నిత్యపూజగా శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధన ఎలా చెయ్యాలి?
శంకరభగవత్పాదాచార్యులకు షణ్మతస్థాపనాచార్య అని పేరు. మోక్షం ఇవ్వగలిగిన రూపాలు ఏవి అన్నవాటిని ఆరింటిని ఆయన నిర్ధారణ చేశారు. మోక్షం ఇవ్వగలిగితే ఇక క్రింద వాటిని వేటిని ఇవ్వడంలోనూ వాళ్ళకి శక్తి లేనివారు అని చెప్పడానికి ఉండదు. అన్నింటికన్నా పతాకస్థాయి మోక్షం. అదే ఇవ్వగలరు అంటే ఇంక ఏదైనా ఇవ్వగలరు అని గుర్తు. అలా ఇవ్వగలిగిన వారిని ఆరుగురిని నిర్ధారించారు ఆయన – 1. పరమశివుడు 2. అంబిక(అమ్మవారు) 3. సూర్యుడు 4. విష్ణువు 5. సుబ్రహ్మణ్యుడు 6. విఘ్నేశ్వరుడు.
ఈ ఆరుగురి పేర్లమీదే శైవము, శాక్తేయము, సౌరము, వైష్ణవము, కౌమారం, గాణాపత్యము అని ఆరు సిద్ధాంతాలు. ఈ ఆరుగురూ మోక్షప్రదాతలే. ఇందులో అయిదుగురికి పూజలో స్థానం ఇచ్చారు. పంచాయతనం అంటే అయిదు. పరమశివుడు, అమ్మవారు, శ్రీమహావిష్ణువు, సూర్యుడు, విఘ్నేశ్వరుడు పంచాయతనంలో ఉంటారు. మోక్షం ఇవ్వగలిగిన వాళ్ళలో సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు. పూజలో మాత్రం సుబ్రహ్మణ్యుడు లేడు. మరి ఎలా పూజ చేయడం? సుబ్రహ్మణ్యుడు ఎక్కడ ఉన్నా సరే జ్యోతిస్స్వరూపుడు. ఆయన పేరు పావకి. అగ్నిహోత్రుడి రూపంగా వచ్చాడు.
ఆయన ఎక్కడ ఉంటే అజ్ఞాన దగ్ధం. అజ్ఞానాన్ని తీసేస్తాడు. అందుకే గోచీ పెట్టుకుని ఒక సన్యాసి ఎలా ఉంటారో అలా స్వామిమలై అన్న కొండమీద దండం చేత్తో పట్టుకొని జ్ఞానమూర్తిగా నిలబడి ఉంటారు. ఆ పేరుతోనే పుట్టారు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు, స్వామినాథన్. అందుకే ఇప్పటికీ ఆయన పుట్టినరోజునాడు ఆ క్షేత్రంలో ప్రత్యేకపూజ జరుగుతుంది. సుబ్రహ్మణ్యుడు అంటే ఎప్పుడూ జ్ఞానమూర్తి. వెలిగిపోతూంటాడు జ్యోతిస్వరూపంగా. పూజ మొట్టమొదటగా దీపం వెలిగించి మొదలుపెట్టాలి. ఆ దీపశిఖలో వెలుగుతున్నటువంటి జ్యోతి సుబ్రహ్మణ్యుడే. పూజ పూర్తి మంగళ నీరాజనంతో. నీరాజనంలో ఉన్న జ్యోతి సుబ్రహ్మణ్యుడే. జ్యోతిని చూస్తూ మీరు ఏ మూర్తి దగ్గర వేసినా సుబ్రహ్మణ్యుడికి అందుతుంది.
