https://www.clickmagick.com/share/1485142037427

కుమారస్వామి అపరావతారమైన కుమారిలభట్టు


కుమారిలభట్టు ఏడవ శతాబ్దములోని విద్వాంసులలో మహా విద్వాంసుడుగా నుండెను. ఇతడు జైమిని సూత్రములకు భాష్యమును విరచించెను. ఈ జైమిని సూత్రములలోని మతమునకే పూర్వ మీమాంసమతమని పేరు. ఇది కర్మప్రధానమైన వైదికమతమును బోధించును. కవలుని సాంఖ్యతత్వము నాధారపరుచుకొని హేతువాదికములై నవీనతత్వమార్గముల బోధించుచు కర్మప్రధానమైన వైదికమతము నిరర్థకమైనదని నిరసించెడు జైన,బౌద్ధ మతములను ఖండించి కుమారిలభట్టు కర్మమార్గ ప్రధానమైన వైదిక ధర్మమును ప్రబలజేసెను. ఈ కుమారిలభట్టునకు భట్టపాదుడను మరియొక పేరు గలదు. ఈతడు వంగదేశీయుడని పాశ్చాత్యులు మొదలగువారు కొందరు వ్రాసిరిగాని యితడాంధ్రదేశీయుడని జైనుల గ్రంథమునందు జెప్పబడినది.

ఒకానొక సమయంలో భారతదేశమంతటా బౌద్ధమతము వ్యాప్తి చెందినది. దీనికి సంబంధించి సనాతన ధర్మంలో కొంత ఆందోళన పొందడం జరిగింది. బౌద్ధము వేదమును అంగీకరించదు. వేదము ప్రమాణము కాదు అన్నవారిని నాస్తికుడు అని పిలుస్తారు. వేదప్రమాణమును అంగీకరించనిది నాస్తికము అవుతుంది. బౌద్ధము వైపు వెళ్ళిపోతే నాస్తికులు అయిపోతారని నాస్తిక మతమును ఖండించి తిరిగి ప్రజలలో కర్మ నియతిని ఏర్పరచి, మరల అందరినీ వేదమార్గంలో నడిపించడం కోసమని సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారు కుమారిలభట్టుగా వెలశారు. ఆయన ప్రయాగ క్షేత్రంలో పుట్టారు.

ఏదయినా తెలుసుకోకుండా ఖండిస్తే దానివలన మర్యాద ఉండదు. బాగా తెలుసుకుని ఖండించాలి. అందుకని వారు ఒక బౌద్దారామమునందు చేరారు. అది ఏడు అంతస్తుల ప్రాకారము కలిగినటువంటి ఆరామము. అక్కడ అనేకమంది బౌద్ధులు ఉండేవారు. వేదము కాని, యజ్ఞము కాని, యాగము కాని, ప్రార్థన కాని, స్తోత్రము కాని చేయడం వారు అంగీకరించరు. అక్కడే కూర్చుని గురువుగారు చెప్పేది ఆయన వినేవారు. సనాతన ధర్మమును ఖండించినపుడు వాటి గురించి చెప్పినపుడు కుమారిలభట్టు ఏడుస్తూ ఉండేవారు. ఒకరోజున గురువు ‘ఎందుకు ఏడుస్తున్నావు?’ అని అడిగాడు. అపుడు ఆయన ‘సనాతన ధర్మంలోని విషయములను ఎంతో గొప్పగా ఖండించారు. అందుకు సంతోషంతో ఆనంద భాష్పములు కారుస్తున్నాను’ అని ఆయన అబద్ధం చెప్పారు. ఎందుకు? అసలు ఆ మతంలో ఉన్నదేంటో తెలుసుకుంటే తప్ప ఖండించడం కుదరదు.

