శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం పళముదిర్చోళై
పళముదిర్చోళై తమిళనాడులో గల మదురై మీనాక్షి అమ్మవారి దేవాలయానికి 23 కిలోమీటర్ల దూరంలో కలదు. ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రములలో (ఆరు పడై వీడు) ఈ క్షేత్రం ఆరవది. సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం చిన్న కొండపైన ఉంటుంది. దీనిని అళగర్ కోయిల్ (అందమైనవాని కోవెల) అని అంటారు. పళముదిర్చోళై అనగా పళ్ళతోట అని అర్థం. ఇక్కడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాలుగు చేతులు కలిగిన విగ్రహం. ఆ విగ్రహానికి ఇరువైపులా వల్లీ, దేవసేనల విగ్రహాలు ఉన్నాయి.
స్వామి చేతిలో పాషాణంతో తయారైన ఆయుధం ఉంటుంది. ఇది ఒక విశేషం. మూలవర్ గా స్వామిని ఇక్కడ కొలుస్తారు. ఆ స్థల వృక్ష పండ్లు స్కంద షష్ఠి రోజున సరిగ్గా పరిపక్వానికి రావటం ఇక్కడి విశేషం. దేవాలయ సమీపంలోని ఒక వృక్షం వేలాది సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్నది. ఆ చెట్టు దగ్గరే స్వామి తన యొక్క మహా భక్తులలో ఒకరైన అవ్వయ్యార్ ని పరీక్షించాడు అంటారు. కొండ క్రింద ప్రఖ్యాత వైష్ణవ క్షేత్రమైన అళగర్ విష్ణు మందిరం ఉంది. ఈ అళగర్ కోయిల్ శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో దివ్యదేశములు అని పిలువబడే 108 పవిత్ర క్షేత్రములలో ఒకటి.
పళముదిర్చోళై క్షేత్రాన్ని అళగర్ కోయిల్ కొండలలోనిదిగా గుర్తిస్తారు. ఇది ఒక సుందర ప్రదేశం. విశేష వృక్ష, జంతు సంపద గల అటవీ ప్రాంతం. ఇక్కడి ప్రకృతి విశేషాలను, వృక్ష జంతువర్ణనల్ని వేల సంవత్సరాల క్రితం నక్కీరుడు తన గ్రంథాలలో వర్ణించారు. కొండ క్రింద నుండి పైన సుబ్రహ్మణ్యుని ఆలయం వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది. పై వరకు కార్లతో వెళ్ళవచ్చు. బస్సు సౌకర్యం ఉంటుంది.
ఈ ఆలయం కంటే ఇంకా పైన కొండ మీద, నూపుర గంగ ఉంది. ఈ జలపాతానికి సమీపంలో వున్న మండపంలో కూర్చునే తమిళ కవి ఇళంగోఅడిగళ్ “సిలప్పదిగారం” రచించాడని ప్రతీతి. ఈ గంగ శ్రీ మహా విష్ణువు యొక్క పాద నూపురముల నుంచి వచ్చిందని, అందుకే ఆ పేరు అని చెప్పారు. అక్కడ ఎప్పుడూ చిన్న కొండ గుహలో నుంచి గంగా జలము వస్తూనే ఉంటుంది. భక్తులు ఆ జలములలో శిరస్సు కూడా తడుపుకుని పునీతులవుతారు. అక్కడే అమ్మ వారి (రక్కాయి అమ్మన్ అంటారు తమిళంలో) మూర్తి కూడా ఉంది.
నిజంగా పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి మాటలలో చెప్పాలంటే, ఈ ఆరు పడై వీడు – ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రములను దర్శిస్తే వచ్చే ఫలము ఏమిటంటే, ఏది మనలో బలమైన ఆసురీ గుణములు ఉన్నాయో వాటిని తీసి, మనలో దైవీ గుణములు కలిగేలా అనుగ్రహిస్తాడు స్వామి. మనలను ఎన్నో జన్మల నుంచి వెంటాడి వస్తున్న ఆరు షడూర్ములను తీసివేస్తాడు స్వామి. ఆ పైన మంచి బుద్ధిని ఇచ్చి, ఇష్ట కామ్యములను నెరవేర్చి, జీవితం యొక్క పథం ఉన్నతము వైపు నడిపిస్తాడు ఆ దేవసేనాపతి కార్తికేయుడు.
