స్వామినాథస్వామి ఆలయం II స్వామిమలై
స్వామిమలై అంటే ‘దేవుని పర్వతం’ అని అర్థం మరియు ఈ పవిత్రమైన దేవుని ఉనికి ఈ పట్టణం లోపల మరియు చుట్టూ ఉన్న పరిసరాలలో ప్రభావం చూపుతుంది. స్వామిమలై శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో నాలుగవది, రాష్ట్రంలో ఇక్కడ మాత్రమే కాంస్య నాణేల యొక్క కళ బోధించే పాఠశాల ఉన్నది. స్వామిమలై అపారమైన జ్ఞానం. అందరికీ స్వామి అయిన శివునికి ఇక్కడ సుబ్రహ్మణ్యస్వామి ప్రణవ మంత్రం ‘ఓం’ తత్వాన్ని వెల్లడించిన కారణంగా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారిని స్వామినాథ స్వామి అని కొలుస్తారు..
స్వామినాథ అంటే గురు స్వరూపం. అసలు స్వామి అనే మాట అమరకోశం ప్రకారం ఒక్క సుబ్రహ్మణ్యుడిదే. ఎందుచేతనంటే “దేవసేనాపతీ, శూరః, స్వామీ, గజముఖానుజః “ అని అర్ధంగా ఇవ్వబడింది. తరువాత స్వామి అనే పేరు వేరే స్వరూపాలు కూడా తీసుకున్నా, అన్నీ సుబ్రహ్మణ్య స్వరూపాలే అని అనుకోవాలి. అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని పిలిచినా, కేవలం స్వామీ అని పిలిచినా అది సుబ్రహ్మణ్యుడికే చెందుతుంది అని చెప్పింది అమరకోశం. అటువంటి మహానుభావుడు స్వామిమలైలో వెలిసి ఉన్నాడు.
ఆలయ విశేషాలు…
ఈ క్షేత్రము అరవై మెట్లు ఉన్న ఒక కొండ మీద ఉంటుంది. పైకి ఎక్కాలంటే విశాలమైన 60 రాతి మెట్లు ఎక్కాలి. ఈ అరవై మెట్లు అరవై తమిళ సంవత్సారాలకి ప్రతీకలనీ, ఆ సంవత్సరాధిదేవతలు ఈ రూపంగా స్వామిని సేవిస్తున్నారనీ అంటారు. ప్రతి మెట్టు దగ్గర గోడమీద ఆ సంవత్సరం పేరు వ్రాసి వుంటుంది తమిళంలో. ఈ మెట్ల దోవ మధ్యలో, 32 మెట్లు ఎక్కగానే కుడివైపున కుమారస్వామి తన తండ్రికి ఉపదేశం ఇస్తున్న అద్భుత శిల్పం కనబడుతుంది. స్వామిమలై ఆలయం మూడు గోపురాలను, మూడు ప్రాకారాలు కలిగి ఉన్నది. ఇక్కడి ఆలయ ప్రాకారాలు విచిత్రంగా ఉంటాయి. మొదటి ప్రాకారం గుట్ట (కొండ అని కూడా పిలుస్తారు) అడుగుభాగంలో ఉన్నది. రెండవ ప్రాకారం గుట్ట మధ్యభాగంలో ఉన్నది. మూడవ ప్రాకారం కొండపై ఆలయం చుట్టూ నెలకొని ఉన్నది. ఇక్కడి ఆలయం బావిని వజ్రతీర్థం అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని కార్తవీర్యార్జునుడు కట్టించాడు. గర్భ గుడి బయట హాల్లో ఈయన విగ్రహాన్ని చూడవచ్చు.
