంలో కృష్ణానదీ మహాత్మ్యము, ఇతర క్షేత్రములను వివరించు సందర్భంలో ప్రస్తావించబడిన ప్రముఖ క్షేత్రమైన మోపిదేవి క్షేత్ర విశేషాలు …
వారణాసిని వీడిన అగస్త్యుడు:
అగస్త్యమహర్షి వింధ్య పర్వత గర్వాన్ని అణచడానికి తప్పని పరిస్థితుల్లో లోకక్షేమానికై కాశీని వీడి రావలిసివచ్చింది. వింధ్య పర్వతం అహంకారంతో విజృంభించి, ఆకాశంలోకి చొచ్చుకొని పోయి, సూర్య మండలాన్ని దాటి నిలిచిపోయింది. ఫలితంగా సూర్యగమనం ఆగిపోయి ప్రకృతి స్తంభించిపోయింది. గ్రహసంచారములు నిలిచిపోయాయి. ప్రజలు పీడితులయ్యారు. భూమి చలించిపోయింది. దేవలోకం గడగడలాడింది. ఈ మహోపద్రవాన్ని నివారించగలిగేది అగస్త్య మహర్షి మాత్రమేనని భావించిన బ్రహ్మాది దేవతలు అగస్త్య మహర్షికి, విషయాన్ని వివరించారు.
యోగదృష్టితో సర్వము తిలకించిన మహర్షి తాను ఇప్పుడు కాశీని వీడితే కల్పాంతమైనా తిరిగి కాశీకి రావడానికి వీలు పడదని తెలిసి కూడా లోక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అమర కార్యానికి అంగీకరించారు. లోపాముద్రా సహితుడై దక్షిణాపథానికి బయలుదేరాడు అగస్త్యమహర్షి. దారిలో నున్న వింధ్య పర్వతం మహర్షి రాకను గమనించి సాష్టాంగపడి నమస్కరించింది. తాను మరలి వచ్చేవరకు అలాగే ఉండమని శాసించి, కాశీ విశాలాక్షీ, విశ్వనాథులను మనసులో నిలుపుకొని, దక్షిణాపథం వైపు బయలుదేరాడు అగస్త్యుడు. మునిశక్తికి పర్వతం బయపడి అలాగే ఉండిపోయింది.
పవిత్ర గోదావరీ ప్రాంతాన్ని పావనం చేసి కృష్ణాతీరంలోకి అడుగుపెట్టారు ఆ పుణ్యదంపతులు. కనకదుర్గామాతను, శ్రీకాకుళాంద్ర మహావిష్ణువుని దర్శించుకొని వ్యాఘ్రపురం (పులిగడ్డ) చేరుకున్నారు.‘వ్యాఘ్రస్య పూర్వదిగ్భాగే కుమార క్షేత్ర ముత్తమమ్ సుబ్రహ్మణ్యేన సత్యత్ర భుక్తి ముక్తి ఫలప్రదమ్’ అనేమాట అప్రయత్నంగా మహర్షి గళం నుండి వెలువడింది. ఆ ప్రదేశమంతా పుట్టలతో నిండివుంది. లోపాముద్రా దేవి, శిష్యబృందము ఆయన ననుసరించారు. ఒకపుట్ట నుండి దివ్యతేజస్సుని గమనించి ఇదే సుబ్రమణ్య క్షేత్రమని, ఇది భుక్తి ముక్తి ఫలప్రదమని శిష్యులకు వివరించాడు అగస్త్యుడు. కుమారమూర్తికే సుబ్రమణ్యమనెడి పేరని మాండమ్యడనే శిష్యుని సందేహాన్ని నివృత్తి చేశాడు.
కుమారస్వామి ఉరగరూపంతో తపస్సు:
తెలియక చేసిన అల్పదోష నివారణార్ధం కుమారస్వామి ఉరగరూపం ధరించి తపస్సు చేయవల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ కారణాన్ని ఈ విధంగా శిష్యులకు వివరిం చారు అగస్య్త మహర్షి. సనక, సనకస, సనత్కుమార సనత్సు జాతులనెడి దేవర్షులు ఎప్పుడూ ఐదేళ్ల వయసు వారు గానే ఉంటారు, పైగా దిగంబరులు. వారు నిరంతరం భగవదారాధనలోనే కాలం గడుపుతుంటారు. వారు ఒక పర్యాయం పరమేశ్వర దర్శనానికి కైలాసం చేరుకున్నారు. ఆ సమయంలో పరమేశ్వరుడు కైలాసంలో లేడు. లోకమాత పార్వతి, కుమారస్వామి కొలువు తీరి ఉన్నారు.