పూర్వం అంటే అటువంటి కర్మనిష్ఠ ఉండేది. ఇప్పుడు నాలుగు శ్లోకములు, రెండు పద్యములు చదవడం రాకపోయినా అసలు అవతల మతంలో గొప్పతనం ఏమి ఉన్నదో తెలియకపోయినా, అవతల మతం మీద దుమ్మెత్తి పోసెయ్యవచ్చు. అంతటి హీనస్థితికి మనం దిగజారిపోయాము. ఇది కలియుగం కదా! కానీ కుమారిల భట్టు అటువంటి వాడు కారు. విషయమును తెలుసుకుని, ఏది చెడో దానిని మాత్రమే ఖండించాలని అనుకున్నారు. ఇలా అనుకుని గురువుగారి దగ్గర నేర్చుకున్నారు.
బాగా నేర్చుకున్న తర్వాత ఈయన ఉద్దేశ్యమును శిష్యులు, గురువులు కనిపెట్టారు. ‘ఈయన బౌద్ధుడు కాడు. ఈయన బ్రాహ్మణుడు. ఈయన సనాతన ధర్మమునందు మక్కువ ఉన్నవాడు. వేదమంటే చాలా ప్రీతి కలిగిన వాడు. ఈయన కేవలం మన మతం గురించి తెలుసుకోవడానికి మనలో చేరాడు. కుశాగ్రబుద్ధి కనుక ఈవేళో రేపో మనతో వాదానికి దిగుతాడు. అప్పుడు మనం ఈయనను తట్టుకోవడం కష్టం. కాబట్టి ఆయన ఈ స్థితిని పొందకముందే ఈయనను చంపేస్తే గొడవ వదిలిపోతుంది’ అని అనుకున్నారు.

ఆయనను మాటలలో పెట్టి ఏడవ అంతస్తుకి తీసుకువెళ్ళారు. ఒక కిటికీ దగ్గర నిలబెట్టి ఆయనతో మాట్లాడుతుండగా కొందరు వెనకనుంచి వచ్చి ఆయన రెండు కాళ్ళూ ఎత్తేసి, ఆయనను పైనుండి క్రిందికి తోసేశారు. అపుడు కుమారిలభట్టు క్రింద పడిపోతూ ఆయన ఒక శ్లోకం చెప్పారు. ‘వేదమే ప్రమాణం అయితే, సనాతన ధర్మం సత్యం అయితే వేదములలో చెప్పబడినవన్నీ సత్యములే అయితే, అది అనుష్టించవలసిన మతమయితే నేను క్రిందపడినప్పుడు మరణించకుందును గాక’ అని దాని అర్థం. ఏడంతస్తుల నుండి కిందపడిపోయినా ఆయనకు ఏమీ అవలేదు. కానీ కంట్లో ఒకరాయి గుచ్చుకుని నెత్తురు వచ్చింది. ఆయన వెంటనే వేదమాతను ప్రార్థన చేసి ‘నువ్వు ప్రమాణం అయితే నేను మరణించకూడదు అని నేను అన్నాను. ఇపుడు నేను మరణించలేదు. బ్రతికాను. నువ్వు ప్రమాణమని నిరూపించావు. చాలా సంతోషం. కానీ ఈ రాయి నా కంట్లో ఎందుకు గుచ్చుకోవాలి?’ అని అడిగారు.

మనకి పురాణములలో అశరీరవాణి పలికింది అని తరచుగా చెప్తుంటారు. అశరీరవాణి అంటే వేదం. ఇప్పుడు వేదం అశరీరవాణియై పలికింది. వేదమును మొట్టమొదట ఈశ్వరుడు ఋషులకు చెప్పారు. ఏ రూపము లేకుండా వారికి వినపడేటట్లుగా వాళ్ళ చెవిలో చెప్పారు. అది అప్పటినుంచి వినబడుతూ గురువు దగ్గర శిష్యుడు, గురువు దగర శిష్యుడు అలా వింటూ వెళ్ళింది. వింటూ స్వరం తెలుసుకుని పలికారు కనుక దానికి శృతి అని పేరు వచ్చింది. కాబట్టి ‘మనకి శృతి ప్రమాణము. ఇటువంటి శృతి ప్రమాణం అయితే చావకూడదని నేను అనినప్పుడు నేను చావలేదు కానీ నా కంటికి ఎందుకు దెబ్బతగిలింది’ అని ఆయన అడిగారు. అలా అడిగితే అశరీరవాణియైవేదము అంది ‘నీవు పైనుండి క్రింద పడిపోయేటప్పుడు ‘వేదమే ప్రమాణం అయితే’ అంటూ పడ్డావు. ‘వేదము ప్రమాణం కనుక నేను మరణించను’ అని నీవు అనలేదు. చిన్న అనుమానం పెట్టుకున్నావు. అటువంటి అనుమానము నీ శ్లోకమునండు ఉండరాదు. నీవు బ్రతికావు కానీ నీకు ఈ చిన్న అనుమానం ఉండడం వల్ల కంట్లో రాయి గుచ్చుకుంది’ కుమారిల భట్టుకి కంటికి దెబ్బ తగిలింది కానీ వేదము ప్రమాణం అయింది. అప్పటి నుంచి మరల అందరూ కర్మానుష్ఠానం యజ్ఞము, యాగము, దానము ఇవన్నీ మళ్ళీ మొదలుపెట్టారు.