గుడి క్రింది భాగంలో శివుడు పార్వతుల మంటపాలు వున్నాయి. వీరి పేర్లు మీనాక్షీ సుందరేశ్వర్, మీనాక్షి. పాండ్య రాజైన వరగుణుడు ఒకసారి మధుర నుంచి పుణ్యక్షేత్రమైన తిరువిడైమరుదూర్ కు వెళ్తూ ఈ ఆలయంలో ఒక రాత్రి గడిపాడుట. ఆయన కుల దైవమైన మీనాక్షీ సుందరేశ్వరుని ఆరాధించటానికి ఈ మంటపాలనేర్పరచాడు. తర్వాత కీ.శే. అరుణాచల చెట్టియార్ ఇక్కడ రాతి కట్టడాలు కట్టించాడు.
ధ్వజ స్ధంబం దగ్గర వున్న వినాయకుడిగుడి కూడా చాలా మహిమ కలది. ఇక్కడ కుమార తరై, నేత్ర పుష్కరిణి అనే రెండు పుష్కరిణులు వున్నాయి. కొంగు ప్రాంతంనుంచి వచ్చిన పుట్టుగుడ్డి అయిన ఒక భక్తుడు ఈ రెండు పుష్కరిణులలో స్నానం చేసి స్వామి సన్నిధానానికి వస్తుంటే ఈ వినాయకుడి గుడి దగ్గరకు వచ్చేసరికి ఆయనకి కన్నులు కనిపించాయట. అందుకే ఈ వినాయకుణ్ణి నేత్ర వినాయగర్ అంటారు.
స్థల పురాణము…
పూర్వము ఒకనాడు చతుర్ముఖ బ్రహ్మ గారు కైలాసం వైపు వెడుతూ వుండగా, సదా చిద్విలాసంతో ఉండే నా తండ్రి సుబ్రహ్మణ్యుడు, బ్రహ్మ గారిని ఆపి “ బ్రహ్మమనగా ఏమి?, ప్రణవమునకు అర్ధం తెలుసా? “ అని అడిగారు. చతుర్ముఖ బ్రహ్మ గారు అన్నారు, “ బ్రహ్మము అనగా నేనే “. వెంటనే కార్తికేయుడు, మీరు నాలుగు ముఖములతో వేదములు చెప్తున్నారు కాని, బ్రహ్మము అర్ధం కాలేదు అని బ్రహ్మ గారిని చెరసాలలో బంధించారు. వెంటనే పరమశివుడు వచ్చి, “బ్రహ్మ గారికి జ్ఞానములో కించిత్ దోషం ఉండవచ్చు, అంత మాత్రాన కారాగారములో పెట్టకూడదు. ఆయనని విడిచి పెట్టేయి” అని చెప్పగా, సుబ్రహ్మణ్య స్వామి వారు వెంటనే బ్రహ్మ గారిని విడిచిపెడతారు. అంతే కాక, సుబ్రహ్మణ్యుడు శంకరుడితో అంటారు, “ నేను ఎంత మీ కుమారుడనైనా, బ్రహ్మ గారిని అలా అవమానించకూడదు” అని, దీనికి ప్రాయశ్చిత్తంగా సర్ప రూపం దాల్చి భూలోకంలో వచ్చి ఉన్నారు . అలా ఉండగా పిల్లలూ, అందరూ వచ్చి రాళ్ళతో కొడుతూ ఉంటే, పార్వతీ దేవికి ఈ విషయం తెలిసి షష్ఠీ వ్రతం చేయించింది. దానితో ఆయన పాపం తొలగి పూర్తి తెజోమయుడైన సుబ్రహ్మణ్య రూపం వచ్చిందని అంటారు పెద్దలు.
పరమశివునికీ ప్రణవ ఉపదేశం…
ఒకానొక సమయంలో సుబ్రహ్మణ్య స్వామి వారు, పరమశివునికి ప్రణవము ఉపదేశం చేశారు స్వామిగా. ఇది ఎంతో చిత్రంగా ఉంటుంది, శంకరుడు సకల జ్ఞానములకు ఆలవాలము. ఈశానః సర్వ విద్యానాం అంటారు కదా. ఇక్కడ దీని అంతరార్ధము ఏమిటంటే, ఏ తండ్రి అయినా తన కొడుకు చేతిలో ఓడిపోవడం ఇష్టపడతాడు. కొడుకు చేతిలో తండ్రి ఓడిపోతే అది తనకి గొప్ప సన్మానముగా భావిస్తాడు తండ్రి. లోకానికంతటికీ జ్ఞానమునిచ్చే తండ్రికి, తన తేజస్సుతో పుట్టిన పుత్రుడు జ్ఞాన బోధ చేయడం అనేది ఎంతో ఆనందదాయకమైన విషయము. ఇక్కడే అగస్త్య మహర్షికి ద్రవిడ వ్యాకరణం బోధించారు సుబ్రహ్మణ్యుడు. స్వామిమలైలో సుబ్రహ్మణ్య స్వామి వారి మందిరం పైన ఉంటుంది, క్రింద, మీనాక్షీ, సుందరేశ్వరుల మందిరములు ఉంటాయి.
వసతి సదుపాయము…
స్వామిమలై క్షేత్రం కుంభకోణం నుండి చాలా దగ్గరలో ఉండడం వల్ల, వసతి కుంభకోణంలో చూసుకోవడమే ఉత్తమం. స్వామిమలైలో అంత ఎక్కువగా వసతి సదుపాయాలు లేవు. కుంభకోణం కూడా ప్రఖ్యాత పుణ్య క్షేత్రము అవడం వల్ల ఇక్కడ ఎన్నో హోటళ్ళు ఉన్నాయి.
ఆలయంలో ఆర్జిత సేవలు…
స్వామిమలైలో ప్రతీ రోజూ స్వామి వారికి అభిషేకం చేస్తారు. స్వామి వారిని అలంకరణ లేకుండా చిన్న కౌపీనం మాత్రం ఉంచి వేద మంత్రాలు చదువుతూ, పంచామృతాలతో అద్భుతంగా చేస్తారు ఈ అభిషేకం. అభిషేకంలో మన పురుషార్ధంతో ద్రవ్యాలు ఏమైనా ఇచ్చినా వాటితో కూడా చేస్తారు. ఈ అభిషేకం దర్శనం కోసం పదిహేను వందల రూపాయలు టికెట్. ఇక్కడ స్వామినాథ స్వామి చిన్న కౌపీనంతో తన చేతిలో శక్తిఆయుధం పట్టుకుని చిన్న పిల్లవాడిలా ముద్దుగా కనబడతారు. సమయము, అవకాశము ఉన్న వారు తప్పకుండా చూడవలసినది స్వామి వారి అభిషేకం.
ఎక్కడ ఉన్నది?
ఈ క్షేత్రం తమిళనాడు లోని తంజావూర్ జిల్లాలో కుంభకోణం సమీపంలో ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్ ద్వారా: తిరుచిరాపల్లి నుండి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుచిరాపల్లి, మధురై, చెన్నై, బెంగళూరు నగరాల నుండి అనేక బస్సులు ఉన్నాయి. రైలు ద్వారా: కుంభకోణంలో రైల్వే స్టేషను ఉంది. ఇక్కడ నుండి చెన్నైకి ప్రతీ రోజూ అనేక రైళ్ళు నడుస్తాయి.విమానము ద్వారా: దగ్గరలో విమానాశ్రయములు తిరుచిరాపల్లి ( 90 కి.మీ. ), మధురై ( 234 కి.మీ. ), చెన్నై ( 285 కి.మీ. ), బెంగళూరు ( 438 కి.మీ. ) దూరంలో ఉన్నాయి.
మరిన్ని వివరాలకై ఆలయం వెబ్ సైట్ ఇచ్చట చూడండి: స్వామినాథస్వామి ఆలయం – స్వామిమలై
మరిన్ని వివరాలకై ఇచ్చట చూడండి: అరుళ్మిగు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం – స్వామిమలై:
****** స్వామి వారి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం, శ్రీ స్వామివారిని దర్శించి తరించ గోరుచున్నాము. ******
Leave a Reply