తిరుమలలోని కుమారధార తీర్ధం II ముక్తిపథ జలధార
తిరుమల పరమ పవిత్రమైన పుణ్యధామం. ఇక్కడ ముక్కోటి తీర్ధాలు, సకల దేవతలు నిత్యనివాసం ఉంటారని ప్రతీతి. ఇక ఈ శేషాచల కోండల్లో కుమారస్వామికి చెందిన ఓ దివ్య తీర్ధం దాగి ఉంది. ఏటా మార్చి నెలలో వచ్చే పౌర్ణమి రోజున ఈ దివ్య తీర్ధానికి వెళ్తుంటారు భక్తులు. శ్రీవారి ఆలయానికి వాయువ్యం వైపున 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కుమారధార తీర్థం గురించి తెలుసుకుందాం.
తిరుమల శేషాచలం కొండల్లో వెలసిన అద్భుతమైన తీర్థాల్లో కుమార ధార తీర్థం ఒకటి. వైష్ణవ వైభవానికి చిహ్నంగా ఉన్న తిరుమలలో పశుపతి తనయుడైన కుమారస్వామి పేరిట తీర్థం ఉండటం, శివకేశవ అభేదాన్ని చాటుతోంది. దైవం ద్వంద్వాతీతుడన్న సత్యానికి ఇది నిదర్శనంగా కనిపిస్తుంది.
పాపనాశనం డ్యామ్ నుంచి వాయవ్య దిశలో ఉంటుంది కుమారధార తీర్థం. కాలినడకన నాలుగైదు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. దట్టమైన అరణ్యంలో, భారీ కొండల నడుమ, మార్మికమైన బిలంలా కనిపించే ఈ కందకం.. ప్రాకృతిక సౌందర్యానికి మచ్చుతునక. చుట్టూ పోతపోసినట్టు ఉన్న రాతికుడ్యాల మధ్య తళుక్కున మెరుస్తూ జలజల జారే సున్నితమైన జలపాతాన్ని చూడటంతోనే మనసు పులకితమవుతుంది. ఈ పుణ్యజలాల కింద స్నానమాచరించడానికి తపోధనులు, దేవతలు కూడా వస్తుంటారని చెబుతుంటారు.
కుమారధార మహత్యం…
తిరుమల మహాత్మ్యంలో పేర్కొన్న 26 ముఖ్య తీర్థాల్లో కుమారధార ఒకటి. వేంకటాచలంలో ముక్తిపథ తీర్థాలుగా పేరెన్నికగన్న తొమ్మిదింటిలో దీనికీ స్థానం ఉంది. కుమారధార వైభవం గురించి వరాహ, వామన, పద్మ పురాణాల్లో ప్రస్తావించారు. పూర్వం ఒకానొక ముసలి బ్రాహ్మణుడు.. తప్పిపోయిన తన కుమారుడైన కౌండిన్యుడి కోసం వెతుకుతూ, వెతుకుతూ ఏడు కొండలు చేరుకున్నాడట. అప్పుడు వేంకటేశ్వరస్వామి మానవ రూపం ధరించి ఆ పెద్దాయనకు ఎదురుపడ్డాడు. ‘తాతా! నీకు ఇంకా బతకాలనే ఆకాంక్ష ఉన్నట్టుందే! కొడుకు కోసం ఏమిటీ ఆరాటం’ అని ప్రశ్నించాడు.
అప్పుడా బ్రాహ్మణుడు.. ‘నాయనా! నాకు నిజంగానే బతకాలని ఉంది. ఈ జీవితంపై వ్యామోహంతో ఈ మాట చెప్పడం లేదు. దేవతలు, ఋషులు ఎలాగైతే పరమాత్ముని ఎల్లకాలం సేవిస్తుంటారో నాకూ అలాంటి భాగ్యం కావాలని ఉంది. అందుకు దేహం అవసరం. పితృకార్యాలు, దైవకార్యాలు నిర్వర్తించడానికి నాకు కొడుకు అవసరం’ అని బదులిచ్చాడట. ఆ జవాబుకు ప్రసన్నుడైన బాలాజీ.. ఆ బ్రాహ్మణుడిని అక్కడికి సమీపంలో ఉన్న ఒక తీర్థానికి తీసుకెళ్లి స్నానం చేయమన్నాడట. అందులో మునక వేయగానే ముదుసలి బ్రాహ్మణుడు యౌవనవంతుడయ్యాడట. అతడి కుమారుడిని చూపించి.. ఆధ్యాత్మిక మార్గంలో సాగమని ఆశీర్వదించాడట. ముసలివానికి యౌవనాన్ని ప్రసాదించిన కారణంగా.. దీనికి కుమార తీర్థం అని పేరువచ్చిందని వరాహ పురాణం పేర్కొంది.