కుమారిలభట్టు కర్మ గురించి వ్యాప్తి చేశారు కనుక జ్ఞానమార్గము గొప్పది అని చెప్పడానికి శంకరాచార్యుల వారు ఆయన దగ్గరకి వచ్చారు. కానీ అప్పటికి కుమారిల భట్ట తుషాగ్ని ప్రవేశం చేసేశారు. తుషాగ్ని అంటే ఊకను పెద్ద రాశిగా పోసుకుని ఆ ఊకను అంటిస్తారు. ఊకకు ఉండే లక్షణం ఏమిటంటే అది గబగబా కాలిపోదు. తుషాగ్నిలో నిప్పు సెగ మెలమెల్లగా క్రిందనుండి అంటుకుంటూ వస్తుంది. ముందు వేడి పుడుతుంది. సెగ పుడుతుంది. ఒళ్ళు ఉడికిపోతుంది. తరువాత కిందకు వస్తుంది. తరువాత పాదములు, మోకాళ్ళు, తొడలు అన్నీ కాలిపోతుంటాయి. ఎంత కాలిపోతుంటే బూదిలోకి అలా దిగిపోతూ ఉంటారు. ఎంత దిగిపోతుంటే అంత కాలుస్తూ ఉంటుంది. కాల్చి కాల్చి చివరకు ప్రధానమయిన అవయవములయిన గుండె మొదలగునవి కాలిపోయేంత వరకు ఆ ఒళ్ళు కాలిపోతున్న బాధ అనుభవించవలసిందే. ఈవిధంగా క్రిందనుండి పైకి కాలుస్తూనే ఉంటుంది. కదలకుండా కూర్చుని తుషాగ్నిలో ఆయన కాలిపోతున్నారు.

ఆ సమయంలో శంకరాచార్యుల వారు వచ్చారు. వచ్చి ‘అయ్యో, మీరు ఎందుకు ఇలా కాలిపోతున్నారు? ఎందుకు మీరు ఈ పని చేయవలసి వచ్చింది? నేను మిమ్మల్ని కర్మ మార్గం నుండి జ్ఞాన మార్గంలోకి తిప్పడానికి వచ్చాను’ అని చెప్పారు. అపుడు కుమారిలభట్టు ‘నేను తెలిసి చేసినా తెలియక చేసినా గురువుల పట్ల అపచారం చేశాను. బౌద్ధము సనాతన ధర్మమును అంగీకరించని నాస్తిక మతం కావచ్చు. కానీ ఇప్పుడు నేను సనాతన ధర్మ ప్రచారం కోసం బౌద్ధమతంలో ఉన్న రహస్యములు తెలుసుకోవడం కోసం వాటిని ఖండించడం కోసం గురువుల దగ్గర శిష్యుడుగా చేసి వాటిని నేర్చుకున్నాను. ఇలా గురువు దగ్గర వినకూడదు. వాటిని విన్నాను కనుక దానికి ఈ శరీరం తుషాగ్నిలో కాలిపోవడం ఒక్కటే సరియైన ప్రాయశ్చిత్తం. అందుచేత దీనిని ఇలా కాల్చేస్తున్నాను’ అన్నారు. ఆయన ఎంతటి మహాత్ములో చూడండి. నిష్ఠతో ఉన్నవారు కాబట్టి ఆ కర్మనిష్ఠకే శరీరమును వదిలేశారు.