అదేసమయంలో శచీ, స్వాహా మొదలైన వేల్పు పడుచులు, లక్ష్మీ, సరస్వతులు, పార్వతీదేవి దర్శనానికి విచ్చేశారు. ఇటు జడధారులు, అటు రంగు రంగుల వస్త్రాలు ఆభరణాలతో సుందరీమణులను చూచి శివకుమారుడు నవ్వు ఆపుకోలేకపోయాడు. పార్వతీదేవి ‘‘కుమారా! ఏల నవ్వుచున్నావు? వారు నేనులా కన్పించలేదా? ఆ తాపసులు మీ తండ్రివలే లేరా? భేదమేమైననూ కన్పించినదా?’’ అని ప్రశ్నించినది. ఆ ప్రశ్న విన్న కుమారస్వామి లోలోన పశ్చాత్తాప పడినాడు. తల్లి పాదాలపైబడి క్షమాపణ కోరుకున్నాడు. తల్లి కాదన్న వినకుండా పాపపరిహారం కోసం తపస్సు చేసుకోవడానికి బయలుదేరాడు. ఈ ప్రాంతానికి చేరుకొని తన రూపం ఇతరులకు కనిపించకుండా ఒక పుట్టను ఏర్పరచుకొని ఉరగ రూపంతో తపస్సు ప్రారంభించాడు.
ఈ విషయాన్నంతటిని దివ్యదృష్టితో చూచి శిష్యుల కెరింగించిన అగస్త్యుడు మహాతేజస్సు వచ్చే పుట్టను సమీపించి సాష్టాంగ నమస్కారం చేశాడు. పడగ వలే ఉండే శివలింగాన్ని దివ్యతేజస్సు వచ్చే పుట్టమీద ప్రతిష్టించాడు. ‘అత్రస్నానంతు కుర్యాచ్చేత్కోటి జన్మాఘ నాశనమ్’ అని కృష్ణానది లో స్నానం చేసి లోపాముద్రతో కలసి శిష్యసమేతంగా శివలింగానికి పూజలు నిర్వహించారు అగస్త్యమహర్షి. అగస్త్యమహర్షి అంతటి తపస్విచే నిరూపించబడినది కావుననే ఈ ప్రదేశమునకు కుమార క్షేత్రముగా ప్రతీతి చెందినది. ఆ కాలములో మహర్షులెందరో ఈ మూర్తిని ఆరాధించినట్ట్లు చరిత్ర చెబుతోంది. కుమారుడు అనగా చిన్నవాడు. ఆయన రూపం ఎప్పుడు పంచవర్ష ప్రాయం. అట్టి సుబ్రహ్మణ్యమూర్తి నివసించుటచే ఈ క్షేత్రం కుమార క్షేత్రమైనది.
స్థల పురాణం:
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం లోని మూలమూర్తి స్వయంభూలింగం. వీరరపు పర్వతాలు అనే కుమ్మరి శివభక్తుని భక్తికి మెచ్చి శివుడు కలలో కనిపించి మోపిదేవి గ్రామం లోని చీమలపుట్టను త్రవ్వి తన లింగాన్ని బయల్పరచమని ఆదేశించాడు. పర్వతాలు తన కల గురించి గ్రామస్థులకు తెలియజేసి కలలో కనిపించిన ప్రదేశంలో చీమలపుట్టను త్రవ్వి బయల్పడిన లింగాన్ని ఆ చీమలపుట్టపైనే ప్రతిష్ఠించి గ్రామస్తులు పూజించడం ప్రారంభించారు. పర్వతాలు గుఱ్ఱము, నంది, కోడి మరియు గరుత్మంతుని విగ్రహాలను బంకమన్నుతో తయారుచేసాడు. మహాఋషుల విగ్రహాలను కూడా బంకమన్నుతో తయారుచేసి బట్టీలో కాల్చి కలకాలం చెక్కుచెదరకుండా తీర్చిదిద్దాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చల్లపల్లి జమిందారీ కుటుంబం యొక్క ఇలవేల్పు. ఇప్పటికీ వీరి ఆధ్వర్య౦లోనే ఆలయ నిర్వహణ కొనసాగుతున్నది.
క్షేత్ర విశిష్టత:
స్వామివారి ఆలయం తూర్పుదిశగా ఉంటుంది. గర్భగుడిలో పాము చుట్టల మీద లింగం ఉంటుంది. ఇదే పానమట్టం. స్వామికి వేరే పానమట్టం ఉండదు. పానమట్టం క్రింద అందరికీ కనబడే విధంగా లోపలికి ఒక రంధ్రం ఉంటుంది. అర్చన, అభిషేక సమయాల్లో ఆ రంధ్రంలో పాలుపోయడం జరుగుతుంది. ఆలయ ప్రదక్షిణ మార్గంలో ఉన్న పుట్టనుండి గర్భగుడిలోకి దారి ఉన్నట్లు, ఆ దారి నుండే దేవతాసర్పం పయనిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ స్వామి వారి ఆలయంలో పుట్టలో పాలుపోయడం విశేషసేవగా భక్తులు భావిస్తారు. సంతానం లేనివారికి సంతానం కలిగించడం, చూపు మందగించిన వారికి దృష్టిని ప్రసాదించడం, శ్రవణ దోషాలు, శారీరక దౌర్బల్యం, మనోవ్యాధి, చర్మసంబంధ వ్యాధులను నశింపజేయడం, విద్యాభివృద్ధి సకలసంపదలను సమకూర్చడం మొదలైన ఎన్నో మహిమలను స్వామి అందిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్ముతున్నారు. స్వామి వారి ఆలయంలో చెవులు కుట్టించడం, తలనీలాలు సమర్పించడం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, చీర్రమొక్కుబడి, ఉయ్యాల ఊపు మొదలైన మొక్కులు తీర్చుకుంటారు. నాగదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యమవుతున్న యువతులు ప్రత్యేకపూజలు జరిపించుకుంటారు. పుట్టలో పాలు పోయడం, పొంగలి నివేదన ఇక్కడి ప్రత్యేకతలు.
స్వామి వారికి జరుగు విశేషపూజలు:
స్వామి వారికి పర్వదినాల్లో మహన్యాసపూర్వక రుదభ్రిషేకంతో పాటు ప్రత్యేక అర్చనలు జరుగుతాయి. భక్తులు స్వామివారికి శాంతికళ్యాణం జరిపిస్తారు. స్వామి వారికి వైదిక స్మార్త ఆగమబద్దవిదంగా పూజ విధులు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఉగాది పర్వ దినం, శ్రావణార్చనము, దసరాలో శమీపూజ, కార్తీక దీపారాధనలు, ఆరుద్రోత్సవము, నాగులచవితి, సుబ్రహ్మణ్య షష్టిలకు విశేష అర్చనలు జరుగుతాయి. మాఘమాసంలో కల్యాణమహోత్సవం, రధోత్సవం, వసంతోత్సవం వైభవంగా జరుగుతాయి. రాహుకేతు దోషనివారణకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఎక్కడ ఉన్నది?
రోడ్ మరియు రైలు ద్వారా:
కృష్ణా జిల్లాలోని మోపిదేవి మండల కేంద్రం మచిలీపట్టణానికి 35 కి.మీ.ల దూరంలోనూ, గుంటూరు జిల్లా రేపల్లెకు 8 కి.మీ.ల దూరంలోనూ, విజయవాడకు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. అతి సమీపంలోని రైల్వేష్టేషన్ రేపల్లె. బస్సులు విజయవాడ, మచిలీపట్టణ౦ మరియు గుంటూరు నుండి అందుబాటులో కలవు. ఇక్కడ ఉండటానికి ఎటువంటి ప్రత్యేక సౌకర్యాలు లేవు. దేవాలయములోనే విశ్రాంతి తీసుకోవాలి. హోటల్స్ కానీ, ఇతర లాడ్జి సౌకర్యంకాని లేవు. గ్రామీణ స్థాయి కాఫీ హోటల్స్ మాత్రమే ఉంటాయి. సమీపంలోని రేపల్లె, అవనిగడ్డ ప్రాంతాల్లో మాత్రమే కొద్దిపాటి లాడ్జీలు కలవు.
గాలి ద్వారా:
దగ్గరి దేశీయ విమానాశ్రయం విజయవాడ. ఇది 63 కిలో మీటర్ల దూరంలో ఉంది.
****** శ్రీ స్వామివారిని దర్శించి తరించ గోరుచున్నాము. ******
మరిన్ని వివరాలకై ఇచ్చట చూడండి: మోపిదేవి – శ్రీ సుబ్రహ్మణ్య దేవాలయం
Leave a Reply