స్థల పురాణము…
ఈ క్షేత్రములో సుబ్రహ్మణ్య స్వామి వారు చిన్నతనంలో ఆడుకొనేవారని చెప్తారు. సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క మహా భక్తులలో ఒకరైన అవ్వయ్యార్ ని స్వామి వారు పరీక్షించిన స్థలం ఈ క్షేత్రం. తమిళనాట అవ్వయ్యార్ అని ఒక తల్లి ఉండేది. ఒకనాడు ఆమె చాలా దూరం ప్రయాణించి అలసిపోయింది. బాగా ఎండగా ఉండడం వలన, నీడ కోసం ఒక పళ్ళ చెట్టు క్రిందకి వచ్చింది. ఆమె అప్పటికే చాలా ఆకలి, దప్పికలతో ఉంది. ఆ చెట్టు మీద ఒక చిన్న పిల్లవాడు అవ్వయ్యార్ ని చూసి పళ్ళు కావాలా అని అడుగుతాడు. ఆమె కావాలి అనగానే, ఆ పిల్ల వాడు “నీకు వేయించిన పళ్ళు కావాలా, లేక వేయించకుండా కావాలా?” అని అడుగుతాడు. ఇతనెవరో మరీ తెలియని వాడిలా ఉన్నాడు, పళ్ళు వేయించినవి కావాలా అంటాడేమిటి అనుకొని, పిల్లాడితో మాట్లాడే ఓపిక లేక, వేయించిన పళ్ళు ఇమ్మంటుంది అవ్వయ్యార్.
వెంటనే ఆ పిల్లవాడు చెట్టును బలంగా కుదిపితే కొన్ని పళ్ళు క్రింద మట్టిలో పడతాయి. అవి తీసి ఆమె మట్టి దులపడం కోసం నోటితో ఊదుతూ ఉంటే అవి నిజంగా వేడిగా, వేయించినట్లు భావం కలుగుతుంది ఆమెకు. అప్పుడు వాటిని ఊదుకుంటూ (మట్టి తొలగడానికి) పళ్ళను తింటుంది. ఈ లీల చేసినది మామూలు పిల్లవాడు కాదు, ఎవరో మహాత్ముడు నాకు పాఠం చెప్పడానికే ఈ లీల చేశాడు అని అనుకుని పైకి చూడగానే, ఆ పిల్లవాడు మాయమై సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షం అవుతారు. ఆమె జ్ఞాన భిక్ష పెట్టమని స్వామిని ప్రార్థిస్తుంది.
ఆలయంలో ఆర్జిత సేవలు…
ప్రతి రోజూ స్వామి వారి శక్తి ఆయుధానికి అభిషేకం జరుగుతుంది. మనం కూడా పాలు, తేనె మొదలైన వస్తువులు తీసుకువెడితే, వాటితో కూడా స్వామి వారి శక్తి ఆయుధానికి అభిషేకం చేస్తారు.
వసతి సదుపాయము…
ఈ క్షేత్రము మదురైకి దగ్గరగా ఉండడం వల్ల, వసతి ఏర్పాటు మధురైలోనే చూసుకోవచ్చు. మధురైలో ఎన్నో హోటళ్ళు ఉన్నాయి. కొండపైన వసతి సదుపాయం లేదు.
ఎక్కడ ఉన్నది?
రోడ్ ద్వారా:
చెన్నై – 450 కి.మీ., బెంగళూరు – 470 కి.మీ. దూరంలో ఉన్నాయి. తమిళనాడులోని మధురై చేరుకొని అక్కడ నుంచి పళముదిర్చోళైకి చేరుకోవచ్చు.
రైలు ద్వారా:
చెన్నై, బెంగళూరు నుంచి మదురైకి రైలు సదుపాయం కలదు. మధురైకు దేశంలోని పలుప్రాంతాల నుంచి విమాన, రైలు, బస్సు సౌకర్యాలున్నాయి.
విమానము ద్వారా:
జాతీయ విమానాశ్రయము మదురై మీనాక్షీ అమ్మ వారి ఆలయం నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.
మరిన్ని వివరాలకై ఈ వెబ్ సైట్ ఇచ్చట చూడండి: పళముదిర్చోళై – అరుళ్మిగు శ్రీ సుబ్రహ్మణ్య దేవాలయం
మరిన్ని వివరాలకై ఇచ్చట చూడండి: పళముదిర్చోళై – అరుళ్మిగు శ్రీ సుబ్రహ్మణ్య దేవాలయం:
*** స్వామి వారి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం, శ్రీ స్వామివారిని దర్శించి తరించ గోరుచున్నాము. ***
****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******
స్వామి వారిని ఊరేగించడానికి కొత్తగా చేసిన తంగ (బంగారు) రథం