కాదు కళ్ళతో చూస్తూ చేయాలని ఉంది అంటే సుబ్రహ్మణ్యుడి మూర్తి పెట్టుకొని ఆయన వంక చూస్తూ మంటపంలో వేయండి. ఆయన పాదాల దగ్గరే పడుతుంది ఆ పువ్వు. మనస్సు చేత వెళ్తుంది. కాబట్టి ఎక్కడెక్కడ జ్యోతిస్స్వరూపం ఉంటుందో అక్కడక్కడ సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు అని గుర్తు. కాబట్టి జ్యోతికీ చేయవచ్చు. దీపం దగ్గర ఒక పళ్ళెం పెట్టి జ్యోతిస్స్వరూపంగా సుబ్రహ్మణ్యుడు వెలిగిపోతున్నాడు అని భావన చేసి పళ్ళెంలో పువ్వులు వేస్తూ ఉంటే ఆ పువ్వులు వెళ్ళి ఆయన పాదాలమీద పడతాయి. లేదు అంతలా మనస్సు నిలబెట్టలేను అంటే మూర్తిని ఎదురుగా పెట్టుకుని ఆయన వంక చూస్తూ శివుడికి వేస్తే ’ఆత్మావై పుత్ర నామాసి’. విష్ణువు స్థితికారుడు – ఎప్పుడూ లోకాలను రక్షిస్తాడు.
సుబ్రహ్మణ్యుడు రక్షణశక్తి. పైగా సుబ్రహ్మణ్యుడు శివకేశవులు ఇద్దరికీ ప్రతీక. అందుకే తమిళదేశంలో ఇప్పటికీ మురుగన్, మరుమగల్ అంటారు. అంటే మురుగన్ అంటే మేనల్లుడు, ఎందుచేత అంటే పార్వతీదేవి కొడుకు, పార్వతీదేవి శ్రీమన్నారాయణుడికి చెల్లెలు నారాయణి. కనుక పార్వతీదేవి కొడుకు విష్ణువుకు మేనల్లుడు అవుతాడు. మేనల్లుడు అల్లుడు ఎందుకంటే విష్ణువు యొక్క కూతురు వల్లి. మేనల్లుడే అల్లుడైనాడు. శైవము, వైష్ణవము వియ్యం అందాయి సుబ్రహ్మణ్యుడి వల్ల. స్థితికారశక్తిగా విష్ణుస్వరూపంగా ఉంటాడు. అందుకే సుబ్రహ్మణ్యుడు కొండలమీద ఉంటాడు తప్ప సాధారణంగా నేలమీద ఉండడు. సుబ్రహ్మణ్య క్షేత్రాలన్నీ కొండలమీదే ఉంటాయి. ఆయన మేనమామ గారికీ అదే లక్షణం. కాబట్టి విష్ణువు పాదం దగ్గర వేసినా, చేతిలో ఉండేది వేలాయుధం – శక్తిని చేతిలో పట్టుకుంటాడు.
అమ్మ ఎలా ఉంటుందో అలాగే ఉంటాడు. అమ్మ శక్తియే ఆయన చేతిలో శూలం. అమ్మ దగ్గర వేస్తే సుబ్రహ్మణ్యుడికి అందుతుంది. తేజోమూర్తి సూర్యనారాయణమూర్తి దగ్గర వేసినా ఆయనకు అందుతుంది. గణపతి పెద్దకొడుకు పరమేశ్వరుడికి. ఆయనకి ఒక పేరు ఉంది. స్కందపూర్వజాయ నమః’ అని సుబ్రహ్మణ్య సంబంధంగా. ఆయన దగ్గర వేసినా సుబ్రహ్మణ్యుడికి అందుతుంది. అందుకని ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యుడికి పూజలో మూర్తిని శంకరాచార్యుల వారు ఇవ్వలేదు. జ్యోతిస్స్వరూపుడు దీపంగా ఉన్నాడు కాబట్టి అక్కడ చేసినవన్నీ సుబ్రహ్మణ్యుడికే అందుతాయి. ఇలా సుబ్రహ్మణ్య పూజను పూర్ణం చేసుకోవచ్చు.
Leave a Reply