కుమారస్వామి తపస్సు…
ఈ తీర్థానికి సమీపంలోని గుహలో కుమారస్వామి విగ్రహం ఉంది. తీర్థంలో స్నానమాచరించిన భక్తులు కుమారస్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతారు. తారకాసరుణ్ణి సంహరించడంతో కుమారస్వామికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. దోష నివారణార్థం వేంకటాచలం వెళ్లి శ్రీహరికై తపస్సు చేయమన్నాడట శివుడు. తండ్రి మాట మేరకు కుమారస్వామి ఈ తీర్థం సమీపంలో కఠోర తపస్సు ఆచరించాడట. కొన్నాళ్లకు విష్ణుమూర్తి ప్రత్యక్షమై కుమారస్వామిని అనుగ్రహించాడట. కుమారస్వామి తపమాచరించిన తీర్థం కావడంతో దీనికి ‘కుమారధార’ అని పేరు వచ్చిందని మరో కథ ప్రచారంలో ఉంది.
మాఘ మాసంలో ముక్కోటి ఉత్సవం…
పురాణ ప్రాశస్త్యం ప్రకారం తిరుమలలోని శేషగిరులలో ముక్కోటి పుణ్యతీర్ధాలు ఉన్నవని ప్రతీతి. ఈ పుణ్య తీర్ధాలలో ధర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్య, ముక్తి ప్రదములు కలిగించేవి ప్రధానమైనవి ఏడు తీర్ధములు. అవి స్వామివారి పుష్కరిణి, కుమారధార, తుంబురు, రామకృష్ణ, ఆకాశగంగ, పాపవినాశనం మరియు పాండవ తీర్ధములు. ఈ తీర్ధాలలో ఆయా పుణ్య ఘడియల్లో స్నానమాచరించిన ఎడల సర్వ పాపాలు తొలగి ముక్తి సమకూరుతుందన్నది వైశిష్ట్యం.
కుమారధార ప్రయాణం సంక్లిష్టంగా ఉంటుంది. అయినా భక్తులు ఏ మాత్రం వెరవకుండా ఇక్కడికి చేరుకుంటారు. మూడు నాలుగు మార్గాల ద్వారా ఈ తీర్థానికి చేరుకోవచ్చు. జాపాలి తీర్థం నుంచి ఇక్కడికి దారి ఉంది. తలకోన నుంచి అరణ్య మార్గంలో రావచ్చు. అన్నదమ్ముల బండ, గొల్లోళ్ల రచ్చ మీదుగా కుమారధార తీర్థానికి చేరుకోవచ్చు. అయితే సాహసాలకు సిద్ధపడిన యాత్రికులు ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. పాప నాశనం డ్యామ్ మీదుగా రావడానికి ఆసక్తి కనబరుస్తారు.
ఏటా మాఘ మాసంలో మఖా నక్షత్రంతో కూడుకున్న పౌర్ణమి రోజున కుమారధార తీర్థానికి ముక్కోటి ఉత్సవం నిర్వహిస్తారు. ఈ పర్వదినాన స్నానమాచరించి, దానధర్మాలు చేసి, స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు. ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే కుమారధార తీర్ధ ముక్కోటిని దర్శించి, స్నానమాచరించడం భక్తులు ఒక ప్రత్యేక అనుభూతిగా భావిస్తారు.
కుమారధారకు సమీపంలో పసుపుధార తీర్థం ఉంటుంది. వర్షరుతువులో ఈ తీర్థాల గుండా భారీగా నీళ్లు ప్రవహిస్తుంటాయి. అందుకే ఈ తీర్థాలకు సమీపంలో కుమారధార డ్యామ్ నిర్మించారు. ఏడాది పొడుగునా జలకళతో అలరారే కుమారధార డ్యామ్ తిరుమలకు వచ్చే భక్తుల తాగునీటి అవసరాలను తీరుస్తోంది.
****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
మరిన్ని వివరాలకై ఇచ్చట చూడండి: తిరుమలలోని కుమారధార తీర్ధం:
Leave a Reply