సుబ్రహ్మణ్య స్వామీ అవతారములు అన్నీ కూడా అగ్నియందే పర్యవసిస్తాయి. అందుకే అగ్నిహోత్రంలోకే తుషాగ్నిలోకి కుమారిలభట్టు వెళ్ళిపోతూ ‘నా శిష్యుడు మండనమిశ్రుడు’ ఉన్నాడు. ఆయనతో వాదించి ఓడించండి. అపుడు లోకం అంతా కర్మమార్గం నుండి జ్ఞానమార్గంలోకి వెడుతుంది’ అన్నారు. ఏమి చిత్రం జరిగిందంటే అంతకుపూర్వం వరకు పూజలుచేస్తే మీరు ఏ పూజ చేస్తున్నారో ఆ పూజలో స్వామి పేరు చెప్పి ప్రీత్యర్థం అనేమాట చెప్పడం సంకల్పంలో లేదు. ఇది చెప్పకుండా పూజ చేసేవారు. శంకరాచార్యుల వారు మండనమిశ్రుని గెలిచిన తర్వాత కర్మ భాగమునందు ఒక కొత్త విషయం కలిసింది. మీరు ఏది చేసినా సంకల్పంలో….ప్రీత్యర్థం అని దేవత పేరు చెప్పి నీళ్ళు ముట్టుకుంటారు. ‘ఈ కర్మను నేను ఇప్పుడు ఈశ్వరానుగ్రహం కొరకు చేస్తున్నాను’. ఈ కర్మ చేస్తే ఫలితం వచ్చేస్తుందని కాదు. ఈ కర్మ చేస్తే ఈశ్వరుడు ప్రీతిచెంది ఫలితమును ఇవ్వాలి. ఈశ్వర ముఖంగా ఫలితం రావాలన్న జ్ఞానమును అంకురింపచేయడానికి సంకల్పమును శంకరాచార్యుల వారే అక్కడ మార్చారు. మండనమిశ్రుడు ఓడిపోయినతరువాతి నుండి అలా మారింది.

కనుక తుషాగ్నిప్రవేశం చేసిన గొప్ప అవతారం కుమారిలభట్టు అవతారం. ఆయన అవతారం రాబట్టే మనకి సనాతన ధర్మం మరల నిలబడే అవకాశం ఈ లోకమునందు కలిగింది. అంతటి మహోత్కృష్టమయిన అవతారం కుమారిలభట్టు అవతారం. ఎప్పుడెప్పుడు వేదం చేత ప్రతిపాదింపబడిన బ్రహ్మమును గూర్చిన ఆలోచనయందు వైక్లబ్యము కలుగుతుందో, వేదము ప్రమాణము కాదనే ఆలోచనలు ప్రబలుతాయో, అప్పుడు ముందుగా సుబ్రహ్మణ్యుడే అవతరిస్తూ ఉంటారు. రాక్షసులను సంహరించడం ఆయనకేమీ పెద్ద విషయం కాదు. లోకమునకు వైదికమయిన మార్గమును ప్రబోధం చేయవలసి వస్తే ఎప్పుడెప్పుడు ఎంతవరకు సమాజంలో బోధ జరిగితే తప్ప కుదరదో అంత గొప్ప బాధ్యతను ఆయన భుజాల మీదకు ఎత్తుకుంటారు. ఆయన మహాజ్ఞాని. ఆయన జ్ఞాన బోధ చేయగలరు. లోకం అంతాకూడా సనాతన ధర్మమును విడిచిపెట్టి నాస్తికము వైపు నడుస్తున్న రోజులలో ముందు కర్మనిష్ఠను చూపించడం కోసమని ఆయన కుమారిల భట్టు రూపంగా వచ్చారు. అంతే కర్మనిష్ఠతో చిట్టచివరకు ఆయన తుషాగ్ని ప్రవేశం చేసేశారు.

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనము నుంచి…



       ****** సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ******

About the Author

Ravikanth Bandi ()

One Reply to “కుమారస్వామి అపరావతారమైన కుమారిలభట్టు”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *