స్వయంభువు సుబ్రహ్మణ్యుడి దర్శనభాగ్యం II నడిపూడి

తూర్పుగోదావరి జిల్లా అమాలాపురానికి సమీపంలోని నడిపూడిలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి స్వయంభువుగా ఆవిర్భవించిన క్షేత్రం ఉన్నది. ప్రాచీనకాలం నుంచి ఇక్కడ స్వయంభువు సుబ్రహ్మణ్య స్వామి పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. గోదావరి నదీతీరంలో గల ఈ క్షేత్రానికి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున పెద్దసంఖ్యలో భక్తులు వస్తుంటారు. స్వామివారికి పూజాభిషేకాలు జరిపించి తరిస్తుంటారు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఈ క్షేత్రంలో తప్పనిసరిగా ఒక సర్పం భక్తులకు దర్శనమిస్తుందని చెబుతుంటారు.

ఆ రోజున తెల్లవారుజామున ఆలయానికి చేరుకున్న భక్తులకు శిఖరంపై సర్పం దర్శనమిచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయని స్థానికులు చెబుతుంటారు. స్వామియే సర్పరూపంలో భక్తులకు దర్శనమిస్తున్నట్టుగా వాళ్లు విశ్వసిస్తుంటారు. ఇక్కడి స్వామిని దర్శించడం వలన సమస్త దోషాలు నశించి సకల శుభాలు కలుగుతాయని చెబుతుంటారు. ఆ రోజున ఈ క్షేత్రంలో స్వామికి మొక్కుబడులు చెల్లించేవాళ్లను చూస్తే, స్వామి ఎంతటి మహిమాన్వితుడో అర్థమైపోతుంది. ఈ క్షేత్రంలో అడుగుపెట్టినవాళ్లు స్వామి అనుగ్రహాన్ని పొందకుండా వెనుదిరగరని స్పష్టమైపోతుంది.

స్థల పురాణం…

దక్షిణాపదములో వశిష్ట గోదావరీ నదీ తీరములో శతాబ్దాల క్రితం అనగా బ్రిటీష్ ప్రభుత్వంలో కాటన్ దొర బ్యారేజి కట్టని క్రితం ఈ ప్రదేశంలో వశిష్ట గోదావరీ నది పరవళ్లు త్రొక్కుతూ ప్రవహిస్తూ ఉండేది. పురాణ ప్రసిద్ధి చెందిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు నాశికా త్రయంబకం నుండి గోదావరీ నదిలో ప్రయాణం చేస్తూ ఋషుల తపస్సులు, పండితుల వేదం ఘోషలతో నిత్యము విరాజిల్లుతున్న ఈ గోదావరీ నది ఒడ్డుకు స్వామి వారు చేరుకున్నారు. పిదప శ్రీ స్వామి వారు ఒక భక్తునికి స్వప్నములో కనిపించి తనకి గ్రామోత్సవము జరిపించి, గ్రామోత్సవము జరిపించిన ఆ పల్లకి ఎక్కడ స్థిరముగా ఆగిపోతుందో అక్కడ తనని ప్రతిష్టించమని ఆజ్ఞాపించారు. స్వామి వారి కోరిక ప్రకారం అరటి దొప్పలతో పల్లకి తయారు చేసి స్వామి వారిని గ్రామములో ఉరేగించి, పల్లకి ఆగిన చోట ఆలయలము గ్రామస్తులు నిర్మించారు. అప్పటి నుండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు స్వయంభువునిగా ఈ ఆలయం నందు కొలువై ఉన్నారు.

భక్తులు కోరినంత మాత్రమునే వారికి ఆయు ఆరోగ్యములు, సంతతి, సకల ఐశ్వర్యములు కలుగజేయును. సంతానలేమితో బాధపడుతోన్నవారికీ, చర్మసంబంధమైన వ్యాధులతో సతమతమైపోతున్నవారికీ, నాగదోషాలతోను, గ్రహ సంబంధమైన దోషాలతోను బాధలుపడుతోన్నవారికి, విద్యలో అభివృద్ధిని సాధించలేకపోతున్నవారికి కూడా శ్రీ స్వామి వారిని దర్శించి పూజించినంత మాత్రమునే వారి దోషములు అన్నియు తొలగిపోతాయి. ఇది అంతయూ స్వయంభు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్ర మహత్యం.

స్వయంభువుగా వెలసిన స్వామి క్షేత్రం లోక ప్రసిద్ధి చెందినది. స్వామి వారికి తూర్పు వైపున ద్వారబందము లోపల స్వామి పుట్ట ఉన్నది. ఇది ఎవరు నిర్మాణము చేసినది కాదు. స్వామి వారు ఈ పుట్టలో నిత్యము ఉంటారని భక్తుల నమ్మకం. ఈ పుట్టను దర్శనము చేసుకొనుటకు అద్దము ఏర్పాటు చేయబడినది. ప్రతి సంవత్సరం వచ్చే గోదావరీ నది ప్రవాహ వేగమునకు నది-పూడి ఏర్పడిన ఈ గ్రామము కాలక్రమేణా నడుపూడిగా వ్యవహారములోనికి వచ్చియున్నది. 1973 సంవత్సరంలో ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమము, శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట జరిగినది.

శ్రీ స్వామి వారికి జరుగు విశేష కార్యక్రములు…

1. నిత్యము స్వామి వారికి అభిషేకము, కళ్యాణము జరుగును.
2. మార్గశిర శుద్ధ పంచమి రోజు రాత్రి స్వామి వారి కళ్యాణం.
3. మార్గశిర శుద్ధ షష్ఠి రోజు శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి, రధోత్సవం, తిరునాళ్లు జరుగును.
4. మార్గశిర శుద్ధ సప్తమి రోజు రాత్రి స్వామి వారి కళ్యాణం.
5. మార్గశిర శుద్ధ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి రోజు స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం.
6. ఆషాడ మాస శుద్ధ షష్ఠి రోజు కుమార షష్ఠి.
7. మాఘ శుద్ధ షష్ఠి రోజు స్వామి వారికి విశేష అభిషేకములు జరుగును.
8. కార్తీక శుద్ధ చవితి, నాగుల చవితి రోజు స్వామి వారికి పాలాభిషేకములు జరుగును.
9. కార్తీక శుద్ధ షష్ఠి, స్కంద షష్ఠి రోజు స్వామి వారికి విశేష అభిషేకములు జరుగును.

ఎక్కడ ఉన్నది?

1. నడిపూడికి రావులపాలెం, పెనుగొండ, తణుకు నుంచి బస్సు మరియు ఆటో సౌకర్యం ఉంది.
2. దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్లు: తణుకు , తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు, రాజమండ్రి.
3. దగ్గరలో దేశీయ విమానాశ్రయము రాజమండ్రి.

       ****** శ్రీ స్వామి వారిని దర్శించి తరించ గోరుచున్నాము. ******

       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

About the Author

Ravikanth Bandi ()

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *