దేవసేనా సుబ్రమణ్యుల కళ్యాణం
అరిష్టనేమి అనబడే ఒక ప్రజాపతి కుమార్తె దేవసేన. ఈమెకు దైత్యసేన అనే ఒక చెల్లెలు ఉంది. ఒకరోజున దేవసేన తన చెల్లెలయిన దైత్యసేనతో కలిసి ఆడుకుంటోంది. ఆ సమయంలో అక్కడికి ఒక రాక్షసుడు వచ్చి దేవసేనను భయపెట్టి ఎత్తుకుపోయే ప్రయత్నం చేశాడు. ఆవిడ బిగ్గరగా కేకలు పెట్టింది.
ఆ సమయంలో ఇంద్రుడు ఐరావతం మీద వెడుతున్నాడు. ఆయన వెంటనే తన వజ్రాయుధంతో ఆ రాక్షసుని సంహరించి అరిష్టనేమి కుమార్తె అయిన ‘ఈ దేవసేనని నా కుమార్తెగా ఇవ్వాల్టి నుంచి పెంచుకుంటాను. దైత్యసేనని నీ దగ్గర ఉంచుకో. దేవసేన నా దగ్గర పెరుగుతుంది. అని అరిష్టనేమికి చెప్పి ఆమెను తీసుకు వెళ్ళి పెంచాడు. ఈ పిల్ల పెరిగి పెద్దదవుతుంటే ఇంద్రునికొక ఆలోచన కలిగింది.
ఈ దేవసేనను దక్కించుకోగలిగిన వాడు పరాక్రమముతో పాటు కారుణ్యము అపారముగా కలిగిన వాడి ఉండాలి. అటువంటి వాడికి ఇచ్చి వివాహం చేస్తాను అనుకున్నాడు. ఆ సమయంలో ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. తారకాసురుడి తమ్ముడు శూరపద్ముడు. ఆ శూరపద్ముని సంహారం కూడా కుమారస్వామి చేశారు. తన కుమార్తెకు అలాంటి వాడిని ఇచ్చి వివాహం చేయాలి అనుకున్నాడు. వెళ్లి కుమారస్వామిని వేడుకుని దేవసేననిచ్చి వివాహం చేసాడు. వివాహంచేసిన స్థలాన్ని తిరుప్పరంకుండ్రం అని పిలుస్తారు.
మంచి గుణములు కలగాలంటే కుమారస్వామి ఆరాధనము చేసి తీరవలెనని శాస్త్రం చెప్తోంది. సుబ్రహ్మణ్యానుగ్రహమును పొందాలి.
Leave a Reply